30, అక్టోబర్ 2019, బుధవారం

సులభమైన యుపాయమును చూడరే



సులభమైన యుపాయమును చూడరే మీరు భక్త
సులభుడైన రామవిభుని కొలువరే చేరి

అందరకును ధర్మమార్గ మందించగ వెన్నుడే
యందాల రాముడై యవనికి వచ్చి
యందరు మానవులవలె నాపదల నెన్నిటినో
పొంది గెలిచి చూపె మనకు పొలుపగు దారి

జయజయ  శ్రీరామచంద్ర జానకీమనోరమణ
జయజయ పట్టాభి రామ సాకేతరామ
జయజయ కళ్యాణ రామ శరణమనుచు వేడుచో
దయామయుడు రాముడిచ్చు తప్పక ముక్తి

రామచంద్రు డెవ్వానికి ప్రాణాధికుడై యుండు
రామనామ మెవ్వాని రసనకు హితము
రామతత్త్వ చింతనతో నేమానవుం డుండు
నా మానవుడు ముక్తుడగు నవలీలగను

2 కామెంట్‌లు:

  1. రాముడు స్వయంగా ధర్మ స్వరూపుడై నందువల్ల ఎల్లవేళలా ధర్మాచరణ గావించిన వారికి మోక్ష ప్రదాత అవుతాడు. ధర్మావిరుద్ధమైన అర్థకామాలకు లోటు రానీయడు. ఈతి బాధలు అనుభవిం పజేసి కర్మక్షయం గావిస్తాడు. నమ్మికతో రామ భక్తి మార్గం ఆజన్మాంతం వీడనివారిని ఆయన తరింపజేస్తాడు.
    కానీ ఆ మార్గం అందరికీ అలవడేది కాదు.
    బహూనాం జన్మనామ్ అంతే మన ప్రయత్నం కొంత రాముని కృప ఎంతో కలిగిననాడు అది సాధ్య మవుతుంది అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిప్రాయం బాగుంది. కర్మ, జ్ఞాన వైరాగ్య సాధనాక్రమ సాధ్యమైన క్రమముక్తి అనేదాన్ని గురించి చక్కగా వివరించారు. భక్తి మార్గం కించిద్భిన్నం. శరణాగతుడైన భక్తునకు ఈసోపానక్రమం ద్వారానే కాక భగవదనుగ్రహం వలన సత్వరముక్తి కాని తక్షణముక్తి కాని లభమని భాగవతుల నమ్మిక. ఈ కీర్తనలో అటువంటి శరణాగతుడినీ అతడి లక్షణాలనూ ప్రస్తావించటం జరిగింది.

      నాస్తి యజ్ఞాది కార్యాణి హరేర్ నామైవ కేవలం
      కలౌ విముక్తయే నృణాం నాస్త్యేవ గతిర్ అన్యథా

      హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం
      కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథా

      హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనం
      కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా

      ఇత్యాది ప్రమాణాలను బట్టి కలిలో శరణాగతిని పొంది నామస్మరణ ద్వారా హరినాశ్రయించుకొని ఉండటం వలన ఉత్కృష్టమైన ముక్తస్థితిని పొందవచ్చునని గ్రాహ్యం.

      ఇలా హరినామాశ్రయుడై యోగమార్గంలో తక్షణం ఘడియలోనే ముక్తిపొందిన మహాత్ముని చరితం భాగవతం ప్ర్థథమస్కందంలో చూడవచ్చును.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.