31, అక్టోబర్ 2019, గురువారం
శ్రీహరి వీడే శివుడును వీడే
శ్రీహరి వీడే శివుడును వీడే సీతారాముడు వీడే
ఊహలుచేసి బేధము లెంచుట యుచితమె బ్రహ్మము వీడే
క్షీరజలధిలో శయనించెడు నా చిన్మయమూర్తి వీడే
ఆ రజతాద్రిని హాయిగనుండే ఆదిదేవుడు వీడే
వీరరాఘవ ప్రఖ్యను భూమిని వెలసిన దేవుడు వీడే
కారణజగతిని చక్కగ నడిపే ఘనుడగు బ్రహ్మము వీడే
మదనునిగన్న మంచితండ్రి యగు మాధవదేవుడు వీడే
మదనాంతకుడను మంచి పేరుగల మహాదేవుడును వీడే
మదనకోటి సుకుమారరూపమున మసలెడు రాముడు వీడే
విదితముగ జగమంతట నిండి వెలిగెడు బ్రహ్మము వీడే
స్థిరపదమున ధృవబాలుని నిలిపిన దేవదేవుడు వీడే
చిరజీవిగ నా మృకండసూనుని చేసిన శివుడును వీడే
వరమిడి కపిని బ్రహ్మను చేసిన వాడగు రాముడు వీడే
నిరుపమానమగు సృష్టికి మూలము పరబ్రహ్మమన వీడే
30, అక్టోబర్ 2019, బుధవారం
సులభమైన యుపాయమును చూడరే
సులభమైన యుపాయమును చూడరే మీరు భక్త
సులభుడైన రామవిభుని కొలువరే చేరి
అందరకును ధర్మమార్గ మందించగ వెన్నుడే
యందాల రాముడై యవనికి వచ్చి
యందరు మానవులవలె నాపదల నెన్నిటినో
పొంది గెలిచి చూపె మనకు పొలుపగు దారి
జయజయ శ్రీరామచంద్ర జానకీమనోరమణ
జయజయ పట్టాభి రామ సాకేతరామ
జయజయ కళ్యాణ రామ శరణమనుచు వేడుచో
దయామయుడు రాముడిచ్చు తప్పక ముక్తి
రామచంద్రు డెవ్వానికి ప్రాణాధికుడై యుండు
రామనామ మెవ్వాని రసనకు హితము
రామతత్త్వ చింతనతో నేమానవుం డుండు
నా మానవుడు ముక్తుడగు నవలీలగను
27, అక్టోబర్ 2019, ఆదివారం
అతడు సార్వభౌముడై యవని నేలగా
అతడు సార్వభౌముడై యవని నేలగా
నతని స్వజనమే నిండి రన్ని చోట్లను
ప్రతిలేని రామసార్వభౌమునకు జయమని
యతి హర్షమున పలుకునట్టి వారి తోడను
చతురులై శ్రీరాముని జయగీతికలు పాడు
నుతశీలురు కవులు పండితులతో నొప్పె ధర
రూపుకట్టి ధర్మమే లోకమేలుచుండగ
శ్రీపతి యే యితడని సురలు పొగడుచుండగ
తాపసోత్తములు చేరి తనకు దీవనలీయ
కాపాడుచు నందరను ఘనతకెక్కె రాముడు
ఎప్ఫటికిని రాముడే యీనేలకు ప్రభువన
ఎప్పటికిని రామయశ మీనేలకు వెలుగన
ఎప్పటికిని రామనామ మెల్లరకు రక్షయన
తప్పక ధర నందరు దాశరథి స్వజనులే
నతని స్వజనమే నిండి రన్ని చోట్లను
ప్రతిలేని రామసార్వభౌమునకు జయమని
యతి హర్షమున పలుకునట్టి వారి తోడను
చతురులై శ్రీరాముని జయగీతికలు పాడు
నుతశీలురు కవులు పండితులతో నొప్పె ధర
రూపుకట్టి ధర్మమే లోకమేలుచుండగ
శ్రీపతి యే యితడని సురలు పొగడుచుండగ
తాపసోత్తములు చేరి తనకు దీవనలీయ
కాపాడుచు నందరను ఘనతకెక్కె రాముడు
ఎప్ఫటికిని రాముడే యీనేలకు ప్రభువన
ఎప్పటికిని రామయశ మీనేలకు వెలుగన
ఎప్పటికిని రామనామ మెల్లరకు రక్షయన
తప్పక ధర నందరు దాశరథి స్వజనులే
26, అక్టోబర్ 2019, శనివారం
శ్రీరఘురాముని చింతనమే
శ్రీరఘురాముని చింతనమే నను
చేరెడు గాక శ్రీకరమై
పామరత్వమున పడిపోనీయక
రాముని కృపయే రక్షించగను
కామక్రోధములు క్రమ్ముకొనక నను
రామనామమే రక్షించగను
కల్లగురువులకు కడుదూరముగ
నల్లనయ్య నను నడిపించగను
ప్రల్లదనము నను పైకొనకుండగ
చల్లగ రాముడు సంరక్షింపగ
దహరాకాశము నందలి రాముడు
బహుదయతో నను పాలింపగను
బహిరంతరముల ప్రబలిన యతడే
అహరహమును నాయాత్మ నేలగ
ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
యెందుకిలా మరలసొమ్ము కింతగ కటకట
చేయకయే దుర్వ్యయము చెల్లిపోయె సొమ్మంతయు
వేయనెట్టి పందెములు వెచ్చమాయె నంతయును
ఆయమేమొ సున్నాయెను అరయ రేపేమగునో
నీ యాశయ మిపుడు నన్ను నిర్ధనుని చేయుటయా
బందిపోట్ల వలె కర్చులు పట్టినన్ను దోచగా
అందగాడ రామచంద్ర ఆనంద మేమి నీకు
తొందరించ చీకాకులు ముందటివలె పాడలే
కుందునేమొ పరీక్షించు నూహ నీకు కలిగెనా
ఎన్ని జన్మముల నుండి యిట్లు పాడుచుంటినో
యెన్నెన్ని కష్టంబుల కేరీతి నోర్చితినో
యెన్నటికిని మాననురా యీశ్వర నీ కీర్తనము
చిన్న పెద్ద కష్టములా చిత్తము నీ ప్రసాదము
హరి మావాడే యందుము
హరి మావాడే యందుము
హరికే లోబడి యుందుము
హరిమార్గమునే యనుసరించెదము
హరికీర్తనలే ఆలపించెదము
హరిగుణగానము నందురమింతుము
హరికన్యముల నంటము తలపము
హరిగాధలు మా కానందంబులు
హరిభక్తులు మా కాదరణీయులు
హరిస్మరణమె మా పరమాచారము
హరిసేవయె మా పరమధర్మము
హరినామములే వరమంత్రము లని
హరేరామ యని హరేకృష్ణ యని
నరసింహా యని నారాయణ యని
పరవశించుచు పలుకుచుందుము
25, అక్టోబర్ 2019, శుక్రవారం
చేయందించగ రావె చిక్కులు పెక్కాయె
చేయందించగ రావె చిక్కులు పెక్కాయె
నీయందే చిత్తము నిలిపి వేడుచు నుంటి
నీ కొఱకే యాడుచు నీ కొఱకే పాడుచు
నీ కొఱకే యాశల నించుచు మనసున
నీ కీర్తి నెంచుచు నీ గుణము నెంచుచు
నీ కాయమున్నది నీ వెఱుగని దేమి
నీ యాజ్ఞమేరకు నేనిట నుంటిని
నీ యాన చక్కగ నెఱవేర్చుచుంటిని
ఓ యయ్య నేనిటు లుండుట నెఱిగియు
గాయపడిన నాపై కనికార ముంచవు
పామరుడనె గాని భక్తుడనే కద
యేమయ్య నీకన్యమే యెఱుగనయ్య
స్వామి దైన్యము బాపి చక్కగ బ్రోవగ
రామయ్యా వేగమే రావయ్య రావయ్య
అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట
అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట మొదలాయె
నిమ్మహి నిన్నినాళ్ళకు హీనస్థితి నాకాయెరా
కొంచెము వెండి నమ్ముకొని కొంచెము సొమ్ము తెచ్చుకొని
కొంచెము కొంచెము కరిగించి కొద్దిరోజులను గడపితిని
మంచిదినము లిక గడచినవి పంచార్చిదశయు వచ్చినది
కొంచెపుమానిసి నైతిని గోవిందా నీదయచేత
ఇన్నాళ్ళున్న వాహనమా యిప్పుడె చేయి దాటినది
కొన్నాళ్ళపాటైన నీసొమ్ము కొమ్ముకాయునని తలచెదను
చన్నవిగా మంచిదినములు చిన్నబుచ్చినది కాలము
విన్నదనము నను క్రమ్మినది విన్నావా నా రాముడా
హరియను మాటకు నర్ధము హరియించు వాడని వింటిని
హరియించ వలయు నవిద్యను హరియింతువా జీవనమును
పరమాత్ముడా నీ తలపులు పామరుండ నే నెఱుగను
హరియించ దలచిన దంతయు హరియించి నన్నుధ్ధరించుము
ఏది దుఃఖ మైయుండు నేది మనకు సుఖమో
ఏది దుఃఖ మైయుండు నేది మనకు సుఖమో
లో దలంచి మేలు కాంచరో జనులారా
హరిచింతన మనకు గలుగ నంతవరకె దుఃఖము
హరిచింతన కలిగినదా యదియే సుఖము
హరిపూజ చేయకుండు నంతవరకె దుఃఖము
హరిపూజ మొదలైతే నదియే సుఖము
హాయి గొలుపు రామనామ మందుదాక దుఃఖము
హాయిగాను రామరామ యనుటే సుఖము
మాయనుండి తనచిత్తము మరలుదాక దుఃఖము
మాయకవలి రాముని మరగిన సుఖము
తానెవరో తనకెఱుకగు దాకనుండు దుఃఖము
తానాత్మరూపుడగుచు తనరుటయే సుఖము
మానక యజ్ఞానమేను మానవులకు దుఃఖము
జ్ఞానవంతులగు వారికి జరుగును సుఖము
నీకు మ్రొక్కుటకునై నాకీతనువు
నీకు మ్రొక్కుటకునై నాకీతనువు కాని
లోకవినోదార్ధమై చేకొన్నదా
నీకు పాడుటకునై నాకీ రసన కాని
లోకులను పొగడగా చేకొన్నదా
నీ కెఱుకే లెమ్మిది నిశ్చయంబుగను
ఓ కీర్తిమంతుడా ఓ రామచంద్రుడా
నీవు మెచ్చుట కొఱకు నే నాడుటలు కాని
భూవలయమున మెప్పు పొందనేనా
నీ వెఱుంగుదు విది నిశ్చయంబుగను
ఓ వేదవేద్యుడా ఓ రామచంద్రుడా
నీ కులుకుమోము జూడ నాకీ కనులు కాని
లోకుల సింగారాలు రూపించనా
నీకిదియు తెలియును నిశ్చయంబుగను
ఓ కళ్యాణమూర్తి ఓ రామచంద్రుడా
24, అక్టోబర్ 2019, గురువారం
పోషణ నీదే రామభూమిపాలా
పోషణ నీదే రామభూమిపాలా భక్త
పోషక బిరుదాంకిత హరి పురుషోత్తమా
ఎంచియెంచి నీవే నన్నిచట నుంచినావు నా
మంచిచెడ్డల బాధ్యత మరి నీదే కాదా
అంచితముగ నిన్ను కొలుచు నట్టివాడ న
న్నించుకదయ నేలకుండిన నేమన గలవాడను నా
మణులు మాన్యములు భూషణము లడుగ లేదురా
ఘనమైన పదవుల నిమ్మని కోరలేదురా
మనుజుడ సామాన్యుడ నేనేమని నిను కోరితిరా
తినుట కింత పెట్టుమనుచు తిరిగి తిరిగి యడిగితి నా
నీవు కాక త్రిభువనముల దీనపోషకుం డెవడు
నీవు కాక యాపదల నెవ్వరు దాటింతురు
నీవు కాక సజ్జనులకు నేలమీద దిక్కెవ్వడు
నీవే నా పతివి గతివి కావున కాపాడుము నా
23, అక్టోబర్ 2019, బుధవారం
తెలిసీ తెలియక సంసారములో
తెలిసీ తెలియక సంసారములో దిగబడు చుండును జీవుడు
తెలివి వచ్చెనని మొత్తుకొన్నను తెరలి వెనుకకు రాలేడు
వదలక నిత్యము వెదకుచు నుండును బయటపడుటకై మార్గములు
చదువును శాస్త్రము లందు రహించెడు చక్కని మోక్షోపాయములు
విదులగు గురువుల వెంబడి తిరుగుచు విడువక ప్రశ్నించుచు నుండు
నదులను మునుగును కొండల నెక్కును నానా తిప్పలు పడుచుండు
నానా దేవతలను పూజించగ నానా నిష్ఠల పాటించు
నానా దీక్షల నాచరించుచుటకు నానా బాధలు పడుచుండు
నానా యాగవ్రతాచరణంబుల నలుగుచు నుండును నిత్యమును
నానా మంత్రపునశ్చరణంబుల ప్రాణము బిగబట్టుచు నుండు
ఏమిలాభ మటు లేమి చేసిన నీ సంసారము విడలేడు
ఏమో యెప్పటికైన నీశ్వరుడె యించుక బోధను చేయడా
రామరామ శ్రీరామరామ యని రామనామమును చేయుమని
ప్రేమగ చెప్పిన వినినప్పుడు కద వీనికి సంసారము వదలు
విల్లెత్తి నాడని నల్లని వానికి
విల్లెత్తి నాడని నల్లని వానికి
తెల్లని పిల్లనిచ్చి పెళ్ళి చేస్తివి
వనిత మెఱుపుతీవట వరుడు మబ్బుతునకట
జనకుడవు చేసితట చక్క నైన పెండ్లిని
వినరమ్మ తెల్లని వీరు లిపుడు విల్లెత్తు
డని చాటకుంటి నని యాక్షేపించేరో
తెలిసి తెలిసి యెవడైన తెల్ల పిల్ల నిచ్చేనో
కళకళలాడే నలుపు గల మంచి వరునెంచి
జలజాక్షున కిచ్చె క్షీరసాగరుడా లచ్చిని
నళినాక్షి తెలుపు హరి నల్లవాడే కాదా
అవునవును చూడరే హరివంటి రామునకు
యవనిజయే తగినది యన్నిభంగుల జూడ
యువిదలార రాముడై యున్నాడు హరియని
ధవళాక్షి లచ్చియని తలచి పెండ్లి చేస్తిని
ఓ రామయోగి నీ కోరిక యేమి
ఓ రామయోగి నీ కోరిక యేమి
కోరి రామయోగి నైతి కోరనన్యము
రామయోగి కక్కరలే రానేరావా
రామయోగి రసన నున్న రామనామమే
స్వామిదయను నిత్యమును సమకూర్చగ
నేమి తక్కువగుట కలుగు నెన్నడైనను
రామయోగి రామయోగి భూమిజనులకు
రామరామ యన్నంతనె రాముని దయకు
ప్రేమకును పాత్రులగుచు వేరు తలపులు
కామనలును విడువనగునె కాస్త చెప్పుమ
ఏమయ్యా సందేహము లింక మానుము
రామయోగులకు రామరక్ష కలుగును
రామయోగ మేమొసగును రామయోగి
రాము డిచ్చు మోక్ష మింకేమి వలయును
22, అక్టోబర్ 2019, మంగళవారం
శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
నారచీర లందించె కూరిమితో కైక
మందస్మితవదనుడై మహాప్రసాదం బని
యందుకొని రఘునాథు డంతలో ధరించె
నందుకొని బుసబుసల నణచుచు కట్టుక చే
నంది విల్లు లక్ష్మణు డన్న వంక జుచె
చీర నందుకొని యంత చిన్నబోయి నిలబడె
నే రీతిని దాల్చుటో యెరుగని సీతమ్మ
శ్రీరామచంద్రు డంత చీరగట్ట సుదతికి
భోరుమనె నంతిపురి భోరుమనె రాజు
చల్లబడ్డవా నీ కళ్ళిప్పు డనె రాజు
చల్లబడు లోకమిక సత్య మనెను కైక
తల్లివి రాముని దయదలచవే యనె రాజు
తల్లిని కొడుకు మేలు తలచితి ననె కైక
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
13, అక్టోబర్ 2019, ఆదివారం
ఈ వివేకమిది యిప్పుడు కలిగెను
ఈ వివేకమిది యిప్పుడు కలిగెను
నీవు నన్ను కరుణించ వలయును
మోహము వెంబడి పుట్టును బంధము
మోహము వెంబడి పొడమును పాపము
మోహ మదెట్లు నిర్మూలిత మగునో
మోహ ముడిగితే మోక్షము కలదు
అశల వెంబడి యమరును దుఃఖము
ఆశల వెంబడి యాత్మ కలంగును
ఆశల నెట్టుల నణచ వచ్చునో
ఆశలు విడిచిన యాత్మవిముక్తము
దాశరథీ కరుణాశరధీ భవ
పాశవిమోచన వరమీయగదే
ఆశామోహము లంతరించెనా
ఈశా నిన్నే యిక చేరెదను
ఆశామోహము లంతరించెనా
ఈశా నిన్నే యిక చేరెదను
12, అక్టోబర్ 2019, శనివారం
ఆ రాముడు వచ్చి నాతో పోరగ
ఆ రాముడు వచ్చి నాతో పోరగ సీతా - వాడు
వారాసిని దాటి రావలయును సీతా
వారాసిని దాటి స్వామి వచ్చుటె కాదు - నిన్ను
పోరాటమున చించి పోగులు పెట్టు - కోరి
కోరి నీవు తలకెత్తుకొన్న మిత్తిని - ఇంక
పోరా నీ తలలు తెగిపోవును రేపు
నారాయణు నట్టివాడు నారాముడు - స్వామి
చేరలేని చోటనగ సృష్టిని లేదు - యతని
నారాచమునకు నిలుచు వీరుడు లేడు - నీకు
దారుణమగు మరణమే తప్పదు రేపు
శూరుడ నను బెదిరింప జూడకు సీత - నీవు
శూరుడవా దొంగవు క్షుద్రుడ వోరి - రేపు
వారాసిని దాటి వాడు వచ్చుట కల్ల - స్వామి
వారాసిని దాటు నీవు బ్రతుకుట కల్ల
10, అక్టోబర్ 2019, గురువారం
హరినామము లన్నియు నమృతగుళికలే
హరినామము లన్నియు నమృతగుళికలే
హరికీర్తన లన్నియు నపురూపములే
హరిని కీర్తించు వా రెవరైన ననఘులే
హరిని భావించు వా రందరు పవిత్రులే
హరిని పూజించు వా రందరును శుధ్ధులే
హరి నిలయమైన చో టరయ వైకుంఠమే
హరి నెరుగనట్టి వారంద రపవిత్రులే
హరిని దూషించు వారంద రతిపాపులే
హరిని తెలుపని విద్య లన్నియును వ్యర్ధమే
హరి కహితమైన పను లన్నియును తప్పులే
హరిని సేవించు వా రందరకును సుఖమే
హరిని ప్రేమించు వా రందర కానందమే
హరితత్త్వవిచారము పరమార్ధదాయకమే
హరి రాము డని కొలువ నావల కైవల్యమే
8, అక్టోబర్ 2019, మంగళవారం
హితవైన దేదైనా ఇచ్చేవా డితడే
హితవైన దేదైనా ఇచ్చేవా డితడే
ఇతడే మన రాముడే యింకెవ్వరు లేరు
హితమైనది కూడైతే - ఇచ్చేవా డితడే
హితవైనది గూడైతే - ఇచ్చేవా డితడే
హితవైనది సతియైతే - ఇచ్చేవా డితడే
హితవైనది సుతులైతే - ఇచ్చేవా డితడే
హితవైనది విద్యైతే - ఇచ్చేవా డితడే
హితవైనది ధనమైతే - ఇచ్చేవా డితడే
హితవైనది బ్రతుకైతే - ఇచ్చేవా డితడే
హితవైనది సుఖమైతే - ఇచ్చేవా డితడే
హితవైనది జయమైతే - ఇచ్చేవా డితడే
హితవైనది కీర్తైతే - ఇచ్చేవా డితడే
హితవైనది శాంతైతే - ఇచ్చేవా డితడే
హితవైనది ముక్తైతే - ఇచ్చేవా డితడే
7, అక్టోబర్ 2019, సోమవారం
శ్రీరాము డొకని మాట చిత్తగించి
శ్రీరాము డొకని మాట చిత్తగించి
మీ రున్న చాలదా మేదిని పైన
వీని మాట వాని మాట విని చెడిపోక
జానకీజాని మాట చక్కగా వినుడు
వాని మాట కేమి యన్న భావనలో నుంటే
యీ నేలమీ దింక మీరేమి సాధించేరు
కలిపురుషుడు మీకు చెప్పు కాసుల గూర్చి
తెలివి గలిగి వానికి తొలగి యుండు డీ
యిల మీదను కాసులతో యెంతో పని యంటే
తెలిసి తెలిసి గోతిలోన దిగినటులే నండి
ఒక్క రాముడేను ధర్మ ముపదేశించు
ఒక్క రాముడేను గురూత్తముం డయ్య
ఒక్క రాముడేను హితము నొక్కి చెప్పు వాడని
చక్కగా నెఱిగి కొన్న సద్గతి పొందేరు
ఎందరికి దక్కునో యింతటి యదృష్టము
ఎందరికి దక్కునో యింతటి యదృష్టము రామ
చందురుని కడ నుండెడి సద్భాగ్యము
సీతా సుందరి యన శ్రీదేవియే కనుక
ప్రీతి నర్ధాంగియై విభుని జేరి
చేతోముదంబుగ సేవించుచున్నది
ఆ తల్లి యదృష్ట మంతింతన రానిది
వేయిపడగల వాడు విభునికి తమ్ముడై
యీ యిలపై పుట్టి తా నెల్ల వేళల
శ్రీయుతుని రఘుపతిని స్థిరనిష్ఠుం డగుచు
హాయిగా సేవించె నదిగదా యదృష్టము
హరుడు తా నిలబుట్టె నాంజనేయుండన
వర రామభక్తుడై ధరను నిలచె
పరమప్రీతిని రామపాదముల సేవించు
నరయ నదృష్ట మనగ నది కదా నిజముగ
పాపపుణ్యరహితుడు భగవంతు డితడు
పాపపుణ్యరహితుడు భగవంతు డితడు
శ్రీపతి సాకేతపతి శ్రీజానకీపతి
త్రిగుణరహితుడు వీడు దేవదేవుడు
సుగుణభూషుడు వీడు సుప్రకాశుడు
నిగమవేద్యుడు వీడు నీరజాక్షుడు
జగదధీశుడు వీడు జ్ఞానగమ్యుడు
రామచంద్రుడు వీడు రాఘవేంద్రుడు
రామభద్రుడు వీడు దామోదరుడు
ప్రేమపూర్ణుడు వీడు వేదవేద్యుడు
కోమలాంగుడు వీడు శ్యామలాంగుడు
ధర్మరూపుడు వీడు దయాపూర్ణుడు
కర్మరహితుడు వీడు కౌసలేయుడు
నిర్మలాకృతి వీ డనింద్యచరితుడు
దుర్మర్షణుడు వీడు దుష్కృతిఘ్నుడు
5, అక్టోబర్ 2019, శనివారం
వాడొక్కడే కాడు వరము లిచ్చు వాడంటే
వాడొక్కడే కాడు వరము లిచ్చు వాడంటే
వాడొక్కడే ముక్తి వరము నిచ్చు వాడంటే
చిల్లులున్న కుండలకు చేతులడ్డు పెట్టుటకు
చిల్లర సంపదలు మీ చేతిలో పోయుటకు
అల్లదిగో దేవత లదె యంతమంది యున్నార
లెల్లరకు ముక్తి నీయ నీ రాము డున్నాడు
వీర నియమ నిష్ఠలతో వేడుకొన్న వారలకు
వారడగెడు వరములిచ్చు వారై దేవతలుండ
తారకనామమను ప్రేమ మీఱ గొలుచు వారలకు
కోరినట్టి ముక్తి నిచ్చు శ్రీరాము డున్నాడు
ఎట్టి వరము లడిగెదరో ఎంచుకొనుడు జనులార
వట్టి భవసౌఖ్యములను వాంఛించు చున్నారో
పట్టుబట్టి మోక్షమడుగు వారగుచు నున్నారో
తుట్టతుదకు మీ బుద్ధికి తోచినట్లు కోరుడు
ఎవరేమి యెఱుగుదురో యీశ్వరు డెఱుగు
ఎవరేమి యెఱుగుదురో యీశ్వరు డెఱుగు
నెవరి కేది ప్రాప్తమో యీశ్వరుడే యెఱుగు
ఎవరు తన యాజ్ఞమేర కిచట నాడు వారు
ఎవరు భ్రాంతచిత్తు లగుచు నిచట నాడు వారు
ఎవరెవరో యెవరి కెవరొ యీశ్వరుడే యెఱుగు
ఎవరు లోక మెఱుగుదురో యీశ్వరుడే యెఱుగు
ఎవ రిచట పరేంగితజ్ఞు లెవరు సమయజ్ఞులు
ఎవ రిచట దింగ్మూఢులు నెవరు సర్వజ్ఞులు
ఎవరు తమ్ము తామెఱుగుదు రీశ్వరుడే యెఱుగు
ఎవరు తన్నెఱుగుదు రది యీశ్వరుడే యెఱుగు
ఎవరు తత్త్వచింతన పరు లెవరు స్వార్ధపరులు
ఎవరు రామభక్త జనులు నెవరు కూటజనులు
ఎవరు జన్మ చక్రబధ్ధు లీశ్వరుడే యెఱుగు
నెవరు మోక్షగాములో యీశ్వరుడే యెఱుగు
పామరు లైతే నేమి పతితులైతే నేమి
పామరు లైతే నేమి పతితులైతే నేమి
రామ రామ యనగానే రక్షణ దొరకేను
స్వామి నామ మధురిమతో సర్వపాపముల చేదు
నామరూపములు లేక నశియించి పోదా
ప్రేమతో రామనామ వీరవ్రతాచరణమే
యేమరకను చేయరే యెల్ల రుత్సహించి
స్వామి రూప మెడదలో చక్కగా మెఱయగనే
పామరత్వమను చీకటి పరువెత్తి పోదా
రామచంద్రదివ్యపదారాధనాతత్పరులై
యేమరకను నిలువరే యెల్ల రుత్సహించి
స్వామి రక్ష యబ్బి నంత జననమరణములు లేని
కామితమగు సత్పదమే కైవసము కాదా
రామదేవు డొక్కడే రక్షించి యిచ్చు మోక్ష
మేమరకను కొలువరే యెల్ల రుత్సహించి
నిన్ను గూర్చి నీకు నిజముగ తెలియునా
నిన్ను గూర్చి నీకు నిజముగ తెలియునా
నిన్ను గూర్చి యా హరికే నిశ్చయముగ తెలియునా
ఎన్ని జన్మ లెత్తి నీ విడుముల బడి యుంటివో
యెన్ని మ్రుచ్చుపనుల చేసి యున్నావో నీవు
యెన్ని కర్మఫలము లనుభవించ వలసి యున్నదో
యెన్నటికి భాగవతుల యింట బుట్ట నున్నావో
రామనామ మందు నీకు రక్తి కలుగు టెన్నడో
నీమ మొప్ప నీవు రామనిష్ఠ నుండు టెన్నడో
పామరత్వ మంతరించి పావనుడగు టెన్నడో
ఏమో ఆ రామచంద్రు డెప్పుడు దయజూచునో
ఇంకను నీ వెన్ని జన్మ లెత్త వలసి యున్నదో
అంకిలిపడు కర్మవితతి యంతరించు టెప్పుడో
పంకజాక్షు డెపుడు తన వద్ధకు రా రమ్మనునో
శంకించక నీకు తన సన్నిధి నెపుడిచ్చునో
4, అక్టోబర్ 2019, శుక్రవారం
పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు
పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు
జగమేలు స్వామికి మన జానకీపతికి
పరాక్రమమునందు వీని వంటి వాడొకడు లేడు
కరుణారస సముద్రుడని ఘనత కెక్కెను వీడు
నిరుపమాన సత్యవ్రతుడు నిశ్చలసంకల్పుడు
పరమపురుషు డిట్టి వాడు ధర నెవ్వడు లేడు
నిర్మల చారిత్రుడితడు నిరుపమాన ధీరుడు
నిర్మముడు లోకనుతుడు నిఖిలప్రాణి హితుడు
కర్మవీరు డుద్యోతిత నిర్మలస్వభావుడు
ధర్మమూర్తి యిట్టి వాడు ధర నెవ్వడు లేడు
శరణాగత పరిత్రాణ శపథంబును గలవాడు
నిరుపమాన వరదాతగ వరయశంబు గలవాడు
పరమశుభదాయకుడై భక్తులను ప్రోచువాడు
అరయ రాము నట్టి వాడు ధర నెవ్వడు లేడు
అట్టి పామరుడనే యవనిజారమణ
అట్టి పామరుడనే యవనిజారమణ
గట్టిగా బుధ్ధి చెప్పి కరుణించవయ్య
పొరబడి యయోగ్యుల పూజ్యులుగ నెంచుటయు
త్వరపడి సాధువుల తప్పులెన్ని తిట్టుటయు
తరచుగ తనగొప్ప తాను చాటుచును తిరుగుటయు
నరులలో పామరుల నడతలందు కనబడును
ఎవరెవరినో నమ్మి యిట్టే మోసపోవుటయు
ఎవరెవరికో సేవ లెఱుక లేక సేయుటయు
ఏవోవే తత్త్వసార హీన విద్య లెఱుగుటయు
అవలక్షణములు చూడ భువిని పామరుల కన
కోరి కోరి బంధముల కూరుకొని యుండుటయు
ఊరకే యివల కవల కొంటిగా తిరుగుటయు
తారక నామము నైన తలప లేక పోవుటయు
శ్రీరామ పామరులకు జీవ సహజాతములు
3, అక్టోబర్ 2019, గురువారం
ఒట్టు శ్రీరామా యిచట
ఒట్టు శ్రీరామ యిచట దుష్టు లెవ్వరు లేరు
గట్టిగ నొకరైన నీ ఘనత నెఱుగ రంతే
పంచదార చేదగును పైత్యరోగుల కటులె
మంచివాడ వగు నిన్ను మాలోన పెక్కురు
కొంచెమైన నెఱుగరే ఘోరపు కలిజ్వరము
వంచింపగ నిందించి పలుకుదురే కాని
ఎఱుగుట కేమున్నదో యెఱిగించు వారెవరు
తఱచు తప్పుదోవలను తఱుము ఘనులె గాని
అఱకొఱ జ్ఞానమ్ము తో నంగలార్చుచు వట్టి
కొఱగాని వార లగుచు కొలువ లేరు నిన్ను
నీ వారన పెఱ లనగ నీకెవ్వరును లేరు
భూవలయము నందు సంభావింప నందరు
నీ వారే కద నీవు నిర్వ్యాజ మైన కృప
వేవేగ జూపి యందర బ్రోవ వేడెదనయ్య
1, అక్టోబర్ 2019, మంగళవారం
హరి యొక్కడే కాక యాత్మబంధువు
హరి యొక్కడే కాక యాత్మబంధు వనగ
మరి యొక్కడును లేడు మాటవరుస కైన
నరుల కైన సురల కైన సురవైరుల కైన
ధరనైనను స్వర్గపాతాళము లందైన
అరయ నెల్ల ఋక్షవానరాదులకు నైన
నిరుపమాను డా రాముడె నిజమైన చుట్టము
ధనము లున్న వారి కైన ధనహీనుల కైన
వనేచరుల కైన పట్టణవాసుల కైన
గుణగరిష్ఠులకు నైన గుణహీనుల కైన
అనుమాన మేల రాముడె యసలైన చుట్టము
బలము గలుగు వారి కైన బలహీనుల కైన
తెలివిగల వారికైన దేబెలకే నైన
కలయ సుఖము నందైన కానివేళ నైన
తలప నెప్పు డైన రాముడె దయచూపు చుట్టము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)