22, జులై 2012, ఆదివారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 4

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము:ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు. 

వివరణము: ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా ప్రభువు అని అర్థం. శ్రీమన్నారాయణుడేయీశ్వర శబ్దవాచ్యుడు.ఈ ద్వితీయ స్కంధములోనివే అయిన రెండు పద్యాలను చిత్తగించండి.

మ. వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయ వలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరు డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్యమంచున్ సుతా

కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కీ‌ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా.

బ్రహ్మగారు నారదమహర్షితో  "కుమారా,  ఈ మాయ అనేది ఉంది చూసావూ, ఇది ఈశ్వరుని దృష్టిని ఆకర్షించటానికి యెంతో సిగ్గుపడి బెరుకు తనంతో‌ ఉంటుంది. ఆట్టే ప్రజ్ఞ లేని వాళ్ళు మందమతులై నన్నే అన్ని లోకాలకూ అధిపతిని అనుకొని మొక్కుతూ‌ ఉంటారు. ఆహా, ఇదంతా ఆ శ్రీహరి మాయాప్రాభావం కదా అని నవ్వుకుంటూ ఉంటాను. వాళ్ళ మొక్కులు అంగీకరించను సుమా. ఆశ్రీహరియే ఈశుడు. తుదీ మొదలూ‌ లేని వాడు.  నీవో నేనో ఆ మాయో మరేదైనా ప్రాణిగానీఈశ్వరత్వం అంటూ ఉండటం అసంభవం." అని అంటున్నారు.

ఈ‌ పద్యాలు ఎందుకు ఉదహరించానంటే ఈశ్వర, ఈశ శబ్దాలసమత్వాన్నీ, ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడే అన్న భాగవత రహస్యాన్నీ‌ వివరించటానికే.

ఇప్పుడు మనకు ఈశ్వరాధిష్టితమైన ప్రకృతి అన్న వ్యవహారానికి శ్రీహరి అధీనం లోని ప్రకృతికి అన్న అర్థం సిధ్ధిస్తున్నది కదా. గత వాక్యానికి వివరణం చెప్పుకుంటూ మనం ఒక గీతా‌శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. అది

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ 'నా యొక్క ప్రకృతి'లో అనటం‌ కూడా గమనించాం కదా!

మనకు ప్రకృతికి స్వామి యైన వాడు  శ్రీమన్నారాయణుడు అని స్పష్టం అవుతున్నది.

ఎవరికైనా సందేహం ఉండ వచ్చును, ఇదేమిటీ ఈయన శ్రీకృష్ణునీ, శ్రీమన్నారాయణునీ ఒక్కరే అని వ్యవహరిస్తున్నారూ అని. అవునండి, ఒకరే, శ్రీకృష్ణుడు 'లక్ష్మీపతి రభూత్స్వయం' అని ప్రమాణం.  ఆయన విష్ణువు యొక్క విభూత్యవతారంగానీ,  ఆవేశావతారంగాని, అంశావతారంగానీ కాక స్వయంగా విష్ణువు. దీనికి భాగవతమే ప్రమాణం. అందుకే మనం శ్రీకృష్ణప్రోక్తమైనగీతోపనిషత్తు నుండి ప్రమాణాలు స్వీకరిస్తున్నాము.

ఈశ్వరుడు అనాది అయినట్లే ఆయన అధీనంలో ఉన్న ప్రకృతి కూడా అనాదియే! అది ఆయన విభూతులలో ఒకటే.  ఈ‌ ప్రకృతి అంశం వలన మహత్తత్తం యేర్పదుతోంది.  ఇదీ ప్రస్తుతం మనం వివరణ చెప్పుకుంటున్న వాక్యానికి విశదీకరణ.

ఇదంతా బాగానే ఉంది కాని, ఇంతకూ ఈ‌ మహత్తత్త్వం అంటె యేమిటీ అని ప్రశ్న.

పరమాత్మయొక్క విభూతులలో ముఖ్యమైనది ప్రకృతి. ఈ‌ ప్రకృతి అనేది సమస్తమైన నామరూపాత్మకమైన వ్యవహారాలకూ‌మూలం.అందుకే దానికి వేదాంత పరిభాషలో ప్రధానం అనిపేరు. ఈ ప్రకృతిద్వారా అభివ్యక్తమైన పరమాత్మ స్వరూపానికే మహత్తత్త్వం అనిపేరు. అందుకే శుధ్ధపరబ్రహ్మాన్ని ప్రకృతిలయం చేయకుండా తెలుసుకోవటం సాధ్యం కాదు.

బృహదారణ్యకోపనిషత్తులోని యీ క్రింది గార్గీ యాజ్ఞ్యవల్క్యుల సంవాదలోని మాటలు చూడండి.

గార్గి: యాజ్ఞ్యవల్యా, ద్యులోకానికి పైనా, భూలోకానికి క్రిందా కూడా వ్యాపించి, యీ రెండులోకాల మధ్యనూ వ్యాపించి యున్నట్టిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు లాంటి వ్యవహారాలు కలిగినిది దేనిలో పడుగు -పేక లాగా‌కూర్చబడి యుంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశంలో
గార్గి: ఈ‌ఆకాశాము ఓతప్రోతమై దేనిలో ఉంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశం అక్షరమునందు ఆధారపడి యుందని బ్రహ్మవేత్తల నిశ్చయం.
గార్గి:  అక్షరం అంటే ఏమిటి?
యాజ్ఞ్యవల్క్యుడు: ఏదైనా వస్తువును తెలుసుకోవాలంటే విశేషణాలూ నామరూపాలూ కావాలి. అక్షరం‌ అనేదానికి యెటువంటి నామరూపాలూ విశేషణాలూ లేవు. సర్వవిశేషణశూన్యమైనది అక్షరం అని తాత్పర్యం. అంటే అక్షరం అనేది పరబ్రహ్మమే.

మనం చర్చించు కుంటున్న గద్యలో ముందు ముందు మహత్తత్వం నుండి ఆకాశం ఉత్పన్నం కావటం చెప్పబడుతుందని గమనిస్తాం.  అందుచేత మహత్తత్త్వం అంటే పరమాత్మ యొక్క వ్యక్తవిభూతి అని గ్రహిస్తే చాలు.