నన్ను బ్రోవ రార నాదైవమా నే
నెన్న జాల నొరుల నెన్నడైనను
పాపాలు చేసితి నని భావించి విడనాడి
నాపాట్లు నావనకు నాదైవమా
పాపాలు పుణ్యాలనగ పట్టక నరజన్మ
మేపగిది వచ్చును తండ్రి ఎవ్వరికైన
నీనామ మెన్నడు నేను మానియుంటి నయ్య
నానాల్క కదియే రుచి నాదైవమా
యేనాడు నీనామ మింపార బలికితి
నానాడె నాపాపాలన్ని నాశనమాయె
రామా రామా యంటే రక్షింతు వనుచు నీ
నామమే చేయుచు నుంటి నాదైవమా
ఏమయ్యా యెవ్వడైన నింకేమి చేసేను
ప్రేమమీఱ నన్నేలగ వేగమె రార