30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

వేడుకైన రాసక్రీడ వేళాయెనే

 ఏడే మన మురళీధరు డెందున్నాడే

వేడుకైన రాసక్రీడ వేళాయెనే


అదిగోనే మురళీరవ మటు వినిపించె అటు

పొదపొదలో వెదకండే మదనగోపాలుని


ఇదిగోనే మురళిపాట యిటు వినిపించె యిటు

వెదకండే పూలపొదల వెన్నదొంగ కృష్ణుని


వినబడెనే పొన్నచెట్టు వెనుకనుండి మురళి మరి

కనుగొనరే మనకృష్ణుడు కలడేమో అచటనే


మనమధ్యనె మురళీస్వనమును విఃటినే సఖి హరి

మనలో నొక గోపికయై మసలుచున్నా డేమో


పొదపొదలో వినిపించునె ము‌ళీరవము ఇక

వెదకుట మన వశముకాదె వీడు మాయలోడే


అన్ని తరుశాఖలపై హరి యడిగోనే మన

పున్నెములివె పండినవే పుణ్యశీలలారా


మనమధ్యనె కలడే హరి మానినులారా ఇదె

కనుగొనరే మురళీధరు కన్యామణులారా


అడిగోనే చందమామ ఆకసమున కెక్కె హరి

ఇడుగోనే పొన్నచెట్టు నెక్కె పాటపాడగా


ఇదిగో నా.చేయిపట్టి యెగురుచున్నాడే యిదె

మొదలాయెనె రాసక్రీడ మోహనాంగులారా


29, సెప్టెంబర్ 2022, గురువారం

మాకు తనివితీరలేదు మరల నూదరా

నీకు మ్రొక్కేమురా గోకుల బాలా
మాకు తనివితీరలేదు మరల నూదరా 
 
ముధ్దుముధ్దు మాటల మోహనకృష్ణా ఇంక
సధ్దుచేయము లేరా చాలనకురా
పొద్దుపోయిన దింక పొండన బోకు మాకు
సుధ్దులేమి బోధింపజూడకు కృష్ణా

ఒక చిన్న పాటపాడి ఉవిదలారా నేటికి
యికచాలు ననరాదు ఎట్లుచాలురా
ఒకటి రెండు ఝాములైన యొప్పిదమేరా మాకు
వికచాబ్జనయన కృష్ణ వినిపించుమురా

మురళిపాట వినుటకే పుట్టినామురా కృష్ణ
మరలమరల వినకుండ మరలగ లేము
పరమమధురమైన మురళిపాటకన్న మాకేదీ
ధరణిమీద హితము కాదయ్యా బ్రతుకున

26, సెప్టెంబర్ 2022, సోమవారం

మనసులోపల నున్న మారామునే

మనసులోపల నున్న మారామునే మేము
తనివార కొలిచెద మని యెఱుగుడు

వాడెంత సుముఖుడో వాడెంత సులభుడో
వాడెంత సరసుడో వాడెంత వరదుడో
వాడెంత మనసున్న వాడో జనులార
వాడెంత కరుణగల వాడో మా రాముడు

అన్ని వేళల పలుకు నట్టి మాదేవునే
అన్ని బాధల తీర్ఛు నట్టి మాదేవునే
అన్ని వరముల నిచ్చు నట్టి మాదేవునే
మన్నించి మమ్మేలు హరినే రామునే

సీతాసమేతుడగు శ్రీలక్ష్మణాగ్రజుడు
ప్రీతితో మాలోన విడిసియున్నా డిదే
ఆతని దయగల్గి యాతడే దేవుడని
మాతండ్రి యనుచును మారామునే 

 

24, సెప్టెంబర్ 2022, శనివారం

కాలి గజ్జెలు ఘల్లుఘల్లన రారా

కాలి గజ్జెలు ఘల్లుఘల్లన రారా కమలదళాక్షా రారా

నందగోపబాల రారా ఆనందతాండవ కృష్ణ రారా
సుందరసుకుమార రారా ఓ సోగకన్నుల పిల్లగాడా
బృందావనానంద రారా నీ విరహమోర్వగలేము రారా
ఎందెందు వెదకేము రారా నీ వెందున్న దయచేసి రారా
 
నీలగగనశ్యామ రారా మేము నీవారమే కద రారా
కాళీయమర్దన రారా మాకన్నుల వెలుగా రారా
వేళాయె వేళాయె రారా ఇదె విచ్చేసె చంద్రుడు రారా
లీలామానుషరూప రారా వనమాలాధరా యింక రారా 

మురళిని వాయించ రారా ఏపొదలోన దాగుంటి వౌరా
నెఱజాణతనమున కృష్ణా నీసరివారు లేరయ్య రారా
హరి నీకు మ్రొక్కేము రారా మమ్మాటపట్టించకు రారా
కరుణతో‌ మమ్మేల రారా మము పరవశింపజేయ రారా 
 

22, సెప్టెంబర్ 2022, గురువారం

శ్రీమన్నారాయణ నీనామములు

శ్రీమన్నారాయణ నీనామము లేమరకుండ స్మరింతుమయా

మామా జన్మములకు సాఫల్యము స్వామీ యిక కలిగించవయా


కేశవ మాధవ గోవిందా నరకేసరి వామన యందు మయా

దాశరథీ మధుసూదన శ్రీహరి దయామయా యని యందు మయా

శ్రీశా త్రిజగదధీశా పాపవినాశా వరదా యందు మయా

నాశనరహితా దేవగణహితా నందకుమారా యందు మయా


విశ్వవినుత హరి ధర్మవిదుత్తమ విషమశ్శూన్యా యందు మయా

విశ్వేశ్వర పరమేశ్వర శాశ్వత విశ్వదక్షిణా యందు మయా

విశ్వమోహనా వాసుదేవ రిపువీరవినాశక యందు మయా

విశ్వరూప శ్రుతిసాగర రామా వేదవేద్య యని యందు మయా


అనాథనాథా సురేశ అవ్యయ అనాదినిధనా యందు మయా

అనంతరూపా విశ్వాధారా అచ్యుత ధాతా యందు మయా

జనార్దనా హరి దనుజమర్దనా జానకిరమణా యందు మయా

సనాతనా మధుసూదన కృష్ణా సర్వేశ్వర యని యందు మయా

21, సెప్టెంబర్ 2022, బుధవారం

వ్యామోహములు చాలు నయ్యా

వ్యామోహములు చాలు నయ్యా యికనైన

రామ రామా యన రాదా


కామితవరదుని కమలదళాక్షుని

రాముని కొలువగ రాదా

స్వామి కటాక్షము చాలును నాకని

నీమది నెంచగ రాదా


ఏది శాశ్వతమై యెసగును జనులకు

మేదినిపై నన రాదా

వేదవేద్యుడగు వెన్నుని తలచుచు

మోదము నందగ రాదా


రవికులతిలకుడె రక్షకుడన్నది

భువినిప్రసిధ్ధము కాదా

భవతారకమగు పావననామము

నవలంబించగ రాదా


18, సెప్టెంబర్ 2022, ఆదివారం

రామచంద్ర నిను రక్షణ కోరితి

రామచంద్ర నిను రక్షణ కోరితి

స్వామీ నీవే శరణమయా


దేవదేవ నిను తెలియగ లేరట

దేవతలైనను తెల్లంబుగ నిక

భావజజనక వాతాత్మజనుత

భావింపగ నెవ్వాడనయా


పరిపరి విధముల నరిషడ్వర్గము

దురితములకు నను ద్రోయగను

మరల బుట్టుచును మరల జచ్చుచును

కర మలసితిరా ఘనశ్యామా


దివికిని భువికిని త్రిప్పకు మయ్యా

చివరి జన్మమిది చేయగదయ్యా

భవతాపము నోర్వగజాలనయా

రవికులనాయక రామయ్యా



15, సెప్టెంబర్ 2022, గురువారం

ధనధనేతరముల వలన

ధనధనేతరమురముల వలన తప్పక సుఖ మున్నదా

మనసిజగురుసేవ లోన మనకు సుఖం బున్నదా


పేరాశను బొంది నరులు వెదకివెదకి సంపదలను

ధారుణి గాలించి తమకు దక్కినంత సాధించి

ఆరాటపడుచు బొక్కుచు నధిక మన్వేషించుచును

వారు పొందు సుఖ మంతయు వట్టిభ్రాంంతియే కదా


స్మరవిరోధి యుపదేశము చక్కగాను గ్రహియించి

హరినామము లందు శ్రేష్ఠమైన రామనామము గొని

నిరంతరము జపముచేయు నిర్మలాత్ములైన యట్టి

హరిభక్తులు పొందుసుఖం బంతులేనిది కదా


వెంటరాని ధనాదులకు వెంపరలాడుటలు మాని

కంటగించి మోహాదివికారములను తెగగోసి

బంటులగుచు రామచంద్ర ప్రభువును సేవించుచు

నంటకాగి యుండు వారి దసలుసిసలు సఖము


అంతే నయ్యా హరి యంతే నయ్యా

అంతే నయ్యా హరి యంతే నయ్యా యిది
యంతయు నీయిఛ్ఛయే యందు నయ్యా

ధరణి సుజను లెల్ల నిను దైవరాయడా
కరము పొగడుచుండ వినుచు మురియుదు నయ్యా
నిరంతరము నీనామము  నెమ్మది నెంచి
పరమసంతోషముగను పలుకుదు నయ్యా

రామ రామ రామ యనుచు రసన పాడగా
భూమిజారమణ చాల పొంగుదు నయ్యా
నీమహామధురదివ్య నామము నించి
రామచంద్ర సంకీర్తన లల్లితి నయ్యా

నేను నీవాడ నగచు నిలచితి నయ్యా
మానక నామీద దయ రానీ వయ్యా
నే నెన్ని జన్భ లెత్తినానో స్వామీ
దానికేమి యిదే కడది కానీ వయ్యా

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

దినమణికులమణిదీప

దినమణికులమణిదీపా రాఘవ
దనుజకులాంతక దారుణచాపా

దేవదేవ హరి త్రిభువనపోషక
పావననామా భవభయనాశక
భావజజనకా రావణనాశక
సేవకసుజనవిశేషవరప్రద

అగణితదివ్యగుణాన్విత రామా
గగనశ్యామా విగుణవిరామా
జగదభిరామా జానకిరామా
నిగమవినుత హరి జగదోధ్దారక

చిరసుఖదాయక వరమునిసన్నుత 
సురగణసన్నుత విరించిసన్నుత
పురహరసన్నుత భూజనసన్నుత
నిరుపమవిక్రమ పరమపురుష హరి

ఎవరి మాట లెటు లున్న

ఎవరి మాట లెటు లున్న నేది నీమాట నా
కెవరయ్యా నీకన్న నెక్కువ రామా

పవలురేలును నీదునామము వదలని వాడ ఈ
భువిని కాదా దివిని గూడను భూరికృపాళో ఓ
పవనసూనుసమర్చితం బును పరమపావనము ఈ
భవరుజాంతక మైన నామము వదలనే కాదా

పదుగు రాడెడు మాట చెల్లగ వచ్చునీ భువిని ఆ
పదుగురును నను తెగడి యెగ్గులు పలికితే నేమి ఓ
సదయ నీకృప నేను బడయగ జాలితి నేని నా
మదిని నిన్నే నమ్మియుంటిని మాటలాడవయా

ఎవరి మెప్పును కోరబోనే యెఱుగవా నీవు నే
నెవరి తప్పుల నెంచబోనే యెఱుగవా నీవు న
న్నెవరు మెచ్చిన మెచ్చకున్నను యించుకంతగ ఓ
భువనమోహన నీవుమెచ్చిన మురిసెదను గాదా



10, సెప్టెంబర్ 2022, శనివారం

పెదవిచివరి మాటలనే‌ పెద్దనింద వచ్చినది

పెదవిచివరి మాటలనే‌ పెద్దనింద వచ్చినది
మదిని కలచునోయి ఆ మాట నేడు
 
ఏనాటిదొ యీపున్నెం బీనాడు నిను పొగడుచు
తానెంతో మురియుచున్న దాయెనీ మనసే
తానాడెడు పలుకులను ధర నున్న కొంద రిపుడు
మానకను పెదవిచివరి మాట లందురా

ఈ యక్షరాలు పదము లీవాక్యము లెవ్వరివి
ఈ యపురూపపు భావంబు లెవ్వ రిచ్చి రోయి
చేయి పట్టి చేరదీసి వ్రాయించున దెవరోయి
హాయిగా పెదవిచివరి వందు రటోయీ

అన్నియు నిటు నీవగుచు నలరెడు నీ కీర్తనల
నెన్నుదురో తేలికగా నిట్లు పరిహసించి
తిన్నగ నీప్రసాద మని తెలియరే రామయ్యా
నిన్నే తిరస్కరించ నేరుతు రయ్యా

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రసనా ఈ శ్రీరామనామమే

రసనా ఈ శ్రీరామనామమే రసరమ్యము కాదా
వాసిగ మోక్షప్రదాయక మగుచు భాసించును కాదా

ప్రీతిగ పలుకుచు నుండిన సర్వాభీష్టము లిచ్చు గదా
చేతోమోదము గూర్చుచు భక్తుల చింతలుడుపు గాదా
సీతారాముల దయామృతమునే చిలికించును కాదా
భూతలవాసుల కంతకు మించిన భూరిభాగ్య మేదే

వీరిని వారిని పొగడుచు నెందుకు వీఱిడి వయ్యెదవే
ఊరక సామాన్యులను పొగడిన నుపయోగము కలదా
నారాయణుని పొగడిన తలచిన నరుడు తరించేనే
శ్రీరామా యను శుభనామమునే ప్రీతిగ పాడగదే

తారకనామము కన్న తీయనిది ధరపై లేదు కదా
మారాడక శ్రీరామనామమే మానక పాడగదే
మారజనకుని వేయినామముల మధురమధుర మనుచు
పేరుకెక్కిన రామనామమును విడువక నుండగదే



శ్రితజనపోషక మము నీవే రక్షించవలయు రామా


శ్రితజనపోషక మము నీవే రక్షించవలయు రామా
చ్యుతి లేనట్టి పదంబు నొసగి యచ్యుత రక్షించవయా

రామా మేఘశ్యామా నిన్నే మేము నమ్మి నాము నీ
నామామృతమును గ్రోలుచు మహదానందము పొందేము
కోమలనీలసరోజశ్యామా భూమిసుతారమణా ఓ
శ్రీమద్దశరథనందన మమ్ము చేరదీయవయ్యా

నాలుగుదిక్కుల నీజయగాథలు నవ్వుచు చదివేము ధర
నేలెడు ప్రభువన నీవే నన్నది నిజమని చాటేము
కాలంబునకు నిలచిన యశమును గలిగిన శ్రీరామా మా
నాలుక లెప్పుడు నీకీర్తనలే‌ యాలపించు చుండు

భవసాగర మీదుట యన్నది మా వలన గాదు కనుక నీ
భవతారకమగు శుభనామమునే వదలక నుడివేము
రవికులతిలకా రామచంద్ర మా ప్రార్ధన మన్నించి ఓ
పవనసుతానుత దయతో మాకపవర్గము నీయవయా

కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే?


కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే? 
 
కాకూడదని రూలు ఏమన్నా ఉందా? 
 
ఊరకే‌ తమాషాకు ఈవిషయంలో కొంచెం ఆలోచన చేదాం.
 
ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడు. ఆయన పార్టీకి విదేశాల్లో కూడా అదరణ ఉన్నది. కొన్ని దేశాల్లో పార్టీశాఖలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఆయన ఒక రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. అంతే కాదు మూడవసారి కూడా ఆయన ఆ తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది జరుగకూడదనే కేంద్రంలో ఉన్న అధికారపార్టీతో సహా అనేక పార్టీలు కాళ్లాచేతులా ఆయనను అడ్డుకోవాలని నానాతంటాలూ పడుతున్నాయి.

జాతీయపార్టీని స్థాపించి దేశోధ్ధరణచేసే ఉద్దేశాన్ని ఆయన ఎన్నడో బయటపెట్టారు. అది జరిగేది కాదులే అన్నట్లు మిగిలిన జాతీయ పార్టీలు కొంచెం తేలిగ్గా  తీసుకున్నట్లు అనిపిస్తోంది. కాని ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన జాతీయరాజకీయరంగంలో చక్రం తిప్పటానికే కాదు అధికారాన్ని హస్తగతం చేసుకుందుకూ ఉవ్విళ్ళూరుతున్నారని స్పష్టం అవుతోంది.

అందుచేత ముందుముందు ఆయన ప్రధాని అయ్యే అవకాశాలను ఏపార్టీ కాని తేలిగ్గా తీసుకోవటం కుదరదు.

ఇంతకూ ఆయన ప్రధాని అవ్వాలని కోరుకోవటం వెనుక కారణాలు ఏమిటీ అని ఆలోచిస్తే తోచే జవాబులు ఇవి:
  • భారతీయ జనతా పార్టీ తాను కేంద్రంలో అధికారంలో ఉండటమే‌ కాక ఇతరరాష్ట్రాలలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరం అనుకుంటే అడ్డదారుల్లో కూడా ఇతరపార్టీల ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారాన్ని లాక్కుంటోంది. అది నైతికం కాదు.
  • ఏవో‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏమి తంటాలు పడితే నేమీ? అది తెలంగాణాలోకూడా అధికారంలోనికి రావాలని ఎత్తులు వేస్తోంది. అదెలా సహించటం? తెలంగాణాపై తమ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి తప్ప మరెవరికీ హక్కు లేదే? ఉండరాదే? ఉండనివ్వమే! ఎలా ఊరుకోవటం? దీనికి విరుగుడుగా భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టటమే మందు కదా.
  • దేశంలో కాంగ్రెసు పార్టీ‌ కూడా ఒకప్పటి పెద్దపార్టీ కాని నేడు అది దీనావస్థలో ఉంది. అది కోల్పోతున్న ఓట్లబ్యాంకులను భారతీయ జనతా పార్టీ కొల్లగొడుతోంది. ఆ పని తామే చేయవచ్చు కదా తమ జాతీయ పార్టీతో? భారతీయ జనతా పార్టీ వారిని ఇంకా బలపడ నీయటం ప్రమాదం కదా?
  • బంగారు తెలంగాణాని సాధించటం అనే‌కర్తవ్యం పూర్తి అయింది. దాన్ని పరిపాలించే బాధ్యతను తమ తెలంగాణా రాష్ట్రసమితి స్వీకరించి దిగ్విజయంగా నడిపిస్తోంది. ఆ పంథాలో కొనసాగటానికి తన వారసులు ఉంటే చాలు. తనకు జాతీయ రాజకీయాల్లో కూడా విజయపతాకం ఎగురవేసే అవకాశం ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవటం ఎందుకు?
  • కేంద్రం తెలంగాణానూ ఆంధ్రానూ సమానంగానే చూస్తున్నాం అంటోంది. అదెలా ఒప్పుకోవటం. తెలంగాణానే‌ కదా ఎవరైనా పెద్దగా చూడవలసింది. 
  • కేంద్రం నుండి తాము అడుగుతున్నవి అరకొర గానే అందుతున్నాయి. అదే, కేంద్రంలోనూ తమదే అధికారం ఐతే తమకు కావలసిన వాటిని హాయిగా ఏ ఇబ్బందులూ లేకుండానే‌ పొందవచ్చును కదా. ఎన్నో‌ కొత్త ప్రాజెక్టులని ఏ‌ఆడ్దంకీ లేకుండా కట్టుకోవచ్చును. ఇతర రాష్ట్రాల - ముఖ్యంగా ఆంద్రా వారి - ప్రాజెక్టులను సులభంగా అడ్డుకోవచ్చును.
  • ఆంద్రతో వైరం ఉందంటే ఉంది. లేదంటే లేదు. అక్కడ తమ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. కాని ఎంతైనా రాష్ట్రప్రయోజనాలు అంటూ తరచూ అడ్డుపడుతూనే ఉంది. ముందుముందు వచ్చే‌ ప్రభుత్వాలు అంధ్రాకు కాని మరింతగా సహాయపడవచ్చును. అప్పుడు తెలంగాణాలో తమ పట్ల నిరసనలు రావచ్చును కదా. అందుచేత ఆంద్రావారికి చెక్ పెట్టేందుకు సరైన దారి, కేంద్రంలో తామే అధికారాన్ని అందుకోవటం.
  • తమ వారికి ఎంత కాలం రాష్ట్రంలో చిన్నా చితకా పదవులు ఇస్తూ సంతోషపెట్టటం? కేంద్రంలో అధికారాన్ని పొందితే అప్పుడు తాను ప్రధాని, తన వాళ్ళను అనేక పెద్దపదవుల్లో పెట్టవచ్చును. ఉదాహరణకు కేటీఆర్ గారికి తెలంగాణాను అప్పచెప్పవచ్చు. హరీష్ రావును ఎక్కడికన్నా గవర్నర్ హోదాలో పంపవచ్చును. కవితను కేంద్రంలో హోం వంటి ముఖ్యశాఖకు మంత్రిని చేయవచ్చును. ఇంకా సంతోష్ వగైరాలున్నారు - వాళ్లకూ మంచిపదవులే ఇవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారంతో ఎంతమందికని మంచిస్థాయి కల్పించటం కుదురుతుంది?

ఇలాంటివే మరొక కొన్ని కారణాలు ఉండవచ్చును నాకు ఇంకా తట్టనివి.

ఏదైతేనేం కేసీఆర్ గారు కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. శుభం.

ఒకవేళ కేసీఆర్ గారు కాని ప్రధాని ఐతే అప్పుడు జరిగే పరిణామాలు కొన్ని పైన సూచించన దాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నా మరికొంతగా బేరీజు వేదాం.

  • ఎప్పటిలాగే దేశపరిపాలన ఐనా సరే హైదరాబాదులోని కేసీఆర్ గారి ప్రగతిభవన్ నుండే‌ జరుగుతుంది. ఒకవేళ ఆ భవనం చాలదూ అనుకుంటే మరొక కొత్త భవనం వెలుస్తుంది ఆయన ఫార్మ్‌హౌస్‌లో. అంతే కాని ఆయన ఢిల్లీలో కూర్చుని పనిచేయరు.
  • చిన్న చితకా పార్టీలన్నీ కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం అవుతాయి.
  • కాంగ్రెసు పార్టీ కూడా కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం కాక తప్పదు - కొంచెం మొరాయించినా.
  • భారతీయ జనతా పార్టీ అక్రమాల మీద విచారణ మొదలవుతుంది. 
  • వైకాపా వారు కేంద్రంలో అధికారం పంచుకుందుకు అంగీకరిస్తారు.
  • మజ్లిస్ పార్టీ వారు కేంద్రంలో అధికారంలొ ముఖ్య భాగస్వామ్యం వహిస్తారు.
  • కేసీఆర్ గారితో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఇతర పార్టీలలో కొన్నింటికి సహాయ మంత్రుల వంటి చిన్నచితకా పదవులు దక్కుతాయి. కొన్నింటిని కేసేఆర్ గారు చెత్తబుట్టలో వేసేస్తారు.
  • మరిన్ని పరిశ్రమలు తెలంగాణాకు వస్తాయి. తెలంగాణా వారు వద్దన్నవి మాత్రమే యితరరాష్ట్రాలకు దక్కుతాయి.
  • భారతదేశ చరిత్రను కాంగ్రెసు వారు కంగాళీ‌ చేసారని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టింది చరిత్రను పునర్లిఖించే ఉద్యమాన్ని. అది కొనసాగుతుంది. అతే మరో కోణంలో. అందులో కాంగ్రెసు చేర్చిన కహానీలూ భాజపా చేరుస్తున్న కహానీలూ అన్నీ ఎగిరిపోతాయి. కొత్త చరిత్రను - తెలంగాణా ఎలా భారతస్వాతంత్రాన్ని తెచ్చిందీ అన్న కోణంలో ముందు ముందు చదువుతాము.
  • సర్దార్ వల్లభాయి పటేల్ దుర్మార్గుడు అని ఋజువు చేసే కార్యక్రమం మొదలౌతుంది. ఆయన హైదరాబాదు మీద్ చేసిన దురాక్రమణను గురించిన కథనాలు జాతీయమీడియాలో ప్రముఖంగా చర్చిస్తారు.
  • నిజాం దొరల కీర్తిని చాటటం కోసం అనేక కార్యక్రమాలు మొదలౌతాయి. 
  • స్వాతంత్రోద్యమంలో కేసేఆర్ పూర్వీకులు చేసిన త్యాగాల కథలు వెలుగులోనికి వస్తాయి.
  • హరీష్ రావో‌ మరొక కేసీఆర్ దగ్గర బంధువో ఆంధ్రాకు గవర్నర్ అవుతారు.
  • పార్లమెంట్ సమావేశాలు అప్పుడప్పుడూ‌ కొద్ది రోజుల పాటు జరుగుతాయి. ఊరికే‌ ఎక్కువ రోజులు సాగతీసి ప్రజాధనం దుర్వినియోగం చేయరు.
  • ఒకటి రెండు దఫాలు కేసేఆర్ గారు ఎన్నిక చేసిన వ్యక్తులు రాష్ట్రపతులూ ఉపరాష్ట్రపతులూ అవుతారు. దరిమిలా అధికారం కేటీఆర్ గారికి ఒప్పచెప్పి కేసీఆర్ గారే రాష్ట్రపతి పదవిని అలంకరించి దానికి వన్నె తెస్తారు.
  • కేసేఆర్ భజన సంఘాల నాయకులు మేధావులుగా గుర్తింపు పొంది అనేక కీలక మైన పదవుల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు.
  • మళ్ళా భారతదేశానికి అమెరికా లాగా  అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే‌ మంచిది అన్న చర్చ మెల్లగా మొదలౌతుంది. 

ఇంకా చాలా జరుగవచ్చును.  వేచి చూడండి!

5, సెప్టెంబర్ 2022, సోమవారం

నా గురువులు - 1

ఈరోజున ఉపాధ్యాయదినోత్సవం అంటున్నారు. ఈరోజు భారతరాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ప్రతిసంవత్సరమూ ఈ సెప్టెంబరు 5వ తారీఖును జాతీయఉపాధ్యాయదినోత్సవంగా మనం వాడుక చేస్తున్నాం.

నిజానికి సంప్రదాయికంగా మనకు గురుపూర్ణిమ అనే వేరే గురుసంస్మరణోత్సవ దినం ఉంది. అది వేదవ్యాసమహర్షిని మనం గుర్తుచేసుకొని ఆరాధించటానికి సంబంధించినది.

ఈ రెండు ఒక్కలాంటివే అనిపించవచ్చును కాని వేరువేరు.

ఈరోజును భండారు శ్రీనివాసరావు గారు ముగ్గురు గురువులు అని ఒకటపా వ్రాసారు. మరికొంతమంది కూడా సందర్భానుసారం ఏమన్నా టపాలు వ్రాసారేమో. ఇంకా చూడలేదు.

నాకు మాస్వగ్రామం లక్ష్మీపోలవరంలో అక్షరాభ్యాసం జరిగింది. కొంచెం కోలాహలంగానే‌ జరిగింది. ఇంటికి పెద్దపిల్లవాడిని కదా, ఆమాత్రం చేయరా ఏమి? మాగ్రామంలోని ప్రాథమికపాఠశాల మాయింటికి అక్షరాలా కూతవేటు దూరంలోనే ఉంది. అందుచేత ఆపాఠశాల ఉపాధ్యాయులూ విద్యార్ధులూ అందరూ వచ్చారు. బొందుపలకా బలపాల పెట్టే సిధ్ధంగా ఉన్నాయి. నాకు ఒక తెల్లచొక్కా పాంటు కుట్టించారు. అవి వేసి అక్షరాభ్యాసం చేయించారు. ఓనమాలు దిద్దించినది ఆపాఠశాల ప్రథానోపాధ్యాయులు. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన్ను అందరూ మాస్టారూ, పోస్టుమాష్టారూ అనటమే మరి. పిల్లలందరకూ పప్పుబెల్లాలూ పలకలూ పంచాం. ఆరోజునుండి బడిచదువు ప్రారంభం అయింది. 

ఆ పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు. పోష్టుమాష్టారు గారే ప్రథానోపాధ్యాయులు. ఆయనకు పెద్ద బొట్టొకటి ఉండేది. భలే లావుపాటి పెన్నొకటి ఉండేది చొక్కా జేబులో. వాళ్ళబ్బాయి కూడా అదే పాఠశాలలో విద్యార్ధి.

రెండవ ఉపాధ్యాయులు ఆలీఖాన్ మాష్టారు. పొడుగ్గా సన్నగా కోలముఖంతో ఉండేవారు. తెలుగుభాష అంటే ప్రాణం ఆయనకు. మాకు దస్తూరీ నేర్పించేవారు ముఖ్యంగా. గణితం కూడా చెప్పేవారు.

మూడవ ఉపాధ్యాయులు కటాక్షమ్మ గారు. ఆవిడే ముఖ్యంగా నాకు చదువు చెప్పారు. అమ్మా ఆవు ఇల్లూ అంటూ మొదలుపెట్టి. సాయంత్రం పాఠశాల బయట చెట్టుక్రింద పిల్లల్ని కూర్చోబెట్టి చిట్టిపొట్టి కథలూ పాటలూ చెప్పేవారు.

నాకు కటాక్షమ్మ గారితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆవిడ మా ఊరికి రోజూ లాంచీ మీద ప్రయాణం చేసి వచ్చేవారు. ఆ పాఠశాల మాయింటికి చాలా సమీపంలోనే ఉండేది. రోజూ ఆవిడ మాయింటికి వచ్చి నన్ను కూడా పాఠశాలకు తీసుకొని వెళ్ళేవారు.

ఒకరోజున ఆవిడ ఎందుకో బడికి రాలేదు. అందుచేత నేనూ‌ బడికి పోలేదు! మర్నాడు ఆవిడ వచ్చి నిన్న నువ్వెందుకు బడికి పోలేదూ అని అడిగింది. మరి నువ్వెందుకు రాలేదూ నాకోసం అని అడిగాను ప్రతిగా. ఆవిడకు నవ్వు వచ్చింది కాని మానాన్నగారికి చిరుకోవం వచ్చింది. అలా ఉపాధ్యాయులకు ఎదురు సమాధానం చెప్పకూడదని కొంచెం హితబోధ చేసారు. రేపటినుండి నీ అంతట నువ్వే బడికి వెళ్ళలి అని చెప్పారు కూడా.

ఐనా ఆవిడ వస్తూనే ఉండే వారు లెండి నాకోసం. నన్ను బాగా ముద్దు చేసే వారు.

అంత ముద్దుచేసినా ఒక సారి పిచిక అనే‌ పాఠం అప్పచెప్పలేకపోయానని బాగా కోప్పడ్డారు. కోపం నాకు మాత్రం రాదా ఏమిటీ? నేనూ కోపంగా పాఠశాల పిట్టగోడ దూకి రెండంగల్లో ఇంటికి పోయానంతే. పాపం ఆవిడ మాయింటికి వచ్చి ఎంతోసేపు బ్రతిమలాడి మళ్ళీ పాఠశాలకు తీసుకొని వెళ్ళారు ఆరోజున.

అవిడ చెప్పిన కథలూ పాటలూ అన్నీ రోజూ సాయంత్రం ఇంటికి వచ్చాకా మాఅమ్మగారికి చెప్తూ ఉండేవాడిని. ఆపాటలైతే డాన్సు చేస్తూనే చెప్పటం. అందులో ఒకపాట "అమ్మ చెప్పిన్ మాట వినకపోతే నీవును - అలాగె కష్టపడవలెన్" అని ఉండేది.

నేను పెరిగి పెద్దై ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడిన తరువాత కూడా మాస్వగ్రామానికి వెళ్తూనే ఉండే వాడిని. నేను ఊళ్ళోకి వచ్చాన్నన్న వార్త కటాక్షమ్మ గారికి ఎలా తెలిసేదో తెలిసేది. వెంటనే, అప్పటికే వృధ్ధురాలైన అవిడ లాంచీ ఎక్కి గోపాలపురం నుండి లక్ష్మీపోలవరంలోని మాయింటికి వచ్చే వారు నన్ను చూడటానికి.

ఆవిడను నేను ఎన్నడూ 'మీరు' అని పిలిచింది లేదు - ఎప్పుడూ 'నువ్వూ' అనే. చిన్నప్పుడు బాగానే ఉంటుంది కాని పెద్దవాడిని అయ్యాక కూడా అలాగే పిలిచే వాడిని. ఆవిడా ఏమీ అనుకునేది కాదు. కాని ఒక సారి మాత్రం "నేను నీకు గురువును కదా. నన్ను నువ్వూ అని పిలవచ్చా" అంది. "నాకు మా అమ్మ ఎంతో నువ్వంత. ఎవరన్నా అమ్మని మీరూ అంటారా" అని చెప్పాను. ఆవిడకు ఎంతో సంతోషం కలిగింది.

మొదట్లోనే పలకా బలపం అనుకోకండి. నేను ఐదో తరగతిలో కూడా పలక బలపం వాడాను. అప్పట్లో అంతే.  రెండో తరగతిలో నాచేతికి పెన్సిల్ వచ్చింది కాని ఎక్కువభాగం బలపంతోనే చదువు. డబుల్ రూళ్ళ పుస్తకంలో ఆలీఖాన్ మాష్టారు మాకు చూచివ్రాత నేర్పేవారు. ఆయనకు తెలుగు అంటే ప్రాణం. మేం అక్షరాలు వంకరటింకరగా గిలికితే ఆయన గిలగిల్లాడేవారు. ఒరే తెలుగు అక్షరాలు ముత్యాల్లా ఉంటాయిరా. ఇంత అందమైన అక్షరాలు మరే భాషలోనూ లేవురా. చక్కగా గుండ్రంగా వ్రాయాలిరా అని బుజ్జగిస్తూ ఉండే వారు మమ్మల్ని.కాని అ గుండ్రంగా వ్రాయటం మాకు ఒకపట్టాన కుదిరేది కాదు.

ఒక సారిమాత్రం నేను చాలా చక్కగా ఆయన పేజీ మొదట్లో వ్రాసిన లైనులో ఉన్నంత గుండ్రంగానూ అందంగానూ చూచివ్రాత వ్రాసాను. నాకే పిచ్చి ఆనందం కలిగింది. వెంటనే ఆలీఖాన్ మాష్టారి ఇంటికి పరుగెత్తాను. ఆయ నుండే ఇల్లు మావీధి చివర్లోనే ఉండేది లెండి. వెళ్ళి ఆయన మీద పడ్డాను చూడండి ఎంత గుండ్రంగా రాసానో గుడ్ అని చెప్పండి అని హడావుడి చేసాను. ఓరేయ్ నేను ఇప్పుడు అన్నం తింటున్నాన్రా. తిన్నాక చూస్తాను సరేనా అంటే వింటేనా? చూడండి ఎంత గుండ్రంగా రాసానో అని గోల, చివరకు ఆయన కుడిచేయి అంటచేయి కాబట్టి ఎడం చేత్తోనే పుస్తంకం అందుకొని చూసి బాగుంద్రా అంటే మరి గుడ్ అని రాయండి అని నా డిమాండ్.

ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి కొడుకు కూడా మాతో చదువుకున్నాడని చెప్పాను కదా. మేము పెద్ద ఐన తరువాత కూడా కొన్ని సార్లు మాఊళ్ళో కలుసుకున్నాం. అప్పుడు పెద్దాయనను ఒకసారి కలుసుకున్నానని గుర్తు.

మాఊరి బడిలో నేను చదివింది మూడోతరగతి వరకే. అదీ మధ్యలో ఉండగా గెద్దనాపల్లె వెళ్ళిపోయాం. అక్కడ మానాన్నగారు మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉండే వారన్న మాట.నేను గెద్దనాపల్లెలో మూడు నుండి ఐదుకు జంప్ చేసాను. అప్పట్లో ఉపాధ్యాయులు తమకు నమ్మకం కుదిరితే అలా ప్రమోట్ చేసేవారన్న మాట. ఆ బళ్ళో నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సోమరాజు మాష్టారు. ఆబళ్ళో కొద్దికాలమే‌ చదివి మానాన్నగారి ఆధ్వర్యంలోని మిడిల్ స్కూల్లో ఆరులో చేరాను.

కాని ఆ సోమరాజు మాష్టారు గారిని నేను అమలాపురంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా ఒకటి రెండు సార్లు కలిసాను. ఆయన నేను ఆద్దెకు ఉంటున్న రూము యజమాని గారికి బంధువు కావటం కారణం. ఆయనా నన్ను కలిసినందుకు చాలా సంతోషించారు.

చేయరే హరిభజన జీవులారా

చేయరే హరిభజన జీవులారా పెను
మాయనుండి కాచు భజన మన హరిభజన

చరాచరసృష్టి నెల్ల సంకల్పమాత్రమున
హరియే చేయు ననుచు నాత్మలోపల నెఱిగి

పరాత్పరు డైన హరి పదునాల్గు భువనములు
పరిపాలన చేయు ననుచు బాగుగా లోనెఱిగి

భువనంబులు హరిజొచ్చి పొందు విశ్రాంతి యని
అవి యధాపూర్వముగ హరి చేయు నని యెఱిగి

రవిచంద్ర నేత్రు డప్రతిమాను డగు హరిని
పవలురేలు గొలుచువారు భవమింక పొందరని

హరి మహిమల నెన్నుచును హరి యశము చాటుచును
హరి యం దనురక్తి కలిగి హరియే మాలోకమని

హరియే మా దైవమనుచు హరిని శరణు వేడుచు
హరేరామ హరేకృష్ణ యనుచు సంతోషముగ


4, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఎందెందో దోషంబుల నెంచనేల

ఎందెందో దోషంబుల నెంచనేల మీరు
ముందు మీ దోషంబుల నెంచుకొనుడు

అద్దమును తుడువనేల యామురికి ముఖముపైన
కద్దైన వేళ వెఱ్ఱి కాకపోతేను
సద్దుచేయు కోరికలు చాల మనసులోన నుండ
పెద్దగా తిట్టనేల వెలిప్రపచంచమును

కరాంగుళుల మురికితో కనరైన నోగిరము
చిరచిర లవేల వంట చెడినదనుచును
దురాశల పూజలతో దొరుకకున్న ఫలలాభము
నిరాశను పొంది దైవనింద యేమిటికి

కామిని యని తిట్టనేల కాంచన మని తిట్టనేల
మీమనసుల మలినములు మిక్కుటమైతే
రామనామ స్మరణతోవి రాజిల్లు మనసుండిన
నేమి దోషములుతోచ విల రామమయము

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రక్తి ముక్తి దాయకము రామనామము

రక్తి ముక్తి దాయకము రామనామము కనుక
శక్తి కొలది రామనామజపము చేయుడు

వెన్నునివి నామాలు వేనవే లన్నిటిలో
తిన్నగా సదాశివు డెన్నుకొన్న నామము
జన్నము లొనరించిన పున్నెమే దక్కును
అన్నా శ్రీరామ యన నపవర్గ మబ్బును

గొప్పవే కావచ్చును కోట్లాది మంత్రాలు
తప్పకుండగ నేర్వదగినవే కావచ్చును 
చెప్పు డం దెన్నున్నవి జీవులకు మోక్షమును
తప్పకుండగ నీయ నొప్పారు ప్రేమతో

ఒక్క రామనామమే యుర్వి నట్టి దున్నది
ఒక్క రామనామమే యుర్వి నేలుచున్నది
ఒక్క రామనామమే యుగములుగా భక్తుల
చక్కగా  పోషించుచు సాగిపోవుచున్నది

హరిని భజించరె హరిని భజించరె హరిని భజించరె

హరిని భజించరె హరిని భజించరె హరిని భజించరె నరులారా
పరమపురుషుడగు హరిని భజించక మరి యెవరిని గొలిచెదరయ్యా
 
టక్కుటమారపు విద్యలు చూపే నరుల భజించిన చెడుదురయా
చక్కెరపలుకులు క్షుద్రవిభూతులు తక్క వారికడ నేముండు
మిక్కిలి సేవలు చేయించుకొని మిమ్ము ముంచెదరు నరులారా
చక్కగ శ్రీహరినే సేవించిన దక్కును మోక్షము నిక్కమిది

అరకొర సంపద లిచ్చెడి దేవత లందరి గొలిచిన చెడుదురయా
మరి వారిచ్చెడు విషయభోగములు మంచితీపికల విషములయా
సరిసరి వాటికి లోబడువారలు జన్మచక్రమును దాటరయా
మరువక శ్రీహరినే సేవించిన నరులకు మోక్షము దక్కునయా

కోరిగురువులను చేరిమంత్రములు నేరిచి ఫలితము లేదయ్యా
ఊరక బహుమంత్రములను బడసిన నొరగెడు మేలే మున్నదయా
తారకనామము నోటనుండగ తక్కిన మంత్రము లెందుకయా
శ్రీరామాయని నిత్యము పలికిన సిధ్ధము మోక్షము తెలియుడయా