24, సెప్టెంబర్ 2016, శనివారం

దైవమా నీకేల దయరాదయ్యా



దైవమా నీకేల దయరాదయ్యా
ఏవిధి భవవార్నిధి నీదేనయ్యా

కనుల కెపుడు కనరాని ఘనుడవని గమనించి
మనసులోన నెంతగానొ నినుగూర్చి చింతించి
పనికిరాని భోగములను భావించుట వర్జించి
కొనసాగుచు నుంటిగద కొంచమైన దయరాదా
దైవమా

తల్లివీవు తండ్రివీవు దాక్షిణ్యమూర్తివీవు
ఎల్లచుట్టాలకన్న నెక్కుడయిన వాడవీవు
చల్లగాను చూచునట్టి సర్వలోకవిభుడవీవు
మెల్లగ నాకిపుడు కొంత మేలుచేయ తలచరాద
దైవమా

సామాన్యుడనయ్య నిన్ను చాలనమ్మి కొలుచుచుంటి
నీమమొప్ప రామరామ రామయనుచు పలుకుచుంటి
స్వామి నిన్నె తగిలియుంటి కామాదుల వదలియుంటి
శ్రీమంతుడ రామచంద్ర చింతదీర్చమనుచు నుంటి
దైవమా