మాలిని. ధనము బడయ వచ్చున్ ధారుణిం బొంద వచ్చున్ వనిత నరయ వచ్చున్ వంశముం బెంచ వచ్చున్ తనివిని గొనవచ్చున్ దానిచే నేమి వచ్చున్ వినుము కొనుము ముక్తిన్ వేడుకన్ రామభక్తిన్ |
మాలిని
సంప్రదాయం ప్రకారం దీని గణవిభజన న - న - మ - య - య. నడక చూస్తే న-న-గగ ర-ర-గ అన్న ట్లుంటుంది.
భాసుని కాలమునుంచీ మాలినీవృత్తము వాడకంలో ఉంది.
పాదం ఎనిమిది అక్షరాలకు విరుగుతుంది. మాలినికి సామాన్యముగా అర్ధపాదములకు అంత్యప్రాస ఉంచుతారు. అంటే ఏ పాదాన్నైనా యతిస్థానం దగ్గర రెండు ముక్కలుగా చేస్తే ఆ రెండు భాగాలకూ అంత్యప్రాస ఉండాలన్న మాట. ఆన్ని పాదాలకూ ఒకే అంత్యప్రాస అవసరం కాదు. ఏ పాదానికి అ పాదంలోని భాగాల మధ్యనే అంత్య ప్రాస కూర్చవచ్చును. నేను ఇక్కడ చెప్పిన పద్యంలో నాలుగవ పాదానికి అంత్యప్రాస వేరేగా ఉంది చూడండి.
శివమానసపూజ, శివాపరాధక్షమాపణ స్తోత్రము, శివానందలహరి, త్రిపురసుందరీమానసపూజా స్తోత్రములలో మాలిని మనకు కనబడుతుంది.
శివమానసపూజ నుండి ఒక ఉదాహరణ చూదాం.
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభోః
బమ్మెర పోతన్నగారి శ్రీమదాంధ్రమహాబాగవతం నుండి మరొకటి చూదాం:
ధరణిదుహితృరంతా ధర్మమార్గానుగంతా
నిరుపమనయవంతా నిర్జరారాతిహంతా
గురుబుధసుఖకర్తా కోసలక్షోణిభర్తా
సురభయపరిహర్తా సూరిచేతోవిహర్తా
ఇలా మెత్తం ప్రతిస్కందాంతంలోనూ ఒక్కొక్క మాలిని ఉంది తెలుగుభాగవతంలో.
ఈ మాలినీవృత్తానికి ఉన్న అనుప్రాసనియమం కారణంగా, ఒక చిక్కు ఉంది. అదేమిటంటే ఏదైనా కథను నడిపించటానికి అనుప్రాసలతో కూడిన ఇలాంటిపద్యాలను వ్రాస్తూ కూర్చోవటం కష్టం. గమ్మున కథాకథనానికి సందర్భోచితం కూడా ఐన మాటలను అనుప్రాసలతో ఉన్నవి పట్టుకొని వాటితో ఇలాంటి పద్యం అల్లటం కించిత్తు శ్రమతో కూడినదే. ఏదైనా వర్ణనలు వగైరా అవసరం ఐన చోట వాడటానికి ఉపయోగించవచ్చును. కాని మనకవులు ఈ పద్యాన్ని అశ్వాసాంతంలో వాడే పద్యాల లిష్టులో వేసేసారు.
అందుకే దీన్ని ప్రత్యేకంగా వ్రాయటమే కాని కావ్యంలో విస్తారంగా వాడటం ఉండదు.
స్వర్గీయ పండిత నేమాని సన్యాసిరావుగారి పద్యం శంకరాభరణం టపాలో
జయము జయము రామా! సర్వలోకాభిరామా!
జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా!