ఈనాటి రామకీర్తన నిజానికి శుక్రవారం15వ తారీఖు నాటిది.
ఆనాడు ఆపరేషన్ జరిగింది నాకు. గుండెకు ఒక స్టెంట్ వేసారు. ఒక బెలూన్ కూడా పెట్టారు.
ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వచ్చిన రామకీర్తన యిది.
పైన ఉన్న ఫోటో శనివారం నాడు నన్ను గదికి మార్చిన తరువాత మాచెల్లెలు లక్ష్మి తీసినది. అందరికీ నేను కులాసాగానే ఉన్నానని సందేశం పంపటానికి తీసినది అన్నమాట.
నిన్ననే ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను.
వీలు చూచుకొని ఈకీర్తనను ఇప్పుడు ప్రకటిస్తున్నాను.
నరులార సంసారనరకబాధితులార
శిరసువంచి వందనము చేయరే రామునకు
మరల మరల మాకు గర్భనరక మీయకుండు మని
మరల భూమిమీద పడి తిరుగకుండ జేయు మని
మరల దుర్మాన మొంది మొఱుగకుండ జేయు మని
పరమవినయపరు లగుచు ప్రార్ధింప దొడగరే
మరల దుష్టమతులజేరి మసలకుండ జేయు మని
మరల క్షణికసౌఖ్యములను మఱుగకుండ జేయు మని
మరల మోహపాశములను మమ్ము కట్టకుండు మని
పరమభక్తిపరవశులై ప్రార్ధింప దొడగరే
హరేరామ యందుమని హరేకృష్ణ యందుమని
హరేజనార్దనాయని యందుము కరుణించుమని
పరమపురుష నీకు గాక పరులకెపుడు మ్రొక్కమని
పరమపదము నీయుమని ప్రార్ధింప దొడగరే