పరాయి వాడనా పలుకరా రామయ్యా
నిరాశ పరచేవు నీకు న్యాయమా
యుగములుగా నీకీర్తి నొప్పుగా చాటుచు
జగమంతా తిరుగుచుంటి జానకీపతీ
తగునని యొక్కింతగా తలయూచి చిరుచిరు
నగవులైన చిందించవు న్యాయమా హరీ
మారాముడు మారాముడు మారాము డందునే
మారజనక నాతో నొక్కసారి పలికితే
గౌరవమే తగ్గిపోదు శ్రీరామచంద్రుడా
నోరారా పలుకరించ నేరవా ప్రభూ
కూరలకై నారలకై కొరగాని వారలను
చేరిపొగడ నేరననుచు చిత్తములోన
తీరుగా నెఱుగియు సందేహమేమి నాతో
కూరిమితో మాటలాడకుందు వేలరా