17, నవంబర్ 2026, మంగళవారం

నిన్నే నమ్మితి రామ విభో

 
నిన్నే నమ్మితి రామ విభో న న్నేమరకుము రామ విభో

ఆపదలందున పెద్దది ఐన ఆపదయనగా రామ విభో
ఈ పగిదిని భవసాగరమందున ఈదులాడుటే రామ విభో

శోకములందున పెద్దది ఐన శోకంబనగా రామ విభో
నీకు దూరమై విలపించుటయే నిక్కంబరయగ రామ విభో

సంతోషముల పెద్దది అయిన సంతోషమన రామ విభో
అంతకు డను వా డొకడున్నాడను చింత తొలగుటే రామ విభో

సిరులన్నిటిలో పెద్దది ఐన సిరి యేదంటే రామ విభో
తరింప చేసే నీ నామము నను వరించు యుండుట రామ విభో

ఘనకార్యంబుల పెద్దది ఐన ఘనకార్యంబన రామ విభో
తనువు పైన మోహమును వీడి నిను తగులుకొనుటయే రామ విభో

చుట్టములందున ముఖ్యుండైన చుట్టం బెవడన రామ విభో
ఇట్టే భవ చక్రంబును ద్రుంచే ఈశ్వర నీవే రామ విభో

కర్మములందున ముఖ్యం భైన కర్మం బేదన రామ విభో
నిర్మల మగు సద్భక్తిని కలిగి నీకు మ్రొక్కుటే రామ విభో

చదువుల యందున పెద్దది ఐన చదువేదన గా రామవిభో
విదితముగా నీ పైన భక్తిని వెలయించినదే రామ విభో

పలుకుల యందున మేలిమి ఐన పలుకేదనగా రామ విభో
పలికిన భవతారకమగు నీదు ప్రశస్తనామమె రామ విభో

నమ్మదగిన వాడెవడయ్యా యన నారాయణ శ్రీరామ విభో
అమ్మవు అయ్యవు గురుడవు దైవము నైన నీవె కద రామ విభో

రామ రామ రఘురామ రామ జయరామ రామ శ్రీరామ విభో
కామిత వరదా కరుణామయ న న్నేమరకయ్యా రామవిభో