31, డిసెంబర్ 2018, సోమవారం
ఏమో నీ వన్నచో
ఏమో నీ వన్నచో నెవరికైన మక్కువే
రామా యదియేమి రహస్యమయ్య
ముక్కు మూసుకొను వారు మునులు నిన్ను చూచిరి
మిక్కిలి మోహించిరిది యెక్కడి విడ్డూరము
మక్కువ నీపైన మునుల కెక్కుడాయె ననగ
నిక్కముగ నీవు సర్వ నియామకుడైన హరివి
చుప్పనాక వచ్చినది చూచి నిన్ను మెచ్చినది
చప్పున మోహించినది చాల భంగపడినది
అప్పుడే రావణసంహారమునకు తెరలేచె
చెప్పరాని వింతలు నీ చెయుదంబులో హరి
విభీషణుడు నిను గూర్చి విని చాల మెచ్చెను
సభనువీడి వచ్చి నిన్ను శరణమే కోరెను
ప్రభుడ వెల్ల లోకమున కభయ మీయ కుందువె
నభశ్చరుల కభయము నాడే నీ విచ్చినట్లు
ఎఱుగుదురా మీ రెఱుగుదురా
ఎఱుగుదురా మీ రెఱుగుదురా
యెఱుగదగిన దిది యెఱుగుదురా
ఇతడెవరో మీ రెఱుగుదురా యితని విశేషము లెఱుగుదురా
చతురానను మీ రెఱుగుదురా యత డీతని సుతు డెఱుగుదురా
శతక్రతుని మీ రెఱుగుదురా యతని కితడె గతి యెఱుగుదురా
ఇతడే మిము కరుణించినచో నిక పుట్టువులే దెఱుగుదురా
వనమాలాధరు నెఱుగుదురా పరమమనోహరు నెఱుగుదురా
మునిమోక్షప్రదు నెఱుగుదురా మోహవిదారకు నెఱుగుదురా
ఇనవంశప్రభు నెఱుగుదురా ఘనసత్యవ్రతు నెఱుగుదురా
వినుడాతని మీ రెఱిగినచో జననము లేదిక యెఱుగుదురా
భూమిసుతాపతి నెఱుగుదురా రాముని తత్త్వము నెఱుగుదురా
కామితప్రదుడని యెఱుగుదురా ప్రేమమయుండని యెఱుగుదురా
శ్రీమంతుడని యెఱుగుదురా చిన్మయు డితడని యెఱుగుదురా
మీమీ బుధ్ధుల నెఱుగుదురా మీకిక మోక్షం బెఱుగుదురా
27, డిసెంబర్ 2018, గురువారం
నా కొఱకై నీవు నేలకు దిగిరావో
నా కొఱకై నీవు నేలకు దిగిరావో
నీవుండు తావేదో నేనెఱుగ లేను
తెలియమి జేసి ధరకు దిగి వచ్చితి నేను
తెలిసియు నన్ను నీవు దిగనిచ్చినావో
వలదని నీవన్నను భ్రమపడి దిగినానో
అలనాటి నుండి కావు మని వేడుచున్నానే
ఎన్నియుగము లందు వీ యెదురు చూపులు
ఎన్నియుగము లందు వీ పరితాపాలు
ఇన్నాళ్ళ కైన నీ కేల కృప రాదాయె
నన్నిచట వేగుమను టన్నదిది న్యాయమా
ఇక్కడ సంసార మం దింత తిరిగితి సూవె
చక్కనయ్య యీశిక్ష చాలన విదేమయ్య
ఒక్కటై మనముండు టుచితము గానుండు
నిక్కము రామయ్య నీవాడ నేనయ్య
26, డిసెంబర్ 2018, బుధవారం
నినుగూర్చి చింతించు మనసేల యీనాడు
నినుగూర్చి చింతించు మనసేల యీనాడు
ధనముసంపాదించు తలపులో మునిగె
జనియించి సంసారజంజాటమును పొంది
ధనము లార్జించుచు ధరణి గ్రుమ్మరుచు
తనువును పోషించి తనవారి పోషించి
దినములు దొరలించు మనుజుడ గానె
ఎంతగా బుధ్ధిలో నీశ్వరా నీతత్త్వ
చింతనంబును చేయు చిత్తంబునకును
కొంతలో కొంతైన కొఱతగా ధనమున్న
సుంతైన చెదరుట చోద్యమే రామ
అంటి యంటనిరీతి నట్లుంటి వందుచే
బంటుకష్టము లిట్లు ప్రబలుచు నుండె
వెంటరాని ధనము వెంట వెఱ్ఱి పరుగు
వెంటనే యరికట్టి విడిపించ వయ్య
25, డిసెంబర్ 2018, మంగళవారం
పాత 'చందమామ'లు డౌన్ లోడ్ చేయటం ఎలా?
పాత చందమామలు సులువుగా లభిస్తున్నాయి.
మీరు http://www.chandamama.in/ సైట్ లోపలికి వెళ్ళి వివిధభాషల్లో చందమామలను చదువవచ్చును. తెలుగు చందమామల కోసం TELUGU అన్న లింక్ పైన నొక్కితే1947 నుండి అనేక సంవత్సరాల చందమామలు కనబడతాయి. కావలసిన సంవత్సరం ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఆ సంవత్సరం తాలూకు పేజీ తెరచుకుంటుంది అక్కడ ఉన్న మీకు కావలసిన నెల చందమామను క్లిక్ చేసి చదువుకోవచ్చును.
ఐతే నాకు అలా ఓపెన్ ఐన చందమామ ఫార్మేట్ బ్రౌజర్‍లో నచ్చలేదు. దిగుమతి చేసుకొనే విధం అన్వేషించి పట్టుకున్నాను.
1947 జూలై నెల సంచిక నుండి 2007 డెసెంబరు వరకూ ఉన్న సంచికలను మీరు సులువుగా మీ బ్రౌజర్‍లోనే చదువుకో వచ్చును లేదా డౌన్ లోడ్ చేసుకో వచ్చును.
మీరు ఈ లింక్ టైప్ చేసి 1947 జూలై నెల సంచికను డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ముఖ్యంగా ఇలా గైతే సమ్చికలు చాల వేగంగా బ్రౌజర్‍లో లోడ్ అవుతున్నాయి. లోడ్ ఐన తరువాత మనం డౌన్ లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి దాచుకోవటమే!
http://www.chandamama.in/resources/telugu/1947/Chandamama-1947-7.pdf
పై లింక్ లోపల 1947-7 అంటే 1947 జూలై నెల. 1947 బదులుగా మీరు మరొక సంవత్సరాన్ని టైప్ చేయవచ్చును. అలాగే చివర 7.pdf బదులుగా 12.pdf అని డెసెంబరు నెల కోసం టైప్ చేయవచ్చును. అక్కడక్కడా కొన్ని నెలల సంచికలు లేవు. ఉదాహరణకు 2007 జూన్ సంచిక లేదిక్కడ. ఆనెలలో ఎందుకనో చందమామ రాలేదేమో మరి.
నా సూచన ఏమిటంటే ఆసక్తి ఉన్నవాళ్ళు చందమామల్ని డౌన్ లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్‍లో దాచుకోవటం మంచిది. వీలైతే ఒక పెన్‍డ్రైవ్ లో దాచుకోవటం ఇంకా మంచిది. అవి ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. కొన్నాళ్ళకి చందమామ వారు ఆ సంచికలని తొలగించినా ఇతరవిధంగా ఇబ్బంది కలిగించినా మనకైతే సమస్య రాకుండా ఉంటుంది.
22, డిసెంబర్ 2018, శనివారం
ఆవల పదునాల్గువే లసురు లుధ్ధతులును
ఆవల పదునాల్గువే లసురు లుధ్ధతులు
నీవల తానొకడె వీరు డీశ్వర సమానుడు
సుదతిని గుహలోన డాచి సోదరుని కాపుంచి
సదమలబలు డగు రాముడు ముదమున విల్లెత్తె
అది విల్లనరాదు సుమా హరిచేతి చక్రమన
మదోధ్దతులు రాకాసులు మందలుగ కూలిరి
పరిఘను చేపట్టి వచ్చి పడిపోయె దూషణుడు
శిరములు మూడిట్టె తెగ ధరకొఱగె త్రిశిరుడు
ఖరుడు రామశరవహ్నికి కాలిబూడిదాయెను
హరిని ఋషిగణంబు లెల్ల నమితంబుగ పొగడెను
సీతాలక్ష్మణులు వచ్చి శ్రీరాముని కూడిరి
సీతమ్మరామయ్యను చేరి కౌగలించెను
సీతమ్మ రాకాసుల చేటు నరసి మురిసెను
సీతాలక్ష్మణయుతుడై శ్రీరాముడు మెరిసెను
చింతా కంతైనను చింతలేక వనములకు
చింతా కంతైనను చింతలేక వనములకు
సంతోషముగ రామచంద్రు డరిగెను
వనములైన గాని పట్టణములైన గాని
తనకు సమములే నని జనకుని యొడబరచి
జనకజ నీడగా సౌమిత్రి తోడుగా
వనము లందుండగను బయలుదేరెను
పినతల్లి యడిగెనా విధి యడిగించెనా
వనవాసదీక్ష గొనవలసె నీరాముడు
మునికోటి సురకోటి ముదము నొందగను
వనములకు జననుతుడు బయలు దేరెను
మహాసాధ్వి కైకను మాటాడ బనిచినట్టి
మహావిష్ణు సంకల్పము మనుజుల కేమెరుక
మహావిష్ణువే కద మన రామచంద్రుడు
విహరించు వనములను విరచు రావణుని
21, డిసెంబర్ 2018, శుక్రవారం
ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము
ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము
కొల్లాయె నీకీర్తి గోవిందా
మెల్లగా నీవు శివుని విల్లు పైకెత్తిన
ఫెళ్ళున విరిగె నది వీరేంద్రా
చల్లని తల్లి యా జనకజ సీతమ్మను
పెళ్లాడినావు లోకమెల్ల మెచ్చ
ఎల్లలోకములకు తల్లి సీతమ్మను
చెల్లరే రావణుడు చెఱబట్టగ
త్రుళ్ళిపడుచున్నట్టి దోషాచరుల కెల్ల
చెల్లాయె నాయువు శ్రీరామా
కల్లరి రాకాసిమూక కష్టపెట్ట నోర్చిన
యెల్లదేవతల నవ్వు పెల్లాయె
ఇల్లాలితో కూడి యేలికవై లోకముల
నెల్లకాలమును పాలించవయ్యా
20, డిసెంబర్ 2018, గురువారం
చిక్కులు తీర్చమంటే చిక్కులు పెట్టేవు
చిక్కులు తీర్చమంటే చిక్కులు పెట్టేవు
చక్కని స్వామి యిది సరసత కాదురా
దినదినగండ మని తేలుచున్న దీ బ్రతుకు
వెనుకముందు నీవుండ వీఱిడి నైతినే
దినమణికులతిలక తెలిసి రక్షించవు
నను కరుణించకున్న నాకేదిరా దిక్కు
ఏమేమి భవములలో నేమేమి పాపాల
నీ మానవుడు చేసె నిప్పటికవి పండె
పాములవలె పట్టి బాధించు చున్నవి
రామయ్య రక్షించ రా వింకేది దిక్కు
పలికెద పలికెదరా పలికెద నీకీర్తి
పలుకను పలుకనురా పరులను కీర్తించి
చిలుకుము చిలుకుమురా చిలుకుము నీకృప
హరిహరి హరి యెపుడు నాకు నీవే దిక్కు
19, డిసెంబర్ 2018, బుధవారం
ఎన్నడును నినుమరచి యున్న వాడను గాను
ఎన్నడును నినుమరచి యున్నవాడను గాను
ఎన్నడును నీమాటల కెదురాడ కున్నాను
అటువంటి నాపైన నలుక బూనితి వీవు
అటువంటి గాగోస నాలకించవు నీవు
అటువంటి నన్నేల నాదరించవు నీవు
ఎటువంటి తప్పు నీయెడల జేసితిని రామ
అటుమొన్న కలలోన కరుగుదెంచిన నీకు
చటుకున మ్రొక్కినది చప్పున మరచితివి
అటమటకాడనా యంత కోపము నీకు
కటకటా యిందుకేమి కారణమో రామయ్య
ధరాసుతావరా సదాదాసుడను రామయ్య
పరత్పరా నినుదక్క పరులనర్ధించనయ
మరల నవ్వుమొగముతో నావంకకు రావయ్య
కరుణదక్క అలుక నీకు సరిగా శోభించదయ
18, డిసెంబర్ 2018, మంగళవారం
కొత్తకొత్త దేవుళ్ళు - ఉత్తుత్తి దేవుళ్ళే
కొత్తకొత్త దేవుళ్ళు - ఉత్తుత్తి దేవుళ్ళే
బత్తి దండగ కాక వారు మోక్షమిచ్చేరా
మనుషుల్లో కొంతమంది మంచి తెలివైన వాళ్ళు
పనిగట్టుకొని సృష్టించిన దేవుళ్ళు వీరు
కనరారు వీరెవరు మనపురాణాలలోన
వినరయ్యా వీరివెంట జనువారి కధోగతే
దొరుకక దొరుకక దొరికినదీ నరజన్మము
సిరులు చింతకాయలని చిత్తవిభ్రమముతో
తిరిగేరో ఈదొంగ దేవుళ్ళ కొలుచుకొనుచు
సరాసరి యధోగతికి జారిపోయేరు మీరు
కామారియైన శివుడు కలడు కదా మరచిరా
రాముడై మీకు నారాయణుడున్నాడుకదా
ఏమనుచు నమ్మరాని యెవరెవరో దేవుళ్ళను
పామరత్వమున కొలచి పతితులై పోయేరో
16, డిసెంబర్ 2018, ఆదివారం
నీ మనసులో దూరి నేనేమి చెప్పేది
నీ మనసులో దూరి నేనేమి చెప్పేది
నామనసులో నున్న నీవే చూడవలె
నీవాడ నీవాడ నీవాడ నని నేను
వేవేల మార్లిదే విన్నవింతునా
నీవున్న మానసము నీది కాకున్నదా
భావమిచ్చి నేను నీ భక్తుడ గానా
కావవే కావవే కావవే యని నీకు
నే విన్నవింతునా నిత్యాశ్రితుడను
భావంబులోనుండి భగవంతుడా
నీ వెఱుగలేవో నిక్కంబుగను
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని ఇదే
యారాటపడెడు నా యంతరంగమున
చేరియున్నావు నీ చిత్తంబునకు నేను
వేరేమి వివరముగ విన్నవింతును
చాలించవయా పరీక్షలు
చాలించవయా పరీక్షల నింక రామచంద్ర
గాలికంటె పలుచన కావించుచుంటివే
ఇట్టిట్టి వనరానివే యెత్తించి జన్మములు
బిట్టుగ నేడ్పించు టేమి వింతపరీక్ష
పొట్టకేమి వీడు కట్టుపుట్టంబుల కేమి
కొట్టుమిట్టాడు చుండ కూర్చొని చూచేవు
ఎన్నెన్నో జన్మంబులే యెత్తిన పదంపడి
నిన్ను గూర్చి దయతోడ చిన్నచిన్నగ
నన్నెఱుగ నిచ్చి మరి నాచూపు యిహముపై
యున్నదేమో యని విడువ కొకటే పరీక్షలా
ఎప్పటికిని జీవుడనే యెంత పరీక్షించిన
తప్పులేని బ్రతుకు నాకు ధరనే లేదు
ఒప్పుగ నీదరి జేరగ చొప్పడ కున్నావే
యిప్పటితో పరీక్షల నీశ చాలించవే
కాసు లేనివాడు చేతకాని వాడే
కాసు లేనివాడు చేతకాని వాడే వాని
దోసమున్న లేకున్న దోషి వాడే
మొకము దాచుక చాల ముడుచుకొని యుండు
ఒకరూక వెచ్చించ రకరకములుగ నెంచు
చకితుడై యుండును సర్వవేళలయందు
ఒకనాడు రాముడే యుద్ధరించ వలె వీని
ఐనవారింటి పెండ్లి కయిన పోలేడు వాడు
మానక సంతాపించు లోన నంతే కాని
వాని కష్టమెఱుగు వాడొక్క రాముడే
తానొకడే తప్పుబట్ట దలచడు వింటే
పురాకృతమున జేసి పుట్ట కష్టము లెల్ల
వరుసతప్పులవాడు వాడగు ధర మీద
దరిజేర్చు రాముడే దయజూచు నందాక
సరిసరి తనలోన చచ్చిబ్రతుకుచు నుండు
15, డిసెంబర్ 2018, శనివారం
ఎక్కడికని పోదునో చక్కని వాడా
ఎక్కడికని పోదునో చక్కని వాడా యన్ని
దిక్కుల నీటెక్కెమే తేజరిల్లగ
నీవు కనిపించవని నీపైన కోపించి
యేవంకకు పోయి నే నించుక దాగుందును
నీవులేని చోటు లేనేలేదాయె
భావించి యచట దాగ వచ్చును నా నెంచగ
నీవు మరచినావని నిన్ను నే మరతునా
యే వంకకు పోయి నేనేమి చేయుచున్నను
నీవు నా కన్నులలో నిత్యముందువే
నీ వెలుగులలో కదా నేను విహరించునది
నీవు విశ్వపూజ్యుడవు నీవు నా రాముడవు
నీవు నారాయణుడవు నీవు నా సఖుడవు
యీ విశ్వము నీలో నించుకంతయె
కావున నీపై నలుక కలిగి యెందు దాగుదు
14, డిసెంబర్ 2018, శుక్రవారం
ఏమయా కరుణ రాదేమయా
ఏమయా కరుణ రాదేమయా
రామయా వేగ రావేమయా
ఎన్నాళ్ళు చేసితి మీ సంసారము
చిన్నమెత్తు సుఖమును లేదాయె
అన్ని విధముల సుఖము నిన్ను నమ్ముట యని
యెన్ని నీపాదములే తిన్నగ నమ్మితిమి
నీరూపమే వలచి నీనామమే తలచి
కారుణ్యమూర్తి వని లోనెంచి
ఘోరభవజలధి నుండి తీరమ్ము దాటించి
తీరెదవని నమ్మిన వారము మేమయ్యా
నీవొకడవే గాని నేల నెల్ల జీవులను
బ్రోవ నెవ్వరు లేరు పుణ్యాత్మ
కావవే యుగములే గడువనిచ్చుట యన్న
నే విధముగ నీయశ మినుమడింప జేయును
12, డిసెంబర్ 2018, బుధవారం
ఔరా యీ సంసార మంతరించు టెటులని
ఔరా యీ సంసార మంతరించు టెటులని
మీరు భావించితే శ్రీరాము డున్నాడు
ఏరీతి తనునౌకల ఘోరసంసారజలధి
పారముముట్టెదరయా శ్రీరామనౌక
దారిచూపుచు నిట్టె తీరంబు చూపించ
చేరి హరివాసమున చిరకాల ముందురు
తారకనామమును మీరు తలచునందాక
దారి తెలియలేరు సంసారాటవిని వీడ
శ్రీరామచంద్రుడే దారిచూపించగ
చేరి హరివాసమున చిరకాల ముందురు
దారుణసంసారసర్పధంష్ట్ర లందు చిక్కి
పారిపోలేరు రామభద్రుని వేడక
శౌరిదయాఖండితసంసారులై మీరు
చేరి హరివాసమున చిరకాల ముందురు
11, డిసెంబర్ 2018, మంగళవారం
ఎక్కడికని పోదువో
ఎక్కడికని పోదువో చక్కనివాడా నా
ప్రక్కనుండి నీవెట్లు పారిపోయేవు
దిక్కులన్నిట నిదే దేదీప్యమానమై
పిక్కటిల్లు నీ దివ్యవిభూతి దేవా
యెక్కడ దాగొందువో యింక నీవు చెప్పుమా
నిక్కముగా క్రొత్తతావు నీకొక్క టున్నదా
దక్కితి విక నాకు దంభంబు లేమిటికి
చక్కగా నీవు నా సఖుడవు కావే
యెక్కడ నీవుందువో యక్కడ నేనుండనా
నిక్కముగా నాలోన నిండి నీవుండవే
చక్కనయ్య శ్రీరామచంద్రుడా నిచ్చలు
నొక్కరీతి తలపోయుచుందును నిన్ను
అక్కజముగ నీవును నటుల నన్నెంచుచు
నొక్క నిముష మేని దాగ నుంకించుటున్నదే
అవధారు శ్రీరామ
అవధారు శ్రీరామ అఖిలలోక పరివ్యాప్త
ధవళకీర్తి నీ సేవ దక్కెను నాకు
భానుకులాలంకార దానవగణ సంహార
మానవేంద్ర భక్తపోష మరగితి నిన్ను
దాన నిదే నా దోషతతి యంతరించెను
జ్ఞానమయుడ వైన నీ కలిమి జేసి
సకలలోకేశ్వరా సకలజీవేశ్వరా
ప్రకటించుకొంటి సేవకునిగ నీకు
నికరమైన చిత్తశాంతి నేడబ్భె నీవే
యకళంకశాంతమూర్తి వగుట చేత
విమలవేదాంతసంవేద్యదివ్యమూర్తి నా
యమలినమగు ప్రేమ నీ కందింతును
భ్రమలిదిగో తొలగినవి బాగొప్ప నీపాద
కమలంబులను జేరు కతన నాకు
10, డిసెంబర్ 2018, సోమవారం
శ్రీరామచంద్ర నేరములే చేసితి నేమో
శ్రీరామచంద్ర నేరములే చేసితి నేమో నీవు
కారుణ్యము చూపవేమి కారణ మటు కాక
హరిభక్తశిఖామణుల కవమానము చేసితినో
హరినింద జేయువారి నంటుకొని తిరిగితినో
హరి నీవుకాక దైవమనుచు నొకని తలచితినో
మరి యేమి చేసినతినని మారుమొగము
పరద్రవ్యము లాశించు పాపమే చేసితినో
పరులను సేవించునట్టి పాపమే చేసితినో
పరమాత్మ నిన్నుమరచు పాపమే చేసితినో
మరి యేమి చేసినతినని మారుమొగము
పుడమిపై పలుమార్లు పుట్టుట నా నేరమా
బడలుచును నీనామము విడువమి నా నేరమా
యెడమైన నీ కొఱకై యేడ్చుట నా నేరమా
గడుసువాడ భవమింక కడతేర్చవు
8, డిసెంబర్ 2018, శనివారం
నిత్యసన్నిహితుడు వీడు
నిత్యసన్నిహితుడు వీడు నీకు నాకు నందరకు
అత్యంత ప్రేమమూర్తి యైన రామచంద్రుడు
సోగకన్నుల వాడు సొగసైన తనువు వాడు
యోగీశ్వరేశ్వరుడై యుండువాడు
భోగపరాయణులకు బుధ్ధి కందని వాడు
వాగీశప్రభృతులు ప్రస్తుతించెడు వాడు
పవమానసుతసేవ్యపావనాంఘ్రులవాడు
అవనిజాసమేతుడై యలరు వాడు
భవచక్రప్రవర్తకుడు పరమాత్ముడు వాడు
పవలు రేలు యోగులను పాలించు వాడు
తనపేరు తలచినంత దయను చూపించువాడు
మనసిచ్చికొలిచితే మన్నించు వాడు
తన భక్తులకు మోక్షధనము నందించువాడు
మనుజులార మ్రొక్కరే మహావిష్ణు వీతడు
నమ్మితి నది చాలదా
నమ్మితి నది చాలదా నన్నుధ్ధరించుటకు
నెమ్మదిగ నైన దయ నీకు రాకుండునా
ఇంకొకరి కాళ్ళ మీద నెన్నడును వ్రాలనే
ఇంకొకరి దయనా కేలనయ్యా
వంకలు పెట్టవని పచరించు సేవలలో
లెంకవాడనై యుందు లేవయ్య నిను చాల
ఎవరెవరో దేవతలట యేమేమో యిత్తురట
ఎవరెవరి దయలు నా కేలనయ్యా
ఇవల నవల నాకు నీ వీయలేని దున్నదా
తివిరి సతము సేవింతు దేవుడా నిను చాల
కాలాత్మక రామ కరుణాంబు రాశి న
న్నేలి మోక్షమిచ్చితే చాలునయ్యా
చాలు నింక భవజలధిని సంచరించుట మాను
వేళయైన దని నీవు పిలచెదవని చాల
రామరామ రామరామ
రామరామ రామరామ రామరామ రామరామ
రామ కోదండరామ రామ కళ్యాణ రామ
రామ బ్రహ్మాదిలోకపాలకార్చితా హరి
రామ దశరథమహారాజపుణ్యఫల హరి
రామ గాధేయయాగరక్షణాదక్ష హరి
రామ ఖండితామేయరాజధరచాప హరి
రామ లోకసన్నుత రామ సీతాసమేత
రామ భరతదత్త లోకారాధ్యనిజపాదుక
రామ ఖరదూషణాది రాక్షసాంతక హరి
రామ శరధిబంధన రామ రావణాంతక
రామ వినుతసుత్రామ రామ రాజలలామ
రామ సాకేతరామ రామ పట్టాభిరామ
రామ లోకాభిరామ రామ జానకీరామ
రామ పరంథామ శ్రీరామ వైకుంఠధామ
7, డిసెంబర్ 2018, శుక్రవారం
దేవుళ్ళున్నారు దేవత లున్నారు
దేవుళ్ళున్నారు దేవత లున్నారు
కావగ జీవుల కడువేడుకతో
చిన్నవైన పెద్దవైన జీవుల కోరికలు
మన్నించ దగునేని మానక తీర్చగ
నన్నిట నిదె సుముఖు లగుచు వారున్నారు
పన్నుగ ముక్తి భగవంతు డిచ్చును గాక
సుప్తచైతన్యులైన క్షుద్రు లటులుండగ
సప్తమోక్షభూమికా సంచారజీవుల
కాప్తులైన దేవుళ్ళ యాశీస్సుల వలన
ప్రాప్తించు చున్నది పరమాత్ముని దయ
తారకనామ మొకటి తలచుచుండు జీవుడు
కోరుచుండు మోక్షమే తీరుగ దయచేయ
కారుణ్యమూర్తియై కాచుకొని యున్నాడు
ధీరులార చేరుకొనుడు దేవదేవుని మీరు
3, డిసెంబర్ 2018, సోమవారం
కోరిక తీర్చని దేవుడి కిచ్చిన కొబ్బరిచిప్పలు దండుగ
కోరిక తీర్చని దేవుడి కిచ్చిన కొబ్బరిచిప్పలు దండుగ
కోరగ రానివి కోరెడు మూర్ఖుడు గుడికి పోవుట దండుగ
అడుగ దగినవే యడుగవలె నని యడిగెడు వానికి తెలియాలి
అడిగిన వన్నీ యమరించేందుకు యవసర మేమిటి దేవుడికి
బుడబుడ కోర్కెలు మనిషిబుధ్ధికి పుట్టుచు నుండును నిత్యమును
అడుగదగినవి యడుగదగనివి అంతరంగమున తెలియాలి
అడుగదగినది యొకటే నన్నది యనుభవమున నెఱుకయ్యేను
విడువదగునవి తదితరములను వివేక మొక్కటి కలిగేను
అడుగడుగున తన కంతవరకును యక్కరలుగ తోచిన వెల్ల
అడుగుచు ప్రతిగుడిలో దేవుడి నడుగుట తప్పని తెలిసేను
అడుగదగిన ఆ యొక్కటి యెవ్వని నడుగుట యుక్తమొ తెలియాలి
కడుపుణ్యులకే ఆ యొక్కడైన శ్రీకాంతుని సంగతి తెలిసేను
పుడమిని వాడే రామచంద్రుడను కడిది మగండని తెలిసేను
తడయక నాతక వేడిన మోక్షము తప్పక కలదని తెలిసేను
1, డిసెంబర్ 2018, శనివారం
ఒక్కొక్క కీర్తన
ఒక్కొక్క కీర్తన యొక మంత్రము
చక్కగ నీగొప్ప చాటెడు మంత్రము
జరిగిన తప్పులు సరిజేయు మంత్రము
మరిమరి హితవైన మాటల మంత్రము
నిరుపమానుని కీర్తి పలికెడి మంత్రము
సరిలేని మంత్రము చక్కని మంత్రము
భాగవతులెల్ల సంభావించు మంత్రము
వేగమె మనసును వెలిగించు మంత్రము
భోగము లం దాశ పోకార్చు మంత్రము
యోగభూమిక బుధ్ధి నునిచెడి మంత్రము
ఆరాటము లెల్ల నణచెడు మంత్రము
ధారాళమైన మంచిదనమున్న మంత్రము
కోరిచేగొన్న ముక్తి కూర్చెడు మంత్రము
శ్రీరాముని గూర్చి చెప్పెడి మంత్రము
29, నవంబర్ 2018, గురువారం
ఎవరు నమ్మిన
ఎవరు నమ్మిన నీ కేమాయె మరి
యెవరు నమ్మక నీ కేమాయె
నమ్మినచో యానందము కలుగుచు
నమ్మనిచో న్యూనత కలిగేనా
నమ్మిన నమ్మకున్న నరు లితరులు నిను
నమ్మి తోడై రామనాథుడు లేడా
కమ్మని పలుకుల కరిగి నమ్మేవారు
సొమ్ముల తళతళ చూచి నమ్మేవారు
నమ్మించబోని నిను నమ్మకుంటే నేమి
నమ్మెనుగా రామనాథుడు చాలదా
నమ్ముకున్నావు నీవు నారాయణునే
నమ్ముచున్నాడు నిన్ను నారాయణుడే
నమ్ము మిదిచాలు నరుల యూసేల నిక
తమ్మిచూలి సృష్టినుండి తప్పిపోదు వంతే
28, నవంబర్ 2018, బుధవారం
శ్రీరామనామస్మరణ మొకటి
శ్రీరామనామస్మరణ మొకటి చాలుననే జన్మము
ఔరా అసలైన జన్మ మదే చివరి జన్మము
పదుల కొలది జన్మము లవి పదవులలో నున్న వారి
పదముల కడ పడిగాపులు పడుచు సతము సేవించుచు
పదవులకై ఆత్రపడుచు పాటుపడుచు చెడినవాయె
పదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము
పదులకొలది జన్మములవి పెదవులపై ఆశలతో
మదవతుల కొంగుబట్టి వదలకుండ సేవించుచు
పెదవులిచ్చు స్వల్పసుఖము భావించుచు చెడినవాయె
పెదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము
పదులకొలదు జన్మములవి ముదనష్టపు సొమ్ములకై
పదవులపై పెదవులకై మొదవులకై వెదకులాట
వదలలేని యొక జీవికి తుదకు రాము డొకడు చాలు
తదితరముల వలదటన్నతలపుజేయు నొక జన్మము
25, నవంబర్ 2018, ఆదివారం
శ్రీరామచంద్ర కందములు - 4
కం. శ్రీరామచంద్ర! రుచిర
స్మేరా! దశరథ కుమార! శ్రిత మందారా!
ధీరా! కరుణా పారా
వారా! నను బ్రోవుమయ్య! పాపవిదారా *
కం. శ్రీరామచంద్ర మాయా
మారీచప్రాణహరణ స్మరకోటిసమా
కారా జలనిథిబంధన
ఘోరభవారణ్యదహన గుణవారినిధీ
కం. శ్రీరామచంద్ర సుజనా
ధారా సురవైరిగణవిదారా గుణకా
సారా సేవకజనమం
దారా సంసారవార్థితారకనామా
కం. శ్రీరామచంద్ర నీవై
ఘోరాటవులందు తిరుగ కోరక నీవై
కోరక రాకాసులతో
వైరము నవి కలిగె నెందు వలనం జెపుమా
కం. శ్రీరామచంద్ర ఘోరా
కారిణియా చుప్పనాక కదియగ నేలా
యా రావణు డడగుట కది
కారణ మగు టేల దైవఘటనము కాదా
కం. శ్రీరామచంద్ర కాలపు
తీరెఱిగెడు వారు కారు దేవతలైనన్
వారింపరాని కాలము
శ్రీరమణా నీకళావిశేషమె కాదా
కం. శ్రీరామచంద్ర శౌరివి
నీ రచనయె నరుడ వగుచు నేలకు దిగి దు
శ్చారిత్రుని పౌలస్త్యుని
ఘోరాజిని జంపు కథయు కువలయ నాథా
కం. శ్రీరామచంద్ర శాపము
తీరిన దటు కొంత జయుని దీనత బాపన్
నారాయణ నరుడవుగా
ధారుణి కరుదెంచినావు తామరసాక్షా
కం. శ్రీరామచంద్ర సుజనులు
ఘోరాపదలొంది విధము గొంకు వడినచో
వారల రక్షింప మహో
దారత నేరూపమైన దాల్చెదవు హరీ
* ఇది శ్రీవిష్ణునందన్ గారు అందించిన పద్యం.
23, నవంబర్ 2018, శుక్రవారం
రామకీర్తనా రమ్యకీర్తనా
రామకీర్తనా రమ్యకీర్తనా
ప్రేమభావనాయుక్తవిమలకీర్తనా
రామసంకల్పమున రవళించిన యూహతో
నామనోవీధిలో నాట్యమాడు పలుకులతో
కామితార్థప్రదవుగా కల్యాణ మూర్తివై
భూమికి దయచేసినట్టి పుణ్యకీర్తనా
ధన్యాత్ముల గుండెల తలుపుతట్టు కీర్తనా
పుణ్యాత్ముల నోళుల పులకరించు కీర్తనా
సన్యాసులు సంసారులు చాలమెచ్చు కీర్తనా
అన్యాయపరుల బుధ్ధి కందనట్టి కీర్తనా
పారమాత్మికమైన పలుకులొప్పు కీర్తనా
ధారాళమైన సుఖము దయచేయు కీర్తనా
తారకరాముని దివ్యతత్త్వ మొలుకు కీర్తనా
శ్రీరాముని యింటిదారి చెప్పునట్టి కీర్తనా
22, నవంబర్ 2018, గురువారం
రామ కల్యాణరామ
రామ కల్యాణరామ రామ కోదండరామ
రామరామ రామరామ రామరామ రామరామ
తామసించి నేను రామ తప్పుదారి నుండ రామ
కాముడనేవాడు రామ కష్టపెట్టుచుండె రామ
ప్రేమమీఱ నిన్ను రామ పిలువనీడు వాడు రామ
యేమిచేయగలను రామ యిట్లు నేను చెడితి రామ
మంచివాడ వనుచు రామ మనసిచ్చితి నీకు రామ
కొంచమైన కరుణ రామ కురిపించిన చాలు రామ
పంచమలము లింక రామ బాధించవు నన్ను రామ
వంచకుడగు కలిని రామ వంచి గెలువగలను రామ
అంతకుడు నన్ను రామ బంతులాడుచుండ రామ
వింతదేహములను రామ యెంతకాలమయ్య రామ
చింతలకు చిక్కి రామ చితుకుచుందునయ్య రామ
పంతగించి నీవు రామ పలుకకుంటివేమి రామ
21, నవంబర్ 2018, బుధవారం
ఓయీ శ్రీహరిని
ఓయీ శ్రీహరిని గూర్చి యొక్కమాట పలుకవా
మాయ నీదులాడుచు మైమరచి యుందువా
ఎన్ని జన్మలిటులెత్తి యేమి ప్రయోజనము నీకు
వెన్నవంటి మనసున్న వెన్నునే తలపక
మన్నులోన పొరలాడుట మతిమాలిన పనికదా
చిన్నగా శ్రీహరి యని చిత్తమందు పలుకరా
రామరామ యనువాడికి రాని సౌఖ్యమేమున్నది
కామదాసుడగువాడు గడియించున దేమున్నది
పామరుడై పడియుండిన బ్రతుకున ఫలమేమున్నది
స్వామినామ మికనైన చక్కగా పలుకరా
తప్పు లెన్నొ చేసితి నని తలచి సిగ్గుపడవల దిక
తప్పొప్పులు లేక నీకు తనువు లేల కలిగినవి
గొప్పవాడు రాముడు నీ తప్పులెంచబోడురా
ఇప్పుడే శ్రీరాముని హృదయ మందు తలచరా
18, నవంబర్ 2018, ఆదివారం
శ్రీరామచంద్ర కందములు - 3
కం. శ్రీరామచంద్ర లోకపు
తీ రెఱిగియు నప్పుడపుడు తెఱలును మది నే
నారూఢుడ గాకుండుట
కారణముగ దోచు నీవు కరుణించ గదే
కం. శ్రీరామచంద్ర తనువులు
నీరములం బుడగలట్టి నిర్మాణంబుల్
కారణకారణ నీదయ
కారణముగ రాగమణగు గాక తనువులన్
కం. శ్రీరామచంద్ర లోకో
ధ్ధారక నీ దయను కాక తరియింతు రొకో
ధారుణి నరులొక నాటికి
వేరెరుగను నీకు నన్ను విడువకు తండ్రీ
కం. శ్రీరామచంద్ర మును నే
నేరిచి నీ ధ్యానమెంత నిపుణతమీఱం
గూరిమితో జేసితినో
వేరెఱుగదు నేడు మనసు విజ్ఞానమయా
కం. శ్రీరామచంద్ర వైదే
హీరమణ సమస్తలోకహితకర శౌరీ
పారాయణ మొనరింతురు
నీ రమణీయచరితము మనీషులు పుడమిన్
కం. శ్రీరామచంద్ర జీవులు
నేరరు కలిమాయ లెఱిగి నిలచు విధములన్
కారుణ్యమూర్తి వీవే
వారల కొక దారి చూపవలయును తండ్రీ
కం. శ్రీరామచంద్ర పెద్దల
నూరక నిందించువార లుందురు ధరణిన్
వా రెఱుగరు తమకే యవి
నారాచము లగుచు తగులు నా నించుకయున్
కం. శ్రీరామచంద్ర సుజనులు
క్రూరాత్ముల వలన కొంత కుందువడినచో
వారికి కలుగు విచారము
వీరికి మున్ముందు కలుగు భీతి దలచియే
కం. శ్రీరామచంద్ర ప్రాజ్ఞులు
కోరెదరా యొకరి చెడుగు కువలయనాథా
కోరెదరందరి సేమము
క్రూరాత్ములకైన శుభము కోరెద రెపుడున్
శ్రీరామచంద్ర కందములు -2
కం. శ్రీరామచంద్ర శ్రీమ
న్నారాయణ పద్మనాభ నానాలోకా
ధార దశాననగర్వవి
దార భవవిషాపహార తారకనామా
కం. శ్రీరామచంద్ర రాఘవ
వీరేంద్రా సకలలోక వినుతచరిత్రా
భూరమణీకన్యావర
కారుణ్యముచూపి నన్ను కావవె తండ్రీ
కం, శ్రీరామచంద్ర నుతగుణ
భూరికృపాభరణ భక్తపోషణచణ సం
సారాపద్వారణ సీ
తారమణ సమస్తదైత్యదండన నిపుణా
కం. శ్రీరామచంద్ర నీకృప
ధారుణి ప్రజలందరకును దక్కిన నిధియై
చేరిన పాపుల పుణ్యుల
నారూఢిగ బ్రోచుచుండు నన్నివిధములన్
కం. శ్రీరామచంద్ర యెవ్వని
బారినిపడి లోకప్రజలు పరవశులగుచున్
దారులు మరచెదరో యా
మారుడు నను చెణక కుండ మనుపవె తండ్రీ
కం. శ్రీరామచంద్ర నాలో
నీ రూపం బనవరతము నిలచెడు నటులన్
నా రసనను నీ నామము
ధారాళం బగుచు నాడ దయచేయు మయా
కం. శ్రీరామచంద్ర యోగీం
ద్రారాధ్య మహానుభావ దైత్యవిదళనా
యీరేడు లోకములలో
శూరులలో నీకు సాటి శూరుడు కలడే
కం. శ్రీరామచంద్ర నీదగు
తారకనామంబు చాలు ధారుణి ప్రజ సం
సారము దాటగ నని లో
నారసి నిను చేరియుందు రఖిలసుజనులున్
కం. శ్రీరామచంద్ర ధర్మము
నీ రూపము దాల్చి వచ్చి నిలచినటులుగా
మారీచు డన్న మాటకు
భూరియశము కల్గి వాడు పొందెను ముక్తిన్
17, నవంబర్ 2018, శనివారం
శ్రీరామచంద్ర కందములు - 1
కం. శ్రీరామచంద్ర నీవే
చేరువగా బిలువవలయు జీవుని వాడే
తీరున తానై వెదకుచు
చేరగలాడయ్య నిన్ను శ్రితమందారా
కం. శ్రీరామచంద్ర లోకా
ధారా నీయందు భక్తి తాత్పర్యంబుల్
ధారాళంబగుచో సం
సారంబునతిక్రమించ జాలుదురు నరుల్
కం. శ్రీరామచంద్ర విద్యలు
నేరిచి ఫలమేమి లోన నిన్నెఱుగనిచో
నేరిచెనా నీ నామము
కూరిమితో విద్యలెల్ల కొలిచిన యటులే
కం. శ్రీరామచంద్ర జగమున
ధీరులు నిక్కముగ బల్కు తెరగెట్లన్నన్
శ్రీరామచంద్రపాదాం
భోరుహముల కన్య మేల పూజించ నగున్
కం. శ్రీరామచంద్ర యీ భవ
వారాన్నిధి దాటదలచు వారల కెపుడున్
తీరము చేర్చెడు నౌకగ
నారూఢిగ నీదు నామ మలరుచు నుండున్
కం. శ్రీరామచంద్ర నృపతుల
పేరెన్నికగన్నవాడ విజ్ఞానులు నీ
పేరెన్నిపలుకుచుండెద
రారాటంబులు నశించు ననుచున్ భక్తిన్
కం. శ్రీరామచంద్ర ఆర్తుల
యారాటము దీర్చువాడ వయ్యును దయతో
ధారుణి నిదె నీపాదాం
భోరుహగతుడైన నన్ను బ్రోవ వదేలా
కం. శ్రీరామచంద్ర యీ సం
సారము నిస్సారమన్న సంగతి మున్నే
కారుణ్యముతో తెలిపిన
శ్రీరమణా యేల నన్ను చేదుకొన వయా
కం. శ్రీరామచంద్ర నీకొఱ
కారాటము హెచ్చుచుండె నతిదుస్సహమై
భారంబైనది యీ తను
ధారణ మిటు లెన్నినాళ్ళు దయచూడవయా
13, నవంబర్ 2018, మంగళవారం
ఇక్కడ మే ముంటి మని
ఇక్కడ మే ముంటి మని యెల్లరి కెఱుక మరి
యెక్కడ నీ వుంటివో యెవ్వరి కెఱుక
భవవార్థిలోతెంతో ప్రాణుల కే మెఱుక యది
వివరముగ తెలిసిన నీ వివర మెవరి కెఱుక
కువలయమున మాకు నీవు కొంత చెప్ప కెఱుక
యెవర మెటు పోదుమో యెవ్వరి కెఱుక
దగ్గరనే యుంటివో దవ్వులనే యుంటివో
లగ్గుగ మా కెఱుక గాదు లక్షజన్మలకును
మ్రొగ్గగు కుందగు మోసకారి మాయవలన
యెగ్గులణగు విధమేదో యెవ్వరి కెఱుక
అప్పుడెపుడొ రాముడవై యవతరించి వందురే
యిప్పుడెచట దాగితివో యెవ్వరి కెఱుక
అప్పటివలె రాక్షసులీ యవని నిండిరి కనుక
చప్పున చనుదెంచవయ్య శతకోటిదండాలు
11, నవంబర్ 2018, ఆదివారం
ఎంత వ్యామోహమే
ఎంత వ్యామోహమే యేమే ఓ చిలుకా
వింత పంజరమునే విడువ లేవటే
లోకమంత నీదని నీ కెఱుకై.యుండగ
యే కొఱత లేకుండ యెగురుచుండగ
సౌకర్యము కాని పంజరమేల చొచ్చితివి
నీకన్న వెఱ్ఱి దీలోకాన కలదా
అన్నియు నీకైన నాటి హాయి చాలలేదటే
అన్నిట విహరించు నాటి హాయి చాలలేదటే
తిన్నగా ఒక పంజరాన దిగబడితివె చిలుకా
అన్నన్నా యెంత వెఱ్ఱి వైతివే చిలుకా
ఇప్పటికిని మించిపోయినది లేదు చిలుకా
అప్పడిదే రాముడై యరుదెంచెను చిలుకా
తప్పక దయజూచును దండమిడవె చిలుకా
చప్పున బయటపడవె చక్కని చిలుకా
వింత పంజరమునే విడువ లేవటే
లోకమంత నీదని నీ కెఱుకై.యుండగ
యే కొఱత లేకుండ యెగురుచుండగ
సౌకర్యము కాని పంజరమేల చొచ్చితివి
నీకన్న వెఱ్ఱి దీలోకాన కలదా
అన్నియు నీకైన నాటి హాయి చాలలేదటే
అన్నిట విహరించు నాటి హాయి చాలలేదటే
తిన్నగా ఒక పంజరాన దిగబడితివె చిలుకా
అన్నన్నా యెంత వెఱ్ఱి వైతివే చిలుకా
ఇప్పటికిని మించిపోయినది లేదు చిలుకా
అప్పడిదే రాముడై యరుదెంచెను చిలుకా
తప్పక దయజూచును దండమిడవె చిలుకా
చప్పున బయటపడవె చక్కని చిలుకా
10, నవంబర్ 2018, శనివారం
ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున
రామాయణ మన నేమి రాముని మార్గము
రాముడనే వాడు లోక రంజకుడై
భూమిసుతాసమేతుడై సౌమిత్రీయుక్తుడై
భూమి నెట్లు చరించెనా పుణ్యచరిత్రము
ఆరాముని కథ చక్కగ నందించెను వాల్మీకి
భారతజాతి యేమి ప్రపంచ మెల్ల
ఆరాధించు చున్నది అందమైన చరితమది
తారకలున్నంతవరకు ధరపైన నిలుచునది
ఉన్న ఒకే రామకథకు కొన్ని క్రొత్తరంగులద్ది
వన్నెలు చెడగొట్ట కోరు వారరుదెంచి
యెన్నియత్నాలు చేసి యెంత గోలపెట్టినా
చిన్నబోవునా యేమి శ్రీరాముని కీర్తి
ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
ఒకే ఒక రాముడే యున్నాడు కావున
నిన్న ప్రచురించబడిన ఒక బ్లాగుటపా అనేక రామాయణాలు - తెలుగు అనువాదం: పి.సత్యవతి అనేది ఈ రోజు (2018 నవంబరు10)న చూసాను.
MANY RAMAYANAS : The Diversity of a Narrative Tradition in South Asia (edited by Paula Richman, University of California Press, Bderkeley, Los Angeles, USA, 1991) అనే ఒక పుస్తకానికి పి. సత్యవతి గారి తెలుగు అనువాదం గురించి ఆ బ్లాగుటపా వివరిస్తున్నది.
అ టపా ఎత్తుగడలోనే ఎవరో సుగత శ్రీనివాసరాజు (పత్రికా రచయిత్రి) గారి ఉవాచ ఒకటి కనిపిస్తోంది. ''రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అని ఆవిడ ఆక్షేపణ వాక్యాలతో టపా మొదలు కావటంతో రెండు విషయాలు స్ఫుటం అవుతున్నాయి. మొదటిది ఆపుస్తకం అధునాతనమైన వామపక్షాది మేధావుల మనోవికాసజనితమైన రామద్వేషం అనే చిగురుకొమ్మగా ఉన్న సనాతనభారతీయసంస్కృతీవిద్వేషవృక్షం. రెండవది సదరు మేధావులకు విద్యార్థిలోకాన్ని గురిచేసుకొని తమతమవిద్వేషభావజాలవ్యాప్తికోసం అహరహం చేస్తున్నకృషి,
బ్లాగుటపా రచనాకారుడి పుస్తకపరిచయ కథనం "భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి" అన్న వాక్యంతో ప్రారంభం అవుతున్నది.
ఈ అభిప్రాయం శుధ్ధతప్పు. (నిజానికి శుధ్ధతప్పు అనేది ఎంత ప్రాచుర్యంలో ఉన్నా అది తప్పుడు సమాసమే అన్నది వేరే విషయం.)
ఒక వ్యక్తికి ఒక జీవితమే ఉంటుంది. అందులో మనం ఎన్ని పార్శ్వ్యాలను దర్శించినా సరే.
ఉన్నది ఒకే రాముడు.
ఆ వ్యక్తి గురించి పదిమంది పదిరకాలుగా ఆలోచించి పదోపాతికో పుస్తకాలు రచించితే ఆ పుస్తకాల లెక్క ఎంతో అంతమందిగా అతడు మారిపోతాడా?
ఆ పుస్తకాలను చదివి స్ఫూర్తిపొందినవాళ్ళు మరో బుట్టెడు పుస్తకాలనూ, ఆ పుస్తకాలను మెచ్చని లేదా మెచ్చలేని వాళ్ళు మరో తట్టెడు పుస్తకాలనూ అదే వ్యక్తి గురించి విరచించి జనం మీదకు వదిలితే ఆ మూలవ్యక్తి కాస్తా అంతమంది వ్యక్తులుగా మారిపోతాడా?
ఉన్నది మొదట ఒకే ఒక వ్యక్తి కదా?
జనంలో కొందరు తమతమ బుధ్ధిజనితవాదాల రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని ఆ వ్యక్తిని వివిధంగా ఉన్నాడని వ్యాఖ్యానిస్తే అతడు అనేక మూర్తులుగా ఎలా మారిపోతాడూ అని వివేకవంతులకు తప్పక అనిపిస్తుంది.
ఇక్కడ కొందరు పాఠకులు ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చును. అనేక రామకథలున్నాయీ అనటంలో ఉద్దేశం అనేక మంది రాముళ్ళున్నారూ అని చెప్పటం కాదూ, రామకథను అనేకులు అనేక విధాలుగా గ్రంథస్థం చేసారూ అని చెప్పటం మాత్రమే కావచ్చును కదా ఆవేశపడటం అవసరమా అని.
అవును నిజమే.
అలా అనుకోవటమూ న్యాయమే అనిపిస్తుంది.
కాని అటువంటి సందర్భంలో అనేక రామకథలు ఉన్నాయి అనకుండా భారతదేశ చరిత్రలో రామకథను అనేకమంది వివిధంగా గ్రంథస్తం చేసారు అని అనవచ్చును కదా స్పష్టంగా? కావాలనే అలా అనరు లెండి. వారికి కావలసినది రామకథకు ఉన్న ప్రామాణికతను దెబ్బతీయటం కోసం రామకథకు వాల్మీకికి ఉన్న అవినాభావసంబంధాన్ని నిరసించి ప్రక్కకు తోయటం.
ఆ సుగత గారి "రాముడిని ఆదర్శానికి ప్రతీకగా చేసి, జనరంజకంగా చేప్పే రామాయణాలనే హిందుత్వవాదులు ఇష్టపడతారు. పిల్లలని నిద్రపుచ్చడానికి చెప్పే కథలాగా, విన్నదంతా నమ్మేసి నిద్రపోయేలా చేసేటట్లువుండే రామాయణమే వారికి నచ్చుతుంది'' అన్న అక్షేపణలో రాముణ్ణి ఆదర్శానికి ప్రతీకగా చెప్పటం పైన -అంటే- అలా చెప్పిన వాల్మీకి రామాయణం పైన నిరసన ఎంత స్పష్టంగా ఉందో తెలియటం లేదా మనకి?
హిందూత్వవాదులు అంటూ సనాతనధర్మాన్ని ఎద్దేవా చేసే ఈ మేథావిగారి ఉవాచలో రాముణ్ణి ఈ భరతజాతి ఎంతో కాలంగా ఆదర్శపురుషుడిగా కొలవటం పైన ఉన్న ఆందోళన విస్పష్టంగా ఉన్నదా లేదా చెప్పండి.
ఇటువంటి (అంటే వాల్మీకంవంటి) రామాయణం నచ్చటం పట్ల ఈ వర్గం మేథావులకు అక్షేపణ ఉందే, మరి వారి దృష్టిలో ఎటువంటి రామాయణం జనానికి నచ్చదగినదీ అన్న ప్రశ్న వస్తున్నది కదా. దానికి సమాధానం ఏమిటీ?
నిజం చెప్పాలంటే ఈ మేథావుల దృష్టిలో రామాయణం ఎవరు ఎలాగు చెప్పినా మెచ్చదగినది కానేకాదు. వారి దృష్టిలో రాముడు ఒక అభూతకల్పన. ఉన్నాడని ఆ వాల్మీకి అతడి చరిత్రను ఒక ఆదర్శపురుషమూర్తి కథలాగా చెప్పటం హర్షణీయం కాదు. జనం ఆ వాల్మీకి రామాయణాన్ని ఆదరించకూడదు. వాల్మీకి గొప్ప యేమీ లేదు. ఇంకా బోలెడు మంది రామకథను వ్రాసారు. వాల్మీకితో సదరు రామాయణాలన్నీ కలేసి చూడాలి కాని వాల్మీకి చెప్పాడు కదా అని రాముడు గొప్పవాడూ - అతడి జీవితం మనకి ఆదర్శం వంటి దృష్టితో వాల్మీకి ఇచ్చిన రాముడిని గొప్పవాడిని చేయకూడదు. ఇలాంటిది ఈ మేథావుల దృక్పథం. ఈ అధునాతన దృక్పథానికి ఫలంగా జాతికి వీరు అందించే మహత్తర విజ్ఞానఫలం ఏమిటంటే జాతిదృష్టిలో రాముడి పట్ల ఆరాధనాభావం నశించి దానిస్థానంలో రాముడిపై ద్వేషం పెరిగి నవచైతన్యంతో యావజ్జాతీ ధర్మభ్రష్టులు కావటం.
ఏదైనా కొత్తవిషయాన్ని జనం బుర్రలోనికి చక్కగా ఎక్కించాలంటే, పైగా అది తరతరాలకు నిలచిపోయే విధంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది చిన్నపిల్లల తలల్లో దట్టించటం.
ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి తాతలూ బామ్మలనుండీ ఇంకా ఇతర కుటుంబ పెద్దలనుండీ రామకథ పిల్లలకు అందటం సహజం ఐపోయింది.
శ్రీకృష్ణకర్ణామృతం అని లీలాశుకుడి ప్రసిధ్ధ గంథం ఒకటి ఉంది. అందులోని ఒక శ్లోకం చూడండి.
రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
కృష్ణేనేతి పురాతనీం నిజకథామాకర్ణ్య మాత్రేరితాం
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:
యశోద చిన్ని కృష్ణుడికి రామకథ చెబుతున్నది.
ఆమె 'రాముడని ఒకడున్నాడు' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడి భార్య పేరు సీత' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'ఆ రాముడూ అతని భార్యా కూడా పెద్దల ఆజ్ఞమేరకు పంచవటి అనే చోట ఉంటున్నారు' అనగానే కృష్ణుడు 'ఊఁ' అన్నాడు.
ఆమె 'అక్కడ ఆ పంచవటిలో ఆ సీతను రావణు డనే వాడు ఎత్తుకొని పోయాడు' అన్నది.
ఎప్పుడైతే 'సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు' అని యశోద అన్నదో అ తక్షణం కునికిపాట్లతో ఊఁ ఊఁ అంటున్న చిన్ని కృష్ణుడు రామావతారంలోని వెళ్ళిపోయాడు. వెంటనే కంగారుగా 'లక్ష్మణా ఏది నా విల్లేది నావిల్లేది' అని బొబ్బలు పెట్టాడు.
అలా రావణప్రసక్తి రాగానే వెంటనే రామావతారంలోనికి దుమికిన బాలకృష్ణుడు రక్షించుగాక అని కవి అంటున్నాడు. శ్రీరామకర్ణామృతం అని శంకరభగవత్పాదుల గంథం ఒకటి ఉంది. అందులోనూ ఈ శ్లోకం కనిపిస్తోంది.
ఇలా తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా రాముడి ఆదర్శవ్యక్తిత్త్వం ఈ భారత జాతికి స్ఫూర్తినిస్తున్నది.
ఈ స్ఫూర్తిని దెబ్బకొట్టాలంటే రామాయణం యొక్క గొప్పయేమీ లేదని చెప్పాలి. రాముడు హీనచరిత్రుడు అని కూడా వీలైనంతగా చెప్పాలి. అదీ పిల్లలకి చెప్పాలి.
ఇంతకంటే ఘోరం ఉంటుందా?
అసలు ఇన్ని రామాయణాలెక్కడివి? వాల్మీకి చెప్పక ముందు రామకథ ఎక్కడ? వాల్మీకి చెప్పిన రాముడు ఎవరు?
ఆ రాముడు ఒక ఆదర్శవ్యక్తి సరే.
ఆ రాముడు కల్పిత పాత్ర ఐతే ఆపాత్రను సృజించిన ఘనతను వాల్మీకినుండి ఎందుకు ఎవరు ఎలా గుంజుకుంటారు? అలా గుంజుకోవటం న్యాయం ఎలా అవుతుంది? వాల్మీకి తరువాత ఆయన సృజించిన పాత్రకు ఇతరులు ఎలా హక్కుదారులు అవుతారండీ?
ఆ రాముడు చారిత్రక వ్యక్తి ఐతే, ఆయన కథను మొట్టమొదట గ్రంథస్థం చేసి జాతికి అందించినది వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి తరువాత తండోపతండాలుగా వచ్చిన పునఃకథనాలు వాల్మీకి నుండి భిన్నంగా ఉంటే తప్పు అవుతుంది కాని వాల్మీకి చెప్పనిదేదో వాళ్ళు చెప్పినట్లు మనం ఎలా తీర్మానిస్తాం? అది కాక వాల్మీకికి కొన్ని వందల వేల సంవత్సరాల తరువాత వచ్చిన వాళ్ళ రచనలలో వాల్మీకికిమించి ప్రామాణిక కథనం ఎలా వస్తుంది? అలా వస్తున్నది అని చెప్పటం అమానుషం కాదా?
ఇప్పుడు అనేకరామాయణాల ఆధారంతో రామకథను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం అనే వ్యవహారం నేటి చరిత్రకారులూ మేధావులూ ఎలా చేస్తారూ? వందలకొద్దీ ఉన్న పిల్లరామకథలన్నీ కలేసి వాల్మీకి రాముడికి కొత్తరూపురేఖలు దిద్దటం అనే నవీనశాస్త్రీయకర్మకలాపం చేస్తారా? అసలు రాముడే లేడని సిధ్ధాంతం చేస్తారా?
రాముడి కథ తెలియాలంటే వాల్మీకి అధారం.
ఇతరులు వేరేగా అందంగానో వికారంగానో కొత్తకొత్త కథలు చెబితే అవి రామకథలు కాలేవు. అవి ప్రామాణికాలు కాలేవు.
రాముణ్ణి భారతజాతికి దూరం చేయాలని కుహనామేధావులు పన్నుతున్న కుట్రల్ని తిప్పికొట్టండి!
7, నవంబర్ 2018, బుధవారం
శ్రీమన్నామ ప్రోచ్య
శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యాం
కేనప్రాప్నుర్వాంఛితం పాపినోౕ౽పి
హానః పూర్వం వాక్ప్రవృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్
భావం. నారాయణ నామం శ్రీమంతమైనది. అంటే సమస్త సంపదలతో ప్రకాశించేది, అంటే ఆనామమే సమస్తమైన సంపదయునూ అని జీవులు భావించవలసినది. అందుచేత ఎంత పాపాత్ముడైనా సరే ఆ నారాయణ నామాన్ని స్మరిస్తే సమస్తమైన శుభాలూ కలుగుతాయి. అయ్యో నేను పూర్వజన్మలలో అలా నారాయణ నామగానం చేయలేదు కాబోలు. అందుకే నాకు గర్బవాసం వంటి దుఃఖాలు కలిగాయి
అనువాదం.
తే. పాపి నారాయణా యన్న వాంఛితంబు
పొందు నందురు నేనేల పొంద ననగ
మునుపు జిహ్వ నారాయణా యనమి నేడు
గర్భవాసాది దుఃఖముల్ కనుచు నుంటి
5, నవంబర్ 2018, సోమవారం
ఒకరి కొకరము
ఒకరి కొకర మండగా నుండవలయును
సకలేశ్వర నీవు నాకు చక్కని యండవు
తోడుగా నన్ను నీవు తొలుత కల్పించుకొని
యాడుకొనుట మొదలిడితి వల్లనాడు
వేడుకగా నీకొఱకై వివిధరూపములతో
యాడుచుంటి నొంటివాడ వగుదువే నీవు
ఆదమరచితే నే నలసితే సొలసితే
వేదనలకులొంగి నిర్విణ్ణుడనైన
ఆదుకొను వాడవై చేదుకొనువాడవై
ఓదయామయ నన్నొంటిగా విడువవు
ఆటలో గడువరాని యడ్డంకు లెదురైన
ఓటమితథ్యమై యుండువేళైన
వాటముగ స్వయముగ వచ్చియాడెదవు
నాటి రామాకృతి నాకొఱ కెత్తినదే
2, నవంబర్ 2018, శుక్రవారం
ఇంతకంటె భాగ్యము
ఇంతకంటె భాగ్య మిం కేమున్నది
చింతదీర్చు మంత్రమే చేజిక్కినది
ఎన్నిజన్మలెత్తి చేసుకున్న పుణ్యఫలమో
ఇన్నాళ్ళకు నాబుధ్ధి కిది చిక్కినది
ఎన్ని శ్రీరాముడే నాకిచ్చిను నా నెంచు
కొన్నాను దీనిని కూర్మిభజింతును
సౌమిత్రి దీనిని సాధించుకొనె తొలుత
సామీరి కిది యబ్బె చక్కగాను పిదప
ఆ మీదను విభీషణాదులందుకొనిరిది
సామాన్యమా మోక్షసాధనామంత్రమిది
ఏను యోగభ్రష్టుడనో యేమో గతజన్మమున
ఏను వాని కిష్ట్టుడనో యేమో యీజన్మమున
ధ్యానించ నాకు మోక్షధనమిచ్చు మంత్రము
శ్రీనాధుడిచ్చె నిదిగో చేగొంటి నిపుడు నేను
చెప్పరాని చింతల జీవుడా
చెప్పరాని చింతల జీవుడా రా
మప్పనే తలచ వేమందురా
పుట్టిన దాదిగా పొంచియున్న కాలుడటు
పుట్టెడుపాపాల బుగ్గైన బ్రతుకిటు
గట్టిగా నొక పుణ్యకార్యమే లేదాయె
పట్టవేలరా రామపాద మిప్పటికిని
ఉత్తుత్తివేదాంత మూడబొడచునది యేమి
బత్తిలేని పూజలకు ఫలితమేమి
కొత్తకొత్తమాటల గురువులిచ్చున దేమి
చిత్తముంచవేలరా శ్రీరామునిపైని
కల్లలాడియాడి తుదకు కొల్లపోవుట
చిల్లరవేషాలు వేసి చిన్నబోవుట
ఎల్లవేళ లందు నీ కిదియేగా జీవితము
చెల్లుసేసి దానికింక శ్రీరాము నెంచవేల
మొదటికి మోసమాయి
మొదటికి మోసమాయి ముచ్చటపడి భూమికి
నిదిగో దిగివచ్చిన దిందింతగ చేటాయె
తొట్టతొలి తప్పిదము దూరపుకొండల
నుట్టిపడు సోయగాల నుట్టిట్టి వనక
గట్టిగ నమ్మి నిన్ను కాదని పోవుట
మట్టిబొమ్మగా మార మంచిశాస్తి జరిగె
రెండవ తప్పిదము రీతి దప్పి నాలోన
నుండి నీ తలపులనే యెండించి నాడ
నిండారు కరుణతో నీవెంత పిలచిన
బండగుండె విననందుకు భలేశాస్త్రి జరిగె
ఇన్నాళ్ళకు తెలిసివచ్చి యెంత మొత్తుకొన్నను
నన్నుపట్టుకొన్న మాయ చిన్నది కాదాయె
అన్నా రామన్న ఆపన్నుడను దయచూపి
నన్ను విడిపించుమన్న నిన్నింక విడువను
ఎట్టివా డనక
ఎట్టివా డనక చేపట్టినాడే వాడు
గట్టియండనే యిచ్చి కాపాడుచున్నాడు
అతనునకు తండ్రియైన యచ్యుతుడు వాడు
అతనునకు బంటైన యర్భకుడు వీడు
పతితపావనుడు వాడు పతితు డేమొ వీడు
అతికినట్లు గొప్పబంధ మమరినది చూడు
కలికి చూపులవాడు కమలాక్షుడు వాడు
కలికిపైన చూపులుండు కాపురుషుడు వీడు
పలుకు సత్యము వాడు పలుకు నసత్యము వీడు
తెలియగ మంచి పొత్తే కలిసినది చూడు
ధర్మావతారుడు వాడు దశరథ రాముడు
ధర్మమెఱుగలేని వట్టి తామసికుడు వీడు
కర్మరహితుడు వాడు కర్మబధ్ధుడు వీడు
నిర్మలమగు స్నేహమిదే నిలచినది చూడు
1, నవంబర్ 2018, గురువారం
అందమైన విందు
అందమైన విందు గోవిందనామమే
యందరి నోళులకు నందరి చిత్తంబులకు
సుందరీమణులచూడ్కు లందాల విందులు
చెందిన నాడున్న తృప్తి చెడిననాడు లేదు
బందుగులందరును పొగడి పలుమాటలవిందుల
నందించెడు తృప్తి వారలిగినపుడు లేదు
ఇందందని తిరిగితిరిగి యేవేవో రుచిచూచి
యిందిరియములను మేపి యెన్నటికిని
కందువ కెనయైన తృప్తి కలుగమిని గమనించి
సందేహము కలిగి నట్టి సర్వజనావళికిని
ఇందిరారమమణుండే యందాలరాముడై
యందరికి పంచియిచ్చె నానందసంధాయక
మందమైన నామము కడు పసందైన నామమది
అందుకొన్న ముక్తిఫలము నందించెడు నామమది
హరివీరుడే
హరివీరుడే కలికి సరివీరుడై మెఱయు
హరినామములు వాని కస్త్రశస్త్రంబులు
వాడేమొ తామసికము పడవేయ తనమీద
వేడుక సత్త్వస్థనామము పెద్దబాణమై యణచు
వాడేమో మహామోహ బాణరాజమెత్తి వేయ
వీడు కామహానామము విరుగుడుగా వేయును
ఎగసి వాడు నిజకలిమాయ నెత్తి మొత్త జూచు
నగుచు వీడు మహామాయానామాస్త్రమును విడచు
తగుదు నని భోగాసక్తి దారుణాస్త్రమేయు నతడు
తెగవేయ యోగీశనామ దివ్యాస్త్ర మేయు వీడు
కలి చేతనున్న సకల కలుషశక్తు లస్త్రములు
తిలకించ విష్ణునామదివ్యాస్త్రముల చెడును
పొలసి వాడు వేసెనా విమూఢతాస్త్రమే యదియు
మలగు రామమహామంత్రమాహాత్మ్యమున జేసి
నాచేయి వదలక
నాచేయి వదలక నడిపించవయ్యా
నాచేయునవి నీకై చేయునవి కాన
నీ పనుపున నేను నేలకు దిగితిని
నీ పని చేయుచు నిలచితిని
కాపాడు నీవుండ కష్టమే మున్నదని
తాపము లెన్నైన తాళుకొనుచుంటిని
తప్పొప్పులెంచు వారు తగులుకొని నన్ను
నొప్పింతురు నిన్ను నొప్పింతురు
గొప్పకష్టములు వారు కూర్చెడు వేళలను
చప్పున చనుదెంచి సరసనే నిలబడి
యేమరక నిను గూర్చి యెల్లపుడు పాడుటే
రామచంద్ర పని నాకు భూమిపైనను
నీమమొప్ప నీపనిని నే చేయు వేళలను
నా మార్గమున కడ్డుగా మాయ రాకుండ
31, అక్టోబర్ 2018, బుధవారం
బరువైన పదితలల
బరువైన పదితలల వలన నేమిలాభము
యిరువది చేతులున్న నేమిలాభము
పెడదారి తలపులతో చెడిపోయిన తలల
కడుగడుగున తప్పులందు ప్రీతిగలిగె
నుడువరాని పనులుచేసి యూడిపడె నవియెల్ల
బెడిదముగ రామబాణవితతి చేత
యిరువదిచేతులతో పొరిపొరి చెలరేగి
పరసతులను చెఱబట్ట వాంఛగలిగె
సరి కాని పనులు చేసి జారిపడె నవి యెల్ల
హరి విడచిన బాణముల వరుసచేత
హరిబుధ్ధి లేక వట్టి యట్టలే తలలని
తిరముపరచ రావణుకథ ధరను కలిగె
హరిపూజనంబున కమరుటకే చేతులని
తిరముపరచ రావణుకథ ధరను కలిగె
నేనని నీవని
నేనని నీవని నిత్యవ్యవహారము
కాని సిధ్ధాంతమున కానరాదే
మరియొక తత్త్వమే మహితమై కనరాక
సరిసరి పరమవిస్పష్టంబుగను
నిరుపమానమై నెలకొన్నదొక్కటే
పరమతత్త్వమన్నది వరసిధ్ధాంతము
ఉదితమై వేరొక్కటున్నప్పుడే కదా
అది యిది యని మాటలాడంగను
విదితంబుగానింక బేధంబు లెక్కడ
అదే పరబ్రహ్మ మన్నది సిధ్ధాంతము
రాముడనగ లోకాభిరామమై బ్రహ్మము
నామరూపములతో నడిచివచ్చినది
రామునియందు నిజనామరూపంబులను
ప్రేమతో విడచుటే విహితసిధ్ధాంతము
పొమ్మనక కర్మచయము
పొమ్మనక కర్మచయము రమ్మనక ముక్తికాంత
యిమ్మహి నందందు తిరుగు నీజీవుడు
ప్రతితిత్తిని జొరబారు పర్యంతము బుధ్ధిగలిగి
యతిశయించ గోరువా డగును జీవుడు
అతనుదొట్టి దుర్మార్గుల కతిసులభంబుగ జిక్కి
అతిశయించుచుండుబో నాజీవుని కర్మములు
రాముడొక్క డున్నాడని ప్రేమతోడ గొలిచినచో
పామరత్వ ముడిగి కర్మబంధమూడునే
ఆ ముక్తికాంత పిలుచు నన్నమాట తెలియుసరికి
ఏమయ్యా యుగము లెన్నెన్నో గడచిపోవును
ఏది మంచిదారి యన్న దించుకవిచారము
మేదినిపై జీవునిలో మెదలునొక్కట
వేదనలు వాదనలు విరిగి కర్మబంధముల
మీదుకట్టి జీవు డపుడు మేలుకాంచు నిశ్చయము
హరికీర్తనము చేయునప్పుడు
హరికీర్తనము చేయునప్పు డీ మనసెల్ల
హరిమయముగా నుండు టావశ్యకంబు
హరికన్యముల నెంచి యందందు నిరతము
చరియించు మనసెట్లు హరిని కీర్తించు
హరినిగూర్చి పలుకులాడెడు వేళలో
హరి నిండవలెను ప్రత్యక్షరం బందునను
హరిని దరిసించక నంతరంగంబున
హరివిభూతుల నెట్లు నరుడు కీర్తించు
విరజిమ్మవలె సర్వవిధముల శ్రీహరి
పరమాత్ముని దివ్య ప్రభలన్ని మాటలును
తారకమంత్ర ముత్తమసాధనము సుండి
మారజనకుని పైన మరులుకల్పించ
ఆరూఢిగ నపుడు మీరేది పలికినను
చేరును హరిచెవికి శ్రేయంబు గలుగును
చింతలన్నియు ద్రోసి
చింతలన్నియు ద్రోసి శివుని సన్నిధి చేరి
సుంతసమయము గడుప జూడరే మీరు
సోమవారమునాడు సోముని దేవళము
ప్రేమతో దరిసించి విభునిసేవించి
కామారికథలును నామజపంబులును
మీ మనసుతీరగ మిగుల భావించరే
విధివిష్ణుశక్రసేవితమైన తత్త్వమును
బుధులార గుమిగూడి పొగడగా త్రిజగ
దధినాథుడైన హరు డానందముగ మీకు
మధురమౌ దీవనలు మరిమరి కురియగ
రామచంద్రార్చితుని రామభక్తులు మీరు
నీమంబుతో చేరి నిలిచిసేవించి
కామాది సర్వవికారంబులను గెల్చి
మోమాటమే లేక ముక్తినిధి గొనరే
29, అక్టోబర్ 2018, సోమవారం
నాడు శ్రీరాముడైన
నాడు శ్రీరాముడైన నేడు శ్రీకృష్ణుడైన
వేడుకగా రెండును హరి వేషము లేను
చేతిలో విల్లుంటే శ్రీరాముడు వాని
చేతిలో చక్రముంటే శ్రీకృష్ణుడు
చేతిలో నేమున్న భీతిగొలుపు రాకాసుల
చేతలణచినట్టి వీడు శ్రీహరి యేను
ఒక్కతే చుక్క తనప్రక్క నున్న రాముడు
మిక్కిలిగ చుక్కలు గల చక్కనయ్య కృష్ణుడు
ఒక్కతైన పెక్కురైన చుక్కలటు లుండనిండు
ఎక్కటిజోదైన వీడేను శ్రీహరి
హరేరామ హరేరామ యనువారు గొల్చునది
హరేకృష్ణ హరేకృష్ణ యనువారు గొల్చునది
నిరంతరము మదిలోన నించున దింకెవ్వని
పరాత్పరుండైన శ్రీహరినే ఇలను
27, అక్టోబర్ 2018, శనివారం
భాగవతుల కివే
భాగవతుల కివే నా వందనంబులు మహా
భాగులార మీ కివే వందనంబులు
భాగులార మీ కివే వందనంబులు
ఖలులను లెక్కించక గాసిపడి వగవక
జలజేక్షణుడైన రామచంద్రునే మనమున
తలచుచు ననిశంబును తన్మయత్వంబున
నిలను ధన్యము చేయు నీశ్వరార్చకులకు
కలిని లెక్కించక నిలచి శ్రీరాముని
తలచువారై కలి తలదన్ను వారై
పలుకుపలుకున రామభద్రుని కీర్తించి
తెలియరాని మహిమతో తేజరిల్లు వారికి
కాలుని లెక్కించక నీలమేఘశ్యాముని
వాలాయముగ నమ్మి వర్తించువారలై
చాలును సంసారమని నేల కింక రామని
యేలికయగు రామచంద్రు నింటికేగు వారికి
రామనామము మాకు
రామనామము మాకు రసమయజాత్యన్నము
రామనామేతరముల మేము కోరము
రామనామ మున్నది రాజసాన్నము లేల
రామనామ మున్నది తామసాన్నము లేల
సామాన్యుల రసనలపై సరసమాడు రుచులకు
రామభక్తు లేమాత్రము భ్రమలు చెందరు
భూమిని కడుపుణ్యులకే పుట్టునింత గొప్పరుచి
రామనామామృతమహారసముపై నింతరుచి
రామదాసులు కాని పామరులగు మానవుల
కేమాత్రము తెలియరాక నిల వెలసిన గొప్పరుచి
రామనామామృతమును ప్రేమతో గెలుచుకొని
భూమిపైన కూర్చుని బొక్కుచున్నారము
మేము రామేతరములు మితముగా సహింతుము
రామభక్తులకు రుచి రామనామాన్నమే
26, అక్టోబర్ 2018, శుక్రవారం
నీవు నా కిచ్చునదే
నీవు నాకిచ్చునదే నిజమైన ధనము
నీవాడను నాకితరము నిష్ప్రయోజనము
తామసించి తిరుగుచు ధరను పెద్దకాలము
ఏమేమో పోగిడిచు నెంతో పేరాశను
స్వామి నేను గడపితిని చాల జన్మంబులు
భూమిని గడియించినవి భూమిపాలాయెను
కలలవంటి బ్రతుకులలో గడియించు ధనములు
తెలియగ నెల్ల నద్దముల లోని వస్తువులు
తెలివిలేక వానికై తెల్లవారె జన్మములు
విలువలేని వాని వెంట వెఱ్ఱిపరుగులాయెను
ఈ నాటికి రామచంద్రు డిచ్చినదే ధనమని
నే నెఱిగికొంటి నింక నీవాడ నైతిని
జ్ఞానలబ్ధి కలిగి నాకు సత్యమెఱుగ నైనది
మానక నీవిచ్చు మోక్షమహాధనమె ధనము
రామనామ మెఱుగడా
రామనామ మెఱుగడా పామరుడే
పామరుడా వాడు పతనోన్ముఖుడే
స్వేదజోధ్భిజాండజముల జీవించి వాడు
మేదినిపై క్షీరదముల మేనులలో గడపి
వేదనలు పడిపడి నరవేషమును పొంది
వేదవేద్యు నెఱిగికొనక వెఱ్ఱికాడా
కామాది రిపుషట్కము కడుహితులై తోచ
తామసించి తిరుగుచు తత్త్వార్థ మెఱుగక
ఈ మానవజన్మమే యెంతో దుర్లభమని
ఏమాఱి యున్న వెఱ్ఱియే యగునుగా
ఏవేవో మతములు నెవరెవరో దేవుళ్ళు
కావరమున హరి గూర్చి కారుకూతలై
తీవరమున కలిమాయల త్రోవలలో నడచి
వేవిధముల నుండెనా వెఱ్ఱికాడా
తప్పతాలు జోలికి
తప్పతాలు జోలికి మీ రెప్పటికిని బోక
తప్పక సన్మార్గమెఱిగి సంచరించుడు
మెచ్చకున్నచో నొరులు మీదుమిక్కిలి లేదు
మెచ్చు వారు మీ విలువ హెచ్చు చేయరు
మెచ్చి రామచంద్రమూర్తి యిచ్చు విలువ గట్టి కాని
త్రచ్చగ నితరంబులెల్ల తప్ప తాలు
ధనధనేతరములకు తరచు విలువ లేదు
జనులార వానివలన స్వర్గము లేదు
ఇనకులేశ్వరుని కరుణ యింతింతనరాని గొప్ప
ధనమగు నితరంబు లెల్ల తప్పతాలు
ఘోరమంత్రజపములు నోరునొవ్వ చేసినా
తీరుగ నపవర్గమును చేర లేరు
శ్రీరాముని నామమే జీవులకు సంసార
తారక మితరంబు లెల్ల తప్పతాలు
పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి
పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి
తుట్టతుదకు నిను పొందితిని
పురుషోత్తమ నీవు పొరపాట్లు చేయవు
నరునకు కుదురునే పొరబడక
పరికింప మాయ కీవు బయటనుందువు నేను
మరి మాయాంబుధిమగ్నఝషమును
హరబ్రహ్మ లంతవారే మరి నీమాయ నెఱుగ
తరము కాదందు రింక తడబడక
పొరపాట్లు చేయకుండ నరునకు సాధ్యమే
నిరుపమానమైన దయను నీవు జూపక
రాముడవై నీవు నాకు తారకమంత్రమిచ్చి
దారిచూపినావు నేను తరియింప
సారహీనమైన సంసారమందిఛ్ఛ వదలి
చేరుకొంటి నేడు నీదు శ్రీచరణములు
ఒప్పని సంగతులు
ఒప్పని సంగతు లిప్పుడెండుకు నీ
చెప్పుచేతల నుండు జీవుల తప్పేమి
మమ్ము కల్పించుమని మరిమరి కోరిరా
మమ్మేల చేసితివో బమ్మ యంటిరా
బమ్మకే యబ్బవైన భగవంతుడా నీ
సొమ్ము లివి యిక నీ చిత్తమ్మోహో
మాయలో ముంచుమని మరిమరి కోరిరా
మాయలేల చాలునింక మానమంటిరా
మాయలమారివైన మాధవుడా నీ
చేయందించ రావీ జీవుల కోహో
పామరత్వమున మమ్ము పడవేయ మంటిరా
తామసత్వము బాపదగు నంటిరా
నామమిచ్చి ప్రోచిన రాముడా మా
పామరత్వముపైన బాణమేయ వోహో
అన్నిటి కంటెను గొప్ప
అన్నిటి కంటెను గొప్ప హరికీర్తనమే
తిన్నగ సుఖమిచ్చు చున్న దీ జీవునకు
గొప్పవంశ మందు బుట్టు టొప్పిదమగు కాక
గొప్పగొప్ప చదువుల గౌరవమగు కాక
గొప్ప ధనవంతు డగుట గొప్పచేయు కాక
అప్పడా శాశ్వతములై యవి యమరేనా
గొప్ప బుధ్ధి భార్య యును గొప్ప బుధ్ధి కొడుకులు
గొప్ప ప్రభుతయును చాల గొప్పకీర్తి యనగ
తప్పకుండ కొండలంత గొప్పసుఖములే కాని
అప్పడా శాశ్వతములై యవి యమరేనా
గొప్పదనము కొంత తాను కోరి గడియించినది
గొప్పదనము కాలముచే కొంత కూడి వచ్చినది
గొప్పదనము లెట్టి వైన కొంగుబంగారములా
అప్పడా శాశ్వతములై యవి యమరేనా
పరమాత్మ రామచంద్ర పరగ నీ నామామృతము
నిరుపమానమైన సుఖము నించుచుండు కాని
నరున కెట్టి గొప్పదనము నాటించు సుఖమైన
పరమాల్ప మగునే కాక పరమున కౌనా
25, అక్టోబర్ 2018, గురువారం
ఓరీ నీ మనసే
ఓరీ నీ మనసే యొక్కింత నిర్మలమై
శ్రీరామనామమే చేయనీ దినదినము
వేయరాని వేషాలు వేసిన దిక చాలు
చేయరాని పనులెన్నొ చేసిన దిక చాలు
మోయరాని భారాలు మోసిన దిక చాలు
చేయరా యికనైన శ్రీరామ నామము
చాల జన్మము లెత్తి సాధించినది చాలు
మేలుకీళ్ళెరుగక మిడికిన దిక చాలు
కాలునిచే తిట్లు గడియించినది చాలు
నాలుకపై శ్రీరామనామము నిలుపరా
దుష్టసంసర్గముల దొరలిన దికచాలు
కష్టాల కొలుముల కాపుర మికచాలు
శిష్టుల నిరసించి చెడిపోయినది చాలు
యిష్టపడి రామనామ మికనైన చేయరా
జగన్నాటకం
జగన్నాటకం
బాగుంది.
నిజంగానే.
ఐతే ఎంతో అమాయకంగా చిన్నపిల్లవాడి చేష్టలాగా ఉంది.జగన్నాటక సూత్రధారి ఎవరంటారు?
ఏమోఐతే పెద్దమోడీ కావచ్చును.
లేదా చిన్నమోడీ కూడా కావచ్చును.
ఒకవేళ సామంతప్రభువరేణ్యులే ఐనా ఆశ్చర్యం లేదు.
పరిణామం ఎలా ఉండవచ్చునూ?
రాష్ట్రపతిపరిపాలన విధించాలన్న మంత్రాంగంలో ఇది ఒక భాగం అనిపిస్తోంది.కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్థలంలో జరిగిన సంఘటనకు రాష్ట్రప్రభుత్వాన్ని ఎలా రద్ధు చేస్తారూ? అనకండి
సవ్యమైన లాజిక్కులు ఆలోచనాపరులకు మాత్రమే అవసరం.
వేయి రూపాయలనోట్లు సులువుగా దాచేస్తున్నారూ నల్లధనం పెరిగిపోతోందీ అని ఆలోచించి అవి రద్ధు చేసి రెండువేల రూపాయల నోట్లుతీసుకువస్తే నల్లధనం కట్టడి అవుతుందని లాజిక్ వెలిగించిన మహానుభావుల తంత్రాంగం సవ్యమైన లాజిక్కులు ఆలోచిస్తుందని అనుకోవటం అవివేకం.
విశాఖపట్నం ఆంద్రాలో ఉంది.
ఆంధ్రాముఖ్యమంత్రికీ (చి/పె)మోడీలకీ పడదు.
ఆంద్రాలో ఒక సంఘటన జరిగింది. (జరిపించాము)
అది చాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని చెప్పటానికి.
అసలు ఆంధ్రాముఖ్యమంత్రి అన్నింటికీ అడ్డుపడే రకం.
శ్రీకాకుళం అని ఒక చోట తుఫానొస్తే అక్కడికిపోయి కూర్చున్నాడు కర్రపెత్తనం చేస్తూ.
దానితో సహాయక చర్యలు కుంటుబడి జనం బీజేపీతోనూ దాని సామంతపార్టీలతోనూ పోయి మొత్తుకున్నారు.
పైగా పరిపాలన అధ్వాన్నంగా ఉండబట్టే విశాఖలో గొప్ప ప్రమాదం తప్పింది ఒక నాయకుడికి.
అర సెంటీమీటరో ఒకటిన్నర సెంటీమీటరో పొడుగు గాయం ఐనది అతడికి.
పాపం, నాలుగ్గంటలు కత్తిపోటుగాయంతోనే విమానంలో హైదరాబాదు వచ్చి వైద్యం చేయించుకున్నాడు.
హుటాహుటిన ఐసియూలో కట్టుకట్టి అంటీబయాటిక్సూ, పెయిన్ కిల్లర్సూ వంటి బహు ఖరీదైన మందులిచ్చారు.
శాంతిభద్రతలు ఇంత దరిద్రంగా ఉంటే ఎలా?
అందుకే రాష్ట్రపతి పాలన అనే అస్త్రం ప్రయోగిస్తాం అంటారు.
శుభం. అదెప్పుడూ?
ఏమో ఈ రాత్రి ఏక్షణంలో ఐనా రావచ్చును.అర్థరాత్రి ప్రకటలన హుషారు ప్రథాని ఏలుబడి దేశం కదా మనది.
ఒకవేళ, ఈ సంఘటనతో మనమే అల్లరి పాలయ్యాం అనుకుంటే మాత్రం మరొక సంఘటన జరిగేంతవరకూ (లేదా జరిపించేంత వరకూ) వేచిచూస్తారు.
ఆంద్రాముఖ్యమంత్రిని అరెష్టు చేస్తారా?
రాష్ట్రపతి పరిపాలన విధించే పక్షంలో, కుట్రదారుడు ఆయనే అని (ఒక వీరవనిత భాషలో వాడే అని) అరెష్టు చేసినా చేయవచ్చును.ఏ నిముషానికి ఏమి జరుగనో ఎవరూహించెదరు?
ఎందుకూ ఊహించటం? మీకేం పని లేదా?
జరిగేది చూడటమే.
మీరో నేనో ఆవేశపడితే ఒరిగేది ఏమీ లేదు సుమండీ.
జరిగేది చూడటమే.
మీరో నేనో ఆవేశపడితే ఒరిగేది ఏమీ లేదు సుమండీ.
అందరి వెతలు దీర్చు
అందరి వెతలు దీర్చు నా రాముడే
అందరికి దేవుడైన ఆ రాముడే
అందరిలో పలుచనై యలమటించు వారికి
చెందవలసిన సిరి చెడిపోయిన వారికి
బందుగులను నమ్మి బాధపడుచుండు వారికి
కుందణచి చేరదీసుకొను వాడు వాడే
కాలము కలసిరాక కష్ట పడువారికి
ఆలుమగలసఖ్యత యటమటగు వారికి
నీలాపనిందలకు నీరసించు వారికి
చాల యూరట నీయజాలునది వాడే
ఈపూట కెట్లనో రేపెట్లు గడచుననో
వాపోవు వారలకు వరుదుడు వాడే
పాపాల పుట్టననో పాపి బెదిరించెననో
తాపమొందు వారికి దారిచూపు వాడే
నమో నమో విశ్వజనక
నమో నమో విశ్వజనక నారాయణా
నమో నమో విశ్వపోష నారాయణా
నమో మత్స కూర్మ కిటి నారసింహ రూప
నమో నమో వటు రూప నారాయణా
నమో రామ రామ రామ నందకుమారా
నమో బుధ్ధ కల్కి రూప నారాయణా
నమో నమో త్రిపురాంతక నారాచ రూప
నమో మోహినీరూప నారాయణా
నమో కపిల ఋషభ నర నారాయణ రూప
నమో దత్త నారద పృధు నారాయణా
నమో సనకాదిక బ్రహ్మనందన రూప
నమో ధన్వంతరి రూపనారాయణా
నమో శ్రీయజ్ఞ వ్యాస రూప నారాయణా
నమో నమో నమో నమో నారాయణా
నమో నమో విశ్వపోష నారాయణా
నమో మత్స కూర్మ కిటి నారసింహ రూప
నమో నమో వటు రూప నారాయణా
నమో రామ రామ రామ నందకుమారా
నమో బుధ్ధ కల్కి రూప నారాయణా
నమో నమో త్రిపురాంతక నారాచ రూప
నమో మోహినీరూప నారాయణా
నమో కపిల ఋషభ నర నారాయణ రూప
నమో దత్త నారద పృధు నారాయణా
నమో సనకాదిక బ్రహ్మనందన రూప
నమో ధన్వంతరి రూపనారాయణా
నమో శ్రీయజ్ఞ వ్యాస రూప నారాయణా
నమో నమో నమో నమో నారాయణా
24, అక్టోబర్ 2018, బుధవారం
ఆకలిని మరపించును
ఆకలిని మరపించును హరినామము
ఆకించు విషయముల హరినామము
సురాసురులు కొలువగ శోభిల్లు నామము
హరున కిష్టమైనదీ హరినామము
అరిది భవతిమిరహర మైనదీ నామము
నరుని నోటికి రుచి నారాయణ నామము
సుందరాతిసుందరమై శోభిల్లు నామము
అందరికి హితవైన హరినామము
మందై భవరోగమును మాన్పెడు నామము
అందుకొనుడు నోటికెంతో అనువైన నామము
శ్రీరామ అనగానే చింతలన్ని పోకార్చి
అరాటము లణచునా హరినామము
నోరార పలికితే చేరదీసి భవసాగర
తీరమును చేర్చునా దివ్యమైన నామము
23, అక్టోబర్ 2018, మంగళవారం
కల దేమూలనో
కల దేమూలనో కీర్తికాంక్ష యీ జీవునకు
తలయెత్తినపు డది తలదించు నీముందు
ధనము కలదేని యిల తానింత బొక్కును
ధనముల మేలిరకపు ధనము కీర్తి ధనము
తనకది స్వర్గవాసమును గూర్చునే కాని
నిను గూర్చ దద్దాని గొననేల కాంక్షయో
యెన్నెన్ని చదివి వీ డెన్నెన్ని చేసినను
ఎన్నిజన్మములెత్తి యెంతభోగించినను
నిన్నెరుగు దాక సుఖ మన్నదెరుగునా
యిన్నాళ్ళ కెరిగి కీర్తి కేల నారాటమో
తారకనామమే తనయొద్ద యుండగా
వేరేల యనుబుధ్ధి వెడలించ పెనుమాయ
ఆరాటపడు చుండు నంతియే గాక ఓ
శ్రీరామ కీర్తిదుష్కీర్తు లెందులకయా
15, అక్టోబర్ 2018, సోమవారం
రామరామ యనుచుంటి
రామరామ యనుచుంటి రక్షించు మనుచుంటి
నీ మీద గురియుంచి నీవాడనై యుంటి
భావాంబరవీధి నీదు భవ్యరూపము నించి
జీవుడ నిన్నే వేళ చింతించుచు నుంటి
దేవుడా నీవు తక్క దిక్కిం కెవరంటి
రావయ్య వేవేగ రక్షించవయ్య
వేలకొలది నామముల వేడుకైన నామమని
మేలైన నామము జగమేలు రామనామమని
నాలోన నమ్మియుంటి నావాడ వనుకొంటి
చాలదా వేవేగ సంరక్షచేయవే
ఎన్నటికిని దాటరాని యీభవాబ్ధి నుంటి
ఎన్నెన్నో యోటిపడవ లెక్కి విడచియుంటి
యిన్నాళ్ళకు రామనామ మన్న నౌక గంటి
విన్నాణము గొంటి నింక వేగ రక్షించవే
14, అక్టోబర్ 2018, ఆదివారం
గోవిందుడు హరి గురువై
గోవిందుడు హరి గురువై యుండగ
జీవులు దుర్గతి చెందెదరా
వినిన చాలురా వెన్నుని చరితలు
అనిన చాలురా హరినామములు
కనిన చాలురా గరుడవాహనుని
మనసారగ నొక క్షణమైన
చాలును శ్రీహరి సంకీర్తనము
కాలుని వలన కలుగదు భయము
మేలగు సద్గతి మీకగు గాదే
శ్రీలోలుడు మిము చేరదీయగ
పామరులై భవవార్థి గ్రుంకులిడు
మీమీ యాత్మల మేలు కొఱకు హరి
మీ ముందుంచెను ప్రేమమీఱగ
రామనామమను రక్షణకవచము
13, అక్టోబర్ 2018, శనివారం
ధర్మవీరుడా రామ దండాలు
ధర్మవీరుడా రామ దండాలు
కర్మవీరుడా నీకు దండాలు
ధనకనకములు కాక దాశరథీ నీ కరుణ
అనిశము కోరువారి నాదరించు దేవుడవు
మనసున నిన్ను నిలిపి మరువక కొలుచుచుండు
జనుల నేవేళ బ్రోచు చల్లని తండ్రివి
శరణన్న వారి నెల్ల సంతోషముగ కాచి
పరిరక్షణ చేయునట్టి భగవత్స్వరూపుడవు
నిరంతరము నీపేరు నిష్ఠతో ధ్యానించు
పరమభక్తుల నేలు పరమాత్ముండవు
అన్నిధర్మముల నీ వాచరించి చూపితివి
అన్నిలోకంబులకు నాదర్శపురుషుడవు
విన్నాణము గొలుపు చరిత వెలయించితి వీవు
నన్నేలి ముక్తినిచ్చు నారాయణుడవు
ఏమి చెప్పుదు నయ్య
ఏమి చెప్పుదు నయ్య యెందరో రక్కసుల
నామావశిష్టుల జేసినావు రామయ్య
పడతుల జెరబట్టు పాపబుధ్ధి యైనందున
పడగొట్టినావు రావణు రణమున
పడతుల నేడ్పించు పాపబుధ్ధులు నేడు
పుడమిని నిండి రిది పొడగాంచవు
యదుకులమున బుట్టి యవనిభారము దీర్ప
వెదకి రాకాసుల విరచితివి
వెదుకబని లేదు నేడు పెరిగి రీ ధరనిండ
సుదతులపాలి రాకాసులు గమనించవు
ఏమయ్య రక్కసుల కేమి తీసిపోవుదురు
భూమిని దుర్జనులై బోరవిరచుక
తామసులై తిరుగెడు ధర్మేతరులు నేడు
స్వామి వారల నేల చక్క జేయవు
11, అక్టోబర్ 2018, గురువారం
ఒకబాణము వేసి
ఒకబాణము వేసి యొంచరాదా
వికటపు కలినింక వీరుడ రామా
తరుణి సీతను బొంది దరహాసముఖుడవై
తరలుచుండు వేళ నిన్ను దాకి తీండ్రించిన
పరశురాముని పైన పరగ విల్లెక్కుపెట్టి
బిరాన నతని పుణ్య విభవమును గొట్టినట్లు
తరుణి సీత యొడిని తలనిడి నిదురించి
తరుణాన కాకి యొకటి ధరణిజను గీరిన
యరసి దానిపైన బ్రహ్మాస్త్ర మెక్కిడి
బిరాన దాని పరిభవించి విడిచి పెట్టినట్లు
తరుణి సీతని బాసి తెరువు జూపవే యని
పరిపరివిధముల నీవు ప్రార్థించ సాగరుడు
గరువాన మిన్నకున్న పరగవిల్లెక్కుపెట్టి
బిరాన నతని కాళ్ళ బేరమునకు తెచ్చినట్లు
పదిమంది దృష్టిలోన
పదిమంది దృష్టిలోన పడవలె నని నీకంత
యిదిగా నున్నదే అది మంచిది కాదు
హరి మెచ్చిన నదే చాలు ననుచు వినిపించక
నరుల మెప్పుకై వెంపరలేమిటికి
నరుడు మెచ్చు కీర్తనకు నాణ్యత హెచ్చునా
హరి మెచ్చుటే యానందము గాక
ఒరులిచ్చు ప్రశంస ల నొరుగున దేముండును
హరి ప్రశంసించె నేని యబ్బు ముక్తి
తరచుగా కీర్తి కొఱకు తహతహలాడు వాడు
పరము నార్జించుట వట్టిది సుమ్ము
పరగ రామకీర్తనలను ప్రజలు మెచ్చి పాడిరేని
హరి వారల మెచ్చుకొను నంతియె కాక
విరచించితి రామునికై వినుడు మీరనుచు నీవు
నరుల మధ్య తిరుగుట పరమును చెఱచు
10, అక్టోబర్ 2018, బుధవారం
పరమయోగిని కాను
పరమయోగిని కాను పామరుడను కాను
హరి నీకు దాసుడనే యది చాలదా
వెనుకటి జన్మలలో వెఱ్ఱినో వివేకినో
యనునది నే నెఱుగ నది యటులుండ
మునుకొని యీ జన్మ ముడుపుగట్టితి నీకు
అనిశము సేవింతునే యది చాలదా
చనిన భవంబు లందు జల్పము లెన్నైనవో
యనునది నే నెఱుగ నది యటులుండ
విను మీ జన్మ మెల్ల విశదంబుగ నీ కీర్తి
అనిశము పాడుదునే యది చాలదా
అణగిన జన్మముల హరిభక్తి యున్నదా
యనునది నే నెఱుగ నది యటులుండ
ఇనకులేశ్వర రామ ఇప్పుడు నినుగూర్చి
అనిశము తపియింతునే యది చాలదా
ఎవరెవరి తప్పు లెంచి
ఎవరెవరి తప్పు లెంచి యేమిలాభము పూర్వ
భవముల చేసినపనుల ఫలము లిటులుండె గాన
పెట్టకుండ పుట్టదను పెద్దల మాటలు నిజము
చెట్టబుధ్ధి చేత దానశీలమును
గట్టున పెట్టినట్టి ఘనుడ నే నైతి నేమొ
కట్టికుడుపు చున్న దిప్పు డట్టి పాపమె
భాగవతుల పరిహసించ పరమమూఢు డగు నందురు
సాగి నేనట్టి తప్పు చాల జేయగ
యోగనిష్ఠ యందు బుధ్ధి యొక్కనిముష ముండదాయె
భోగభూము లందె నిలచిపోవు చుండు నయ్యయ్యో
రామచంద్ర నీవు కాక రక్షసేయ వార లెవరు
కామితార్థమైన ముక్తి కలుగు టెట్లో
యేమిచేయ జాల నట్టి హీనుడను శరణు శరణు
నా మెఱాలకించ వయ్య నన్ను కావ రావయ్య
9, అక్టోబర్ 2018, మంగళవారం
వారగణనం - 1
నిత్యం మనం వాడుతూ ఉన్న గ్రిగొరియన్ కాలెండర్లో ఇచ్చిన తారీఖునకు సరియైన వారం గణితం వేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అష్టావధానాల్లో సభలోని వారో పృచ్ఛకులో ఏదో ఒక తారీఖు చెప్పి ఆరోజు ఏవారం ఐనదీ చెప్పమనటమూ అవధాని వెంటనే చెప్పటమూ మంచి వినోదంగా ఉంటుంది.
తారీఖుకు వారం కనుక్కోవటం కేవలం గణితం.
అతిసులభం అనలేము కాని సులభం అనే చెప్పాలి.
మొదట ఈ టేబుల్ భట్టీయం వేయాలి
జనవరి 0
ఫిబ్రవరి 3
మార్చి 3
ఏప్రిల్ 6
మే 1
జూన్ 4
జూలై 6
ఆగష్టు 2
సెప్టెంబరు 5
అక్టోబరు 0
నవంబరు 3
డిసెంబరు 5
ఈ టేబుల్ వెనుకాల బ్రహ్మ రహస్యం ఏమీ లేదు.
జనవరి 1వ తారీఖు ఆది వారం అనుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు బుధవారం అవుతుంది. ఎందుకలా అంటే జనవరిలో 31రోజులుంటాయి కదా, అందులో 28రోజులు (పూర్తివారాలు) కొట్టివేస్తే మిగిలేది 3 కాబట్టి. ఫిబ్రవరి 1 బుధవారం ఐతే (లీపు సంవత్సరం కాని సం. లో) మార్చి 1వ తేదీ బుధవారమే అవుతుంది. మరలా మార్చిలో 31 రోజులు కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖున 3+31 =34లో 28రోజులు కొట్టివేస్తే 6వది అవుతుంది. ఇలా సంవత్సరంలో ప్రతినెల మొదటి తారీఖు ఏవారం అయ్యేదీ తెలిపే టెబుల్ ఇదన్నమాట, ఈ టేబుల్ ప్రకారం సంవత్సరంలో మొదటిది ఆదివారం అనుకుంటూన్నాం అంతే.
ప్రతిసంవత్సరానికీ 365 రోజులు. ఒక సంవత్సరం లో పూర్తివారాలు కొట్టివేస్తే 1రోజు అదనం అన్నమాట, కాబట్టి ఒకసంవత్సరం మొదటి తారీఖు ఆదివారం ఐతే (అది లీపు సంవత్సరం కాకపోతే) అ తరువాతి సంవత్సరం మొదటి తారీఖు సోమవారం అవుతుంది.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం వస్తుంది.
ఇప్పుడు 20వ శతాబ్దంలోని తారీఖులకు వారాలు సులభంగా ఎలా చెప్పవచ్చో చూద్దాం. (తరువాత ఇతర శతాబ్దాల సంగతీ చూద్దాం).
నిజానికి 20వ శతాబ్దం 1901 సంవత్సరంతో మొదలు అవుతుంది. 1900తో కాదు. కాని మన గణితానికి 1900 ఐనా ఇబ్బంది లేదు.
1900- జనవరి -1 ఏ వారం?
సూత్రం. సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు టేబుల్ ఇండెక్స్ + నెలలో తారీఖు
గణితం. 0 + 0 + 0 + 1
ఇక్కడ సంవత్సరం అంటే శతాబ్దంభాగాన్ని వదిలేయాలి. కేవలం సంవత్సరభాగం 00 మాత్రం తీసుకోవాలి. ఈ సున్నను 4చేత భాగిస్తే వచ్చేది 0 కదా. టేబుల్ ప్రకారం జనవరి ఇండెక్స్ 0. నెలలో తారీఖు 1. అన్నీ కలిపితే వచ్చేది 1. ఆది వారం 0 నుండి లెక్కవేస్తే 1సోమవారం . ఇది సరైనదే.
1947- ఆగష్టు - 15 ఏ వారం?
గణితం.
సంవత్సరం 47
47/4 విలువ 11
ఆగష్టు ఇండెక్స్ 2
తారీఖు 15
మొత్తం 47+11+2+15 = 75
ఈ 75 ను 7 చేత భాగిస్తే శేషం 5 అంటే శుక్రవారం.
ఇలా ఏసంవత్సరంలో ఏనెల కైనా చేయవచ్చును. కాని లీపు సంవత్సరాలతో కొంచెం పేచీ వస్తుంది చూడండి.
1996-1-1 ఏ వారం?
గణితం. 96 + 96/4 + 0 + 1 = 121
121ని 7 చేత భాగిస్తే శేషం 2 అంటే మంగళవారం.
ఇది తప్పు. ఆ రోజు సోమవారం.
సవరణ. తప్పు ఎందుకు వచ్చిందంటే 4 సంవత్సరాలకూ ఒకరోజు చొప్పున 96సంవత్సరాలకు 24రోజులు. కాని ఈ అదనపు దినం కలిసేది మార్చి నుండి కాని జనవరి నుండి కాదు కదా? అందుచేత లీపు సంవత్సరాలలో మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలకు సమాధానాన్ని ఒకరోజు వెనక్కు జరపాలి.
ఇప్పుడంతా సరిగ్గానే ఉంది కదా?
మొదట ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికో చిట్కా ఏమిటంటే 0336, 1462, 5035 అనే సంఖ్యలను గుర్తుపెట్టుకోవటమే. రెండవది కొన్ని ఇరవయ్యవ శతాబ్దపు తారీఖులకు వారాలు గణనం చేస్తూ ఈ గణితాన్ని బాగా ఆభ్యాసం చేయాలి.
మరొక చిట్కా గుర్తుపెట్టుకోవాలి. చివరన 7 చేత భాగించి శేషం మాత్రం వాడతాము. కాబట్టి ఎక్కడికక్కడ 7చేత భాగహారం చేసుకోవచ్చును. 1996-1-1 ఏ వారం? అన్నప్పుడు 96 + 96/4 + 0 + 1 = 121 అని ప్రయాస పడనక్కరలేదు. 96 బదులు 5 తీసుకొని దీనికి 24 బదులు 3 కలిపితే 8 అంటే 1 దీనికి 0 కలిపితే 1 మళ్ళా 1 కలిపితే 2. కాని లీపు సంవత్సరంలో మార్చికి ముందు నెలలు కాబట్టి 1 తగ్గిస్తే 2-1=1 సోమవారం అని వేగంగా నోటి లెక్క చేయవచ్చును. 7వ ఎక్కం బాగా రావాలి ముందు.
రాబోయే టపాలో ఈ సూత్రాన్ని విస్తరించి ఏశతాబ్దంలో ఐనా ఎలా గణనం చేయవచ్చునో చెబుతాను.
5, అక్టోబర్ 2018, శుక్రవారం
సీతమ్మా రామయ్యకు
సీతమ్మా రామయ్యకు చెప్పరాదటమ్మా
మా తప్పులు మన్నించి మమ్మేలుకొమ్మని
ఈ కలియుగమున మే మెంత యత్నించినను
మాకు ధర్మము పైన మనసు నిలువదే
ఆ కారణముచేత నగచాట్లు పడుచుంటిమి
మా కర్మమింతే నని మమ్ము వదలవద్దని
వదలలేకుంటి మీ పాడు కామక్రోధముల
తుదకేమో పరస్పరద్రోహములే
చిదుమ మా బ్రతుకులు చింతింతుము మిమ్ము
మదనారిసన్నుతుని మమ్ము వదలవద్ధని
తల్లిదండ్రులు మీరు తనయులము మేము
చల్లగా మీరు మమ్ము సాకకుందురే
యెల్లవేళల మీరు యించుకదయ చూపినచో
మెల్లగ నొకనాటికి మేము బాగుపడుదుము
దేవదేవ నిన్ను
దేవదేవ నిన్నునేను తెలియజాలను
నీ విధానము లెఱుగ నేనెంత వాడను
నే నెవడ ననునది నేనే యెఱుంగనే
నేననగ లోన ని న్నెఱుగు టెట్టిది
నీ నిజతత్త్వంబును నీరేజభవుడును
లో నెఱుంగడన్న నేనెంతవాడనో
విశ్వంబులన్నియు వెలయించితి వీవు
విశ్వంబులందు వెలెగె దీవు
విశ్వరూపుడ వీవు విశ్వాత్మకుడ వీవు
కావుమ నిన్నే కరణి తెలియు వాడను
నీవే రాముడవని నిన్నదాక తెలిసితినా
భావించ నిప్పు డో భగవంతుడ
నీవే తెలిపితివి గాన నే నెఱింగితి నిదే
భావనాతీతప్రభావ నీ దాసుడను
4, అక్టోబర్ 2018, గురువారం
హాయిగా రామరామ యనుచు
హాయిగా రామరామ యనుచు పాడేవు
తీయగా ఓ చిలుకా దిక్కులు నిండగను
ఎవరు నేర్పించిరే యీ రామనామము
చవులూరంగ చక్కగ నీ
వవలంబించితి వందాలచిలుకా
చెవులకు సుఖమగు శ్రీహరినామము
పడియుండితి విటు పంజరమున నీవు
కుడుచెద విదె కొన్ని గింజలే
యిడుమల మధ్యన నిదె రామనామము
కడువేడ్క నేర్చి చాల గడితేరితివే
మంచిపంజర మను భ్రమలేని చిలుకా
మంచివాడంటే మనరాముడే
యించుక తాళవే యీ రామనామమే
మంచితాళపుచెవి మాయపంజరానికి
3, అక్టోబర్ 2018, బుధవారం
చూడ నందరకు
చూడ నందరకు పెద్దచుట్టంబవ నీవు
వేడుకతో విందువు మా విన్నపంబులు
మాకు ధర్మ మెఱుకగు మార్గమే దంటేను
లోకావననిపుణ నరాకారము దాల్చి
శ్రీకర దయాళో శ్రీరామమూర్తివై
నీకథయే మార్గముగా మాకొసగిన చుట్టమవు
తరణోపాయ మొకటి దయచేయ మంటేను
నరులకిచ్చితివి నీ నామమంత్రము
పరమపామరులము పతితపావననామ
కరుణాలయ నీవే కడుపెద్ద చుట్టమవు
కలిమాయ క్రమ్మిన కపటలోకమునందు
వెలుగుదారి మాకు వెల్లడిచేయు
నళినాక్ష నీ దివ్య నామమంత్రము కాన
నిలనెల్లవారి కీవె యెంతోపెద్ద చుట్టమవు
2, అక్టోబర్ 2018, మంగళవారం
ఇప్పటి కిది దక్కె
ఇప్పటి కిది దక్కె నింతయ చాలు
నెప్పటి కైన ముక్తి నీయక పోవు
నీవు లోకేశుడవని నిశ్చయముగ నెఱిగి
నీవుదక్క గతిలేదని నిశ్చయముగ నెఱిగి
నీవు మోక్షదాతవని నిశ్చయముగ నెఱిగి
భావంబున నిలచెను భక్తి నీమీద
నీవు నావాడవని నిశ్చయముగ నెఱిగి
నీవు రక్షింతువని నిశ్చయముగ నెఱిగి
నీవు నా సర్వమని నిశ్చయముగ నెఱిగి
భావమున ప్రేమ నీ పైననే నిలచెను
నీవు నాలో గలవని నిశ్చయమగ నెఱిగి
నీవు నా ఆత్మవని నిశ్చయముగ నెఱిగి
నీవు నేను నొకటని నిశ్చయముగ నెఱిగి
భావంబిది రామ పరమశాంత మాయెను
చేయలేని పనుల
చేయలేని పనుల దలచి చింతించి ఫలమేమి
చేయగలిగినట్టి పనులు చేసిన చాలు
శక్తికి మించి ధనము సంపాదించుటకై
యుక్తులెప్పుడు పన్నుచుండు చిత్తము
రక్తిమీఱ కొద్దిసేపు రామచంద్రమూర్తిని
ముక్తి కొఱకు ప్రార్థించి మురిసితే చాలదా
ప్రొద్దుపొడిచినది మొదలు నిద్దుర కొఱగుదాక
సద్దుచేయ కుండలేని చచ్చు నాలుక
కొద్దిసేపైన గాని గోవిందనామస్మరణ
ముద్దుముద్దుగా చేసి మురిసితే చాలదా
వారివీరి సేవించి బ్రతుకీడ్చెడు కాయము
ఘోరమైన రోగాల కుప్ప కాయము
పారమార్థికము తలచి పరగ నొక్క ఘడియైన
చేరి శ్రీహరి సేవ చేసిన చాలదా
ఇచటి కేమిటి కని
ఇచటి కేమిటి కని యిందరు వత్తురో
విచిత్రమగు నెల్లవిధముల చూడ
మాయముసుగులు తొడిగి మతిమాలి గంతులు
వేయుచు తిరిగేరు వెంగళులై
చేయరాని పనులు చేసి చెడుఫలితము లొంది
మోయలేని కష్టాలు మోయుచు తిరిగేరు
వచ్చిన దెందుకో భావించ రెవ్వరును
వచ్చి చేసే రెన్నో పిచ్చి పనులు
ఎచ్చోటి నుండి వచ్చి రెన్నాళ్ళ ముచ్చటో
యిచ్చట నే యొక్కరి కిసుమంత పట్టదు
తిరిగిపోవ దారేదో తెలియనేరమి జేసి
తిరుగుచునే గడిపేరీ ధరను వీరు
పరమాత్ముడు రాముని పాదములు పట్టి
మరల స్వస్థితికి కొద్దిమంది చేరెదరు
విచిత్రమగు నెల్లవిధముల చూడ
మాయముసుగులు తొడిగి మతిమాలి గంతులు
వేయుచు తిరిగేరు వెంగళులై
చేయరాని పనులు చేసి చెడుఫలితము లొంది
మోయలేని కష్టాలు మోయుచు తిరిగేరు
వచ్చిన దెందుకో భావించ రెవ్వరును
వచ్చి చేసే రెన్నో పిచ్చి పనులు
ఎచ్చోటి నుండి వచ్చి రెన్నాళ్ళ ముచ్చటో
యిచ్చట నే యొక్కరి కిసుమంత పట్టదు
తిరిగిపోవ దారేదో తెలియనేరమి జేసి
తిరుగుచునే గడిపేరీ ధరను వీరు
పరమాత్ముడు రాముని పాదములు పట్టి
మరల స్వస్థితికి కొద్దిమంది చేరెదరు
వేరువారి జేరి నేను
వేరువారి జేరి నేను విన్నవింతునా
శ్రీరామ నీకే నేను చెప్పుకొందు గాక
ఊరక సంసారమం దుంచితి విదె నీవు
తీరిక లేనట్లు మోము త్రిప్పు కొందువా
నా రక్షణభార మది నమ్మకముగ నీదేను
ఔరౌరా కాని వాడ నైతినా సీతాపతి
తప్పించుకు తిరుగుట నీ తరముగా దొకనాడు
తప్పక నిన్ను చేరి తప్పులెంచనే
యిప్పటి కైన న న్నొప్పుగ కరుణించితే
తప్పును నా ఘోష నీకు దశరథరామయ్య
సర్వలోకరక్షకుడే సంరక్ష జేయకున్న
నిర్వహించుకొను టెట్లు నే నీ బ్రతుకు
దుర్వారమైన తాపదోషముచే తిట్టితే
గర్వ మనుకొనక దయగనుము నీ దాసుడ
1, అక్టోబర్ 2018, సోమవారం
ఆశలపల్లకి నధిరోహించుము
ఆశలపల్లకి నధిరోహించుము
దాశరథి దయజూచె నిను
బహుభవములుగా పరితపించితివి
అహరహమును శ్రీహరికై నీవు
ఇహమున పొందిన నిడుము లడగును
తహతహ లన్నియు తగ్గునని
పరబ్రహ్మమును భావించితివి
నిరతము మదిలో నిండుగ నీవు
పరము కలిగినది బహుధన్యుడవు
హరి నీవాడై యుండునని
నోరునొవ్వగ తారకమంత్రము
నారాధించిన వీరుడ వీవు
కూరిమి చూపెను శ్రీరఘునాథుడు
మారుజన్మమను మాటే లేదని
30, సెప్టెంబర్ 2018, ఆదివారం
అందరూ దేవుడంటే
అందరూ దేవుడంటే అవు ననుకొందురు
కొందరు కాదంటే కొంత సంశయింతురు
నరులకు నీపైన నమ్మక మిట్లుండును
పరమాత్మ కలిని జనుల బ్రతుకు లిట్లుండును
రాముడే దేవుడని ప్రేమించు వారుందురు
రాము డెవ్వడని పల్కు రాలుగాయి లుందురు
రాముడా ఇట కలిమాయామోహితు లందున
యేమియు నిదమిత్థముగ నెఱుగలేరు జనులు
నీ నామము విడువని నిష్టగల వారుందురు
నీ నామ మెఱుగని నిర్భాగ్యులుందురు
నీ నామమహిమ నెఱిగి నిలచిన ధన్యులకు
నీ నిజధామమును నిశ్చయముగ పొందుదురు
నమ్మితే కలవని నమ్మకుంటే లేవని
నమ్మకముగ వాదించు నరులమధ్య నిలచి
యుమ్మలికము లెన్నెన్నో యోర్చుచు నిన్నే
నమ్ముకొన్న కలుగు పో నారాయణ మోక్షము
దేవుడ వని నిన్ను
దేవుడ వని నిన్ను తెలియ లేనైతి
జీవుడనగు నేను నా చిత్తమందున
భావించవచ్చునా పామరుడగు నాకు
భావనాతీతుడ పరమాత్ముడ
భూవలయమున నరులు పొందెడు తెలివిడి
నీ విధానము తెలియ నేర్పించు నంతదా
అవధారు శ్రీరామ యవనిజారమణ
దివిజారికులనాశ దీనబాంధవ
భవరోగగ్రస్థుడనై పడియున్న నాకు
చవిగానిదాయె నీ సచ్చరిత్రమక్కట
రామనామము నందు రక్తి నా నాలుక
కేమాత్రము లేక హీనుడనైతి
నేమయ్య యికనైన నిప్పించవయ్య నీ
నామదీక్ష కృపాళో నా కిప్పటికైన
అన్నులమిన్న సీత
అన్నులమిన్న సీత యమరగ సరసన
వెన్నెలలో రాముడు విహరించినాడు
మొన్నమొన్నటిదాక మొనసి యయోధ్యలో
నున్నవాడై హాయి నువిదను గూడి
నన్ని భోగంబుల నలవోక గైకొనుచు
యెన్నో పూదోటల వెన్నలల గొన్నాడు
ఇదిగో పినతల్లి కోర్కె యింతపని చేయగ
ముదమున నడివిలో ముదితను గూడి
సదమలహృదయుడై సౌమిత్రి రక్షలో
సదా వెన్నెలల భోగచతురుడై యున్నాడు
అన్నన్నా ఆ రావణాసురుని పుణ్యాన
వెన్నెలలే వేడైతే విలపించిన వాడు
కన్నెఱ్ఱజేసి వాని కడతేర్చి యిదిగిదిగో
పన్నుగ మబ్బువిడిన వెన్నెలఱేని వలె
విల్లెత్తి నిలచినాడు
విల్లెత్తి నిలచినాడు వీరాధివీరు డనగ
నల్లనయ్య ఇదె నయనానందముగ
కనుగొని తల్లులు కమలాయతాక్షుని
మునుకొని పొగడ ముదమున
తనరార తన దీర్ఘతరభాహువుల ఠీవి
ఇనకుల తిలకుడై యిదిగో రాముడు
పైకొని పదునాల్గువేలమంది రాగా
రాకాసు లందరిని రణమున
నేక ముహూర్తమున నిలనుండి వెడలించి
చీకాకు నడగించి చెన్నొంది రాముడు
సురలకునైన తేరిచూడరాని రావణుని
పరదారామోహ పతితుని
శరధారావర్షశమితతేజుని చేసి
పరిమార్చె ధర్మతత్పరుడైన రాముడు
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
28, సెప్టెంబర్ 2018, శుక్రవారం
ఎంచ బోతె కంతలే మంచ మంతట
ఎంచ బోతె కంతలే మంచ మంతట మా తప్పు
లెంచు నంత శ్రమయు నీ కెందుకు లేవయ్య
పెద్ద లెంత మంచిమంచి సుద్దులే చెప్పినా
వద్దని పెడదారులు పట్టు వారము
ముద్దుగా నేర్పించిన విద్దెల సారములు
మొద్దు బుఱ్ఱల కేమొ మోయరాని వాయె
చిలుకకు నేర్పినట్లు శ్రీరామనామము
తలిదండ్రులు నేర్పినా పలుకమాయె
గులకరాళ్ళు సొమ్ములను గురువుల పలుకులు
దులుపుకుపోయి నేడు దుఃఖించెద మాయె
తప్పుడు మాటలతో తప్పుడు చేతలతో
తప్పుడు దారులలో తడుబడు వారము
తప్పుడు బ్రతుకులని తలచి యెంతేడ్చినా
యిప్పుడేమి లాభము నీ వెటులో రక్షించుము
కలిగినవేవో కలిగినవి
కలిగిన వేవో కలిగినవి యవి హరికృప వలన కలిగినవి
కలుగని వానికి ఘనవిచారము కలుగక పోవుట మంచిది
ఇది హితము వీని కని యెంచి హరి ఇచ్చు నది
ముదమార గొనుటయే ముఖ్య మటుల కాక
ఇది వీని యున్నతికి హితవు గాదని హరి
మది నెంచి యీయనివి మరచిపోవలయును
అట బొమ్మల నడుగ నమ్మ చేతికి యిచ్చు కత్తి
పీట నడుగ నీకు పిలచి చేతి కీయదు
గాటముగ జీవునకు కలుగు నట్టి కోర్కుల
చేటు మేళ్ళెరిగి హరి చిత్తగించి తీర్చును
ఇల మీదను జీవుడు మెలగ వలయు విధమును
తెలియ జెప్ప లేదే దేవుడే రాముడై
పలుమాట లేమిటికి భగవంతు డిచ్చునది
తలప మీ కెన్నటికి తగినదై యుండునది
27, సెప్టెంబర్ 2018, గురువారం
దయగల దేవుడా
దయగల దేవుడా దండప్రణామాలు
జయము నీకగు గాక సర్వేశ్వరా
దుష్ఠులు చెలరేగి దురితము మితిమీరి
శిష్టుల బ్రతుకులు చెడునపుడు
కష్టాలు సురలకు కలిగినచో ధర్మ
భ్రష్టుల నడచగ వచ్చు మహాత్మా
పుట్టించునది నీవు పోషించునది నీవు
తుట్టతుదకు నెట్టి దుర్మతిని
పట్టు విడువక మంచిపధ్ధతికి తెచ్చి
యెట్టన బ్రోచు గోవింద మహాత్మా
ఇనకులమున బుట్టి యిది ధర్మమని చెప్పి
మనుజుల కాదర్శమును చూపి
తనుబంధములు విప్పు తారకమంత్రము
ననువుగ మాకిచ్చి నట్టి మహాత్మా
కలలోన నీరూపు కనుగొని
కలలోన నీరూపు కనుగొని నెలదాటె
నలిగితివా యేమి ఆలసించేవు
వచ్చి నీవు నన్ను పరికించి చిరునవ్వు
ముచ్చటగా విసరి పోరాదా
హెచ్చిన భక్తితో నిచట నేనున్నానే
నిచ్చలు నీపైన పిచ్చితో నున్నానే
కరుణామృతవృష్టి కాస్తంత చిలికించి
మురిపించితే యేమి పోయేను
నిరుపమ భక్తితో నిలచి నేనున్నానే
తరళాక్ష కలనైన మరువ కున్నానే
ఇనకులతిలక నీ విపుడైన విచ్చేసి
కనికరించి ప్రోవగారాదా
వినవయ్య రామయ్య వేరెవరి నెన్ననే
దినములు లెక్కించు కొనుచు నున్నానే
చిత్తగించ వలెను మనవి
చిత్తగించ వలెను మనవి శ్రీరామ నే
నుత్త మాటల ప్రోవు నోహో శ్రీరామ
పట్టరాని కోపమొకటి పైన వేదాంత మొకటి
చెట్టలాడు బుధ్ధియొకటి యట్టులుండగ
మెట్టవేదాంతమును జెప్ప మేటినైతిని నా
యుట్టుట్టి మాటలకు ఫలిత ముట్టిదే కాదా
పలుకుపలుకు వినయనటన చిలుకుచుండును
విలువనిచ్చి పలికినటుల పెద్దలెంచగ
చిలుకపలుకుల నట్లు చాల చెప్పనేర్చితి నా
పలుకులాడితనము నాకే ఫలిత మిచ్చేను
నేను భక్తుడ ననుచు తలచి నీకునై యిట్లు
పూని పలుకు కీర్తనలును లోన డొల్లలా
జ్ఞానహీనుడనయ్యు నేమో చాల చెప్పుదు
దానికే తప్పెంచకయ్య దశరధాత్మజా
నుత్త మాటల ప్రోవు నోహో శ్రీరామ
పట్టరాని కోపమొకటి పైన వేదాంత మొకటి
చెట్టలాడు బుధ్ధియొకటి యట్టులుండగ
మెట్టవేదాంతమును జెప్ప మేటినైతిని నా
యుట్టుట్టి మాటలకు ఫలిత ముట్టిదే కాదా
పలుకుపలుకు వినయనటన చిలుకుచుండును
విలువనిచ్చి పలికినటుల పెద్దలెంచగ
చిలుకపలుకుల నట్లు చాల చెప్పనేర్చితి నా
పలుకులాడితనము నాకే ఫలిత మిచ్చేను
నేను భక్తుడ ననుచు తలచి నీకునై యిట్లు
పూని పలుకు కీర్తనలును లోన డొల్లలా
జ్ఞానహీనుడనయ్యు నేమో చాల చెప్పుదు
దానికే తప్పెంచకయ్య దశరధాత్మజా
25, సెప్టెంబర్ 2018, మంగళవారం
తనవారి గొప్పలు తాను చెప్పును
తనవారి గొప్పలు తాను చెప్పును కాని
మునుకొని పొగడడు ముఖ్యుని గొప్ప
తనవారి ధనములు తనవారి మదములు
తనవారు చేసిన దానములు
తనకింత గొప్పని తరచుగ పొగడును
తనవాడు హరియని తలపడయా
తనవారి భోగాలు తనవారి త్యాగాలు
తనవారి కీర్తుల తళతళలు
తనకేమి యొరిగించు తానంత పొగడును
తనహరి యనురాగమును చెప్పడే
తనవారి గొప్పలు తనకేమి పరమిచ్చు
తనకెప్పుడు భవతారకుడగుచు
తనహృత్కుహరాన తనరారు రాముని
కొనియాడవలె నని కొంచెమెంచడే
కుప్పలుతిప్పలు తప్పులు
కుప్పలుతిప్పలు తప్పులాయెర కోదండరామ ఆ
తప్పులు చేయక తప్పనిదాయెర దశరథరామ
మాయను మునిగిన మానవమాత్రుడ మన్నింపుము రామ యీ
మాయను దాట నశక్తుడనయ్యా మన్నింపుము రామ
నీ యనుంగు సుతునిగ నన్నెం చి నేడైనను రామ నీ
చేయందించి కావవె నన్ను సీతాపతి రామ
ఈ సంసారము దాటజాలరా యీశ్వర శ్రీరామ ఈ
దోసం బిది నా జీవలక్షణము దుర్వార్యము రామ
దాసుని తప్పులు దండముతో సరి దయచూడుము రామ మా
యా సంసారవిమోహము నణచు మంగజగురు రామా
నీరేజాసనవినుత రామ నిరుపమగుణధామ
పారావారబంధన రామ పావనశుభనామ
కారుణ్యాలయ కామిఫలద కలుషాంతక రామ
దారుణసంసారార్ణవమగ్నుడ దరిజేర్చుము రామ
తప్పులు చేయక తప్పనిదాయెర దశరథరామ
మాయను మునిగిన మానవమాత్రుడ మన్నింపుము రామ యీ
మాయను దాట నశక్తుడనయ్యా మన్నింపుము రామ
నీ యనుంగు సుతునిగ నన్నెం చి నేడైనను రామ నీ
చేయందించి కావవె నన్ను సీతాపతి రామ
ఈ సంసారము దాటజాలరా యీశ్వర శ్రీరామ ఈ
దోసం బిది నా జీవలక్షణము దుర్వార్యము రామ
దాసుని తప్పులు దండముతో సరి దయచూడుము రామ మా
యా సంసారవిమోహము నణచు మంగజగురు రామా
నీరేజాసనవినుత రామ నిరుపమగుణధామ
పారావారబంధన రామ పావనశుభనామ
కారుణ్యాలయ కామిఫలద కలుషాంతక రామ
దారుణసంసారార్ణవమగ్నుడ దరిజేర్చుము రామ
ఇతడే కాదా యేడుగడ
ఇతడే కాదా యేడుగడ సన్ని
హితుడగు సీతాపతి యెల్లెడల
తగిన యింటిని నీకు తానే చూపించేను
తగువిధి రక్షించు తల్లి గర్భమున
జగమున నీవుండదగు రీతి సూచించు
జగదీశుడు కడు చల్లని మనసుతో
తప్పుదారి ద్రొక్కు వేళ తా నంతరంగాన
నొప్పుగ నిలచి హిత ముపదేశించును
తిప్పలు పడువేళ దిక్కుతోచని వేళ
చప్పున తనచేయి చాచి రక్షించేను
తొల్లిటిచోటు చేర తొందరించగ మనసు
నల్లనయ్య నీవంక నడచివచ్చేను
చల్లగ రామతారక సన్మంత్రమే యిచ్చి
అల్లన స్వస్వరూప మందించేను
హితుడగు సీతాపతి యెల్లెడల
తగిన యింటిని నీకు తానే చూపించేను
తగువిధి రక్షించు తల్లి గర్భమున
జగమున నీవుండదగు రీతి సూచించు
జగదీశుడు కడు చల్లని మనసుతో
తప్పుదారి ద్రొక్కు వేళ తా నంతరంగాన
నొప్పుగ నిలచి హిత ముపదేశించును
తిప్పలు పడువేళ దిక్కుతోచని వేళ
చప్పున తనచేయి చాచి రక్షించేను
తొల్లిటిచోటు చేర తొందరించగ మనసు
నల్లనయ్య నీవంక నడచివచ్చేను
చల్లగ రామతారక సన్మంత్రమే యిచ్చి
అల్లన స్వస్వరూప మందించేను
23, సెప్టెంబర్ 2018, ఆదివారం
అన్నిట నీకు సాటి
అన్నిట నీకు సాటి యనుచు మా సీతమ్మ
నెన్నిక సేయరే యింద్రాదులు ఋషులు
తల్లి గొప్ప దండ్రి దనగ తండ్రి గొప్ప తల్లిది
అల్లిదండ్రుల గొప్పదనము లవి
యెల్లరి బిడ్డల గొప్ప లేవేళ లోకమందు
చల్లని వారు మీరు తల్లిదండ్రులు మాకు
ఛాయేవానుగతా యని జనకుడాడిన మాట
మాయమ్మ సత్యముగ మలచినది
వేయేల నీవలె పితృవాక్యపాలనమున
మాయమ్మ సీతమ్మ మరినీకు సాటి రామ
మాయ గొని నీ వొక్క మనుజరూపము దాల్చ
మాయయే వచ్చె సీతామాతగను
మీ యిరువురి యందు మిక్కిలి భక్తులము
మాయందు దయగల మా పితరులు మీరు
22, సెప్టెంబర్ 2018, శనివారం
కర్మవిగ్రహుడ నేను
కర్మవిగ్రహుడ నేను కటకట పడుచుండ
ధర్మవిగ్రహుడ కొంత దయచూప రాదా
చేయగ రాని వెల్ల చేయుచు నమ్మకచెల్ల
హేయమైన తనువు లెత్తి యేడ్చుట లెల్ల
మాయచేత నైతే నది మణుగుట మరి కల్ల
చేయి నీ వందించి చేరదీయక
నీ నామ కీర్తనవేళ నిలువరించ కలి గాడు
లేనిపోని యాశల మది లీనమాయె చూడు
ఈ నరుని జన్మ మెల్ల నిట్లు చెడెను చూడు
నేనేమి చేసేది నీ దయరాక
రాముడా నీకన్న నిక రక్షకుడు లేడని
నీ మీదను భారమును నిలిపి యున్నానని
స్వామి నీవిది యంతయు చక్కగ నెఱుగుదువని
యేమేమో తలచితి నింత పరాకా
21, సెప్టెంబర్ 2018, శుక్రవారం
ఎట్టి వాని నైన మాయ
ఎట్టి వాని నైన మాయ పట్టక మానేనా
పట్టినదా గర్వించిన తల కొట్టక మానేనా
గర్వింతురు కులము వలన గర్వింతురు బలము వలన
గర్వింతురు వయసున తనుకాంతి చేత ననగ
గర్వింతురు ధనము వలన గర్వింతురు ప్రభుత వలన
గర్వించె నివియె కాక కలిగి బ్రహ్మ వరము వాడు
చదివినట్టి చదువు లకట సమయజ్ఞుని చేయలేదు
కదిలి వచ్చి మాయ వాని కమ్మినట్టి వేళ
విదులు చెప్పు పలుకు లతని వీనుల చొరబారలేదు
మదమణచ రాముడు వచ్చి యెదుట నిలిచినట్టి వేళ
ఎట్టి వారి నైనను పడ గొట్టు నట్టి కాల మొకటి
తుట్టతుదకు వచ్చు ననుచు తోచక రేగి
యిట్టిట్టి వన రానట్టి చెట్టపనులు చేసిచేసి
కొట్టబడినాడు రాముని కోలలచే నిదె చూడరె
20, సెప్టెంబర్ 2018, గురువారం
దొంగెత్తు వేసి వాడు
దొంగెత్తు వేసి వాడు తొయ్యలి గొనిపోవ
వెంగలియాయె నని విబుధులు నవ్విరి
కోరికోరి మృత్యువును గొప్పగా చెఱబట్టి
పారిపోవుచున్నాడు పాపాత్ముడు
వీరుడనని నిత్యము విఱ్ఱవీగు వీనికిదె
తీరిపోయె నూకలని తెలిసె నేడనుచు
దశదిశలు గెలిచి చాల దర్పించియున్నాడు
దశముఖుడు నేడు కదా దొరకినాడు
దశరథుని కోడలిని తానిదే చెఱబట్టి
వశుడాయె సమవర్తి పాశమునకు నేడని
మాయచేసినా నని మదమత్తు డెంచేను
మాయలోన బడినాడని మన కెఱుక
ఈ యయోగ్యుని విష్ణు మాయపట్టిన దిదే
వేయేల నిక పీడ విరుగ డాయెనని
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
18, సెప్టెంబర్ 2018, మంగళవారం
నారాయణుండ వని నలువ
నారాయణుండ వని నలువ పలికి నంతట
శ్రీరాముని యోగమాయ శీఘ్రమే విడచినది
విడివడి నిజయోగమాయ వీరరాఘవున కపుడు
వడివడి ఘనశంఖచక్రపద్మశూలాదులును
నిడుదకరవాలముతో నిర్మలదరహాసముతో
నొడయు నెదుట నిలచి మ్రొక్కి నుడివె నాజ్ఞ యేమని
నీయాజ్ఞ మేరకే నీకు మానుషము గూర్చి
యీ యుధ్ధపర్యంతము నీయందే నిలచితిని
ఈ యిరువది కరముల వా డీల్గె నిక విడచితిని
పోయి వచ్చెదను నేను నీయాజ్ఞ యేమనె
నీసత్యము నీనామము నీశీలము నీచరితము
దాసజనపోషకమై ధరను సుస్థిర మగును
వాసవాదిసకలదేవవంద్యపాద రామ
నీ సోదరి యోగమాయ నిలచె నీయజ్ఞ కనె
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
16, సెప్టెంబర్ 2018, ఆదివారం
ఈ నే ననుమాట నేనాడు విడతువో
ఈ నే ననుమాట నేనాడు విడతువో
ఆ నాడే ముక్తి కాని యందాక గలదె
నేనుంటి నిల నుంటి నే నొనరించిన
మానిత పుణ్యఫల మగు నీ జన్మ
నేను కర్మఫలభోగనిష్ఠుడ నైయుంటి
నా నిజభావమిది నానెంచే
యుగము లెన్నో కలవు యుగములన్నిట
జగమున నేనుంటి చక్కగా ననెడు
భగవంతుడిదె నన్నిటు జేసె ననెడు
తగ నిది నానిజ తత్త్వం బనెడు
తన్ను దానెఱుగక నెన్ని యెఱిగిన గాని
చిన్నమెత్తు లాభమైన చేకూరేనా
పన్నుగ శ్రీరామపాదాబ్జముల బట్టి
తిన్నగా నజ్ఞాన తిమిరంబు వెడలి
ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని
ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని
నానాటికి పెరిగెడునది నా భక్తి కనుక
మానక నీ గుణనామమహి మానుకీర్తనమున
నేనెప్పుడు నుండనే నీ వెఱుగగ
జ్ఞానము నీ విచ్చినదై సర్వాత్మనా నేను
పూనికాడనై నిన్ను పొగడుచుండు టరిదియే
ఎన్నుకొంటి నేనాడో నిన్ను నా దేవునిగా
తిన్నగా నీయందే దృష్టి నిలిపితి
మన్నించు నీవుండ మరి యితరుల పనియేమి
నిన్ను నే నడుగున దేమున్న దొక్క ముక్తి కాక
నీవే సర్వస్వమని నిన్ను నమ్మి యుండు వారు
నీ వారై యుందురని నే నెఱుగుదును
నీవు భక్తపోషకుడవు నీవు జగద్రక్షకుడవు
నీ వాడ నైన నన్ను బ్రోవుము శ్రీరామచంద్ర
12, సెప్టెంబర్ 2018, బుధవారం
'కలలో నీలిమ కని' పాటకు వివరణ
ఈ కలలో నీలిమ కని అన్న మాటను గూర్చిన సమగ్ర వ్యాసం కలలో నీలిమ కని .... వేణువు విని! మనకు వేణువు బ్లాగులో లబిస్తున్నది. తప్పక చదవండి. అన్నట్లు ఈ పాటను వ్రాసినది ఎస్.వి. భుజంగ రాయ శర్మ గారు.
ఈ పాట వినవలసిన పాటల్లో ఒకటి. దీని ఆడియో లింక్ ఆ వ్యాసంలో కూడా లభిస్తున్నది.
ఒకటపా డియర్ లార్డ్ కృష్ణా! నీ బర్త్ డే కి …. అనే దానిలో ఒక వ్యాఖ్య కనిపించింది.
Chiranjeevi Y | |
"చిన్నప్పుడు రేడియోలో నాకు బాగా నచ్చిన పాట అది. 2 సం.. క్రితం దాన్ని వెతికి పట్టుకోని దాచుకున్నాను. ఇప్పటికి కూడా నాకు దాన్లో ఒక్క ముక్కకి కూడా అర్ధం తెలియదు .
|
ఈ వ్యాఖ్యను చూసాకనే ఆ బ్లాగు తెరచి ఈ పాటను గమనించటమూ వినటమూ జరిగింది. ఇంంతవరకూ ఈ పాటను ఎన్నడూ విననే లేదు!
ఈపాట సాహిత్యాన్ని వేణువు బ్లాగునుండి తీసుకొని క్రింద చూపుతున్నాను. (గమనిక: పాటపాడేటప్పుడు అక్కడక్కడా పల్లవి వగైరాలు పునరావృత్తం అవుతాయి. ఇక్కడ సాహిత్యం మాత్ర్రమే వ్రాస్తున్నాను.)
కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని
అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే మనసు - ఎంత వెఱ్ఱిదే
కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని
అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే మనసు - ఎంత వెఱ్ఱిదే
కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని
అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే మనసు - ఎంత వెఱ్ఱిదే
ఇంక చిరంజీవి గారు అన్నట్లుగా ఈ పాట అర్థం కాని వారి కోసం కొంచెం వ్యాఖ్యానించటం అవసరమే.
ఈ పాటలో చెప్పుకోవలసిన విశేషం శ్రవణసుభగత్వం. అంటే చెవికి ఇంపుగా ఉండటం. ఈ లక్షణం ఎలా వస్తున్నదీ అంటే దానికి ఒక కారణం పల్లవిలో నీలిమ, చారిమ, రక్తిమ అనే ఒకే రకంగా ముగిసే పదాలూ అలాగే చరణాల్లో మువ్వలు, నవ్వులు, సవ్వడి, వేదన వేదన వంటి ప్రాసపదాల వలన. ఐతే అంతకన్నా ముఖ్యకారణం ఈ పాటలో విస్తృతంగా కనిపించే ముక్తపదగ్రస్తాలంకారం వలన. అంటే ఒకపదాన్ని వెంటవెంటనే వాడటం అనే చమత్కార ప్రక్రియ వలన.
కలలో ఒక నీలిమ కని అని మొదలవుతుంది పాట. నిజానికి కలలో ఒక నీలిమ కని అని ఉంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. నీలిమ అంటే నలుపురంగు. కలలో ఒక నలుపురంగు కనబడింది అంటే అంత గొప్ప మాటగా అనిపించదు గబుక్కున. నీలిమ అంటే నల్లదనం అన్నది వాస్తవమే కాని ఇక్కడ సూచించేది ఏమిటంటే ఒక నల్లటి వస్తువు అని. వస్తువేమిటయ్యా వస్తువూ? కలలో ఒక నల్లపిల్లాడు కనిపించాడూ అని అర్థం తీసుకోవాలి. ఎవడి నీలివర్ణం ఒకవిశేషమో అతడు కనిపించాడూ అని చెప్పటమే నీలిమ కని అని చెప్పటంలో ఉద్దేశం. నీలాకాశం అటే మబ్బుపట్టిన ఆకాశం - అది చూడగానే కృష్ణుడు మనస్సుకు స్ఫురించటం అనేది ప్రసిధ్ధంగా అనేకానేక పాటల్లో కనిపిస్తూనే ఉంటుంది కదా. ఐతే, ఈ పాటలో చెప్పిన విధం ఏమిటంటే కలలో ఒక నల్లని వాడు కనిపించాడు అని చెప్పి, మనల్ని అతడు కృష్ణుడే అని గ్రహించమనటం జరుగుతోంది. ఏమిటయ్యా అందుకు ఋజువూ అంటే, కాస్త ఆగండి. మరికొంచెం అర్థవివేచన చేసాక పునరాలోచన చేస్తే అంతా స్పష్టం అవుతుంది కదా.
ఆ నీలిమలోకమల పత్ర చారిమ గని అని నీలిమను స్మరించటం వెంబడే చెబుతుందీ పాట. కమలపత్రం అంటే ఏమిటీ అన్నది మొదట తెలుసుకోవాలి. కమలం అంటే తామరపువ్వు, పత్రం అంటే ఆకు కాబట్టి కమలపత్రం అంటే తామరాకు అను చెప్పుకున్నామా కుదరనే కుదరదు అన్వయం. పత్రం అంటే పువురేకు కూడా. కమలపత్రం అంటే తామరపూవు రేకు.
అయోద్యాకాండలోని ఈ శ్లోకం చూడండి
స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః.
రామః కమలపత్రాక్ష: జీవన్నాశమితో గతః. (2.66.8)
అలాగే
రామః కమలపత్రాక్ష:,సర్వ సత్వమనోహరః!
రూప దాక్షిణ్య సంపన్నః,ప్రసూతే జనకాత్మజే!!
అలాగే
రామః కమలపత్రాక్ష. సర్వసత్వ మనోఠథః అని హనుమంతుడు రాముని వర్ణిస్తాడు.
భగవద్గీతల్లో పదునొకండవ అధ్యాయంలో అర్జునుడు చెప్పిన శ్లోకం
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్
ఇందులో అర్జునుడు కృష్ణుణ్ణి కమలపత్రాక్షుడని అంటాడు.
అందుచేత కమలపత్రచారిమ అన్న మాటలో, చారిమ అన్న సౌందర్యసూచకపదానికి అధారం ఐన కమలపత్రం ఏమిటీ అంటే అది ఒక తామరపూవు రేకుతో పోల్చబడిన సౌందర్యం అని గ్రహించాలి.
మనం చూసాం కదా, ప్రసిధ్ధంగా కమలపత్రాక్ష అని విష్ణువునీ ఆయన అవతారాలైన రామ, కృష్ణులనీ సంబోధిస్తున్నారని?
అందుచేత కమలపత్రచారిమ అంటూ తామరపూరేకువంటి ఒక ఆందం కనిపించిందంటూన్నారే అది ఆ నల్లని స్వరూపంలోని కన్నుల సౌందర్యమా? మరొకటా?
మరింత పరిశీలనగా చూదాం మరి.
కమలపత్రచారిమలో కనిపించినది సౌహృద మృదు రక్తిమ అట. ఏమిటండీ ఈ సౌహృద మృదు రక్తిమ అన్నది?
సౌహృదం అంటే సుహృద్భావం అనగా స్నేహం. మృదు శబ్దం కూడా తెలిసినదే - మెత్తనిది అని అర్థంలో. ఇక రక్తిమ అంటే ఏమిటి? ఆ మాటకు మూలం రక్త శబ్దం! రక్తం ఎఱ్ఱగా ఉంటుంది కదా. అందుచేత రక్తిమ అంటే రక్తవర్ణం - ఇంగ్లీషు వాడు బ్లడ్ రెడ్ అంటాడే ఆ రంగు అన్నమాట. ఈ సౌహృద మృదు రక్తిమ అన్న పదగుంభనంలో అన్ని మాటలకూ విడిగా అర్థాలు చూసాం కదా. ఇప్పుడు సమాహారంగా ఈ సౌహృద మృదు రక్తిమ అంటే ఏమన్న మాటా?
మొట్ట మొదట మధ్యలో ఉన్న మృదు శబ్దం రక్తిమ పైననా సౌహృదం పైననా అన్వయించేదీ అన్నది నిర్థారించుకోవాలి. మెత్తని ఎఱుపు అన్నది అసందర్భం కాబట్టి చచ్చినట్లు ఆ మృదుశబ్దం కాస్తా సౌహృదం పైననే ప్రయత్నించాలి. మెత్తని స్నేహం అన్నదేదో కొంచెం బాగానే ఉన్నట్లుంది. కొందరి దృష్టిలో కొంచెం కవిత్వపుపైత్యం అనిపించినా సరే. ఎంతో అభిమానంతో కూడిన స్నేహం అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు ఆపైన రక్తిమ అన్నది ఎలారుద్దేదీ చూడాలి. అభిమానమో స్నేహమో దేనికైనాను ఎలా రంగుపులిమేదీ? అది ఎంత అందమైన ఎరుపు ఐతే మాత్రమున్నూ?
కొంచెం క్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తోంది కదూ? అక్షరాలా క్లిష్టమైన సంగతేను.
ముందు మనం రక్తిమకు ఎక్కడైనా మానవదేహంలో అన్వయం దొరుకుతుందేమో చూదాం. అందంగా ఎఱ్ఱగా ఉన్నాయీ అని సాధారణంగా మన కవులు తెగ వర్ణించేవి ఏమిటబ్బా అంటే సులభంగానే పోల్చుకోవచ్చును.
అమ్మాయిలకైతే బింబాధరి అని ఒక పర్యాయపదం కూడా ఉంది చూడండి. ఇక్కడ బింబం అంటే దొండపండు. దొండపండు ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది కదా అని అమ్మాయిల పెదవులకు దానితో పోలిక అన్నమాట. ఇంకా చిగురుటాకుల్లాగా మృదువుగా ఎఱ్ఱగా ఉంటాయి అరచేతులూ అరికాళ్ళూ అని కూడా అమ్మాయిల పరంగా మనకి వర్ణనల్లో కనబడటం మామూలే.
ఎంతలేదన్నా విష్ణుమూర్తినీ - కృష్ణస్తు భగవాన్ స్వయమ్ - అని చెప్పటం ప్రసిధ్ధం కాబట్టి కలేసి కృష్ణుడినీ కూడా అమ్మాయిలకి చెప్పినట్లే అరవిందాక్షుడనీ గట్రా వర్ణించటం మామూలే. కావాలంటే చూడండి లీలాశుకుడు ఎలా బాలకృష్ణుణ్ణి వర్ణించాడో
కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయం తం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలాం ముకుందం మనసా స్మరామి
ఇన్ని అరవిందాలున్నాయే ఈ శ్లోకంలో, అసలు అరవిందం అంటే ఏమిటో తెలుసునా? తామరపువ్వు. విశేషంగా ఎఱ్ఱతామర పువ్వు అన్న అర్థం ఉంది ముఖ్యంగా.
అమ్మయ్య. పట్టు దొరికింది కదా?
ఇప్పుడు సౌహృద మృదు రక్తిమలోని రక్తిమ అన్నది ఎఱ్ఱతామరలోని ఎఱుపున్నూ, ఆఎఱుపు రంగు ఉన్నది సౌహృదం చిందే మృదువైన పెదవులున్నూ అనుకుంటే అంతా చక్కగా అహ్లాదకరంగా అన్వయం సిధ్ధిస్తున్నది. అదీ సంగతి.
ఇప్పుడు పాట పల్లవిని ఒకసారి మరలా చూదాం.
కలలో నీలిమ కని, నీలిమలో
కమల పత్ర చారిమ గని
కమల పత్ర చారిమలో
సౌహృద మృదు రక్తిమ కని
కలలో ఒక నల్లని స్వరూపం (అంటే నల్లనయ్య రూపం అన్నమాట) కనిపించింది. అది ఆట్టే స్పష్టంగా లేదింకా. క్రమంగా అందులో ఒక కమలపత్ర చారిమ కనిపించింది పరిశీలనగా చూస్తేను. ఆ కమలపత్రచారిమ అంటే అందమైన తామరరేకులవంటి కన్నుల సొగసు అన్నమాట. ఆ కమలపత్రచారిమలో అంటే అందమైన తామరకన్నులున్న రూపంలో అన్నట్లుగా అన్వయం చెప్పుకోవాలి - అందులో ఒక సౌహృద మృదు రక్తిమ కనిపించిందట. అంటే స్నేహపూర్వకమైన (చిరునవ్వుకల) మృదువైన అందమైన ఎఱ్ఱని పెదవులు కనిపించాయట. అంటే నల్లనయ్య స్వరూపం స్థూలంగానూ క్రమశః అందులో ఆయన అందమైన కన్నులూ పెదవులూ కనిపించాయంటున్నారు. ఇక్కడ అందచందాల ప్రసక్తి ఎందుకూ అంటే చూడండి కళ్ళు మనపట్ల ప్రసన్నంగా ఉంటేనే కదా అవి అందంగా కనిపించేదీ? అలాగే చిరునవ్వులు చిందే పెదవులే కదా అందంగా కనిపించేదీ? ఇక్కడ అంతర్లీనభావం ఏమిటంటే ఆ నల్లనయ్య మోము ఎంతో ప్రసన్నంగా ఉన్నదీ అని చెప్పటం.
ఇక్కడ మరొక రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. కమలపత్రచారిమ అన్నప్పుడు ఆ కమలపుటాలుగా కనిపించినవి పాదాలో అరచేతులో లేదా ముఖమో అనుకోవచ్చును కదా అన్నది ఎందుకు పరిశీలించలేదూ అని ఎవరైనా అనవచ్చును. సౌహృద అనే పదం కూడా అన్వయం కావలసి ఉన్నది కాబట్టి కేవలం కన్నులను మాత్రమే తీసుకొనటం జరిగింది కమలపత్రచారిమ కొరకు అని సమాధానం. కమలపు రేకులతో పోల్చటానికి కన్నులకున్న సౌలభ్యం ఇక్కడ మరింత బాగున్నది కాబట్టి అనీ మనం గ్రహించాలి.
ఈ స్వప్నదృశ్యానికి మనస్సు ఎలా స్పందించిందీ అంటే
అగరు ధూప లతిక వోలె అవశమయ్యేనే మనసు
ఎగసిపోయేనే మనసు - ఎంత వెఱ్ఱిదే
అగరుదూపం అంటే అగరు వత్తి పొగ. అదిసన్నగా ఒక తీగలాగా గాలిలో పైకి కొంచెం మెలికలు తిరుగుతూ వెళ్ళటం అందరికీ అనుభూతం ఐన విషయమే కదా. లత అన్నా లతిక అన్నా ఒక తీగ అని అర్థం. క అనేప్రత్యయం అల్పార్థాన్ని సూచిస్తున్నది కాబట్టి లతిక అంటే సన్నని తీగ అని తీసుకోవాలి. నిజమే కదా అగరువత్తి పొగ ఒక సన్నని తీగలాగా గాలిలో తేలుతూ పైకి ప్రాకుతూ పోతూ ఉంటుందీ.
ఇక్కడ అలాంటి తీగలాగా ఎగసిపోతున్నదట మనసు. ఎగసిపోవటం అంటే పైపైకి ఎగిరిపోవటం అన్నమాట. ఈ మనసు అలా ఎందుకయ్యిందీ అంటే అవశమవటం కారణం. అవశత్వం అంటే తనపై తనకు అదుపుతప్పిపోవటం - అనగా - మైమరచిపోవటం అన్నమాట. బాగుంది కదా?
మరి అలా మైమరచిపోవటం ఎటువంటిదీ అంటే అగరువత్తి ధూమపు పొగకు తనపై తనకు అదుపులేక ఎగిరిపోతూ ఉంటుందో అలాగన్నమాట. బాగుంది బాగుంది.
మరి ఆమనస్సును పట్టుకొని వెఱ్ఱిది అనటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది. మరి వెఱ్ఱి అంటేనే తనపై తనకు అదుపు లేకపోవటమే కదటండీ. ఎంత పిచ్చిపట్టినట్లుగా అయ్యిందీ అని చెప్పటం బాగున్నది కదా సార్థకంగానూ.
ఇలా అవశత్వం పొందటానికి ఆకలలో మరొక కారణం కూడా పాటలో తరువాత వచ్చే చరణాలు తెలుపుతున్నాయి.
మొదటి చరణం.
కలలో మువ్వలు విని , మువ్వలలో
సిరి సిరి చిరు నవ్వులు విని
సిరి సిరి నవ్వులలో
మూగ వలపు సవ్వడి విని
అన్నది.
కలల్లో దృశ్యమే కాదు శ్రవణం కూడా అందరికీ అనుభవమేను. ఇక్కడ ఆ శ్రవణానందమూ అనుభవం లోనికి వచ్చిందట. కలలో మువ్వల సవ్వడి వినిపించిందట. ఆ మువ్వల సవ్వడితో పాటే సిరిసిరి నవ్వులూ వినిపించాయట. ఆ నవ్వుల వెనుక ఒక మూగవలపు కూడా ధ్వనించిందట. ఇదంతా చాలా వరకూ సులభంగా అనిపిస్తోంది అర్థంచేసుకుందుకు. కాని మూగ వలపు అని ఎందుకన్నారూ?
అన్నట్లు సిరిసిరి నవ్వులూ అన్నారేమీ చిరుచిరు నవ్వులూ అనకుండా అన్న సందేహం వస్తుంది. సిరి అంటే శోభ అన్న అర్థం తీసుకొంటే ఎంతో శోభాయమానంగా ఉన్న నవ్వులు అని చెప్పుకోవచ్చును. నవ్వు శోభాయమానంగా ఉండటం అంటే ఆ నవ్వులే ఎంతో అందంగా ఉన్నాయని చెప్పట అన్నమాట.
మూగవలపు అంటే ఒకరి మనోభావాలని మరొకరితో ప్ర్రేయసీ ప్రియులు పంచుకోలేనిస్థితి. భాషతో వ్యక్తంచేసుకోలేని పరిస్థితి. దీనికి లోకవ్యవహారంగా ఐతే ఇతరుల వలన అడ్డంకులు. మరి ఇక్కడ? భాష చాలక అని అర్థం. ఏవిధంగానూ జీవుడు ఎంతప్రయత్నించినా భగవంతుడి పట్ల తనప్రేమని పూర్ణంగా భాషసహాయంతో వ్యక్తం చేయలేడు. భగవంతుడు వ్యక్తం చేయలేడు అనలేము కాము జీవుడు అందుకోలేడు కదా అని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మూగవేదన అనటం. పై చరణం కూడా వ్యాఖ్యానించుకుందాం. అప్పుడు మరింత స్పష్టత వస్తుంది.
రెండవ చరణం చూదాం.
కలలో వేణువు విని, వేణువులో
విరహ మధుర వేదన విని
విరహ మధుర వేదనలో
ప్రణయ తత్వ వేదము విని
అలా శ్రవణం చేసినది ఒక వేణువు రవళి కూడా
ఆ వేణుగానంలో ధ్వనించినది ఒక మధురమైన విరహ వేదన అట.
ఆ విరయవేదన అన్నది ప్రణయతత్త్వాన్ని సూచిస్తున్నది అంటున్నారు.
అసలు విరహం అంటే ఎడబాటు. సాధారణంగా ప్రేయసీప్రియుల మధ్య కలిగిని ఎడబాటుగా చెప్పుతూ ఉంటాం. తల్లీబిడ్డలమధ్యనో అన్నాచెల్లెళ్ళ మధ్యనో కలిగిన ఎడబాటును విరహం అని చెప్పరు. అది సంప్రదాయం కాదు.
ఇక్కడ ప్రియుడు మురళీగానవినోదుడు. అంటే కృష్ణుడు.
మరి ఆ ప్రేయసి ఎవరూ అంటే జీవుడు.
భగవంతుడు ఒక్కడే పురుషుడు అని మీరా అన్నమాట ప్రసిధ్ధం. ఒకసారి ఆవిడ ఒక స్వాములవారిని చూడటానికి వెడితే ఆయన శిష్యులు అడ్డుపడి తమ గురువుగారు స్త్రీలను చూడరూ అని సెలవిచ్చారట. అప్పుడు అన్నదట మీరాబాయి. ఓహో పరమాత్ముడొక్కడే పురుషుడు అనుకుంటున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు మీగురువుగారు అనే మరొక పురుషుడు బయలుదేరాడా అని. స్వాములవారి శిష్యులూ ఆ స్వాముల వారూ కూడా సిగ్గుపడ్డారట అని వేరే చెప్పనవరం లేదు కదా.
పరాభక్తిని గురించి 'సాతు అస్మిన్ పరమ ప్రేమరూపా' అని నారదులవారు సూత్రీకరించారు. ప్రేయసికి ప్రియునితో ఐక్యం కావటమే పరమార్థం ఐనట్లుగా జీవులు అనే స్త్రీలు భగవంతుడు అనే పురుషుడితో కలయికకు మరమప్రేమతో తపించటమే భక్తి అని దాని అర్థం.
ఈ భగవంతుడేమో దూరంగా ఉన్నాడనుకోండి. జీవుడికి విరహవేదన. అదే భక్తి. శివానందలహరిలో ఈ భక్తి అనేదానిని గురించి శంకరభగవత్పాదులు చెప్పిన శ్లోకం చూడండి
అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః పదారవింద ద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే
ఈశ్లోకానికి ఇప్పుడు మనం వ్యాఖ్య చెప్పుకోవాలంటే చాలా గ్రంథం అవుతుంది కాని, ఇక్కడ అందులోని ఒక ఉపమానాన్ని మాత్రం చూద్దాం. అది 'స్వాధ్వీ నైజవిభుం' అన్నది. పతివ్రత ఐన స్త్రీమూర్తి ఎలా తన భర్తను సర్వకాలసర్వావస్థల్లోనూ ఆశ్రయించి ఉంటుందో అలా ఉండటమే జీవుడు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉండటమే భక్తి అని అంటారు అని ఈశ్లోకం నిర్వచనం చెబుతోంది.
ఇప్పుడు పాటదగ్గరకు వద్దాం. చరణంలో ' వేణువులో విరహ మధుర వేదన విని' అన్నారు కదా.
ఇక్కడ న్యాయంగా చదువరికి ఒక సందేహం కలగాలి. విరహం అనేది ప్రేయసికి ప్రియుడు పట్ల కలిగేది కదా అని. కాదండీ పొరబడకండి. విరహం అన్నది ప్రేయసికీ ప్రియుడికీ కూడా సమానావస్థయే. కాకపోతే అది రసాభాసం అవుతుంది. ఇంగ్లీషువాడంటాడే వన్ సైడ్ లవ్ అనగా ఏకపక్షప్రేమ అనీ అలాగు అన్నమాట.
మనం సాధారణంగా జీవుడు భగవంతుడికోసం తపనపడటం గురించే ఎక్కువగా చదువుతూ ఉంటాము. అలాగే ఆ ప్రభావంతో ఆలోచిస్తూ ఉంటాము.
ఈ పాటలో అమురళీ రవంలో విరహం ధ్వనిస్తోందని చెప్పటం ద్వారా భగవంతుడు కూడా విరహంతో ఉన్నాడని చెప్పటం కనిపిస్తోంది కదా. అది గొప్పగా ఉంది.
అవునండి. అయనకూడా ఈజీవుడు ఎప్పుడు తనను చేరుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంటాడట. జీవుడు తనవైపుకు ఒక అడుగు వేస్తే అయన ఆత్రంగా ఆ జీవుడివైపుకు పది అడుగులు వేస్తాడని చెబుతారు.
సర్వశక్తిమంతుడు కదా ఆయన జీవుణ్ణి కొంచెం జబర్ధస్తీగా తనవైపుకు నడిపించుకొన వచ్చును కదా అన్న మాట వస్తుంది సహజంగా. కాని అలా కాదు. ఆయన అలా చేయడు. అది ఆయన నియమం. ఆయన చేసిన సృష్టికి ఆయన పెటిన ఒక నియమం. జీవుడికి కర్మస్వాతంత్ర్యం ఉంది. అది ఆ ప్రభువు ఇచ్చినదే. అందుచేత అ జీవుడే తనవద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అదే, ఆ ఎదురుచూపే విరహం. భగవంతుడికి భక్తుడికోసం కలిగిన విరహం అన్నమాట,
పాటలో విరహ మధుర వేదన అని ఎందుకన్నారూ అంటే విరహవేదన ఎంత దుస్సహంగా అనిపిస్తుందో అది అంత మధురంగానూ ఉంటుంది అంటారు కాబట్టి. ఎందుకంటే ఆవలి వ్యక్తి గురించిని ఆలోచనా పరంపరతో ఇతరప్రపంచాన్ని మరచి ఆ వ్యక్తి సాన్నిధ్యాన్ని మనసా అనుభవిస్తూ ఉండటం చేత. అందుకే కదా ప్రసిధ్ధమైన సినిమా పాటలో 'విరహపు చింతన మధురము కాదా' అని అంటాడు కవి.
వేణు గానం మధురంగా ఉంటుంది. అది మరింత మధురంగా ఉందట - విరహమాధుర్యాన్ని సంతరించుకోవటం వలన.
ఈ విరహ మధుర వేదనలో ఒక ప్రణయ తత్త్వ వేదం వినిపిస్తోందని పాట అంటోంది.
ఇక్కడ జీవుడికీ దేవుడికీ మధ్యన ఉన్న ఉత్తమోత్తమమైన ప్రణయం అన్నదే కదా విరహం అనే స్థాయీ భావానికి కారణం? అందుచేతనే అలా చెప్పటం జరిగింది. ఇది చాలా బాగుంది.
మరి దాన్ని వేదం అని ఎందుకన్నారూ అని సందేహం రావాలి.
విద్ అన్న ధాతువుకు తెలుసుకోవటం అన్నది అర్థం కాబట్టి వేదం అంటే జ్ఞానం అన్న అర్థం సిద్ధిస్తోంది.
ఈ భగవంతుడికీ జీవుడికీ మధ్యన ఉన్న ప్రణయభావనయే జ్ఞానం! ప్రేయసీ ప్రియులు తాము ఒకటే అనుకుంటారు. అలా అని తెలుసుకోవటమే వారి ప్రణయానికి పరమార్థం. అలా జీవుడు దేవుడితో ఒకటి కావటమే ఆ ప్రణయానికి పరమార్థం కదా. అలా తెలుసుకోవటమే అంతిమమైన జ్ఞానం. దానికి మించిన జ్ఞానం లేదు.
మరి ఆ దివ్యప్రణయాన్ని తత్త్వం అని ఎందుకంటున్నారూ అని ఆలోచించాలి.
తత్త్వం అన్న మాట తత్ + త్వం అన్న మాటల కూడిన అంటే అది నీవే అని అర్థం. ఆ భగవత్త్వత్త్వం - జీవుడూ ఒకటే. రెండుగా మాయచేత అనిపించటమే కాని ఆ దేవుడూ జీవుడూ ఒక్కరే. అదే ఆ ప్రణయతత్త్వం.
ఇదీ ఈ పాట వెనుక ఉన్న తాత్తికమైన వివేచన.
ఏదో నా చేతనైనంతగా పాటకు వివరణ ప్రయత్నించాను. ఎంత వరకూ నప్పుతున్నదీ చదువరులే చెప్పాలి.
11, సెప్టెంబర్ 2018, మంగళవారం
త్రిజగన్మోహన రూపుని
త్రిజగన్మోహనరూపుని రాముని ఋషివరులే వలచేరే
త్రిజగద్వంద్యచరిత్రుని రాముని దేవతలే కొలిచేరే
కుజనులు రాక్షసమూకలు రాముని కోదండముగని పారేరే
సుజనజనావను సీతారాముని శూరులు మిక్కిలి పొగడేరే
ప్రజలందరును సమ్మోదముతో ప్రభువుచరితము పాడేరే
విజయరాముని వీరగాథను వీనులవిందుగ పాడేరే
రాముని చరితము నిత్యము కవులు వ్రాయుచు మిక్కిలి మురిసేరే
రాముని కథలే గాయక శ్రేష్ఠులు రక్తిగొలుపగ పాడేరే
రాముని గాథలు బిడ్డ లందరకు రమణులు నిత్యము చెప్పేరే
రాముని మూర్తిని మనసున నిలిపి పామరులైన తరించేరే
రాముని సద్గుణధాముని రవికుల సోముని భాగవతోత్తములు
ప్రేమమీఱగ నాడుచు పాడుచు వివిధగతుల సేవించెదరు
భూమిని రాముని మించిన రాజును పుత్రుని మిత్రుని సోదరుని
ప్రేమమయుండగు భర్తను వీరుని వేరొక్కరిని కనలేము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)