నలువకే తెలియరాదు నాకేమి తెలియును
శ్రీరామా నీవేమో శ్రీహరివే కదటయ్య
క్షీరాంభోనిధికన్యక సీతామహాలక్ష్మి
ఈరీతిగ సొదను జొచ్చుటేమి తల్లి యనుచు
ఊరకే తికమకబడె నారోజున బ్రహ్మ
గోవుల గోవత్సంబుల గోపాలకు లందరను
దేవఖాతమున దాచ నీవిధం బెఱుగగ
గోవులు గోవత్సంబులు గోపబాలురుగ నొప్పి
నీవు మెలగుచుండ గాంచి నివ్వెరపడె నజుడు
ఒకటి కాదు నాల్గు ముఖము లుండినట్టి బ్రహ్మయే
సకలేశ్వర నిన్నెఱుంగ జాలడనగ దేవా
యిక నేనా నీదు మహిమ నించుకేని గ్రహించుట
చకితుడ నరమాత్రుడ నిను శరణుజొచ్చు చుంటి