15, ఫిబ్రవరి 2026, ఆదివారం

మంచితనము

మంచితనము రాముడై మహిని వెలసెను హరి
వంచు నందరు సురలు నగ్గించ మెరసెను

వనజాసనప్రభృతు లడుగ వసుధను ప్రభవించెను
జనకున కచ్చెరువుగ శివధనువు నిట్టె విరచెను
జనులందరు మెచ్చగాను జానకిని గ్రహించెను
పినతల్లికి ప్రీతిగొలుప విపినములకు బోయెను

అంతులేని యసురుల దురంతములను బాపెను
చెంత చేరి నట్టి వారి చింతల నణగించెను
పంతగించిన దశముఖుని భండనమున గూల్చెను
సంతసించ జనులెల్లరు జగమును పాలించెను

తనపేరే యసురహృద్విదారకముగ చేసెను
తన భక్తుల కెల్లప్పుడు తానండగ నిలచెను
తన యశంబు నాచంద్రతారార్కము చేసెను
తన నామము జనులకు భవతారకముగ చేసెను


3 కామెంట్‌లు:

  1. బ్లాగులు ఒక కాలక్షేప సామగ్రి నుండి కేవలం సాహిత్య-సమాచార వేదికలుగా మారే అవసరం లేదు. సాధ్యపడదు.అన్నిరకాల బ్లాగులు ఉండాలి ఉంటాయి కూడా.

    బ్లాగర్ల సమావేశాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే SKC పార్టీ లాగ ఓకే.

    బ్లాగింగ్ వ్యక్తిగత అభిప్రాయాలు, రచనలు ప్రచురించుకోవడానికి ఉపయోగపడే ఒక వేదిక. అంతకుమించి ఏదో ఆశించడం అవసరం లేదేమో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఈవ్యాఖ్యను మనోహర్ గారి బ్లాగులోని నావ్యాఖ్యకు సమాధానంగా అక్కడే వ్రాసి యుండవలసింది. ఇక్కడ ఈటపాలోని రాములవారి గురించిన కీర్తనకు మీరు పంపిన వ్యాఖ్యకు ఏమీ సంబంధం లేదు కదా.

      తొలగించండి
  2. బ్రాహ్మణులపై అకారణ ద్వేషం కలిగివుండే రచయిత ఒక బ్లాగులో ఉన్నారు. సంకుచిత మనస్తత్వం, వితండ వాదం చేయడం సనాతన ధర్మాన్ని, హిందువులను చులకన చేయడం, కువిమర్శలు చేయడం అదే పనిగా చేస్తుంటారు. వారి భావజాలం మాత్రమే సరైనది అన్న భ్రమలో ఉంటారు. సద్విమర్శను కూడా స్వీకరించలేరు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు