నరజన్మము వృథయేకద నారాయణా
హరిభక్తుల సాంగత్యము నాశించని వానికి
హరికీర్తన పాడ పెదవు లాడకుండు వానికి
హరితీర్ధముల నెప్పుడు నడుగిడని వానికి
నరజన్మము వృథయేకద నారాయణా
తిరుగుచును ధనములకై హరినెన్నని వానికి
తరుణులతో కూడిమాడి హరిని మరచు వానికి
పరముమరచి యిహమునకై ప్రాకులాడు వానికి
నరజన్మము వృథయేకద నారాయణా
పరాత్పర నిన్నులోన భావించి మిక్కిలిగ
పరవశించి తరచుగాను భక్తితో నోరార
హరేరామ హరేకృష్ణ యననొల్లని వానికి
నరజన్మము వృథయేకద నారాయణా