17, సెప్టెంబర్ 2026, గురువారం

నీ వినోదము కొరకు నే నాడుచున్నాను

 

నీ వినోదము కొరకు నే నాడుచున్నాను

నీ వాడు మనునటులే నే నాడుచున్నాను


ధర్మానుబంధమును తగిలించునది నీవు

కర్మానుబంధములు కల్పించునది నీవు

నిర్మోహముగ నాడ నియమించునది నీవు

శర్మదుడవగుచు నను శాశించునది నీవు


నీదైన యీయాట నే నాడుచున్నాను 

నాదైన యహమికయు నీదు సంకల్పమే

భేదములు వాదములు నీదు సంకల్పమే 

నీదివ్యలీలలో నేను పాత్రధారిని


ఆనందముగ నిట్టు లాడించుచున్నావు

ఆనందముగ నేను నాడుచునున్నాను

ఆనంద మిర్వురకు ననవచ్చునా చూడ

నేను నీకన్న వేరుగా నుంటినా రామ



పొమ్మంటి వొక్క నాడు భూతలంబునకు

 
పొమ్మంటి వొక్క నాడు భూతలంబునకు తిరిగి
రమ్మనవు నేటి దనుక రామా యిది తగునా

నీవు మసలినట్టి భూమి కావున నే నియ్యకొని
నీ వానతి యిచ్చినట్లు నివసించగ దొడగితిని
నీవారల నరసికొనుచు నేలను గాలించుచును
భూవలయము తిరుగుచునే ప్రొద్దుపుచ్చు చుంటిని

ఇచట నేను చేయదగిన దేమియు నగుపడదే
ఇచట నన్ను తెలియు వార లెవ్వరు నగుపడరే
ఇచట నేను పొందదగిన దేమియు. నగుపడదే
ఇచట బహువేషంబుల నేల నేను తిరుగుట

నీపాటలు పాడుకొనుచు నేను ప్రొద్దుపుచ్చుదును
నీపవిత్రనామముతో నేను ప్రొద్దుపుచ్చుదును
తాపత్రయములను నన్ను తగిలించినది చాలును
శ్రీపతి యిక నీసన్నిధి చేర ననుమతించుము

16, సెప్టెంబర్ 2026, బుధవారం

మనిషిని మనిషిగా చేసేది ఏమిటి?

 

ఇదొక పెద్ద ప్రశ్న.

మనిషిని మనిషిగా చేసేది ఏమిటి?

ఈప్రశ్నకు సమాధానం కోసం ఆలోచించే ముందు ఒక విషయం గమనిక లోనికి తెచ్చుకోవాలి.

మనిషి ఒక జీవి. ముఖ్యంగా ఒక జంతువు.

జీవులు అన్నాక ఆహార భయ నిద్రా మైథునాలు అనే నాలుగు సహజ లక్షణాలు ఉంటాయి.మొదటి మూడు లక్శణాలూ స్వకీయమైన మనుగడకు అవసరమైనవి. నాలుగవది ఒక జాతిగా మనుగడకు అవసరమైనది.

జీవులు అన్నపుడు వృక్షజాతి కూడా లెక్కకు వస్తుంది.

జంతువులు అన్నపుడు అవి స్వయంచలనశక్తి కలవి కావటం వలన వృక్షజాతి కన్నా భిన్నత్వం కలవి.

జగదీశ్ చంద్ర బోస్ నిరూపించే వరకు వృక్షాలకు జీవం ఉన్నదనే పాశ్చాత్య ప్రపంచం నమ్మలేదు.

భారతీయ భావనలో వృక్షాలకు జీవం ఉందని ఏమిటి రాళ్ళకూ జీవం ఉందనే ఉదారభావన అనాది యైనది. మన శిల్ప శాస్త్రం శిలలకూ స్త్రీ పురుష లక్షణాలు చెబుతుంది.

జీవులకు ఆలోచన అనేదీ ఒకటి ఉంటుంది. నాలుగు సహజాతాలలో ఇది చెప్పబడక పోయినా, ఆలోచన కూడా ఒక ముఖ్య జీవ లక్షణం.

తాను ఉండాలీ అన్న భావన సహజాతం.

తాను సుఖంగా ఉండాలీ అన్న భావన ఆతరువాతది. 

తానే సుఖంగా ఉండాలీ అన్న భావనా వైపరీత్యం ఆ తరువాత స్థాయి.

సుఖంగా ఉండాలీ అంటే ముందుగా సురక్షితంగా ఉండాలి కదా?

జీవులలో రక్షణ వ్యవస్థల గురించి మనకు నేడు బాగానే అవగాహన ఉంది.

వృక్షజాతి యైనా ప్రతికూల పరిస్థితుల్లో రక్షణకోసం ప్రయత్నాలు చేయటం గురించి తగినంత సమాచారం మనకు నేడు తెలుసు.

ఈవిధమైన ప్రాధమిక వాంఛలు రెడూ జీవులకు సహజాతాల తరువాతి లక్షణాలు ఆనుకోవచ్చును. అంటే ప్రతి జీవీ 1. తా నుండాలీ 2. తాను సుఖంగా ఉండాలీ అనేవి జీవుల మనుగడతో అనుబంధం కల మొదటి స్థాయి విషయాలు.

పురితన కాలంలో మానవుల విషయంలోనూ ఇంత వరకే కావచ్చును.

ఈస్థాయిలో జీవులకు ప్రకృతిపై ఆధిపత్యం అన్న భావన లేదు. ప్రకృతితో సహజీవనం అన్న భావనయే ఉంది.

కాని మనిషికి ఒక గమనిక ఉంది. అది ఎలా వచ్చింది అన్నది ఆలోచనీయం. ఆగమనిక ఏమిటంటే ప్రకృతి పైన తాను పెత్తనం చేయగలను అన్నది.

మనుష్యులలో కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఐతే కుటుంబ వ్వవస్థల మూలాలు ఇతర జంతు ప్రపంచం నుండే మనీషికి అబ్బినవి కాని మానవజాతికే ప్రత్యేకంగా ఏర్పడినవి కావు.

ప్రకృతిని కొంత తెలివిగా ఉపయోగించుకోవటం విషయంలో శరీర నిర్మాణ రీత్యా ఇతర జంతువుల కన్నా మనిషికి ఎక్కువ అవకాశం దొరికింది.

ఇది క్రమంగా ఆధునిక సమాజ నిర్మాణానికి దారితీసింది.

(ఇంకా ఉంది)


14, సెప్టెంబర్ 2026, సోమవారం

కంచూగాదు పెంచూగాదు

   
ఇది అన్నమయ్య కీర్తనల రెండవ సంపుటం లోని 21వ కీర్తన. ఆసంపుటంలో మలహరి అని రాగనిర్దేశం కూడా ఉంది.

పాట ఈక్రింది విధంగా ఉంది.

కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ||

పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు
నెట్టన బారుచునుండు నీరుగా దీమనసు
చుట్టి చుట్టి పాయకుండు జుటమూగా దీమనసు
యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు ||

రుచులెల్లా గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు
యెచటా గరగదు రాయీగాదు మనసు
యిచటా నచటా దానే యేటిదో యీమనసు ||

తప్పక నాలో నుండు దైవము గాదు మనసు
కప్పి మూటగట్టరాదు గాలీ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశు దలచి
యిప్పుడిన్నిటా గెలిచె నేటిదో యీమనసు

ఈపాటను పాడటానికి అనువుగా చతురస్రగతిలో పద విభజన చేసుకోవచ్చును.

ఐతే కొన్నిచోట్ల పాఠం సరిగా లేదు. ఈపాటను నిన్న వికీపీడియాలో చూసాను. ఆంధ్రభారతిలో కూడా నేడు గమనించాను. అసలు తితిదే వారి పాఠం శుద్ధంగా ఉంటుందని ఆశించి archive.org నుండి రెండవ సంపుటం తెచ్చుకొని చూచాను. అక్కడా పాఠం ఇలాగే ఉంది. పెద్దలు పరిష్కరించిన పాఠం తాళానికి సరిగా వచ్చేలా ఉంటుందని ఆశించి భంగపడటం జరిగింది.

నేను పాటను ఈక్రింది విధంగా విభజించాను. పాఠలోపం కనిపించిన చోట్ల xxxx అన్నట్లు గుర్తు వేసాను.

ఈపాట నిర్మాణం చూస్తే 7 చతుర్మాత్రాగణాలు ఒక పాదం. పల్లవిలో నైనా, చరణాలలోనైనా. అంటే పాదానికి 28 మాత్రలు.

అన్నమయ్య గారు యతిప్రాసలు నియమంగా పాటిస్తారు. ఈకీర్తనలో అన్నిపాదాల లోనూ ఐదవ గణం తరువాత యతి మైత్రి చేసారు. అంటే 16 మాత్రల తరువాత యతిమైత్రి అన్నమాట.

కంచూ|  గాదూ|  పెంచూ| గాదూ| 

  కడుబెలు| చూ.. |మనసూ|

యెంచా| రాదూ| పంచా |రాదూ| 

  యెట్టీ| దో యీ|మనసు| 


పట్టా|బ.సా|లేదూ| చూడా| 

  బయలూ|గా దీ|మనసూ|

నెట్టన| బారూ|చూ..|నుండూ| 

  నీరూ| గా దీ|మనసూ|

చుట్టీ | చుట్టీ | పాయా| కుండూ| 

  జుటమూ|గాదీ|మనసూ|

యెట్టా| నెదుటా|నే.. | వుండూ| 

  నేటీ| దో యీ|మనసూ| 


రు.చూ| లెల్లా| గానూ|పించూ| 

  రూపూ| లేదూ| మనసూ|

ప.చా|రించూ| నాసా|లెల్లా| 

  బసిడీ|గా దీ|మనసూ|

యెచటా| గరగదు| రాయీ|గాదూ| 

  xxxx| xxxx| మనసు|

యిచటా| నచటా| దానే | xxxx|

  యేటి|దో యీ|మనసూ|


తప్పక |నాలో| నుండూ| xxxx|

  దైవము| గాదూ మనసూ|

కప్పీ |మూటా|గట్టా|రాదూ |

  గాలీ |గాదూ| మనసూ|

చెప్పా|రానీ|మహిమల| xxxx|

  శ్రీవేం| కటేశు |దలచీ|

యిప్పూ|డిన్నీ|టా.. |గెలిచే| 

  నేటీ|దో యీ|మనసూ|


నాకు తోచినట్లు చేసిన పరిష్కరణ ఈక్రింద చూపుతున్నాను.


1. యెచటా| గరగదు| రాయీ|గాదూ| 

  యెట్టి| దో యీ| మనసూ|

2. యిచటా| నచటా| దానే | యిట్టే*|

  యేటి|దో యీ|మనసూ|

3.తప్పక |నాలో| నుండూ| గానీ|

  దైవము| గాదూ మనసూ|

4.చెప్పా|రానీ|మహిమల| వెలిగే|

  శ్రీవేం| కటేశు |దలచీ


* ఈసందర్భంలో తరవాతి పదానికి యడాగమం కావాలి కాబట్టి పూరణపదం దృతప్రకృతి కలది కావటం కుదరదు.


వెదుకగా యూట్యూబ్లో ఒక విడియో కనిపించిందని మాతమ్ముడు నాకు పంపినది ఇక్కడ చూపుతున్నాను




కాని యిదంత సంతృప్తిని కలిగించలేదు.


అందగాడు రాముడే అన్నిట తోచ

 
అందగాడు రాముడే అన్నిట తోచ వాని
అందమే జగతి నిండి చిందులాడనీ

అందమైన తరులూ గిరులూ హరి దివ్యవిభూతులు కానీ
అందమైన లోకమంతా హరి నికేతనమ్మే కానీ
అందుకొన్న జన్మలన్నీ హరి నడిపిన యాటలు కానీ
అందమైన నీమనస్సే హరికి సింహపీఠము కానీ

అందమైన మాటలన్నీ హరికి మంచిపాటలు కానీ
అందమైన యూహలన్నీ హరికి పూలమాలలు కానీ
అందుకొన్న దది యేదైనా హరికి నివేదనమే కానీ
అందమైన ఈబ్రతుకంతా హరికే కైంకర్యము కానీ


12, సెప్టెంబర్ 2026, శనివారం

హరినామకీర్తనమున నరునకు మోక్ష మబ్బు

 

హరినామకీర్తనమున నరునకు మోక్ష మబ్బు

మరి యొక్క దారి యన్న మాటే లేదు


హరే శ్రీరామ యని హరే శ్రీకృష్ణ యని

హరే నరసింహ యని మురియవలెను

హరే సదానంద హరే గోవింద యని

మురవైరి స్మరణమున మురియ వలెను


అరిమర్దన రామ అమితవిక్రమ యని

తరచుగ రామునే తలచవలెను

నరకాంతక కృష్ణ నారాయణా యని

పరమాత్ముని తలచి మురియ వలెను


హరి కన్న నాత్మీయు డన నెవ్వడును లేడు

హరిసన్నిధానమె యమిత సుఖము

హరి జేర దలచిన హరినామస్మరణమున

నరుడెప్పుడును నిలిచి మురియవలెను


నా వలన లాభమేమి

 
నా వలన లాభమేమి నారాయణా నేను
భూవలయ మందుండిన పురుషోత్తమా 

ఈదేహము నెంతకాల మిందుంచెదో
నీదేగా నిర్ణయంబు నిశ్చయంబుగా
వేదవేద్య నీదయతో మేదినిపైన
నీద వలయు భవవార్నిధి నేమిచేయుదు

నీదు దివ్య క్షేత్రములకు నేరాగలనా 
యీదేహము మోసికొనుచు నిపుడు రామా
ఆ దయామృతంబు నించు కంత యిచ్చిన
వేదన లన్నియును తీరు విశ్వమోహనా

వేదవేద్య నీదయచే వేదనలణగ
నీదరిని చేరికొనుటె నాదు కోరిక
నీదు దివ్యనివాసమున నిలిచియుండక
మేదినిపై తిరుగుటేల నీదేహికి

దండాలు రఘురామ దండాలు నీకు

 

దండాలు రఘురామ దండాలు నీకు

దండాలు మాతండ్రి దండాలు నీకు


మాకు దేవుడ వీవు మహిమాన్వితుండవు

సాకేతపతి వీవు నీకు దండాలు

శ్రీకరుండవు నీవు సీతాసహితుడవు

లోకేశ్వరుడ వీవు నీకు దండాలు


ధర్మాత్ముడవు నీవు దశరథాత్మజుడవు

నిర్మలుండవు నీవు నీకు దండాలు

కర్మరహితుడ వీవు కరుణామయుండవు

నిర్మోహుడవు నీవు నీకు దండాలు


పరమేశ్వరుడ వీవు పతితపావనుడవు

నిరుపాధికుడ వీవు నీకు దండాలు

వరదాయకుడ వీవు నరనాయకుండవు

నిరమిత్రుడవు నీవు నీకు దండాలు



11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీరఘురాముని చిత్తజగురుని

 
శ్రీరఘురాముని చిత్తజగురుని చేరి కొలుచుకోండి
ఘోరాకారసురారిగణాంతకు చేరి కొలుచుకోండి

పరమేశ్వరుని పతితపావనుని శరణము వేడండి
పరమానందస్వరూపుని రాముని శరణము వేడండి
నిరుపమశుభగుణభూషణునీశ్వరు శరణము వేడండి
నిరంతరముశ్రీరాముని హరినే శరణము వేడండి

శరణాగతపరిపాలనశీలుని శరణము వేడండి
వరదాయకుని నరనాయకుని శరణము వేడండి
సురవరవినుతుని మునివరవినుతుని శరణము వేడండి
గరుడవాహనుని హనుమద్వాహను శరణము వేడండి

పరమచంచలము లైన సిరుల నాహరిని వేడకండి
ధరణీకన్యానాథుని మోక్షము తప్పక వేడండి
పరమాత్ముని హరి కరుణామయు నపవర్గము వేడండి
నరజన్మము సార్ధకము చేసుకొని హరిని చేరుకోండి

రామనామ మొక యెత్తు

భూమిని సర్వం బొకయెత్తు

రామనామ మొక యెత్తు


భూమిని సిరిసంపద లొక యెత్తు

  రామనామ మొక యెత్తు

సామంతము గల బ్రతుకొక యెత్తు

  రామనామ మొక యెత్తు

రామామణిసంగతి యొక యెత్తు

  రామనామ మొక యెత్తు

కామితసౌఖ్యముల వన్నొక యెత్తు

  రామనామ మొక యెత్తు


నీమంబులు నిష్ఠలు నొక యెత్తు

  రామనామ మొక యెత్తు

నోములు వ్రతము లవన్నొక యెత్తు

  రామనామ మొక యెత్తు

వేమరు తోర్ధాటన మొక యెత్తు

  రామనామ మొక యెత్తు

సోమాదిక యాగము లొక యెత్తు 

  రామనామ మొక యెత్తు


ప్రేమలు బంధుత్వము లొక యెత్తు

  రామనామ మొక యెత్తు

భూమిని నరజన్మం బొక యెత్తు

  రామనామ మొక యెత్తు

ఆమహిమలు సిధ్ధులు నొక యెత్తు

  రామనామ మొక యెత్తు

ఆమోక్షంబను నది యొక యెత్తు

  రామనామ మొక యెత్తు



కనుగొంటి కనుగొంటిని


మునులు పొగడెడు రాముని నేను
కనుగొంటి కనుగొంటిని

ఘననీలదేహుని వనజాయతాక్షుని
కనుగొంటి కనుగొంటిని
మునిలోకమోహను ఘనతాపనాశను
కనుగొంటి కనుగొంటిని

దనుజేశరావణదర్పవిధ్వంసను
కనుగొంటి కనుగొంటిని
వనజాతసంభవవినుతచరిత్రుని
కనుగొంటి కనుగొంటిని

జనవాంఛితాఘ్రుని ఘనపాపనాశను
కనుగొంటి కనుగొంటిని
తనసాటిదైవంబన లేని తండ్రిని
కనుగొంటి కనుగొంటిని

10, సెప్టెంబర్ 2026, గురువారం

హరిని వేడుము హరిని చేరుము

 
హరిని వేడుము హరిని చేరుము
ధరకిక నీవు తిరిగి రాకుము

సిరిపై మోహము నరునకు నాశము
హరిపై మోహము నరునకు మోక్షము
పరమసత్యమని భావనచేయుము
హరి హరి హరి యని హరినే చేరుము

హరికృప లేనిది హరిస్పృహ కలుగదు 
హరికృప వలననె హరి స్ఫురియించును
పరమసత్యమిది భావన చేయుము
హరి హరి యను భాగ్యమునే పొందుము

పరమేశ్వరునే గురువుగ దలచుము
హరికృప జూచును హరిస్పృహ గలుగును
హరిమంత్రంబును హరు డపు డిచ్చును
హరేరామ యని హరిని చేరుదువు

హరుని కొలువకుండు వానికన్న మూర్ఖు డెవ్వడు


హరుని కొలువకుండు వానికన్న మూర్ఖు డెవ్వడు
హరిని తలపకుండు వానికన్న మూర్ఖు డెవ్వడు

హరుని కొలువకున్న నీకు హరిమంత్రం బెట్లు దొరకు
హరిమంత్రము దొరకకున్న పరమభక్తి యెట్లు నిలచు
పరమభక్తి హరిని తలచు వారలకే ముక్తి కదా
హరిహరుల కటాక్షమే యన్నిటికిని మూలము

హరహర హరయనుచు శ్రీహరుని ధ్యానించవయా
హరిమంత్రము దొరుకునయా హరికృపయును దొరకునయా
హరేరామ భవతారక యనుచు ముక్తి పొందవయా
నరజన్మము సార్ధకమై హరిని చేరి మురియవయా


దయగల రామయ్య దయజూడ వయ్య

 


దయలేని మనుజుల భయమే హెచ్చాయె

దయగల రామయ్య దయజూడ వయ్య


తననుదైవంబుగ తలపగ భ్రమబెట్టు

కనికట్టువిద్యల కల్లదేవుళ్ళ నిక

కనికరించుట మాని కమలాక్ష యవ్వారి

కనుచూపుతో నైన కడతేర్చవయ్య


పనిగొని దుర్మతపాపబోధలు చేసి

జనులమనసులు మార్చు ఛండాలగురువుల

పనిబట్టు టది యెంత పనినీకు రాఘవ

పనుచు మొక్క శరమును భగవంతుడా


మనవులు సేసేము మరిమరి కొలిచేము

మనుజాధముల చెయ్వులను విన్నవించేము

పనిగొని పీడించు పాపుల దయతో

హనుమనైనను బంపి యణగించవయ్య


వివేకం

కొన్నాళ్ళ క్రిందట నాస్నేహితులు ఒకాయనకు ఒకానొక కారణంగా నాపైన క్రోథం కలిగింది.

నానామాటలూ ఆయన అనటం నేను పడటం జరిగింది.

అవేవీ నాపైన ప్రభావం చూపటంలేదన్న అనుమానం వలన కావచ్చును ఆయన చివరగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించారు.

బ్రహ్మాస్త్రం అంటే దానికి తిరుగులేదు. ఎవడన్నా కింద పడిపోవలసిందే.

తప్పదు.

ఆ బ్రహ్మాస్త్రం ఏమిటంటే "నువ్వేదో నేనే పెద్ద రామభక్తుడిని అని చెప్పుకుంటున్నావు" అని హేళనచేయటం.

రాముడి గురించి ఎత్తటం దేనికి వ్యక్తిగతవాదవివాదాల మధ్యలో?

మరొకరకంగా నైతే నేమి అస్త్రం బ్రహ్మాండంగా పనిచేసింది. వాదం పెంచటం ప్రమాదం అని నేనే తప్పుకున్నాను.

ఒక చిన్న కథ చెప్పాలి.

ఒకడు తన వృత్తిగా అనుకోండి ప్రవృత్తిగా అనుకోండి అడవిలో చెట్టునరికి పుల్లలు కొడుతున్నాడు. అది కాస్త చిట్టడవే. నట్టడవిలో క్రూరమృగాకులప్రాంతంలో దర్జాగా ఎవడూ పోయి చెట్లు నరుకుతూ గంటలుగంటలు గడపటానికి సాహసించడు.

చిట్టడవే కాబట్టి కాస్త జనసంచారం ఉంది. వీడిని ఎందరో చూసారు. వాళ్ళల్లో కొందరికి వీడి వ్యవహారం నచ్చలేదు.

ఒకడంటాడూ చెట్లను అలా కొట్టకూడదు. వాటికీ ప్రాణం ఉండదా అని. పాయింటే కాని చికెన్ లేనిదే ఆయనకు ముద్ద నోటికి పోదు.

మరొకడు చెట్లను కొడితే ఇలా అడవులు తరిగిపోతాయి. అడవులు మన జాతీయసంపద అని.

ఇంకొకడు చెట్లను ఆవాసం చేసుకునే పక్షులేం కావాలీ వాటి జాతులు నశించి పోవా చెట్లను కొట్టేవాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి అంటాడు. ఈయన టీచరే లెండి.

మరొకడు పక్షులేనా అడవులు పలుచనైతే వన్యప్రాణులూ నశించవా. ఇది ఘోరమైన విషయం అని వాపోతాడు.

మరొక బుద్ధిమంతుడు చెట్లను వంటచెరకు చేస్తే పొగతో వాతావరణకాలుష్యం పెరుగుతుంది. అసలే గ్లోబాల్ వార్మింగ్ పెరిగిపోతోంది ఆని విన్నాణం ఒలికిస్తూ మాట్లాడాడు.

ఇంకా మరొకడు చెట్లను కొట్టేవాళ్ళను చెట్లకే ఉరితీయాలి అని ఆవేశపడుతున్నాడు.

షికారుకు వచ్చి ఇలా కబుర్లాడుతున్న కాలక్షేపరాయుళ్ళ మాటలు ఈపుల్లలు కొడుతున్న వాడికి వినబడుతూనే ఉన్నాయి. కొన్ని ముక్కలు ఇంగిలిపీసులో ఏడవటంవలన వాడికి తెలిసిచచ్చేవి కాకపోయినా వీళ్ళుచేసే శబ్దకాలుష్యం వాడి శ్రవణేంద్రియాలను సోకుతూనే ఉంది.

కానీ, వాడు తాపీగా పుల్లలు కొట్టుకొని చక్కాపోయాడు. 

వీళ్ళతో తగువు పడటం తనకి పనిచెరుపు తప్ప మరేమీ కాదన్న ఇంగితం వాడికి బాగానే ఉంది.

ఎవడేమి చేస్తున్నా లోకంలో అది నచ్చని వాళ్ళూ మెచ్చని వాళ్ళూ దానిపై నోరు చేసుకొనే వాళ్ళూ ఎప్పుడూ పుష్కలంగా ఉంటారు.

తనపని తాను చేసుకుంటూ పోవటం ముఖ్యం. లోకంతో తగువులు పడటం కన్నా చాలా ముఖ్యం.

నేను వచ్చాను.

నాపని నేను చేసుకుంటున్నాను.

ఏఒకరికో లేదా ఏకొంతమందికో నాపని నచ్చకపోతే పోనివ్వండి. ఆవిషయంపై తగవులకు పోను. ఎవరినీ ఒప్పించవలసిన అగత్యం లేదు.

నాది భక్తో నటనో డాంబికమో మోసమో వీటిలో ఏదో కాంబినేషన్లో ఏదో ఒకటి ఆని ఎవరన్నా అనుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు. కోపం హెచ్చి నన్ను తిట్టినా నన్ను రెచ్చగొట్టాలని రాముణ్ణి తిట్టినా వాళ్ళతో తగువేసుకుని నాపని చెడగొట్టుకోను.

ఆపుల్లలు కొట్టుకునేవాడి పాటి వివేకం నాకూ ఉంది.

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినంత

 

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినంత

  చింత లన్నియు పారిపోయె

శ్రీరామ యనినంత రిపుషట్క మెంతయో

  చింతించుచును పారిపోయె


శ్రీరామ శ్రీరామ యనినంత పెద్దమ్మ

  చేరవెరచుచు పారిపోయె

శ్రీరామ శ్రీరామ యనినంత కష్టాలు 

  చేరవెరచుచు పారిపోయె

శ్రీరామ శ్రీరామ యనినంత నాపదలు

  చేరవెరచుచు పారిపౌయె

శ్రీరామ శ్రీరామ యనినంత యముడును

  చేరవెరచుచు పారిపోయె


శ్రీరామ శ్రీరామ యనుటయే హితమగుట

  శ్రీరాముడే ప్రాణమెయె

శ్రీరామ శ్రీరామ యనుటయే పనియగుట

  శ్రీరాముడే లోకమాయె

శ్రీరామ శ్రీరామ యనుటయే బ్రతుకగుట

  శ్రీరాముడే నిత్యమాయె

శ్రీరామ శ్రీరామ యనుటయే నిజమగుట

  శ్రీరాముడే సత్యమాయె


శ్రీరామ శ్రీరామ యన రిపులు ననుబట్టు

  దారులన్నియు తరగిపోయె

శ్రీరామ శ్రీరామ యనగ నిహభోగముల

  పైరక్తియే మాసిపోయె

శ్రీరామ శ్రీరామ యనగ కలిపురుషుని

  బీరమంతయు జారిపోయె

శ్రీరామ శ్రీరామ యనగ భవచక్రమున

  సీలలన్నియు నూడిపోయె





అందుకో హరినామ మందుకో

 

అందుకో హరినామ మందుకో

ఎందుకో అది నాకు ఎందుకో


హరినామ మందుకొని అరివర్గ షట్కమును

  అణచివేయగ వచ్చు నది నందుకో

అరివర్గ షట్కమా ఆదియేమి యద్దాని

  అణచివేయుట యిప్పు డెందుకో

అరిషట్కమన కామమోహాది భావనలు

   హరినామమున గాని యణగారవు

హరినామ మణచునా అట్లైన మంచిదే

  హరినామమును వేగ నందించుమా


హరినామ మందుకొని భవసాగరంబును

  తరియింగావచ్చు నందుకో

సరి సరి ఆభవసాగరం బదియేమి

  తరియింప నుంకించు టెందుకో

వరుస పుట్టువు లుదధి తరగల వంటి వదె

  భరియింపరానిదౌ భవ సాగరం

అరెరె యటు లైనచో హరినామమును వేగ

  పరమార్తుడగు వీని కందించుమా


హరినామమున జేసి యార్తు లుదరు మోక్ష

  మందకొనగా వచ్చు నది యందుకో

హరినామ మునకెన్ని నియమంబు లున్నవో

  అమిత ఋష్టంబైన నాకెందుకో

నరుడా హరేరామ శ్రీహరే కృష్ణయన

   నమ్ముమే నియమంబులును లేవయా

మరి యేమి యికనుండి హరినామమును నేను

  మరువనే మరువ శ్రీహరి యానగా

  

వేదనలన్నీ విభునినామమున వెన్నవలే కరిగె


వేదనలన్నీ విభునినామమున

  వెన్నవలే కరిగె

శ్రీదయితుని శుభనామపు మహిమ

  చిత్తములో నిలిచె


లోకపు పాపపు వాసనలన్నీ 

  రూపరి శాంతియె నిలిచె

శోకము మోహము క్రోథము లోభము 

  సుంత దూరముగ నిలిచె

సాకేతపురాధీశుని దయచే

  చక్కని బుధ్ధులు నిలిచె

శ్రీకరమగు శ్రీరామనామమున

  చిత్తము చక్కగ నిలిచె


హరిభక్తుల సంసర్గమునే మది

  ఆనందముగా తలచె

నిరంతరము శ్రీహరినామమునే

  మరిమరి చిత్తము తలచె

హరినామమునే యడలెడు చిత్తము

  పరమౌషధమని తలచె

పరమపదమునే కోరెడు నాత్మయు

   హరినామమునే వలచె


హరెరామ యని పలుకుటతోనే

  ఆనందవృష్టి కురిసె

హరేకృష్ణ యని పలుకుటతోనే

  అమృతంపువృష్టి కురిసె

హరేరామ శ్రీహరేకృష్ణ యన

  హరి దయావృష్టి కురిసె

కురిసిన హరిదయతో నిజరూపము

  నెరిగిన జీవుడు మురిసె



8, సెప్టెంబర్ 2026, మంగళవారం

ముచ్చటగా నాడుచున్న బొమ్మ పాతబడిన దని


ముచ్చటగా నాడుచున్న బొమ్మ పాతబడిన దని 

యచ్చముగా నావలెనే యాలోచించేవా


మంచి వేషగాని కొక్క మంచివేష మనుచు లేదు

మంచిదే యెట్టి వేష మైనను గాని

కొంచెమైన సిగ్గులేక కోతివేష మైన వేయు

నంచితముగ రాజువేష మైనను వేయు


ఎట్టి వేష మైన వేసి యెట్టి మాట లైన నాడి

యెట్టి పనుల నైన చేసి యించు కంతయు

కట్టుబడక వేసంబుల కల్లనిజంబులకు తాను

గట్టిగ రంజింపజేయు ఘనుడా రామ


వేసి వేసి వేసంబులు విసువు చెందవచ్చు గాక

వాసిచెడిన ఈబొమ్మను వదలి నీవు

చేసిన వేరొక్కబొమ్మ జేరి యాడ కుండ దరమె

నీసంతసమునకు మరల నేనాడెదను



ఆడ నీడను నీవె యండగా నుండగా


ఆడ నీడను నీవె యండగా నుండగా

వేడ నేమిటి కితర వేల్పుల నింక


వేడి చెడినది చాలు వివిధజన్మంబులను

నేడుండి రేపుచెడు నీచసంపదలకు

వాడని భాగ్య మపవర్గంబు నందించు

వాడవు నీవనుచు  నేడుగా నెఱిగితిని


కూడ రాని వారి కువలయంబున నేను

గూడి చెడినది చాలు కూడ నికమీదను

వేడుకతోడ నిదే విభుడ శ్రీరఘువర

నేడు నిను చేరితిని నిక్కంబుగాను


విడువ నీసన్నిదిని  విమల స్వస్వరూప 

మడగి మన యభేదము తొడిగితి దేహము

విడువని మాయచే వేలజన్మల నుండి

పడుచున్న బాధలను బాప నాతోడగుచు