నీయండే చాలు నాకు నీరజాక్షా నాకు
చే యందించగ దయ్య శ్రీరామా
హనుమదాదులను బ్రోచినట్టి దేవుడా నా
వినతులు వినిపించుకోరా వీరరాఘవా
ధనకనకవాహనములు దశరథాత్మజా యి
మ్మన లేదే నీకొలువే నేనడిగితి గాన
కామవైరి పొగడునట్టి ఘనుడ రాముడా ని
న్నేమని నేను పొగడగలను యినకులేశుడా
పామరత్వ మణగజేసి పరంధాముడా యీ
కామాదుల నుండి వేగమె కావమంటి గాన
మూడులోకములను కాచు పురుషోత్తముడా నిను
వేడువారి నెల్లర కాచెడు వీరరాఘవా
వేడుకతో నీనామము పాడుభాగ్యమే నీ
వాడను నా కీయమనుచునే వేడెదనే కాన