తరళం. దశరథాత్మజ రావణాదిక దైత్యవీరవిమర్దనా ప్రశమితాఖిలవైరిమండల పంకజాసన సన్నుతా విశదపూతచరిత్రశోభిత వేదవేద్య సనాతనా దశదిశాధిప భక్తపోషక ధర్మవిగ్రహ రాఘవా |
తరళంవృత్తం గణాలు న-భ-ర-స-జ-జ-గ. ఈ వృత్తానికి యతిస్థానం
12వ అక్షరం. వృత్తం కాబట్టి ప్రాస నియమం ఉంది. ఇది కూడా నడక ప్రథానమైన వృత్తం. అందుచేత దీనిని మూడక్షరాల గణాల కూర్పుగా చెబితే మనకు నడక సరిగా తెలియదు!
దీని నడక ‘ననన-నానన నాన-నానన నాన-నానన నాననా’ అన్నట్లు ఉంటుంది.
స్వర్గీయ పండిత నేమాని సన్యాసిరావుగారి ఉదాహరణ పాదం ఇక్కడ శంకరాభరణం బ్లాగులో చూడండి.
ద్రవమునెల్ల హరించి కాచెను త్ర్యంబకుండు జగమ్ములన్.
మన నన్నయ్యగారు అదికవి. "ఆయనకు ప్రియమయిన వృత్త విశేషం మత్తకోకిల. ఎందుకంటే ఆయన రాసిన వాటిలో మత్తకోకిల వృత్తాలే ఎక్కువ ఉన్నాయి అని సాహితీకారులు చెపుతున్నారు. మత్తకోకిల తరువాత ఆయన ఎక్కువగా వాడిన వృత్త విశేషం తరళ" అని కవిత్రయం - వృత్త విశేషాలు అన్న జానుతెనుగు సొగసులు బ్లాగు టపాలో మాగంటి వంశీ మోహన్ గారు వ్రాసారు.