దశరథనందన పాహి
దశముఖమర్దన పాహి
పాహి వార్ధక్యమే పట్టుకొన్నది తనువు
బడలియున్నది దైవమా
పాహి నీనామమును పలుకుటకే తక్క
పసచెడె నీ తనువున
పాహి శ్రీరామ యిక పదిమందికిని బరువు
వసుధపై నిది యుండుట
పాహి శ్రీనాథ భవతారక యీయునికి
వలన లాభము లేదురా
పాహి శ్రీరఘురామ పడినచిక్కులు చాలు
పరమాత్మ రక్షించవే
పాహి శ్రీపతి నిన్ను ప్రార్ధించు చున్నాను
త్వరపడ విది యొప్పునా
పాహి శ్రీజానకీరమణ నామొరలేవి
పట్టించుకోవేమయా
పాహి శ్రీరామ సంసారబాధలు చాలు
భక్తుడ నను బ్రోవవే
పాహి పాహి యంటే పలుకకుండుట నీకు
పాడి కాదుర రాఘవా
పాహి పాహి యనిన భక్తులెందర మునుపు
బాగుగ దయజూడవో
పాహి పాహి దీనబాంధవ నీయందె
యూహలన్నియు నిల్పితి
పాహి పాహి రామ దేహధారుల కెల్ల
పరమగతివి నీవెగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.