6, జులై 2022, బుధవారం

రామ జయమ్మని యనరే

రామ జయమ్మని యనరే శ్రీరఘురామ జయమ్మని యనరే
రాముని జయగీతికలను పాడుచు మీమీ భక్తిని చాటుచు

కుమతులు విమతులు దుర్మతులును గగ్గోలు పుచ్చుచు లోకమును
భ్రమలను ముంచుచు బెదిరించుచు దుష్ప్రచారములనే చేయుచును
విమలమనస్కులు సజ్జనులను బహువిధములుగాను దూఱుచును
సమరోత్సాహము చాటుచునుండగ సదా రామునకె జయమనుచు

ఒంటికాలిపై ధర్మదేవతకు కుంటక తప్పని యుగమనుచు
కంటను నీరిడి చూచుచు నుండక కాసెబిగించి సుజనులార
తుంటరి కలిని వాని సైన్యమన దోచెడు దుష్టుల మూకలను
కంటగించుచును కలిలో నైనను ఘనుడు రామునిదె జయమనుచు

ఎడరు చెందునెడ నార్షధర్మమున కీశ్వరుడే రక్షకుడగుచు
తడయక స్వస్థితి నిలుపగ దానే స్వయముగ పూనుకొని
గడుసుదనంబున ధర్మద్రోహులై పుడమిని తిరిగెడు వారలను
కడముట్టించును కాని విడవడా కంజాక్షునిదే జయమనుచు