ఇదిగో రామయ్య నీ కెవరు చెప్పిరో గాని
అదనుచూచి నాతప్పులు వెదికేవోహో
కదలివచ్చి నాకై నేను కాలు మోపలేదు భువిని
పదపదమని నీవే నన్ను పంపితి గాని
వదలిపోలేను నిన్ను వద్దన్నా వినకుండా
అదయుడవై పంపినా వంతియె కాదా
నిన్ను మరచి యున్నానని నీకెవ్వరు చెప్పినారొ
అన్నన్నా నమ్మి యడుగు చున్నావు గాని
ఎన్నడైన నిన్ను గాక యెన్నితినో యన్యుని
నన్ను హాస్యమాడు టన్యాయము కాదా
మన మొక్కటి యనుచుందువు మరల తప్పు లెన్నుదువు
పనిగొని వినోదమునకు పలికెదు కాని
నిను నన్నును వేరుచేయు నేరుపుగల వారెవరు
ఇనకులోత్తమ సత్య మింతే కాదా