త్వరితగతి. హరియనుచు తనసుతుని యత డెఱుగ కోహో నరవిభుడు దశరథుడు నరవరుని దామో దరుని నిను గనుచు సతతమును కడు ప్రేమన్ మురిసెనట యతని సుఖమునకు మితి యున్నే |
ఈ వృత్తానికి పాదానికి 15లఘువులూ చివరన 2 గురువులూ ఉంటాయి. ఈ త్వరితగతి వృత్తానికి సాంప్రదాయికంగా చేసే మూడేసి అక్షరాల గణాల విభజన అంతగా నప్పదు. అందుచేత 7 నగణాల మీద 2 గురువులు అని చెప్పరాదు. అలా చెప్పినపుడు పద్యం నడక తెలియదు. నడకను సూచించేలా, దీని గణవిభజనని ఇలా చెప్పటం బాగుంటుంది:
I I I I I I I I I I I I I I I U U
ఇలా ఐతే ఈ పద్యం నడకని తెలుసుకోవటం సులభం. సరిగా నడిపిస్తే ఇది తకిట-తక, తకిట-తక, తకిట-తక, తైతై అన్నట్లుగా నడుస్తుంది. వీలైనంతవరకు ఏఖండానికి ఆఖండంగా పదాలు విరుగుతే నడక బాగా వస్తుంది. ఐతే అలా పద్యం అంతటా సాధ్యపడవచ్చును పడకపోవచ్చును. సాధ్యపడితే చాలా బాగుంటుంది.
యతిస్థానం 11వ అక్షరం. వృత్తం కదా, ప్రాసనియమం తప్పదు.
అన్నట్లు, ఈ త్వరితగతి వృత్తానికి 'పాలాశదళం' అన్న మరొకపేరు కూడా ఉంది.