జనులారా నాపేరిది యని యెందుకు తలచేరో
మును పెన్ని పేర్లతోడ మనుజులు నను పిలిచిరో
అందమైన తనువు లెన్ని వందలు నే దాల్చితినో
అందమైన పేరు లెన్ని వందలు ధరియించితినో
ముందుగ మది నూహింపుడు బుధ్ధిమంతులార మీ
రందర కపు డవగతగమగు నసలుసిసలు సత్యము
చక్కనైన పేరుండునె జంతుతతికి దేనికైన
యెక్కడైన నుండిన నది యెంచిచూడ నొక్క నరుడు
నిక్కువముగ ప్రేమతోడ నిలిపినదే కాని జగతి
తక్కుంగల వాటికెల్ల తగును జాతి వాచకమే
నరునకైన పేరనగా నరుడొక్క డిచ్చెనదే
అరయగ పేరేది యైన వ్యవహరించుట కొరకే
వరుసగ నాకిట్టి పేర్లు వందలువందలుగ నాయె
బిరుదులైన పేరులైన పిచ్చిమాట లేను సుమా
నరుల పేర్లు తలచినంత నొరుగున దేమియును లేదు
హరి పేర్లను తలచినంత తరుగును పాపములు మీకు
హరేరామ హరేకృష్ణ హరేనారసింహ యనుచు
నిరంతరము తలచితిరా నిశ్చయముగ కలుగు ముక్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.