శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ సదా భక్తితో ధ్యానముం జేయు వారే కదా ధన్యు లో రామ యట్లౌటచే నిత్యమున్ దేవ నీదివ్యరూపంబు హృద్దేశ మందుంచి పూజించి నీదివ్యతత్త్వంబు నాత్మన్ విచారించి హర్షించి నీదివ్యనామంబు జిహ్వాగ్ర మందుంచి ప్రేమానుభావంబు లోనించి ధ్యానించగా నిన్ను సంకల్పముం జేసి మున్ముందుగా తండ్రి వాత్సల్య మొప్పంగ నీదివ్యనామంబు నాసవ్యకర్ణంబునం జొన్పి నీయందు సద్భక్తి నాలోన నిండించి నన్నున్ కటాక్షించి రక్షించెనే దేవు డా శ్రీహరున్ విశ్వనాథున్ గరూత్తంశు హృద్బూమి నర్చించి నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ పంచాంగశుద్ధిన్ విచారించి యారంభముం చేయగా నేటికన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నిత్తావు యోగ్యంబు నచ్చో టయోగ్యంబంచు తర్కించుచున్ కాలముం బుచ్చగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నుంకించుచో నింతకాలంబు ధ్యానంబు సాగింతు నేనంతకాలంబు సాగింతు నంచున్ ప్రమాణించగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ సంకల్పముం జేసి యీ సంఖ్యతో పూర్తి యాసంఖ్యతో పూర్తి యంచుం ప్రమాణించగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నీ వస్త్రమాల్యాదులం దాల్చు టొప్పంచు నాభూష లాయంగరాగంబు లొప్పంచు వేషంబుపై శ్రధ్ధముఖ్యంబుగా నెంచగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ లోనెంచి ధ్యానంబుచే గల్గు నీసత్ఫలంబంచు నాసత్ఫలంబంచు బుధ్ధిన్ విచారింపగా నేటికిన్ నీయందు సద్భక్తి దీపించినం జాలు నీనామం దెంతయున్ రక్తి రూపించినం జాలు నాహారశయ్యాదు లడ్డంబులే కావు నిద్రాద్యవస్థల్ విచారింప నడ్డంబులే కావు భోగంబు రోగంబు నడ్డంబులే కావు లోకానుమోదాపవాదంబు లడ్డంబులే కావు కావంచు నాబుధ్ధిలో దేశకాలాదు లేమెంచకన్ దేహసౌఖ్యాదు లేమెంచకన్ లోకవృత్తంబు లేమెంచకన్ తుఛ్ఛమౌ కోర్కు లేమెంచకన్ నీదివ్యనామంబుపై శ్రధ్ద నిండార నీయందు సద్భక్తి నాలోన పొంగార ప్రేమాతిరేకంబుతో నిన్ను ధ్యానింతు శ్రీరామచంద్రా నమస్తే నమస్తే నమస్తే నమః