నదురుబెదురు లేనివాడు నా దేవుడు
చెదరని విక్రమపు సీతారాముడు
నీటిలో దూరినా వేటలాడెను
నీటబడు కొండనే మీటి యెత్తెను
వాటముగ కోరతో వసుధ నెత్తెను
ధాటిగా పగవాని గోట చీరెను
అన్ని లోకములు తానాక్రమించెను
మన్నింపక పగతుర మట్టుబెట్టెను
మున్నేరు దాటి రిపు మొత్తిజంపెను
పన్నుగా భూమికి బరువుదించెను
చూపరియై దనుజుల రూపుమాపెను
రేపు వచ్చి ఈ కలిని రేవుపెట్టును
తాపముడిపి భక్తుల దయజూచును
నా పాలిట పెన్నిధియై నన్నేలును