31, జులై 2023, సోమవారం

సతతం ప్రణమామి

కం. ధృతిమంతమ్ ద్యుతిమంతమ్
మతిమంతమ్ సర్వశక్తిమంతమ్ సత్య
వ్రతపాలనగుణవంతమ్
సతతం ప్రణమామి రామచంద్ర మనంతమ్ 


2 కామెంట్‌లు:

  1. శ్యామలీయం సర్, నమస్తే!

    ఒక మంచికీర్తనే చాలు నీ తత్త్వ ముగ్గడించుటకు
    ఒక మంచిపద్యమే చాలు నీగొప్ప నొప్పార జెప్ప
    ఒక మంచిభావమే చాలు మనసు నిన్నూహించి
    మరియు
    అకళంకదివ్యప్రభావ శ్రీరామ యమితంబు లేల

    అన్నమయ్య వారు 'ఒక కీర్తన చాలు నేను తరించడానికి, మిగిలిన కీర్తనలను నీ భాండాగారంలో దాచుకోవయ్య' అన్నట్లు...
    ఒక మంచి పద్యం చాలు అంటూనే, నాలుగు వందల పైగా పద్యాలు, వేల కీర్తనలతో రామ వైభవమును శ్లాఘించడం... అత్యద్భుతం సర్.

    మీ రామమయ భక్తి తోటలో వివిధ విరులు. ఒకవైపు 'నరుడా' అన్న మకుటంతో వికసించినవి కొన్ని, మరో వైపు విశేష వృత్తాలుతో విరాజిల్లునవి కొన్ని, ఆ దరి ఛందస్సు సోయగాల సుమాలు, ఈ దరి షోడశోపచారాలతో కూడిన మానసిక పూజా పుష్పాలు... పాండిత్య ప్రదర్శన లేని సరళ భాషతో మృదు శైలితో వాడని, వన్నె తరగని పసిడి పుష్పాలు.

    మచ్చుకు కొన్ని -

    శివుడే పొగడును రాముని
    పవమానసుతుండు పొగడు బ్రహ్మయు పొగడున్
    దివిజగణంబులు పొగడును
    సవినయంగా నీవు పొగడజాలవె నరుడా

    శ్రీరామచంద్రునకు చిత్త మంకితం
    శ్రీరామనామమున జిహ్వ పావనం
    శ్రీరామ చింతనము క్షేమదము శుభం
    శ్రీరామచంద్రునకు సేవ మోక్షదం

    శక్తిని యుక్తి నొసంగెడు నామం
    ముక్తివదాన్యత బొలిచెడు నామం
    భక్తులు పాడే భగవన్నామం
    రక్తినిగొలిపే రాముని నామం

    మానసికంబుగా చేసిన
    ఈ నా చిరుపూజ నీకు హృదయంగమమే
    యౌనని తలచెద రామా
    దీని మహాఫలము గొనుము దీవన లిమ్మా

    తాత్త్విక దృష్టితో, వైరాగ్య చింతనతో, శరణాగతి భావనతో, భక్తితో, వేడుకోలుతో పలు పద్య కుసుమాలుతో రామార్చన.

    ఒక పద్యంలో -
    'దయగల వాడు వేడుకొన మోక్షము నైన నొసంగు' అనడంలో అపార విశ్వాసం.

    మరో పద్యంలో -
    'నిను తిట్టగ మనసు రాదు నిజముగ నాకున్'

    నిన్ను కనులారా చూడాలని మనసై వుందీ కానీ,
    నన్ను చూడాలని నీకు లేదే...ఐనా నిన్ను నిందించ మనస్సు రాదే ... నిందాస్తుతి కూడా చేయలేని లాలిత్యపు భక్తి అంటే ఇదే కదా.

    శ్యామలీయం సర్, పూజామందిరంలో భగవంతుణ్ణి అష్టోత్తర నామావళితో అర్చించుకున్నట్లే, రామరక్షా స్తోత్రమ్ చదువుతూ శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే అని శరణు వేడుకున్నట్లే, అప్పుడప్పుడు మీ బ్లాగ్లో కొన్ని పద్యాలు చదువుకుంటూ ...
    శరణు శరణు రామ పరమకృపాధామ
    శరణు శరణు రామ సార్వభౌమ
    శరణు శరణు రామ పరమపావననామ
    శరణు శరణు ధరణిజా సమేత
    అని ఆరాధించడం కూడా అలవడింది, నాతో పాటు మరో ముగ్గురు నా సత్సంగ మిత్రులకు. ఇది రాముని సాక్షిగా సత్యం.
    ప్రతీ రామ భక్తుని నోట మీ పద్యాలు వినిపించాలని కోరుకుంటున్నాను.

    పాహి రామప్రభో...🙏

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలమ్మా. మీలా చదువుకొని సంతోషించే కొద్దిమంది కోసమైనా ఈరామసంకీర్తనాయజనం బ్లాగులో కొనసాగుతూనే ఉంటుంది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.