ఈ రోజు మాతమ్ముడు రామం పుట్టిన రోజు.
ఎటొచ్చీ శుభాకాంక్షలు చెప్పాలని ఉన్నా అందుకుందుకు వాడు మనమధ్యన లేడు.
అది చాలా బాధావహమైన విషయం. జ్ఞాపకంగా మారిపోయిన మా తమ్ముడు రామం ఎప్పటికీ మా దృష్టిపథంలోనే ఉన్నాడు. ఉంటాడు.
ఎంతో దర్జాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అన్న బోర్డు ఉన్న బల్ల మీద ఫైళ్ళు చూస్తున్న మాతమ్ముడిని చూసి ఈరోజున చాలా చాలా సంతోషమూ తృప్తీ కలిగాయి. వాడు లేడే అని ఎంతో నిర్వేదమూ కలిగింది దానితోపాటే
నేను ఉద్యోగస్థుడనైన ఏణ్ణర్ధం లోపే మానాన్నగారు తాడిగడప సత్యనారాయణ గారు హఠాత్తుగా గుండెనెప్పి వచ్చి అక్టోబరు 28, 1975 తారీఖునాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వర్గస్థులయ్యారు. అప్పుడు మాకుటుంబం నివాసం రాజోలులో.
నాకెలాగూ ఉద్యోగం ఉంది కదా అని, మాతమ్ముడు సత్యశ్రీరామచంద్ర మూర్తికి ఏదైనా ప్రభుత్వోద్యోగం ఇప్పించమని తోర్పుగోదావరి జిల్లా కలెక్టరు గారికి ఒక చిన్న విన్నపం ఉత్తరం ద్వారా పంపాను.
ఆశ్చర్యం ఏమిటంటే ఇంకా వారం తిరక్కుండానే మాతమ్ముడికి జిల్లా పరిషత్తు ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇస్తున్నాం రమ్మని తిరుగుజవాబు పంపారు కలెక్టరు గారు.
అలా వాడు చిన్న ఉద్యోగిగా కాకినాడ వెళ్ళాడు. మిగిలిన కుటుంబం అంతా నాదగ్గరకు హైదరాబాదు వచ్చేసారు.
కాలక్రమేణా మాతమ్ముడు కాకినాడలోనే స్థిరపడిపోయాడు. కొత్తలో కొన్నేళ్ళపాటు తనూ హైదరాబాదు వద్దామని ప్రయత్నించినా సర్వీసు కోల్పోయి మరీ రావలసి ఉండటంతో అక్కడే ఉండిపోయాడు.
మిగిలిన నాచెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ హైదరాబాదులోనే పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడ్డారు.
ఒక చిన్న ఉద్యోగిగా మొదలైన మాతమ్ముడు మంచి సమర్ధుడిగా పేరుతెచ్చుకొన్నాడు. మంచి పదోన్నతులూ పొందాడు. కాకినాడలో ఒక ప్రముఖవ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రిటైర్ కూడా ఐనాడు.
రిటైర్ ఐనా సరే జిల్లా పరిషత్తు వారు (ముఖ్యంగా కలెక్టరు కార్యాలయం అనుకుంటాను) అతడిని వదలలేదు. కొత్తగా వచ్చే ఆఫీసర్లకు ట్రైనింగు ఇచ్చే కార్యభారం ఇతడికి అప్పచెప్పారు.
అలా ఉద్యోగానంతరం కూడా హుషారుగా పనిచేసుకుంటూ ఉన్న మాతమ్ముడిని కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకొంది.
అలా అతడు ఆఫీసుపని చేసుకుంటుండగా తీసినదన్నమాట ఆపై ఫోటో.
దానిని చూడటం నాకూ ఇదే మొదటి సారి.
విశాఖలో ఉండే మా మేనమామ ప్రసాద్ ఆత్రేయ గారు తన కంప్యూటరులో ఈఫోటో ఉన్నదని 22వ తారీఖున ఉదయమే నాకు పంపారు. చెప్పానుగా ఆ ఫోటోను చూడగానే ఎంతో సంతోషమూ నిర్వేదమూ కూడా ఎండావానలు ఒక్కసారే వచ్చినట్లు వచ్చాయి నాకు.
ఈఫోటోను భద్రపరచుకుందుకు అన్నమాట ఈటపా!
కాకతాళీయంగా ఈరోజు మాతమ్ముడు రామం పుట్టిన రోజు కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.