పాంచభౌతికదేహపంజరంబున జిక్కి పడరాని యిడుములు పడుచు నుంటి ఉఱక లోకులతోడ కొఱగాని వాదాల మత్తులోపడి నిన్ను మరచు చుంటి ఉత్తుత్తి సుఖముల కూగిస లాడుచు నటునిటు పరుగుల నలయు చుంటి ఎట్టుల నీదారి పట్టుకొందు నటంచు వగచుచు నిత్యంబు పనవు చుంటి ఏమి చెప్పుదు నయ్య నే నిట్టు లుంటి ఎటుల భవవార్థి గడచుటో యెఱుగ కుంటి దేవుడా యెటనుంటి విక దిక్కు నీవె యంటి అరయ వేమి నీ దయ కంగలార్చు చుంటి |
28, నవంబర్ 2014, శుక్రవారం
అరయ వేమి నీ దయ కంగలార్చు చుంటి.
26, నవంబర్ 2014, బుధవారం
పల్లెప్రపంచంలో తెలుగు భాష పైన ప్రశ్న - నా అభిప్రాయాలు
ఈ రోజున పల్లెప్రపంచం పోర్టల్ బ్లాగులో వచ్చిన ప్రశ్న అర్ధం కావడమా!? భాషా ప్రావీణ్యమా!? ఏది ముఖ్యం!? వాడుక భాషవల్ల గ్రాంధికానికి సమస్యలు వస్తున్నాయా!? అనేదానికి రెండువ్యాఖ్యలను మధ్యాహ్నం స్ప్వల్పవ్యవధిలో ఉంచాను. ఆ పిదప మరికొంత చర్చ జరిగింది. నా సమాధానంగా క్రొత్తవ్యాఖ్య సుదీర్ఘం కావటంతో మొత్తం వ్యాఖ్యలు మూడింటినీ ఇక్కడ ఒక టపాగా చదువరుల సౌకర్యార్థం ఉంచాను.
మొదటి వ్యాఖ్య
ఇది రాజకీయసంబంధిత చర్చకాదన్న అవగాహనతో వ్రాస్తున్నాను.
"ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా? " అన్నది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. భాషలను కొన్ని విధాలుగా వర్గీకరించారు. అది భాషాశాస్త్రం. దాని గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు దానికి సంబంధించిన చర్చ బాగుంటుంది - ముఖ్యంగా అవగాహన ఉన్నవారి మధ్యనే అది పరిమితమైనప్పుడు. ఎన్ని అక్షరలున్నాయీ? ఎంత తక్కువ అక్షరాలుంటే అంత గొప్ప భాషా వంటి పశ్నలు అశాస్త్రీయం.
వివిధ భాషావ్యాకరణాల మధ్య విచారణకూడా భాషాశాస్త్రపరమైనదే.
తెలుగు వ్యాకరణం అన్నది కావ్యాలకు ప్రశస్తి సంప్రదాయకవిత్వమూ బాగా ఉన్నరోజుల్లో భాషాస్వరూపానికి సంబంధించిన లక్షణాలను వివరించేదిగా ఉంది. వ్యావహారిక భాషకు సరైన వ్యాకరణం లేదు. ఒకటో రెండో అలాంటి ప్రయత్నాలు ఉన్నా వాటికి అంత ప్రశస్తి రాలేదు. వ్యావహారిక భాష అనేది వివిధ ప్రాంతాల్లో వివిధంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యాకరణమూ, ఒక పదజలమూ సహాయంతో నిర్వచించటం కష్టంగా ఉంది. ఇప్పుడు వాడుతున్న భాషను శిష్టవ్యావహారికం అనేవారు నిన్నటిదాకా. ఉన్న ఫణంగా దీని విస్తారంగా అన్నిప్రాంతాలకూ అన్వయింపజేయటం కూడ కొన్ని వివాదాలకు దారితీయవచ్చును. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి.
పాఠ్యగ్రంధాల్లో రశ్మ్యుద్గారత అనే పదం చూసి అసలు ఎందరికి ఇది నోరు తిరుగుతుందా అని నాడే మా బోంట్లకు అనుమానం వచ్చింది. ఇలాంటి వింతమాటలు ఇబ్బంది కలిగించాయన్నది వాస్తవం. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నదానికి చరవాణి అన్న మాట చాలా మందే వాడుతున్నారు. అది కొందరికి నవ్వు కలిగించవచ్చును. ఆలోచించండి - తమిళులు బస్సు అన్న దానికీ తమిళ పదం తయారు చేసుకుని వాడుతున్నారట. మనకి మన తెలుగుమీదే చులకన భావం కాబట్టి ఇంగ్లీయు పదాలే బాగుంటాయి. అన్నం అనటానికి బదులు రైస్ అనటం అందంగా ఉండే జాతి మనది.
కొత్తపదాలు బాగున్నా మన తెలుగుదనం లోపించిన తెలుగువారికి కృత్రిమంగానే తోస్తాయి. ఏనుగు అంటే మా తమ్ముడి కూతురికి అర్థం కాలేదు. ఎలిఫెంట్ అని చెప్పాక, మరి ఏనుగంటావేం? అని అడిగింది! అమ్మా అనటమే మనకు నచ్చని తరాలలో తెలుగు అన్నదే కృత్రిమంగా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం.
తెలుగు పదాలు అజంతాలు, అచ్చులతో పూర్తయే పొట్టిపదాలు చాలావరకు. సంస్కృతంలో ధాతుజన్యమైన పదాలు ఒకదానితో ఒకటి అతుకు పెట్టి ఏకసమాసం చేయటానికి వీలుగా ఉంటాయి. భాషా లక్షణాలలో బేధమే కారణం.
తెలుగుపదనిర్మాణంలో లోపాలేమీ లేవు. లేని బాగులు మనం చేయలేము. భాష లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను కదా తెలుగులో. అందువలన ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది.
భాషను ముందుకు తీసుకొని పోయేది జనమే. ప్రభుత్వాలు కానేకాదు. ముందు తెలుగువారం తెలుగులో మాట్లాడటం సిగ్గు అనుకోవటం భేషజం వదిలించుకోవాలి. కొత్తతరాలవారికి తెలుగు ఎవరూ నేర్పనిదే ఎలా వస్తుంది? ఇంటా బయట గొప్పకోసం ఇంగ్లీషు. ఇంట్లో అమ్మా నాన్నా కూడా తెలుగువారై ఎక్కడి పిల్లలకు తెలుగు పట్టుబడుతుందో అన్న భయంతో, ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ ఉంటే, ఇంక పిల్లతరాలకు తెలుగు పరాయి భాషకాదా? కావుకావు మనలేని కాకి ఉంటుందా అన్నాడు జంఘాలశాస్త్రి సాక్షివ్యాసాలలో. తెలుగులో మాట్లాడినందుకు పిల్లలను శిక్షించే బడులే కాదు తల్లిదండ్రుల్నీ చూసాను నేను.
ముందు జనానికి తెలుగులో మాట్లాడటం తప్పు కాదు తప్పనిసరి ఐన బాధ్యత అని అవగాహన కల్పించవలసి ఉంది. అది జరిగితే, క్రమంగా మంచి మార్పులు అవే వస్తాయి.
రెండవవ్యాఖ్య
"ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి." అన్నారు ఒకరు.
వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. కాబట్టి ఈ మాటా ఆలకించటమైనది.
ప్రస్తుతం సమస్య "మాతృభాషకన్నా ఇంగ్లీషు గొప్పభాష అన్న భ్రమ కారణంగా ఇబ్బడిముబ్బడి అవుతున్న ఇబ్బందులు". మా అమ్మ మంచిది అనుకోవటం ఎన్నడూ అహంకారం కాదు. మా అమ్మకంటే ప్రక్కింటి వాళ్ళమ్మే గొప్పది అని అనుకోవటం మంచి సంస్కారం కూడా కాదు. ఆవలి వారి అమ్మకన్నా మా అమ్మ ఎక్కువ చరువుకొనక పోయినా, ఎక్కువ అందంగా లేకపోయినా, ఎక్కువ ముసలిది ఐనా, రోగిష్టిది ఐనా, మంచి మాటతీరు లేనిది ఐనా, సామాజికంగా గుర్తింపు లేనిది ఐనా, .... ఇంకా సవాలక్ష కారణాలున్నా, మా అమ్మ మంచిది అని అందరూ అనుకుంటారు. బయటివారు పోలికలు తీసుకొని వచ్చి, అలా మా అమ్మ మంచిది అనుకోవటం అహంకారం అంటే అది వారి అమాయకత్వమా, అజ్ఞానమా, దురుసుతనమా, మరొకటా అన్నది ఎవరికి వారు వేరువేరుగా అనుకున్నా, అలా అనటాన్ని హర్షించలేరు.
ఈ మధ్య కొందరు భాషను ఒక పనిముట్టు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి భాష అమ్మే!
మూడవ వ్యాఖ్య
కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావించటానికి ఈ వ్యాఖ్య పరిమితం. వాదం కోసం వాదాన్ని పెంచటం ఈ వ్యాఖ్య ఉద్దేశం కాదు.
1. యూనికోండ్ తెలుగులో ఉన్న అక్షరాలన్నింటినీ ముద్రించుకొనే సౌకర్యం కలిగిస్తుంది.
2. ఎక్కువ ప్రచారంలో కనిపింఅని అక్షరాలు తీసివేయటం అంటూ ఆలోచించకండి దయచేసి. పాత పత్రాలను ఎక్కించేటప్పుడు అవి అవసరం అవుతాయి.
3. అచ్చులన్నీ వ్రాయవచ్చును. ఋ ౠ ఌ ౡ అనే వాటితో సహా.
4. హల్లులన్నీ వ్రాయవచ్చును ౘ ౙ అనే దంత్యాలతో సహా.
5. రూపాయ గుర్తు కూడా అందుబాటులో ఉంది.
6. ఐతే మీకు అందుబాటులో ఉన్న ఉపకరణాలు అన్ని అక్షరాలను సమకూర్చలేకపోవచ్చును.
7. లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్ తగిన యూనికోడ్ వెర్షన్‍ను అందించక పోవచ్చును.
8. 'భాష అనేది ఒక టూల్ మాత్రమే' అన్న భావన నాకు నచ్చదని ముందే మనవిచేసాను. అన్నిభాషలలోను మహనీయులు జ్ఞానబోద చేసారు. కాని అన్నిభాషలనుండీ మనం నేరుగా స్వీకరించలేము, ఇతరులు భాషాంతరీకరణం చేస్తేకాని. భాష ఒక జ్ఞానవాహిని. మాతృస్వరూపిణి. పుట్టాక కొన్నాళ్ళు పాలిచ్చే టూల్ అమ్మ అనుకోవటం నా ఊహకు అందదు. అలాగే పరస్పర భావవినిమయానికే కాక జ్ఞాననిక్షేపణకూ భాష అనేది ఒక అనంతనిధి. కాబట్టి అటువంటి భాష ఒకటూల్ మాత్రమే అన్న భావన సబుబుకా దనుకుంటాను.
9. తెలుగుపదాల సంఖ్యను పెంచటానికి తాపత్రయం మంచిదే. అంతకన్నా ముందు తెలుగులో ఉన్న పదసంపద బాగా తెలుసుకోవాలు తెలుగుభాషపై అంత మక్కువ ఉన్నవారు.
10. తెలుగుకు 56 అక్షరాలు ఎక్కువే అనుకునే వారితో నాకు వాదించను. కాని, మరొకసారి విన్నవించే ప్రయత్నం చేస్తాను. చీనీభాషలో వేలాది పదచిత్రరూపాలు నేర్చుకోవలసి ఉంటుంది. జపనీస్ భాషలోనూ అంతే. కాని వారు అలాగే తమతమ భాషలను అంతర్జాతీయభాషలుగా తీర్చిదిద్దుకున్నారు. మనం మనకు అక్షరాలు ఎక్కువైపోవటం వలన తెలుగు అంతర్జాతీయ భాష కాలేకపోయిందన్నట్లుగా బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నాం, ఒక పక్కన తెలుగులో పెదవి విప్పటమే నామోషీగా ప్రవర్తిస్తూ. ఇంగ్లీషులో Q అనే అక్షరం లేకపోతే కొంపేమీ మునిగిపోదు. కాని ఇంగ్లీషు తెలిసినవారూ, ఇంగీషు మాతృభాషగా ఉన్నవారూ ఎంతమంది ఈ అక్షరం అనవసరం అని భాషలోంచి తీసెయ్యండి అని అరుస్తున్నారు?
11. తెలుగులో కాని సంస్కృతంలో కాని ఒకేవిధంగా పలికే అక్షరాలు పునరావృతంగా లేనే లేవు. ఊష్మాలనబడే శ, ష, స, హ లను ఈ రోజుల్లో తెలుగు సరిగా తెలియని తరం సరిగ్గా ఉఛ్ఛరించకపోతే ఆ తప్పు భాషదా? శ ను ష లాగా పలకటం శుధ్ధతప్పు! తెలుగులో ఒకే రకం పలుకుబడి ఉన్న అక్షరాలూ అంటూ ఒక రాగం వినిపిస్తున్నవారు, ఇంగీషులో J, Z అనేవి సాదృశాక్షరాలుకావంటారా? Z ఎందుకన్న అనుమానం రావటం లేదా మీకు?
12. సంస్కృతానికి ఉన్న సుళువులు తెలుగులో దించలేము. ఏ భాష వ్యక్తిత్వం ఆ భాషదే. మూలస్వరూపాన్ని మార్చటం కుదరదు. చిన్నయసూరిగారు కాని మరొక వయ్యాకరణి కాని వ్యాకరణం వ్రాసాకనే భాష అలా ప్రవర్తించటం జరగదు. భాష ఎలా ప్రవర్తిస్తోందో దానిని సూత్రబధ్ధం చేయటమే వ్యాకరణం. ఉదా। వాడు + ఎక్కడ => వాడెక్కడ. అందరూ కలిపే అంటారు కదా? వ్యాకరణమూ అదే చెబుతుంది.
13. ఏ భాషలోంచి ఐనా మరొక భాషలోకి తర్జుమా చేస్తే నూటికి నూరుపాళ్ళూ అలాగే ఉండదు. ఏ భాష పలుకుబడి దానిది. ఇంగీషు వాడు make hay while the Sun shines అంటే దానిని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని వ్రాయాలి మన నుడికారం కోసం. అలాగే అందరూ బియ్యాన్నే వండుతారు అన్నం కోసం, కాని అన్నవండాం అంటాం కాని బియ్యం వండాం అనం.
14. ఒక భాష ప్రపంచభాష కావటానికి కారణాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉంటాయి. నామావశిష్టం ఐపోయిన హీబ్రూ భాషని ఇజ్రాయిల్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయస్థాయికి చేర్చింది. అంతా ఆ భాష మాట్లాడే వారి సంకల్పధృఢత్వంలో ఉంది.
15. తెలుగుతోసహా ఏ భాషలోనూ పదాలనూ పండితులు కనిపెట్టి ప్రజల్ని వాడమని ఒత్తిడి చేయలేదు. ముందు ప్రజావినియోగంలో నుండే పదాలు పండితవినియోగం లోనికి వస్తాయి. వాటికి వారు పరిణతి, విస్తృతి కల్పిస్తారు. ప్రజల్లో నుంది వచ్చిన పదాలకు కొత్తకూర్పులూ పండితులు వ్యాప్తి చేస్తారు.
ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువగా వ్రాయవలసిన అవసరం పడదనే భావిస్తున్నాను.
25, నవంబర్ 2014, మంగళవారం
నీవు నావాడవై యుండినావు చాలు
చక్కగ నా చేత జరుగనై నట్టివి నీ దయచేతనే నెఱపు చుంటి జరిగిన వన్నియు జరిపించినది తామె యనెడు ప్రచారముల్ వినుచు నుంటి ముదిమిని నా భారమును వహించెడు వార లెవ్వరు లేరని యెఱిగి యుంటి రాబోవు కాలాన నాబోటి వానికి తలచువారలు లేమి తెలిసి యుంటి ఈశ్వరా నేడు నీవు నా కిచ్చి నట్టి జీవితం బిది దీనికి చింత లేదు ఎవరు నన్నెన్న మానిన నేమి గాని నీవు నావాడవై యుండినావు చాలు |
24, నవంబర్ 2014, సోమవారం
సర్వవిధముల నా కతిసన్నిహితుడు
ఈ చరాచర సృష్టి నెనుబది నాలుగు లక్షల జీవాళి లక్షణముల నెఱుగుచు వాటికి నెల్లవేళల నుత్త మంబగు గతులను మలుచు వాడు వాటికి గలుగు నుపాధిగతంబగు చిక్కులు దీర్చుచు నక్కజముగ నక్షీణకృపను సంరక్షణం బొనరించ క్షణ మేని విశ్రాంతి గొనని వాడు జీవులాడెడు నాటల చిత్రగతులు మందహాసంబుతో జూచు మంచివాడు సర్వవిధముల నా కతిసన్నిహితుడు వాని నీశ్వరు నిత్యంబు బ్రస్తుతింతు |
21, నవంబర్ 2014, శుక్రవారం
కొండలరావుగారి వ్యాసం - బ్లాగర్లకు వ్యాఖ్యాతలకు సలహాలు
పల్లె ప్రపంచం - ప్రజ లో నేనడిగిన "తెలుగు బ్లాగర్లకో విజ్ఞప్తి : కామెంటడం ఓ కళ - దానినెందుకు కలగా మిగులుస్తున్నారు?" అన్న ప్రశ్నకు సమాధానంగానూ, శ్యామలీయం గారి బ్లాగులో "వ్యాఖ్యారంగ విమర్శనం - వ్యాసాలకు ఆహ్వానం!" అన్న పిలుపుకు వ్యాసంగానూ ఏదైనా వ్రాద్దామనుకుని మొదలెడితే ఇలా పెద్ద వ్యాసమయింది. ఎడిట్ చేసే ఓపికలేక యధాతధంగా పోస్టుగా పబ్లిష్ చేస్తున్నాను. ఓపికగా చదివిన వారు తమ అభిప్రాయాలు చెప్పగలరని విజ్ఞప్తి.
భూమి మీద 84 లక్షల జీవరాసులు నివసిస్తున్నాయని ఓ అంచనా ! ఇన్ని జీవరాసులలో మనిషి ప్రత్యేకత 'మనసు' . మనసుకు నిర్వచనం మనిషి యొక్క ఆలోచనావిధానం . మనిషిలో ఇతర అవయవాలు చేసినట్లుగానే మెదడు చేసే పని ఆలోచించడం. ఈఆలోచన అనేది మనిషికీ - ఇతర జీవులకు తేడాని తెలియజేస్తున్నది. .
మనిషి మాత్రమే పాత దానిని బేరీజు వేసుకుని కొత్తగా ఎలా అయితే తనకు బాగుంటుందో అని ఆలోచించి మరీ ప్రయత్నం చేస్తాడు. ఇది మనిషికి కావలసిన అన్ని రంగాలలో నిరంతరం జరిగే ప్రక్రియ. జంతువులు లేదా మిగతా జీవరాసులు అలా కాదు. సహజాతంగా తరతరాలుగా తమకున్న నాలెడ్జ్ మేరకు మాత్రమే అలాగే మారకుండా జీవిస్తున్నాయి. కేవలం ఒక్క మనిషి మాత్రమే ఆలోచించి తను మారుతూ, పరిస్తితులను మార్చుతూ ఉంటాడు.
ఇక్కడే మనిషికీ - మనిషికీ మధ్య కొంత ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ కొన్ని విషయాలలో కొంత కాలం, ఇంకొన్ని విషయాలలో అనంతంగా జరిగినా భగవద్గీతలో చెప్పినట్లు ఎప్పటికప్పుడు పరివర్తనం చెందడమనేది లోకం పోకడగా ఉంటుంది. ఈ పరివర్తనకు కారణం మానసిక సంఘర్షణే - మనసే అనేది మనసున్న మనం చాలా సార్లు మరచిపోతుంటాం. మనుషులమధ్య మనసుల పోట్లాటా అందుకే జరుగుతుంటుంది.
మనిషికుండేవి 2 సంబంధాలు మాత్రమే : 1) ప్రక్రుతితోటి 2) మనిషితోటి . సహజంగా మనిషి సంఘజీవి. తమ అవసరాలకోసం మనుషులంతా కలసి ప్రకృతిని ఆధారం చేసుకుని సాంఘిక జీవనం సాగిస్తుంటారు. సంఘజీవనం కోసం ఎప్పటికప్పుడు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు. తాను ఏర్పరచుకున్న ఈ నియమాలతో పాటు, సృష్టి రహస్యాలయిన ప్రక్రుతిలో తన చుట్టూ జరిగే అనేక అంశాలను, తనకు ఆటంకంగా ఉన్నవాటిపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ సందర్భంగా తన మెదడులో తొలిచే అనేక ఆలోచనలను తన తోనూ ఇతరులతోనూ చర్చిస్తూ పరిష్కారం కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగమే పరస్పర చర్చలు లేదా భావ ప్రకటన అని నా అభిప్రాయం.
మనిషి తను పుట్టి పెరిగిన పరిస్తితులమేరకు కొన్ని భావాలను అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. ఈ సందర్భంగా కొన్ని అలవాట్లూ ఏర్పడతాయి. కానీ పైన చెప్పినట్లు లోకం ఎప్పుడూ మార్పుకు గురవుతుంటుంది. ఎవరాపినా ఆగదు. సమాజం ఎప్పటికప్పుడు ఉన్న స్తితినుండి ఉన్నత స్తితికి మారుతుంది. ఇది అనివార్యం- అవసరం కూడా.
ఒక్కోసారి ఉన్నతంగా కంటే దిగజారే పరిస్తితులూ కొందరు మనుషులు ప్రవర్తిస్తుంటారు. అది వారి స్వార్ధం. ఇంకొందరు చిన్నప్పటినుండి తామేర్పరచుకున్న భావాలు - ఆచార వ్యవహారాలు తొలగిపోతుంటేనో, తొలగించబడుతుంటేనో తట్టుకోలేరు. సమాజం చెడిపోతున్నదని, దిగజారి పోతున్నదని, కావాలని కొందరు దిగజారుస్తున్నారని వారి భయం. మరికొందరు సమాజంలో ఆచార వ్యవహారాలు ఆటంకంగా ఉన్నవి పాత చింతకాయ పచ్చడిలా తయారయ్యాయని చాదస్తమనీ వాదిస్తుంటారు. అది వారి అసహనం. ఇలా రకరకాలుగా వివిధ అంశాలపై అభిప్రాయాలున్నా అందరూ ఒకరిపై మరొకరు ఆధారపడుతూ కలసే జీవిస్తుంటారు.
ఇక్కడే ప్రధానమైన ఓ అంశమేమిటంటే, విడి విడిగా మనసులలో ఏర్పరచుకున్న భావాలు బయటకు వెలిబుచ్చినప్పుడే అదే భావాలున్నవారి మధ్య ఓ ఐక్యత ఏర్పడుతుంది. అది క్రమంగా ఓ శక్తిగా మారుతుంది. ఓ అంశంపట్ల మార్పుకు దోహదం చేస్తుంది. ఇక్కడే మళ్లీ భిన్న భావాలు భిన్న గ్రూపులుగా ఏర్పడతాయి. ఏ భావం రైటూ ఏ భావం తప్పు అనే విచక్షణ లేకపోతే మనుషుల మధ్య ఈగోలు పెరిగి అవి గ్రూపుల ఈగోలుగా మారి గొడవలవుతుంటాయి. ఎన్ని గొడవలయినా ఎవరెంత ఈగో పెంచుకున్నా కాలక్రమంలో ఆచరణలో అవసరమైన కంఫర్టబుల్ అంశాలే ఆచార వ్యవహారాలుగా నిత్యం వికసిస్తుంటాయి.
ఈగోలను పక్కనబెట్టి అంశాలవారీగా విచక్షణకు పదును బెడితే ఎప్పటికప్పుడు వ్యక్తి ఉన్నతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది. ఈగోల మాటున, గ్రూపుల లేదా ఇజాల మాటున బందీ అయితే చైతన్యం వికసించదు. బయట అయినా బ్లాగులలో అయినా విచక్షణ అనేది మనిషి చైతన్యం మరియూ వ్యక్తిత్వం ఏర్పడడానికి కీలకమైనదని నా అభిప్రాయం. దీనికి ఏమిటి? ఎందుకు? ఎలా? అనే శాస్త్రీయ ధృక్పథం అలవరచుకోవడమొక్కటే పరిష్కారం. ఏ ఒక్కరికీ ఎప్పటికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు కనుక అందరూ అందరికి గురువులే. అందరూ అందరికీ అవసరాన్ని బట్టి శిష్యులే అని నా నమ్మకం. నేర్పడానికీ - నేర్చుకోవడానికీ కూడా భావప్రకటన చాలా అవసరం. అది సరిగా ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది. మనిషికీ మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు భావ ప్రకటన అనే కళనును ఇంప్రూవ్ చేసుకోవడానికి కామెంట్లు ఉపయోగపడతాయి. తినగ తినగ వేము తియ్యగుండును అనగననగ రాగమతిశయిల్లుచునుండునన్నాడుగదా మన వేమన్న. అలాగే సాధనమున కామెంట్లు చక్కగా ఉంటాయి.
బ్లాగర్లకు చెప్పదలచుకున్నది:- మీరు చెప్పదలచుకున్న అంశాలను నిర్మొహమాటంగా చెప్పే అవకాశం బ్లాగులు కల్పిస్తున్నాయి. అయితే కొత్త బ్లాగర్లను ప్రోత్సహించడానికి మీరు ఓపిక చేయండి. ఓపిక అంటే బాగాలేని వాటిని, మీరు చెత్త అనుకునే వాటిని గురించి. మీ బిడ్డ తొలిసారిగా మాట్లాడినప్పుడు, కాగితంపై ఓ బొమ్మ తొలిసారి వేసినప్పుడు మీకెంత ఆనందం ఉంటుంది? ఆ బిడ్డకెంత ఆనందం ఉంటుంది. గుర్తుకు తెచ్చుకోండి. అలాగే కొత్త వారు వ్రాయడం ప్రారంభించినప్పుడు వారేది వ్రాసినా మీరు చిరాకు పడకండి. మీరే అన్ని తెలిసిన గొప్పవారిలా నెగెటివ్ గానో, సర్వజ్ఞులలానో ప్రవర్తించకండి. దయచేసి ఇలాంటి లక్షణాలున్నవారు ఓపిక చేయడమనే కళను ఇంప్రూవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి భావాలను స్వేచ్చగా ఆహ్వానించేలా ప్రోత్సహించండి. మీరూ వారినుండి నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త బ్లాగర్లు చిన్నపోస్టులు వ్రాస్తే వారిని అభినందించే చిన్న కామెంటయినా మనం వ్రాస్తే వారు చిన్నపోకుండా ఉంటారు. ఈ రోజే ఆ పని ప్రారంభించండి. అదే విధంగా మీరు వ్రాసినదానికి భిన్నాభిప్రాయం వస్తే ఆలోచించి మీరు నేర్చుకునేది ఉంటే నేర్చుకోండి. లేదా మీ అభిప్రాయం సూటిగా చెప్పేయండి. బాగున్నదానిని బాగున్నదన్నట్లే బాగాలేనిదానిని బాగాలేదనీ అనాలి. అలా ఎందుకంటున్నామో చెప్పేది బాగు చేయడానికి కావాలి గానీ బాధ పెట్టడానికి కాకూడదని మనవి.
వ్యక్తుల గత ఆలోచనలను బట్టి అంచనాతో కాకుండా ఎప్పటి భావాలను,విషయాలను అప్పుడే గమనిస్తూ కామెంట్ చేయడం మంచిది. ప్రవీణ్ తో చర్చించేటప్పుడు మార్క్సిస్టు అనో, శ్రీరాం గారితో చరంచేటప్పుడు బీ.జే.పీ వారనో , శ్యామలీయం గారు రామభక్తులనో, శ్రీకాంత్ చారితో అయితే తెలంగాణావాదనో చూడకూడదు. భావమేది అందులో మన అభిప్రాయమేమిటి? అనేలా మాత్రమే చూడాలి. అలాగే మనిషిని బట్టిగాక విషయాన్ని బట్టి కామెంట్ చేయడం అలవాటుగా మార్చుకుంటే అత్యధిక సమస్యలు తగ్గుతాయి. ఇది అసాధ్యమేమి కాదు కూడా.
మన అభిప్రాయం తప్పని తేలితే వెంటనే నేర్చుకోవడానికీ, మార్చుకోవడానికీ వెనుకాడకూడదు. అలాగే భావోద్వేగంలో వ్యక్తిగతంగా మాట జారితే వెంటనే వెనుకకు తీసుకోండి. పదే పదే దానిని సమర్ధించుకునే విపరీత పైత్యం మనపట్ల మరింత ఏహ్యభావం కలగడానికే ఉపయోగపడుతుంది. మనలోని అహంకారాన్ని - అజ్ఞానాన్ని బయటపెట్టడానికి పనికి వస్తుంది.
అవసరం లేని విషయాలలోనూ, మితిమీరి దూరి సలహాలు విశ్లేషణలు చేయకండి. ఏకంగా మనుషుల గురించో - బ్లాగుల గురించో, పోస్టుల గురించో పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారాలు చేయకండి. పాజిటివ్ అయితే ఫర్వాలేదు. ఒకరిని ప్రోత్సహించినట్లవుతుంది కనుక. మీకు చికాకు అనిపిస్తే తప్పుకుని పోవచ్చు తప్ప, మీరు తప్పు చేసి మరీ ఎదుటివారి తప్పులను సరిచేయాల్సిన అవసరం లేదు. ఇది ఓ రకమైన పైత్యమే అని నా అభిప్రాయం!
పాలకులను, ప్రాంతాలనూ దృష్టిలో ఉంచుకుని ఓ వైపు నిలబడి ఎంతకైనా సాగదీస్తూ ఎబ్బెట్టుగా వాదించడం అభిమానం కంటే దురభిమానమే ఎక్కువగా కనిపిస్తుంది. మీకున్న నాలెడ్జ్ ని ఈ ప్రవర్తన మసకబారుస్తుందని నా అభిప్రాయం. అభిమానానికీ దురభిమానానికీ విమర్శకీ కువిమర్శకీ తేడాని గమనించి వాదించడం మంచిది.
మీకు ఆసక్తిగా ఉన్నవే ఇతరులకీ ఆసక్తిగా ఉండాలని కోరుకునే వాదనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఏది ఎవరికి ఇష్టంగా ఉండాలో అది వారి వ్యక్తిగతం. మీరు అందుకు కష్టంగా ఫీలవడం అంటే అసహనం ఎక్కువవుతున్నట్లే. లేదా స్వార్ధపరులైనా అయి ఉండాలి. ఎదుటివరిని గౌరవించడం తెలీనివారైనా అయి ఉండాలి. అన్ని భావాలను, అందరి భావాలను స్వీకరిచలేకపోయినా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఏవి ఎక్కువ బాగుంటాయో వాటికే ఆదరణ లభిస్తుంది. చిన్న గీతను చెరపకుండానే పెద్ద గీతను గీయడానికి మార్గాలను అన్వేషించండి.
అనవసరమైన, కించపరచే శాడిస్టు లక్షణాలను వెంటనే తగ్గించుకోండి. ఇది కొందరిలో ఎప్పుడూ, అందరిలో(?) అప్పుడప్పుడూ అసహనంతో జరిగినా వెంటనే మార్చుకోవాలి. పొరపాటున నోరు జారితే వెంటనే క్షమాపణ చెప్పండి. ఒక్క అడుగు వెనుకకు వేస్తే రెండడుగులు ముందుకు పడతాయంటే తప్పక ఓ అడుగు ముందుకే వెళుతుందనేది విజయమేనని గుర్తించండి.
మన అభిప్రాయం సరయినదని మనం గట్టి ఆధారాలుతో నమ్మినప్పుడు లక్ష మంది వ్యతిరేకించినా జంకవద్దు. మనమెలా రైటో ఓపికగా వివరించే ప్రయత్నం చేయండి. మూకలుగా ఒక అభిప్రాయానికి వ్యతిరేకంగా కాకిగోల చేయకండి. మనం కాకులం కాదు దాడి చేయడానికి. మనసున్న మనుషులు కాకి గోల చేసినా ప్రయోజనం ఉండదు కంఠశోష - శాడిస్టిక్ పైత్యానందం తప్ప. ఇది ఓ రకంగా వికృత రేగింగ్ లాంటిదే. పదిమంది కలసి కాకిగోల చేస్తే ఒక మంచి అభిప్రాయం చెప్పే గొంతు నులిమివేయలేరు. అరచేతితో సూర్యకాంతినాపాలనుకోవడమెంత అజ్ఞానమో అహంకారంగా,అడ్డగోలుగా మంద బలంతో, మంది బలంతో వాదించడమూ అంతే అజ్ఞానం. భూమి గుండ్రంగా ఉన్నదన్న వారిని చంపేసినా భూమి గుండ్రంగానే ఉన్నదన్నదే నిజం కదా!
కామెంట్లను ఓ బ్లాగరుగా ఎలా నియంత్రించాలనేది ఎవరికివారే చేసుకునే అవకాశం ఉన్నట్లే దానికంటే ముందుగా కామెంట్ చేసేవారు స్వీయ నియంత్రణ పాటించడం మెరుగైన పద్ధతి. ఆ చైతన్యం తెలుగు బ్లాగర్లలో పెరగాల్సిన అవసరం ఉన్నది.
ఇక అగ్రిగేటర్లలో మాలిక విధానం బాగున్నది (నేను ఎక్కువగా మాలికను చూస్తుంటాను). అందులోనే విడిగా బ్లాగుల వారీగా కూడా కామెంట్లు చూసుకునే అవకాశం కల్పిస్తే మంచిది. ఆ విధంగా వారు ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. చాలామందితో వాదించిన అనుభవంతో కొన్ని ఉదాహరణలిచ్చాను. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టేందుకు ఇది వ్రాయలేదని విజ్ఞప్తి.
20, నవంబర్ 2014, గురువారం
వ్యాఖ్యారంగ విమర్శనం - వ్యాసాలకు ఆహ్వానం!
వ్యాఖ్యారంగ విలోకనం అని లోగడ వ్రాసిన టపాకు ఇది కొనసాగింపుగా కొంచెం విస్తృతపరిధిలో చర్చ. ఈ సందర్భంగా మనం కొన్ని అవసరమైన ప్రశ్నలను గుర్తించి వాటికి సమాధానాలను అన్వేషిద్దాం. ఉదాహరణకు ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నలు చూడండి.
నిజానికి ఈప్రశ్నలను చుడుతూనేనే ఒక టపా కట్టి ప్రచురించాలని భావించాను. కాని ఆలోచించగా నాకు మరొక చక్కని మార్గం గోచరించింది.
ఈ సందర్భంగా బ్లాగర్లూ, వ్యాఖ్యాతలూ తమ అభిప్రాయాలతో ముందుకు వస్తే వాటిని ప్రచురించటమే నాకు తట్టిన ఆ చక్కని మార్గం. ఇది బాగుంటుందని నాకు అనిపించింది సరే, ఎలా అమలు చేయాలీ అనే విషయంలొ ఒక స్పష్టమైన విధివిదానాలు రూపొందించి మరీ ముందుకు వెళ్ళటం మంచిది అన్న సంగతి కూడా ఆలోచించి చెబుతున్నాను.
- వ్యాఖ్యల ప్రయోజనం ఏమిటి?
- వ్యాఖ్యలను వర్గీకరించటం ఎలా?
- వ్యాఖ్యలు కాని వ్యాఖ్యలు ఉంటాయా? ఎలా?
- వ్యాఖ్యల అవసరం బ్లాగర్లకు ఎంత మేరకు ఉంది?
- వ్యాఖ్యల వాసి - రాశి తెలుగు బ్లాగుల విషయంలో ఎలా ఉంది?
- వ్యాఖ్యలను వ్రాసే విషయంలో చదువరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వ్యాఖ్యలకు వచ్చే ప్రతిస్పందనలను చదువరులు గమనించవలసిన అవసరం ఉందా?
- వ్యాఖ్యలకు వచ్చే ప్రతిస్పందనలను చదువరులు గమనిస్తూఉంటం ఎలా?
- వ్యాఖ్యలను ప్రకటించే విషయంలో బ్లాగర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వ్యాఖ్యలను చదివే విషయంలో చదువరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వ్యాఖ్యలను ప్రదర్శించటంలో అగ్రగేటర్లు ఎటువంటి పధ్ధతులు పాటించవచ్చును?
నిజానికి ఈప్రశ్నలను చుడుతూనేనే ఒక టపా కట్టి ప్రచురించాలని భావించాను. కాని ఆలోచించగా నాకు మరొక చక్కని మార్గం గోచరించింది.
ఈ సందర్భంగా బ్లాగర్లూ, వ్యాఖ్యాతలూ తమ అభిప్రాయాలతో ముందుకు వస్తే వాటిని ప్రచురించటమే నాకు తట్టిన ఆ చక్కని మార్గం. ఇది బాగుంటుందని నాకు అనిపించింది సరే, ఎలా అమలు చేయాలీ అనే విషయంలొ ఒక స్పష్టమైన విధివిదానాలు రూపొందించి మరీ ముందుకు వెళ్ళటం మంచిది అన్న సంగతి కూడా ఆలోచించి చెబుతున్నాను.
- ముఖ్యాంశం తెలుగు బ్లాగులూ - వ్యాఖ్యలూ అన్నది. ఇతర అంశాల గురించి అభిప్రాయాలు వ్రాయవద్దు.
- పైన ఇచ్చినవి నమూనా ప్రశ్నలు మాత్రమే. మీరు వ్రాసే వ్యాసానికి శీర్షికను మీరే నిర్ణయించుకోండి.
- వ్యాసానికి ఇంత నిడివిలో ఉండాలీ అన్న నియమం ఏమీ లేదు. వ్యాసకర్తలే ఆలోచించుకొని, వ్రాయాలి తగిన నిడివితో.
- వ్యాసాన్ని వ్యావహారికమైన తెలుగులోనే వ్రాసితీరాలి. సందర్భోచితంగా అతిమితంగా ఇతరభాషాపదాలూ వాక్యాలూ సరే.
- వ్యాసంలో అవసరమైన మార్పులూ చేర్పులూ చేయవలసి రావచ్చు. అవి భాషావ్యాకరణదోషాలూ, చర్వతచర్వణాలూ వగైరా తొలగించేందుకూ, ఇతరులకు అభ్యంతరకరం అనిపించే అవకాశాలు పరిహరించేందుకూ, మరింత మెరుగైన వాక్యనిర్మాణాదుల అవకాశాలు వినియోగించుకొందుకూ వగైరా మాత్రమే. వ్యాసవిషయంలో మౌలికమైన మార్పులు కోరటం జరగదు.
- వచ్చిన ప్రతి వ్యాసమూ ప్రచురణకు అంగీకరించబడక పోవచ్చును. అంగీకరించిన వ్యాసాలే ప్రచురించబడతాయి.
- ప్రచురణకు యథాతధంగా స్వీకరించకపోయినా వాటిలోని భాగాల్ని వాడుతూ సమగ్రంగా ఒకటి రెండు ఇతరవ్యాసాలు అనే పేరుతో ప్రస్తావించి ప్రకటించవచ్చును.
- ప్రతి వ్యాసమూ s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది. వాసాన్ని జతపరచి పంపవచ్చును లేదా ఈ-మెయిల్‌లో నేరుగా తెలుగులో టైపు చేసి పంపవచ్చును.
- వ్యాసంతో పాటుగా ఇష్టముంటే ఫోటో, సెల్-ఫోన్ నెంబరు కూడా ఇవ్వవచ్చును.
- వ్యాసంతో పాటు వ్యాసకర్త ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నెంబరు, ఫోటోలు ఏవైనా ప్రచురించబడతాయి. ఏ సమాచారమైనా ప్రచురించవద్దనుకుంటే మీ వ్యాసంతో పంపుతున్న ఈ-మెయిలో చెప్పండి.
- ఈ వ్యాసాలు ప్రకటించినప్పుడు వాటిపై వ్యాఖ్యలు ఈ బ్లాగులో అంగీకరించబడవు. అన్ని వ్యాఖ్యలనూ వ్యాసం లింక్ ఉదహరిస్తూ నేరుగా ఈ s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది.
- ఏ వ్యాసం పైన ఐనా, వచ్చిన వ్యాఖ్యలను రచయితకు పంపి వారి స్పందనలతో ప్రకటించటం జరుగుతుంది. ఐతే రచయిత స్పందించిన వ్యాఖ్యలూ వాటికి రచయిత జవాబులూ మాత్రమే ప్రచురించబడతాయి. ఇక సదరు వ్యాసంపై క్రొత్త వ్యాఖ్యలూ, కొనసాగింపు వ్యాఖ్యలూ అనుమతించబడవు.
- వ్యాసానికి సంబంధించిన అన్ని పరిణామాలూ వ్యాసకర్తవే. ఈ బ్లాగుకు సంబంధం లేదు.
- ప్రచురించబడిన వ్యాసాన్ని వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో పునః ప్రచురణ చేసుకోవచ్చును.
ఐతే ఈ వ్యాసాల ప్రకటనా, అభిప్రాయాల క్రోడీకరణా పూర్తయి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేవరకూ దయచేసి అలా తమ తమ బ్లాగుల్లో ప్రకటించకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షంలో వ్యాఖ్యలను క్రోడీకరించటం ఒక ప్రహసనం ఐపోతుంది.
- లేదా -
వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో ప్రచురించుకొని ఆ టపాకు వ్యాఖ్యలను నిషేధించాలి. వ్యాఖ్యలను వ్యాసం యొక్క లింకుతోపాటుగా s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది అని సూచన ఇవ్వాలి. - తిరస్కరించబడిన వ్యాసాన్ని వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో పునః ప్రచురణ చేసుకోవచ్చును.
- వ్యాసకర్తలు తమవ్యాసాన్ని ముందే తామే ప్రచురించుకుని వ్యాఖ్యలనూ స్వీకరించే పక్షంలో వ్యాసాన్ని ఉపసంహరించటం తప్పనిసరి అవుతున్నది.
ఈ ప్రతిపాదనపైన చదువరులు తమ స్పందన తెలియజేయండి.
దారిజూప నుఱక తహతహలాడెద వీశ్వరా
పండుగో పబ్బమో వచ్చినప్పుడు మాత్ర మొక్క మా రెట్టులో మ్రొక్కువారు తల్లివై తండ్రివై దాతవై నేతవై యుండు నిన్నే మరచి యుండువారు కొంగ్రొత్తమతముల క్రొత్తబోధనలతో క్రొత్తదేవుళ్ళను కొలుచు వారు అందరకన్నను నాప్తుండ వగు నిన్ను తిట్టుచు నిత్యంబు తిరుగువారు నిండి యుండిరయ్య నేడు లోకంబున వారిపట్ల జాలిబరపి నీవు దారిజూప నుఱక తహతహలాడెద వీశ్వరా మహాత్మ యివియె నుతులు |
18, నవంబర్ 2014, మంగళవారం
ఈశ్వరా మోక్షమందుట కేమి యడ్డు
సహజమై కోపంబు సర్పంబు లందుండు పులులందు క్రూరత పొంగుచుండు హరిణంబులందుండు నమిత భయంబును దొంగలై నక్కలు తోచుచుండు తోడేళ్ళు తిండిపోతుల రీతిగా నుండు కోతులయం దతికుతుక ముండు గాడిదలకు బుధ్ధి కడుస్వల్పమై యుండు శుచి నెఱుంగక యుండు సూకరములు వాయి లేనట్టి వటులుండ వచ్చుగాక మనుజులకు జంతుబుద్దులు మంచి వగునె మనసులందున నినునిల్పి మసలి రేని ఈశ్వరా మోక్షమందుట కేమి యడ్డు |
ఎంచ నీ కంటె సద్గురు వెవ్వడయ్య
స్వపరభేదంబులు క్షణము చాలించు నా వలి క్షణమున బంధుగులను దలచు ఇంద్రియసుఖముల నీసడించును క్షణ మవి గోరి మరుక్షణ మలమటించు సత్యంబు పై నిల్చు క్షణము నా బుధ్ధి య సత్యంబు నే బల్కు క్షణము పిదప ఈ బుధ్ధి యీ క్షణ మీశ్వర నిన్నెంచు నంతలో పోవు నన్యముల కడకు చంచలంబగు నాబుధ్ధి జాడ్య ముడిపి మంచి దారికి నీవె రప్పించవలయు ఎంచ నీ కంటె సద్గురు వెవ్వడయ్య ఈశ్వరా నన్ను రక్షించవే మహాత్మ |
మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ ప్రశ్నావళి ద్వారా సులభంగా తెలుసుకోండి.
Harvard School of Public Health (HSPH) వారు ఒక మంచి ప్రశ్నావళితో కూడిన సర్వేను రూపొందించారు. దీని సహాయంతో మన ఎంత మంచి అరోగ్యవంతమైన ఆహారవిహారాలు కలిగి ఉన్నదీ చక్కగా అంచనా వేయవచ్చును.
ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితినీ, తెలుసుకోవచ్చును. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం గురించి ఈ సర్వే చెబుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో గుండెజబ్బుల గురించి అంచనాలకు రావటం అంత సులభం కాదు. ఈ సర్వే ఆ కొరత తీర్చుతోంది.
ముఖ్యంగా మధ్య వయస్కులైన స్త్రీపురుషులకు ఈ సర్వే ఫలితాలు మంచి దారులు చూపిస్తాయి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో స్పష్టం చేస్తాయి.
61,025 మంది స్త్రీలనూ. 34,478 పురుషులనూ పరిశీలించారు ఈ సర్వే రూపొందించటం కోసం . 24 సంవత్సరాల పాటు జరిగిన పరిశీలనలో వీరిలో 3,775 మంది స్త్రీలలోనూ, 3,506 పురుషులలోనూ హృధయసంబంధమైన వ్యాధులు గమనించారు
సులభమైన ప్రశ్నలద్వారా మీ (గుండె) ఆరోగ్యపరిస్థితిని అంచనావేసే ఈ పరీక్షను మీకు మీరే ఇప్పుడే చేసుకోండి. అవసరమైన ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోంది మీ జీవన శైలిలో.
(మూలవ్యాసం:New online calculator estimates cardiovascular disease risk)
17, నవంబర్ 2014, సోమవారం
ఎఱుక గల్గిన యీక్షణ మేను నీది
ఇపుడు చక్కగ నున్న యింద్రియంబుల సత్త్వ మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక తనదంచు మురిపాన దాల్చి తిరుగెడు దేహ మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక లోకంబు తనకిచ్చు నీ కొద్ది మరియాద యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక ఈశ్వరార్పితమైన యీ బుధ్ధి చక్కగా యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక నీది నీదన నిజముగా నేది యుండె నెఱుక గల్గిన యీక్షణ మేను నీది యిదియె పదిలంబుగా బట్టి యీశ్వరునకు పాదపూజల వెచ్చించ వలయునయ్య |
విన్నపం బిదె నీ మాట వినవలతును
వినిపించెదను నీకు విన్నపం బొక్కటి వివరంబుగా నీవు వినవలయును ఇన్ని జన్మము లెత్త నేమిటి కో తండ్రి యింకెన్ని జన్మంబు లెత్తవలయు మరలమరల నేను మానవుండుగ బుట్టి మానక చెడుచుండి మాయవలన పాపపుణ్యంబుల వలలోన చిక్కుచు క్రిందుమీదగుటేమి క్రీడ నీకు మరియు నీ యంశ నేనను మాట యొకటి పలుకుచుండెద వద్దాని భావ మేమి నేను నీ వైన యెడమేల నీకు నాకు విన్నపం బిదె నీ మాట వినవలతును |
నీ దివ్యవిభవంబు మఱువకుండ
సుకవు లద్భుతమైన స్తోత్రంబులం జేసి సేవించి ధన్యులై చెలగు చుండ పరమమౌ ప్రేమచే పరవశమై భక్త కోటి నిన్నెప్పుడు కొలుచు చుండ నీ దైన తత్త్వంబు నిత్యంబు భావించి ముదమున యోగీంద్రముఖ్యు లుండ నీ దయ చాలని నిరతంబు పామరుల్ ప్రార్థించు వారలై పరగు చుండ అందరకు నీదు సత్కృప యలరు చుండ జీవులందరు తుది నిన్ను చేరు చుండ నెఱపు నీ దివ్యవిభవంబు మఱువ కుండ నుండ జేయవె యీశ్వరా యుర్విమీద |
16, నవంబర్ 2014, ఆదివారం
బుధులమాట వినుచు పెరిగి ..
భూతంబు లన్నింటి పుట్టించి పోషింతు వనెడు బుధులమాట వినుచు పెరిగి సజ్జనులకు నీవు సంరక్ష సేసెద వనెడు బుధులమాట వినుచు పెరిగి దుర్జనులను నీవు తొలగించు చుండెద వనెడు బుధులమాట వినుచు పెరిగి నీకు సమానుడు నీ కధికుడును లే డనెడు బుధులమాట వినుచు పెరిగి ఎంతవారు నిన్ను సుంతయు తెలియలే రనెడు బుధులమాట వినుచు పెరిగి నిన్ను శరణు జొచ్చి యున్నాడ నీశ్వర కరుణజూపి నన్ను కావవయ్య |
ఒక తప్పనిసరి నిర్ణయం.
కొన్ని కారణాలవలన ఇకమీద ప్రజ బ్లాగుకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. ప్రప్రథమకారణం ప్రజబ్లాగులో చర్చలు నడుస్తున్న తీరుపట్ల అసంతృప్తి. అలోచించగా ఈ బ్లాగులో చర్చలు పోట్లాటల్లాగా నడుస్తున్నాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీనితో అందరూ ఏకీభవించాలని లేదు. ముఖ్యంగా ఆ చర్చల్లో కొందరు వాదన కోసం వాదన అన్న ధోరణిలో అనంతానంతంగా ఖండనమండనలు చేస్తూ మిగిలినవారి అభిప్రాయాలేవన్నా ఉంటే వాటిని చదువరులు అక్షరాలా వెదుకుకొని చూడవలసిన పరిస్థితిని కల్పించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరు అసంతృప్తి వెలుబుచ్చినా ఆ వాదనా లోలురు శాంతించే అవకాశాలేమీ లేవు నాకు తెలిసినంతవరకు. నేనేమీ ప్రజబ్లాగు ఎలా నడవాలీ నడవకూడదూ అని నిర్ణయించేందుకు అర్హతకాని, అధికారంకాని ఉన్నవాడిని కాను. నాకు అటువంటి పనుల జొలికి పోయేందుకు తీరికా ఓపికా కూడా లేవు. ఐతే, ఆ బ్లాగులో ఇకమీద ఏదైనా చర్చలో పాల్గొనాలా మానాలా అన్న విషయం నిర్ణయించుకునే విషయంలో నా స్వేఛ్ఛనాదే అని నా నమ్మకం. ఇక రెండవకారణం. ప్రజబ్లాగులో చర్చల్లో నేను వ్యాఖ్యలు ఉంచటం వలన నా ప్రతిష్ట పెరిగేదేమీ ఉండదన్న సంగతి నాకు కూడా బాగానే తెలుసును కాని, ఆ ప్రతిష్ట కాస్తా, ఏ మాత్రం చెప్పుకోదగ్గది ఉన్నా అది మసకబారుతోందన్న సంగతి ఈ రోజున ఒక వేరే బ్లాగుటపానీ (దాన్ని ఇక్కడ చూడండి) దానికి వచ్చిన వ్యాఖ్యల్లో నా ప్రసక్తి తీసుకొని వచ్చి అక్కడ చేయబడిన వ్యాఖ్యల్నీ గమనిస్తే నాకు బాగా అర్థమైనది. ఇదేమంతగా సంతోషించదగిన విషయం కాదు కదా! అఖరుదీ మూడవదీ ఐన కారణం. నాకు ప్రస్తుతం ఏవిధమైన చర్చల్లోనూ పాల్గొందుకు పెద్దగా తీరిక లేదు. ప్రజలో కాని ఊరుకోలేక ఏదైనా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చితే దానికి అనంతంగా వివరణ ఇచ్చుకుంటూ పోవలసిన పరిస్థితి. అపైన ఆనుషంగికంగా రకరకాల ప్రశ్నలను ఎదుర్కొని తరచూ నన్ను నేను డిఫెండ్ చేసుకోవలసిన పరిస్థితి. అంత తీరిక లేని పరిస్థితిలో అడుసు త్రొక్కనేల కాలు కడగనేల అన్నట్లు అనంతరం విచారించటం బదులుగా, ప్రజలో చర్చలకు దూరంగా ఉండటమే సముచితం అని నిర్ణయించుకున్నాను. ఈ నా నిర్ణయం వలన ఎవరికీ అసౌకర్యం ఉండదనే నా భావన. |
15, నవంబర్ 2014, శనివారం
ప్రేమమీఱ పిలుచుకొందును
పిలచెదనో నిన్ను ప్రియసఖుండ వటంచు తలచి నిత్యంబు సంతస మెసంగ పిలచెదనో నిన్ను విశ్వపతి వటంచు వినయంబు భయమును పెనగుచుండ పిలచెదనో నిన్ను విశ్వాత్ముడ వటంచు నాత్మలో సద్భక్తి యతిశయింప పిలచెదనో నిన్ను వేదవేద్యుడవంచు అరిది వివేకోదయంబు నిగుడ పిలుపుపులుపున నాదైన ప్రేమమీఱ పిలుచుకొందును నీవు నా తలపులందు నిలచియుండిన చాలు నే యలుపుసొలుపు కలుగ నేర్చునె సుంతయు కలనుగూడ |
14, నవంబర్ 2014, శుక్రవారం
పూవులు చేసే పాదపూజ.
వరమనోహరవర్ణభాసితంబులు పూల బాలలు చేయనీ పాదపూజ మధురసుధాబిందుమానితంబులు పూల బాలలు చేయనీ పాదపూజ అపురూపసుపరీమళాన్వితంబులు పూల బాలలు చేయనీ పాదపూజ సుందరంబులు చాల సుకుమారములు పూల బాలలు చేయనీ పాదపూజ పరవశించుచు నీ నామస్మరణపూర్వ కంబుగా వచ్చి నినుజేరి సంబరమున పాదపూజల నీ పూలబాల లెల్ల జేసికొన నీయవే దయచేసి నీవు |
గడుసుతనం.
ఆగమోక్తంబుగ నర్చించజాలను విధివిధానంబు లవిదిత మగుట స్త్రోత్రపాఠంబుల జోలికి పోలేను కంఠగతంబులు కావు గనుక ఏ మంత్రజప మేని యెంచి చేయగలేను బుధ్ధి కుదురుగ నుండ బోదు కనుక ఉపవాసదీక్షల నుండగ జాలను ఆరోగ్య మంతంత యగుట వలన ఇంక నేనేమి జేయుదు నిట్టివాని నేలమన్నింతు వీ వని యెంచి వగచి వంత వీడితి నీవు నిర్వ్యాజకరుణ బ్రోచువాడవు సుమ్మని తోచి నంత |
ఎన్నెన్నో లెక్కలు
కాలంబు లెక్కించు కర్మశేషంబును సుఖదుఃఖముల లెక్క జూచు జీవి తప్పొప్పులను దండధరుడు లెక్కించును ధనధాన్యముల లెక్క దలచు జగతి ఆర్జన లెక్కింతు రాలును బిడ్డలు మంచిని సఖులె లెక్కించగలరు దేవుడు లెక్కించు జీవుని పరిణతి అధిపులు లెక్కింతు రతని పనులు లెక్కలెక్కకు నెన్నెన్ని చిక్కులకట ఇన్ని లెక్కలు సరిబోలు చున్న గాని జీవి సంసారయాత్రను చేసి తుదకు శాంతిజెందుట యన్నది జరుగకుండు |
13, నవంబర్ 2014, గురువారం
ఏదో ఒక నాటికి..
నిఖిలేశ్వరుడ వీవు నిర్భాగ్యుడను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు సర్వవేత్తవు నీవు జడుడ నల్పుడ నేను కాని నాతోడ సఖ్యంబు నీకు గుణవిశాలుడ వీవు కుత్సితుండను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు సర్వసముడ వీవు గర్వాంధుడను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు తప్పు లెన్నక నాయందు దయను కురిసి పరమమిత్రుండ వైతివో పరమపురుష నీవు చూపిన బాటలో నేను నడచి ఒక్క నాటికి చేరుదునోయి నిన్ను |
12, నవంబర్ 2014, బుధవారం
గుండెనే గుడి చేసుకొంటి వీవు
శైశవంబున వచ్చి చక్కగా నా చిట్టి గుండెనే గుడి చేసుకొంటి వీవు నాట గోలె నీకు నా యనుభూతుల వినుటయే పూజల గొనుట యనగ జరుగుచున్నది యెంత కరుణామయుండవు జన్మజన్మలనుండి సఖుడ వగుచు నడిపించు చున్నావు నన్ను నీ త్రోవలో మాయదారుల వెంట మసల నీక ఎన్నడో యొక్క నాటికి నిన్ను జేర గల నటంచును భరియింతు గాని నాకు బాల్యములు యౌవనంబులు వార్థకములు మరలమరల వినోదించ మనసులేదు |
వ్యాఖ్యారంగ విలోకనం
మాలికలో వ్యాఖ్యారంగాలంకారణం చూస్తే తమాషాగా అనిపించింది. ఎందుకో చెబుతాను.
బ్లాగులకు వ్యాఖ్యల పంటలే పండగ..
ఎందుకలా అని ఎవరైనా అంటారా? అనరనే నా అభిప్రాయం.
ఒక టపాకు వచ్చే వ్యాఖ్య(ల) వలన కొన్ని విషయాలు తెలుస్తాయి.
ఇష్టపడి, కొండొకచో కష్టపడి వ్రాసి ప్రకటించిన టపా పాఠకజనామోదం పొందిందా? పొందలేదా? అన్న విషయం తప్పకుండా ముఖ్యమే.
ఒక టపాను ఎందరు చదివారూ అన్న విషయం బ్లాగుసర్వీసువారే లెక్కలు చెబుతారు . ఐతే అది ఎందరు టపా పేజీని అలవాటుగానో పొరపాటుగానో, ఆసక్తితోనో ఎలా తెరిచారూ, కొసాకి తమ టపాను చదివి ఆనందించరా అన్నది ఈ లెక్కలవలన ఏమీ తెలియదు.
అందుచేత బాగుందనో బాగోలేదనో ఒక ముక్క ఎవరైనా సెలవిస్తే బ్లాగరు సంతోషించవలసిన విషయమే - కనీసం చదివి ఆ మాట అన్నారు కద అని.
ఐతే కొన్నికొన్ని సార్లు ఒక టపా క్రింద ఒక చిన్నదో పెద్దదో వ్యాఖ్యను ఉంచిన చదువరులు తమ అభిప్రాయానికి సదరు బ్లాగరు నుండి లేదా సహపాఠకులనుండి వచ్చే ప్రతిస్పందనలు కూడా తెలుసుకోవాలని భావిస్తారు. ఎవరైనా తమ అభిప్రాయాలకు వివరణ అడిగినా , వాటిని ప్రశ్నించినా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని భావిస్తారు కాబట్టి.
ఒకప్పుడు హారం అన్న అగ్రిగేటర్లో వ్యాఖ్యలనూ వాటికి వచ్చే స్పందనలూ ప్రతిస్పందనలనూ గమనించే అవకాశం ఉండేది.
ఇప్పుడు మాలికలో వ్యాఖ్యల సెక్షన్లో అలా చూసుకునే సదుపాయం కనబతుతోంది.
మాలిక వారు ఒక వ్యాఖ్యల కోసం ఒక పేజీ కేటాయిస్తున్నారన్నది ఆనందించవలసిన అంశమే.
కాని నేను ఒక ఇబ్బందిని గమనిస్తున్నాను.
ఒక బ్లాగులో సమస్యాపూరణాలు జరుగుతున్నాయి. మరొక బ్లాగులో సమస్యలపై రణాలే జరుగుతున్నాయి.
ఈ టపా వ్రాస్తున్న సమయానికి మాలికలో వ్యాఖ్యల సెక్క్షన్లో వ్యాఖ్యల వివరాలు ఇలా ఉన్నాయి.
శంకరాభరణం బ్లాగు టపా(ల)కు వ్యాఖ్యల సంఖ్య 30 (36.1%)
ప్రజ బ్లాగు టపా(ల)కు వ్యాఖ్యల సంఖ్య 22 (26.5%)
ఇతర టపాలకు వ్యాఖ్యల సంఖ్య 31 (37.3%)
మొత్తం వ్యాఖ్యల సంఖ్య 83
అంటే ఈ పేజీలో సింహభాగం విలువైన స్థలం ప్రజారణాలతో సమస్యాపూరణాలతో నిండిపోతోందన్నమాట!
ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. హెచ్చునిడివి గల వ్యాఖ్యలు పెరిగిన కొద్దీ ఈ పేజీలో మొత్తం వ్యాఖ్యల సంఖ్య తగ్గవచ్చును.
చాలా కాలం క్రిందట ఒక అజ్ఞాతగారు శంకరాభరణం బ్లాగులో హారంలో వ్యాఖ్యల సెక్షన్ అంతా మీ బ్లాగుకు వచ్చే కామెంట్లతోనే నిండిపోతోందని ఒక అక్షేపణపూర్వకమైన వ్యాఖ్య చేసారు. అది శంకరాభరణం బ్లాగు అభిమానులకు ఇబ్బందిగా అనిపించింది.
ఇప్పుడు హారం లేదు. కాని క్రొత్తగా ప్రజ అని ఒక బ్లాగు వచ్చి చేరింది కామెంట్ల పంటలో శంకరాభరణానికి పోటీగా.
ఈ విషయంలో అటు శంకరాభరణం కాని ఇటు ప్రజ బ్లాగు కాని చేస్తున్న పొరపాటు ఏమీ లేదు.
కాని, వ్యాఖ్యాతలకు మాత్రం చిక్కులు పెరిగాయి. మాటవరసకు ఒకానొక అప్పారావుగారు ఒక వ్యాఖ్య చేసిన కొంతసేపటికి అది మాలికలో కనిపించింది అనుకుందాం. మరి కొంతసేపటికి మరెవరో సుబ్బారావుగారు దానిమీద ప్రతివ్యాఖ్య చేసారనీ అనుకుందాం. ఉద్యోగస్థులయ్యో మరొక విధంగానే బిజీగా ఉండే అప్పారావుగారు ఆనక మాలికను తెరచి తన వ్యాఖ్యకు ప్రతిస్పందన ఏమన్నా ఉందా అని చూడాలనుకుంటే మాలికలో ఆయన వ్యాఖ్యా దానిపై సుబ్బారావుగారు ప్రతివ్యాఖ్యా కూడా వ్యాఖ్యలపేజీనుండి జారిపోవటం వలన ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం అలా జారిపోయే అవకాశం ఎక్కువే,
అలా ఎందుకు ఆ అప్పారావుగారు నేరుగా తన వ్యాఖ్యదగ్గరకే వెళ్ళి ప్రతిస్పందన చూసుకోవచ్చు కదా అనవచ్చు మీరు. కాని అప్పారావు గారు అనేక టపాల్లో తన వ్యాఖ్యలు ఉంచితే అవన్నీ గమనికలో ఉంచుకుందుకు గాను తానే వాటి లింకులు విడిగా దాచుకోకపోతే ఇబ్బంది అన్నమాట. ఆ కష్టం మాలికలో వ్యాఖ్యల సెక్షన్ వలన తప్పుతుంది. కాని కొన్ని బ్లాగులకు పరంపరగా వచ్చే కామెంట్లవలన ఆ సదుపాయం తరచుగా ఆవిరైపోతోంది. అదీ సంగతి.
తెలుగు బ్లాగుటపాలకు వ్యాఖ్యలు తక్కువ అన్న సణుగుడు ఉండగా ఇప్పుడు వ్యాఖ్యలు ఎక్కువై ఇబ్బంది అంటారేం అనవచ్చును. అలాగే కొన్ని బ్లాగులకు హెచ్చు ఆదరణ వస్తే మీకు కుళ్ళు ఎందుకూ అనవచ్చును కూడా.
నా ఉద్దేశం వ్యాఖ్యలను ట్రాకింగ్ చేయటానికి మరింత సదుపాయం ఉండాలి అని మాత్రమే.
ఉన్న కాస్త పేజీలో కూడా సింహభాగం విలువైన స్థలం రణాలతో పూరణాలతో నిండిపోతోందన్నది వాస్తవం. ఈ విషయంలో ఒక బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలపైన మనకు నియంత్రణ ఉండదు కాని అగ్రిగేటర్లలో వ్యాఖ్యల ప్రదర్శన విషయంలో మరిన్ని సదుపాయాలు రావాలి అని చెప్పటమే నా ఉద్దేశం.
11, నవంబర్ 2014, మంగళవారం
నన్ను తలచువారు నా కెవ్వరును లేరు
నన్ను తలచువారు నా కెవ్వరును లేరు నా వెన్క నొక పది నాళ్ళ వెనుక ఊరక తలచగా నుపకార మొకరికి చేయ నైతి గనుక జీవితమున చేసిన పనులెల్ల చిత్తశుధ్ధిగ నేను చేసితి కర్తవ్యచింత గలిగి ఒకరి గొప్పసేయ నొకరి మెప్పింపను వర్తించినది లేదు వాస్తవముగ నెవరు తలచు వార లిట్టివానిని నన్ను నీవె గాక నిజము నీరజాక్ష నేను నిన్ను తలతు నీవు నన్నెన్నెదు వెవరు తలచకున్న నేమి నాకు |
10, నవంబర్ 2014, సోమవారం
ఆదుకొనవయ్య దేవుడా
నడిపించెదవు జగన్నాటకమును నీవు జగమెల్ల నెఱుగు నా సంగతియును నిన్ను తలచు వారు నేడేని రేపేని కొల్లలై యుందురు కువలయమున నడచుచుంటిని జగన్నాటకమున నేను జగమెల్ల నెఱుగు నా సంగతియును నన్ను తలచు వార లన్న నేడెందరో యొకరు రేపు దలప నుర్వి మీద కాన నీ వేడ నే నేడ ఘనుడ యింక శోధనలు మాని యికనైన బాధతీర్చి యాదుకొనవయ్య దేవుడా యనవరతము చచ్చుచుండుట పుట్టుట చాలు నింక |
నీవు నా వాడవై నేను నీ వాడనై
నేను పిలచిన నాడు నీవు పలుకుచు నుంటి వంత కన్నను కోరు నదియు లేదు నీవు పిలచిన నాడు నేను వచ్చుచు నుంటి జాగుచేయక నొక్క క్షణము కూడ మన మధ్య స్నేహంబు మన కిర్వురకు కూడ పాయని బంధమై వరలు చుండ నీవు నా వాడవై నేను నీ వాడనై జగముల యుగములే జరుగనిమ్ము మాయ నన్నేమి చేయను మరల నదియు నరయ నీదైన లీలయే నగును గాన కాల మది యేమి చేయు నా కాల మైన నీ స్వరూపవిశేషమే నిశ్చయముగ |
9, నవంబర్ 2014, ఆదివారం
బంతిపూలమధ్య పాప
బంతిపూల మధ్యనున్న బాలికాముఖాంబుజం బెంత ముగ్ధమోహనముగ నెసగుచున్నదో కదా యింతులార గంటిరే మహీతలంబు నందు కే రింతలాడు పిల్లదాని కేది సాటి చెప్పుడీ పూలసొగసు గూర్చి యేమి పొగడ నుండు క్రొత్తగా బాలసొగసు గూర్చి చెప్పవలెను నేడు చక్కగా మేలు మేలు బంతిపూల మేలమాడు బాలికా పోలలేవు నీనగవుల పూలకులుకు లెన్నగా కొన్ని పూవు లిపుడు కోసి దేవుని సేవ కర్పణంబు సేయు మపుడు విభుని ముందు జన్మమందు ముద్దులపాపలై పుట్టవలె నటంచు పూలు కోరు |
(పై పద్యాలు పద్యరచన - 729 సందర్భంగా ప్రకటించినవే.)
లేబుళ్లు:
ఆధ్యాత్మ కవితలు - కీర్తనలు
7, నవంబర్ 2014, శుక్రవారం
హాయిగా నుండుట కడ్డ మేమి
తాపత్రయంబుల తలనొప్పి లేదాయె హాయిగా నుండుట కడ్డ మేమి కామక్రోధాదుల గడబిడ లేదాయె హాయిగా నుండుట కడ్డ మేమి ఈషణత్రయముచే హింసయే లేదాయె హాయిగా నుండుట కడ్డ మేమి మూడుగుణములు నిన్ను ముట్టనే లేవాయె హాయిగా నుండుట కడ్డ మేమి కాని దేవుడా నా తల పైన నెక్కి రే బవళ్ళును నివియెల్ల రెచ్చి యాడు హాయిగా నుండ నీయక నడ్డుపడుచు తరిమి వేయుము వాటిని కరుణ జూపి |
4, నవంబర్ 2014, మంగళవారం
పొగడ నిమ్ము నన్ను పుడమి నున్నన్నాళ్ళు
పొగడుదునో నిన్ను జగదధీశ్వరుడహో నా స్వామి యనుచు నానందముగను పొగడుదునో నిన్ను పురుషోత్తముడయా నా స్వామి యనుచు నానందముగను పొగడుదునో నిన్ను భూరికృపాళువు నా స్వామి యనుచు నానందముగను పొగడుదునో నిన్ను మోక్షవితరణుడు నా స్వామి యనుచు నానందముగను పొగడికలకు నీవు పొంగకుండిన నేమి పొగడి సంతసించు బుధ్ధి నాది పొగడ నిమ్ము నన్ను పుడమి నున్నన్నాళ్ళు పొగడదగిన నిన్నె పొలుపు మీఱ |
వాదములకు జొచ్చి వీదినిబడ నేల
దేవుడే లేడని భావించు చుండెడి వారితో వాదించి ఫలిత మేమి మా దేవుడే గొప్ప మీ దేవుడే యల్పు డను వారి తోడ వాదనలు సబబె దేవు డుండును మాను తెలియ నేమిటి కను ప్రజ్ఞానిధులతోడ పంతమేల దేవుని సంగతి తెలియరు మా కన్యు లను వారి జోలికి జనగ నేల నీకు భక్తి యున్న నీ శక్తి మేరకు కొలుచుకొనుము లోన తలచుకొనుము వాదములకు జొచ్చి వీదినిబడ నేల భక్తి చెడగ దాన ముక్తి చెడగ |
3, నవంబర్ 2014, సోమవారం
ఇంతకంటె విన్నవించలేను
నీ పైన నా ప్రేమ నా పైన నీ కృప యను నవి నిత్యమై యలర నిమ్ము నా యనురక్తియు నీ యనుమతమును నొక్కటై నిత్యంబు నుండనిమ్ము నీ వార లందరు నా వారలే నను భావన సత్యమై పరగ నిమ్ము నీ విచ్చు భాగ్యమే నే కోరు మోక్షమై మన మధ్య నెడ మింక మాయ నిమ్ము పరమపురుష నీకు భారమైన వరము లడుగ లేదు గాన నాదరించి చేరదీయవయ్య చేతులు జోడింతు నింతకంటె విన్నవించలేను |
సౌందర్యలహరి - 23 త్వయా హృత్వా వామం ...
మొదటి శ్లోకం | వెనుకటి భాగం | తదుపరి శ్లోకం |
23
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్
లోకంలో శివసాయుజ్యం అన్న మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది.
ఈ శ్లోకంలో శ్రీశంకరులు శ్రీదేవీసాయుజ్యం అంతకంటే గొప్పదీ అని చెబుతున్నారు!
అమ్మవారు శివుడిలో అర్థభాగం అన్న సంగతి తెలిసిందే. అందుకే శివుడిని అర్థనారీశ్వరుడు అని కూడా అంటాం .
ఈ సంగతిని ఆచార్యులు కొంచెం గడుసుగా ప్రస్తావిస్తున్నారు త్వయా హృత్వా
వామం అని అంటూ. త్వయా అంటే నీ చేత హృత్వా అనగా సంగ్రహించబడినదమ్మా వామం అంటే శివుని ఎడమవైపు అర్థశరీరం అని చెబుతున్నారు.
అందులో ఏమి విశేషం ఉందీ అనవచ్చును. అక్కడి నుండే మొదలవుతున్నది అచార్యులవారి గడుసుదనం. చూడండి.
అలా అయ్యవారి ఎడమవైపు అర్థశరీరభాగాన్ని ఆక్రమించుకున్న అమ్మకు తృప్తి
కలగలేదుట. అందుకే ఆవిడను ఈ శ్లోకంలో అపరితృప్తేన మనసా
అన్నారు.అసంతృప్తిగానే ఉందిట ఆవిడ మనస్సుకు. అందుకని ఆవిడ ఒక పని చేసిందీ
అని శంకరులకు ఒక అనుమానం వచ్చిందట, ఏమిటండీ ఆపని అంటే చెబుతున్నారు.
శంభోః అపరమ్ అపి శరీరార్థం హృతమ్ అభూత్ శంకే అంటున్నారు చూడండి. అంటే
శంభుని యొక్క అపరం అంటే మిగిలిన రెండవవైపు శరీరార్థం అనగా అర్థశరీరాన్ని
కూడా హృతం అభూత్ అనగా అపహరించబడి ఉంది అని శంక కలిగిందీ అంటున్నారు!
అంటే అమ్మకు అయ్యవారి ఎడమశరీరాన్ని స్వంతం చేసుకున్నా తృప్తి కలగక ఆయన
కుడివైపు శరీరాన్ని కూడా స్వంతం చేసుకుందీ అన్న అనుమానం వస్తోందీ
అంటున్నారు ఆచార్యులవారు.
అలా ఎందు కనుకుంటున్నారూ అని మనకు సందేహం వస్తుంది కదా! దానికి వివరణ
ఇస్తున్నారు. యత్ అంటే, ఎందుకనగా అని మొదలు పెడుతున్నారు వివరణను.
ఏతత్ రూపం సకలం అరుణాభం అనగా అమ్మా ఏ రూపమైతే నాకు మనస్సులో గోచరం అవుతోందో అది అంతా అరుణంగా అంటే ఎఱ్ఱగా ఉంది.
సరే నీ రూపం ఎఱ్ఱగా ఉంటుంది, నాకు తెలుసును. అరుణాం కరుణాతరంగితాక్షీం అని నుతిస్తూ ఉంటాను కదా.
కానీ నాకు నీ రూపం త్రినయనమ్ అన్నట్లు అంటే మూడు కళ్ళతో ఉన్నట్లు
కనిపిస్తోంది! మరి మూడుకళ్ళవాడు శివయ్య కదా? సరే మీ ఇద్దరికీ కలిపి
అర్థనారీశ్వర రూపం అనుకుందాం.
మరి అమ్మా, కుచాభ్యామ్ ఆనమ్రమ్ అన్నట్లు కూడా నీ రూపం కనిపిస్తోందే.
అంటే నీ రూపం కుచములు రెండింటి బరువుతోనూ కొద్దిగా ముందుకు వంగినట్లు ఉంది.
మరి అర్థనారీశ్వర రూపంలో అలా ఎలా కనబడుతుందీ?
అదీ కాక, నాకు నీరూపం కుటిలశశి చూడాల మకుటమ్ అన్నట్లుగా కూడా కనబడుతోంది. కుటిలశశి
అంటే చంద్రవంక. చూడాలము అంటే శిరస్సు. మకుటం అంటే తెలిసినదే కిరీటం అని.
అంటే అమ్మా, నీ శిరస్సున చంద్రవంక అనేది కిరీటంలా ప్రకాశిస్తూ కనబడుతున్నది
అని అంటున్నారు. మరి చంద్రవంక ఉన్నవాడు శివుడు కదా.
నాకు నీ రూపం సకలం అరుణాభం అంటే అంతా ఎఱ్ఱగా కనిపిస్తోంది, అర్థనారీశ్వర
రూపం అనుకుందామంటే శివుడు తెలుపు గదా. పార్వతీ పతి తెల్పు పాలసంద్రము
తెల్పు అని అంటారు. శివుడి భాగం తెల్లగానూ నీ భాగం మాత్రమే ఎఱ్ఱగానూ
కనబడాలి కదా అలాగైతే.
అంతా ఎఱుపేను. నీ స్వనద్వయమూ కలిగిఉంది రూపం. శివుడి చంద్రవంకా మూడు కళ్ళు ఉన్నా కూడా మొత్తంగా ఎఱుప్పుతప్ప తెలుపు కనరాదు సుమా.
అందు చేత ఆ శివభాగమైన కుడి అర్థభాగాన్నీ కూడా అమ్మా నీవే ఆక్రమించుకున్నావన్న అనుమానం కలుగుతోంది.
ఇదీ శ్రీశంకరులు అమ్మను దర్శించిన విధం ఈ శ్లోకంలో.
కొన్ని కౌల సిధ్ధాంతాలలో అంతా శక్తితత్త్వమే. శివతత్త్వం అందులో అంతర్భూతం. అంతే కాని, విడిగా శివతత్త్వాన్ని చెప్పకూడదు.
ఆమ్మ యొక్క అరుణిమ ఆవిడ దివ్యశక్తికి ప్రతీక. కిరీటం సర్వసృష్టికీ ఆమె
సామ్రాజ్ఞిత్వానికి ప్రతీక. శిరస్సున చంద్రవంక ఆమె ఆనందస్వరూప మరియు అమృతస్వరూప
అన్నదానికి సంకేతం. త్రినేత్రాలూ త్రికాలాలకు ప్రతీకలు. స్తనమండలప్రశస్తి సకలజీవులకు ఆమెయే పోషకురాలన్న భావనకు ప్రతీక. సమిష్టిగా
శ్రీమాత విరాడ్రూపం ఇక్కడ చెప్పబడింది.
ప్రతిదినమూ మూడువేల సార్లు చొప్పున మప్పది రోజులు పారాయణం. నైవేద్యం
క్ష్రీరాన్నం. ఫలం అపదలనుండి నివృత్తి. ముముక్షువులకు జ్ఞానప్రాప్తి.
ఆన తీయవె నీ సేవ నమరియుండ
నోరు నీ నామముల్ నుడువు చుండును గాని మనసు వేరొక చోట మసలు చుండు జపమాల నీ వ్రేళ్ళు జరుపు చుండును గాని బుధ్ధి వేరొక చోట పొరలు చుండు చేతులు పూజలే చేయు చుండును గాని చిత్తంబు మానక చెదరు చుండు కనులు నీ మూర్తినే కాంచు చుండును గాని అంతఃకరణ మన్య మరయుచుండు భువనమోహన నీలీల నవును గాక నింత యలసత గలుగనా కేమి కతము సర్వలోకేశ యిట్లింక జరుగ నీక ఆన తీయవె నీ సేవ నమరియుండ |
ఇతరులను గూర్చి చింతింప నేల నీకు
అన్ని వేళల నీకు నండయై యుండెడు వాని నర్చింపగా వలయు నీవు అన్ని చోటుల నీకు నండయై యుండెడి వాని నర్చింపగా వలయు నీవు అన్ని భవముల నీకు నండయై యుండెడి వాని నర్చింపగా వలయు నీవు అన్ని విధముల నీకు నండయై యుండెడి వాని నర్చింపగా వలయు నీవు వాని కంటెను హితుడైన వాడు గలడె వాడు నీవాడు పెఱ లట్టి వారు గాదు వాని నీశ్వరు నర్చింప వలయు గాని ఇతరులను గూర్చి చింతింప నేల నీకు |
2, నవంబర్ 2014, ఆదివారం
ఇంత జేసితి వెందుకీ చింత నీకు
భగవానునకు నీవు పరమప్రేముడి వేయి పేరులు తీయగా పెట్టినావు భగవానునకు నీవు పరమప్రేముడి వేయి గుణగణంబులు సమకూర్చినావు భగవానునకు నీవు పరమప్రేముడి వేయి దివ్యస్వరూపముల్ దీర్చినావు భగవానునకు నీవు పరమప్రేముడి వేయి భంగుల కీర్తనల్ పాడినావు ఇంత జేసితి వెందుకీ చింత నీకు తెలిసినది నీకు తృప్తియే కలుగలేదు ఈశ్వరున కన్న నీ భక్తి యిష్ట మాయె మెచ్చి యాతడు నీయందె చొచ్చి యుండె |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)