31, ఆగస్టు 2016, బుధవారం

ఏ మందురా రామ యే మందురా ?



ఏ మందురా రామ యే మందురా లోక
మే మన్న నీ వాడ నే నందురా

కామక్రోధాదికఘనవైరిషట్కము
నా మీద పగబట్టి నన్ను జేరి
పాములవలె జుట్టి బట్టెనురా
ఏమయ్య నీ నామ మే కాచెనురా
ఏ మందురా

ఎన్ని జన్మము లెత్తి యున్నానొ తెలియదు
అన్ని జన్మల పాప పున్నెముల
నెన్నగ నా బమ్మ కేనియు వశమా
అన్నియు నీ నామ మడగించెనురా
ఏ మందురా

జీవుడ నగు నేను చీకాకు పడుచుండ
దేవుడ నా చింత దీర్చుటకై
యే వేళ నీ నామ మిచ్చితి వో గాని
భావింప నాడె నీ‌ బంటుగ నైతిరా
ఏ మందురా


(వ్రాసిన తేది 2014-09-13)

30, ఆగస్టు 2016, మంగళవారం

బొమ్మా బొమ్మా ఆడవే



బొమ్మా బొమ్మా ఆడవే
ఇమ్మహి నీదే యాడవే
సొమ్ముల కొఱకే యాడేవో
గుమ్ముగ హరికై యాడేవో

తాపత్రయములు కోపతాపములు
చూపుచు కసిగా నాడేవో
పాపరహితుడౌ తాపసివిధమున
శ్రీపతి మెచ్చగ నాడేవో
బొమ్మా

లేని బంధముల లోన చిక్కువడి
దీనత చూపుచు నాడేవో
జ్ఞానము కలిగిన వాని విధంబున
మౌనము గానే యాడేవో
బొమ్మా

వచ్చేపోయే వంకర బుధ్ధుల
పిచ్చికళలతో నాడేవో
ముచ్చటపడి శ్రీరామచంద్రుడే
మెచ్చువిధంబుగ నాడేవో
బొమ్మా


29, ఆగస్టు 2016, సోమవారం

ఈ బొమ్మ ఆడేది యెన్నాళ్ళు ?



ఈ బొమ్మ ఆడేది యెన్నాళ్ళు
ఈశ్వరు డాడించి నన్నాళ్ళు
ఈ బొమ్మకు సౌబ తెన్నాళ్ళు
డాబుగ నిది యాడు నన్నాళ్ళు

తానెందు కాడేది తానెరుగదే బొమ్మ
తానే యాడుదు నని తలచేను బొమ్మ
తానే గడసరి నని తలచేను బొమ్మ
దాని సంగతి చెప్ప తరముగా దమ్మ
ఈ బొమ్మ

నీటుతనముల బొమ్మ నిండైన బొమ్మ
మేటి యాటల బొమ్మ మేలైన బొమ్మ
మాటిమాటికి రూపు మార్చెడు బొమ్మ
పాటున కోర్వని బంగారు బొమ్మ
ఈ బొమ్మ

అక్కజమగు నడత నలరారు బొమ్మ
చక్కని దిది రామచంద్రుని బొమ్మ
దిక్కు వాడే నని తెలిసిన బొమ్మ
మిక్కిలి భక్తితో మెలగెడు బొమ్మ
ఈ బొమ్మ


(వ్రాసిన తేదీ 2014-09-12)

అన్నియు నీవై యమరి యుండగ



అన్నియు నీవై యమరి యుండగ
నెన్నగ నేమిటి కితరుల నిపుడు

పవలు నీవు దీప్తాంశుడవగుచు
నవల రేయి నమృతాంశుడ వగుచు
దివి భువి గాచుచు తేజరిల్లగ
నెవరిని పొగడగ నేమి కలదయా
అన్నియు

దేవతలందరు నీ విభూతులే
జీవకోటి నీ చిత్కళలే యన
నీ విశ్వంబున నెటు చూచినను
నీవే కలవన్నిటిలో నిండుగ
అన్నియు

అది కావలెనని యాదేవతలనొ
యిది కావలెనని యీదేవతలనొ
మది నెన్నుట మతిమాలిన పనిగద
యిదిగో నిన్నే యెన్నెద రామా
అన్నియు


26, ఆగస్టు 2016, శుక్రవారం

బాల కృష్ణా ఇదిగో నీ‌ప్రతాపం (అన్నమయ్య సంకీర్తనం)




బాపు బాపు కృష్ణా బాలకృష్ణా
బాపు రే నీ ప్రతాపభాగ్యము లివిగో


బాలుడఁవై రేపల్లెఁ బాలు నీ వారగించఁగ
పాల జలనిధి యెంత భయపడెనో
ఆలించి తొదల మాట లాడనేరుచుకొనఁగ
యీ లీల నసుర సతు లెంత భ్రమసిరో
॥బాపు॥

తప్పటడుగులు నీవు ధరమీద బెట్టగాను
తప్పక బలీంద్రుఁ డేమి దలచినాఁడో
అప్పుడే దాఁగిలి ముచ్చు లందరితో నాడఁగాను
చెప్పేటి వేదాలు నిన్నుఁ జేరి యెంత నగునో
॥బాపు॥

సందడి గోపికల చంకలెక్కి వున్ననాఁడు
చెంది నీ వురము మీఁది శ్రీసతి యేమనెనో
నిందుగ శ్రీవేంకటాద్రి విభుఁడవై యున్న నేఁడు
కందువైన దేవతల ఘనత యెట్టుండునో
॥బాపు॥



(బౌళి రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1625వ రేకు)

25, ఆగస్టు 2016, గురువారం

పిలువరే కృష్ణుని ..... (సవ్యాఖ్యానంగా అన్నమయ్య సంకీర్తన)




పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు


వెన్నలారగించఁబోయి వీదులలోఁ దిరిగేనో
యెన్నరాని యమునలో యీఁదులాడీనో
సన్నల సాందీపనితో చదువఁగఁ బోయి నాఁడో
చిన్నవాఁ డాఁకలి గొనె చెలులాల యిపుడు
॥పిలువరే॥

మగువల కాఁగిళ్ళ మఱచి నిద్దరించీనో
సొగిసి యావులఁ గాచే చోట నున్నాఁడో
యెగువ నుట్లకెక్కి యింతులకుఁ జిక్కినాఁడో
సగము వేఁడి కూరలు చల్లనాయ నిపుడు
॥పిలువరే॥

చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె నింటనున్నాఁడో
అందపు శ్రీవేంకటేశుఁ డాడి వచ్చె నిదె వీఁడె
విందులఁ మాపొత్తుకు రా వేళాయె నిపుడు
॥పిలువరే॥



(దేవగాంధారి రాగంలో అన్నమాచార్య సంకీర్తనం 1632వ రేకు)

పాట భావానికి వ్యాఖ్యానం.

భోజనాలసమయం‌ దాటిపోవస్తోంది.
కన్నయ్య జాడ లేదు.
యశోదమ్మకు ఒకటే ఆదుర్దా.

చుట్టుపక్కల తెలిసినవాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాడా  అని ఆరాతీసింది.
అబ్బాయి గారి జాడలేదు.
ఆవిడ ఇల్లిల్లూ గాలిస్తోంది గాభరాగా.
ఆవిడ కంగారు చూసి గోపమ్మలంతా పోగయ్యారు ఆవిడ చుట్టూ.
యశోదమ్మ గోపమ్మలతో ఇలా చెబుతోంది.

ఓ గోపమ్మల్లారా మీరు కూడా వెదకండి.
ఎన్ని చోట్లా వీలైతే అన్ని చోట్లా గాలించండి.
పేరు పెట్టి పిలిచి ఎక్కడున్నాడో వెదికి పట్టుకోండి.
కృష్ణుడికి వచ్చి భోజనం చేసే వేళయ్యింది.
దాటిపోతోంది కూడాను.

గోపమ్మల్లారా మీరంతా టక్కరి వాళ్ళు.
పిల్లవాడికి వెన్నంటే‌ వల్లమాలిన ప్రీతి.
ఏం? కాస్త వెన్న వాడి చేతిలో పెడితే మీ పాడి తరిగిపోతుందా?
పైగా వచ్చి చాడీలు చెబుతారు కూడాను అస్తమానూ..

పిల్లాడు వెన్నకోసం ఇల్లిల్లూ‌ తిరుగుతున్నాడేమో.
మీరేమో వాడికి అందకుండా వెన్నంతా దాచేసారా?
అది ఎక్కడన్నా దొరక్కపోతుందా అన్న ఆశతో తిరుగుతున్నాడేమో.
ఇప్పుడే వీధుల్లో తిరుగుతున్నాడో ఏమో.

నా పిచ్చి కాని మీరంతా ఇప్పుడే కదా మీ ఇళ్ళల్లోంచే వచ్చారు?
మీ కెవ్వరికీ‌ వాడు కనిపించనే లేదంటున్నారు కూడా.
ఐతే మన కృష్ణుడు పోయి యమునలో జలకాలాడుతున్నాడేమో.
వాడికి నీళ్ళల్లో ఆడటం అంటే భలే హుషారు కదా.
మీరెవరన్నా వాడిని ఏటిగట్టు మీద చూసారా?
అక్కడే ఎక్కడో ఉన్నాడేమో.
ఆ చెట్టు ఎక్కనూ‌ నీళ్ళల్లో దూకనూ.
ఈ గట్టు ఎక్కనూ‌ నీళ్ళల్లో దూకనూ.
కాస్త మీరు పోయి చూసి రండమ్మా.

అక్కడా కాకపోతే మా కన్నయ్యకి చదువు అంటే‌ భలే గురి కదా.
ఎప్పుడూ గురువుల దగ్గిర నేర్చిన పాఠాల్ని ఏ చెట్టుకొమ్మ మీదో కూర్చుని బిగ్గరగా వల్లె వేస్తుంటాడు.
ఒకవేళ వాడు గురువుగారు సాందీపని ఇంట్లో‌ లేడు కదా?

ఎక్కడున్నాడో ఏమో వాడికి ఆకలి వేళ ఐందే. ఎలా?

మీ కూతుళ్ళు చెల్లెళ్ళూ ఒక్కక్షణం కూడా మా వాణ్ణి నేలమీద నిలబడ నీయరు కదా?
మీ‌ పిచ్చి ప్రేమలు బంగారం కానూ!
మీ‌ పెరళ్ళల్లో ఎక్కడో ఏపిల్లో మా వాణ్ణి ఒళ్ళో కూర్చో బెట్టుకొని కబుర్లూ చెబుతూ ఆడిస్తోందేమో.
ఐనా ఇదేం చోద్యం అమ్మా, చిన్న పిల్లాడే, వాడికి ఆకలి వేళ అని ఎవరికీ‌ తోచదా?
ఎప్పుడూ ఆటలూ‌ కబుర్లేనా? అసలు వాడిని నా దగ్గరకే రానిచ్చేటట్లే లేరే!

వీడొకడు.
నిత్యం ఆవులవెనకా ఆవుదూడల వెనకా చేరి ఆడుతూ‌ ఉంటాడు.
ఆ దూడలతో సమానంగా చెంగుచెంగున ఎగురుతూ ఉంటాడు.
వీడేమో ఆ ఆవుల గంగడోళ్ళు నిమరటమూ అవేమో ప్రేమగా వీణ్ణి నాకుతూ‌ ఉండటమూ.
వీడిని నా స్పర్శకన్నా ఆవుల స్పర్శ అన్నదే ఎక్కువై పోయింది సుమా.
మా కొట్టాం‌లో ఐతే‌ లేడు కాని మనూరి నిండా ఆవులే కదా.
వేటితో ఎక్కడ ఆడుతున్నాడో ఆదమరచి.
ఐనా ఆవులకి వాటి ఆకలే కాని పిల్లాడి ఆకలి తెలుస్తుందా ఏమిటి?
వీడికా ఆవులదగ్గ రుంటే తిండీ నీళ్ళూ‌ అక్కరేదాయిరి.
కాస్త వెదికి చూడండమ్మా.

అన్నట్లు మర్చే పోయాను.
మీ‌ వాళ్ళెవరన్నా మా కన్నయ్యని కట్టెయ్య లేదుకదా?
ఎందుక్కట్టేస్తాం అంటారా?
ఏమో ఎవరింట్లో ఎవరు వీణ్ణి పట్టుకుందాం‌ అని కాపలా కాసుక్కూర్చున్నారో.
ఏ తల్లి పిల్లని కాపలా పెట్టిందో
ఏ అత్త కోడల్ని కాపలా పెట్టిందో.
ఏ మహా తల్లి స్వయంగా కాపలా కూర్చుందో.
ఆలాంటి దేమన్నా ఐతే కాస్త దయచేసి మావాణ్ణి మీ‌యిళ్ళల్లో వెదకి చూడండమ్మా!
వీడికి అన్నం వేళ దాటిపోతోందీ.
వీడి కిష్టమని చేసిన కూరలూ‌నారలూ అన్నీ చప్పగా చల్లారి పోతున్నాయి.
పైగా చల్లారినవి పిల్లాడికి ఎలాపెడతామూ?
ఐనా ఏమాత్రం చల్లగా అనిపించినా మళ్ళా వాడే నానా రభసా చేస్తాడే!
వీణ్ణి కాస్త వెదికి తెండమ్మా.

మొన్నవ్వరో వీడికోసం ఇన్ని నెమలిపించాలు తెచ్చి పడేసారు చావట్లో.
వీడి కింక పండగే.
ఏ పెరట్లోనో ఒక్కో నెమలి ఈకా  నెత్తిమీద పాగాలో సింగారించుకుంటూ మురుసుకుంటున్నాడేమో.
ఐనా మా యింటి పెరట్లో ఇందాకనే చూసానే?
మీలో ఎవరింటి పెరట్లో ఐనా ఉన్నాడేమో‌ కాస్త చూడండి.
ఏముందీ, ఎక్కడో ఏ బావిగట్టునో నీళ్ల బానల్లోనికి తొంగిచూసుకుంటూ నెమలి ఈకల అందాలు మురుస్తూ ఉంటాడు.
మీ రేమో‌ పొద్దస్తమానం వాడి అందాన్ని పొగుడుతూ‌ ఉంటారు.
దాంతో ఆ ఆందాలయ్యకి మరింత అందం‌ పిచ్చి పట్టుకుంది.

నా మతి మండా ఇంతసేపూ వీధిలో నుంచుని మిమ్మల్ని బతిమాలుతున్నానా?
ఈ‌లోపల మా కృష్ణుడు కాని ఏ పెరటి దారిలోనో ఇంట్లోకి రాలేదు కదా?
అసలే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు.
వెంటనే పోయి వడ్డించకపోతే అలిగి మూల కూర్చుంటాడు.

చూడండి చూడండి.
లోపల్నించి ఏదో చప్పుడు వినిపించటం లేదూ.

వచ్చాడమ్మా వచ్చాడు.
వంటింట్లో దూరి గిన్నెలు విసిరేస్తున్నట్లున్నాడు.
కన్నయ్యకు కోపం వచ్చేస్తున్నట్లుంది.
పాపం‌ మా కృష్ణుడు ఊరంతా బలాదూరు తిరిగితిరిగి బాగా ఆడిఆడి విచ్చేసినట్లున్నాడు.
వెంటనే లోపలికి వెళ్ళకపోతే దొరగారికి తామసం వచ్చేస్తుంది.

ఉంటానమ్మా.
అందగాడు దయచేసాడు కదా స్వగృహానికీ.
మా వాడికి విందులు చేయాలి తక్షణమేను.
లేకపోతే తెలుసుగా వాడి సంగతి.

అదిగో‌ వింటున్నారా?
వస్తున్నావా లేదా ఏమిటా జనంతో పోచికోలు కబుర్లూ‌ అని అరుస్తున్నాడు.
వస్తానమ్మా.
మీరంతా ఇంక పోయిరండి.


23, ఆగస్టు 2016, మంగళవారం

పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు





పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు
పాడగ నేనెంత వాడనయ్య రామ


సాహిత్యము లేదు సంగీతము రాదు
ఓహో నేనును పాడ నుంకింతునో
ఊహించు నిను పాడ నుల్లము శ్రీరామ
సాహసించి నేను నేడు పాడెదనో
పాడేరయ్యా

వేదశాస్త్రంబుల వివరము లెఱుగను
వేదాంతసిధ్ధాంతవిధముల నెఱుగ
వేదవేదాంతసంవేద్య శ్రీరామ
నీ దయ నేమని పాడెదనో
పాడేరయ్యా

రాగము లేదు కాని రాము డున్నాడని
తూగు భావము లేదు తోచు భక్తి యని
భాగవతులు మెచ్చ పరమాత్మ శ్రీరామ
నీ గాధలను నేను పాడెదనో
పాడేరయ్యా



(వ్రాసిన తేది: 2014-09-04)

21, ఆగస్టు 2016, ఆదివారం

మెలకువ రాగానే పలకరింతు రాముని ...




మెలకువ రాగానే పలకరింతు రాముని
పులకరించి పలకరింతు జలధరసుశ్యాముని


నా రాముని దయవలన నాకు గలిగె నీ‌ తనువు
నా రాముని సేవలోన నడచి పోవు నా బ్రతుకు
నా రాముని తలపులే నా కన్నము పానము
నా రాముని పొగడుటయే నాకు సంతోషము
మెలకువ

నా రాముడు లేని చోటు నా కగుపడకుండు
నా రాముడు పవలురేలు నన్ను కాచియుండు
నా రాముడు నిదురనైన నన్ను వదలకుండు
నా రాముడు కలల నన్ను చేరి యాడుచుండు
మెలకువ

నా రాముని పాటలతో నాకు ప్రొద్దుపోవును
నా రాముని యనుజ్ఞతో నాకు నిదురకల్గును
నా రాముని నామముతో నాపెదవులు కదలును
నా రాముని పొగడుకొనగ నాకు తెల్లవారును
మెలకువ






20, ఆగస్టు 2016, శనివారం

బ్లాగుకు ప్రత్యామ్నాయ వేదిక సూచించండి.


నా సాహిత్యవ్యాసంగానికి తగిన ప్రత్యామ్నాయ వేదిక గురించి అన్వేషిస్తున్నాను. ఇంతవరకూ శ్యామలీయం ప్రథానబ్లాగుగా నడిచిన ఈ వ్యాసంగానికి అనివార్యకారణాల వలన ప్రత్యామ్నాయం ఆలోచించుకొనక తప్పటం‌ లేదు. తగిన ప్రత్యామ్నాయం దొరికే వరకూ బ్లాగుల్లో కొనసాగటం‌ జరుగుతుంది.

నా శ్రేయాభిలాషులు ఎవరైనా తమదృష్టిలో ఉన్న ప్రత్యామ్నాయాల గురించి తెలియచేస్తే సంతోషిస్తాను. వారు తమ సూచనలను syamaliyam@gmail.com అనే నా మెయిల్‌కు పంపవలసిందిగా విజ్ఞప్తి.

నేను నా కృషిని మరొక తగిన వేదికకు మార్చుకొనే వరకూ బ్లాగుల్లోనే కొనసాగవలసి ఉంది కాబట్టి, ఇబ్బందులకు గురిచేసి ఆనందించే వారి నుండి సురక్షితంగా ఉండటానికి దారులు వెదుక్కొనక తప్పదు. అందుచేత ఈ‌క్రింది విధానాలను ప్రకటిస్తున్నాను.

  • శంకరాభరణం, కష్టేఫలీ వంటి అతికొద్ది బ్లాగుల్లో తప్ప మరెక్కడా వ్యాఖ్యానించను. 
  • ఎవరన్నా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాపైన వ్యాఖ్యలు చేసినా సమాధానం ఇవ్వను. 
  • నా వ్యాఖ్యలకు ఎవరైనా ప్రతివ్యాఖ్యను వ్రాసినా నేను సమాధానం ఇవ్వటం‌ కష్టం. చర్చలకు నాకు సమయం ఉండదు.
  • శ్యామలీయం బ్లాగులో వ్యాఖ్యల మీద ప్రతివ్యాఖ్యలను ప్రోత్సహించను. వ్యాఖ్యలు నేరుగా టపాకు సంబంధించి మాత్రమే ఉండాలి. ఇతరవ్యాఖ్యాతల అభిప్రాయాలపై ఖండన మండనలు వద్దు. చర్చలకు తావు బాగా తక్కువ.

అందరూ‌ సహకరించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

17, ఆగస్టు 2016, బుధవారం

సంక్షిప్త రామాయణం పాట.



నీరేజపత్రేక్షణా శ్రీరామచంద్ర నిజభక్తసంపోషణా
స్మేరాననా చిన్మయా శ్రీరామచంద్ర సీతామనోమోహనా

పరమాత్మ నారాయణా శ్రీరామచంద్ర వైకుంఠవాసవిభో
పరమేష్ఠిసంప్రార్థితా శ్రీరామచంద్ర పరమేశ లోకప్రభో

కమనీయసందర్శనా శ్రీరామచంద్ర కౌసల్యాసుఖవర్థనా
కమలాప్తకులభూషణా శ్రీరామచంద్ర కల్యాణగుణవర్థనా

మునికాంతాశాపాంతకా శ్రీరామచంద్ర మునియాగసంరక్షకా
మునిలోకపరివేష్ఠితా శ్రీరామచంద్ర దనుజప్రజాకంటకా

భర్గచాపనిగ్రహా శ్రీరామచంద్ర వసుధాసుతావల్లభా
భార్గవాగ్రహవారకా శ్రీరామచంద్ర పరమశాంతవిగ్రహా

సాకేతనగరస్థితా శ్రీరామచంద్ర జనకాత్మజాసేవితా
లోకావనాతత్పరా శ్రీరామచంద్ర లోకైకరక్షాపరా

వనవాసదీక్షాన్వితా శ్రీరామచంద్ర భామాసౌమిత్రీయుతా
అనుజ భరతప్రార్థితా శ్రీరామచంద్ర అభిషిక్తనిజపాదుకా

మునిరాజగణసన్నుతా శ్రీరామచంద్ర మునిలోకవరదాయకా
జనస్థాననిష్కంటకా శ్రీరామచంద్ర సకలాసురదర్పహా

అపహసితదోషాచరీ శ్రీరామచంద్ర అపహృతక్షోణీసుతా
విపరీతశోకాకులా శ్రీరామచంద్ర విపినభ్రమణవ్యాకులా

శకుంతాధిపమోక్షదా శ్రీరామచంద్ర శబరీసమారాధితా
వికటకబంధాంతకా శ్రీరామచంద్ర విరహార్తిసమ్మోహితా

అవనీసుతాన్వేషకా శ్రీరామచంద్ర పవమానసుతసేవితా
రవిపుత్రసన్మానితా శ్రీరామచంద్ర దివిజేంద్రతనయాంతకా

గిరిప్రస్రవణసంస్థితా శ్రీరామచంద్ర విరహార్తిసంక్షోభితా
హరిసైన్యసంసేవితా శ్రీరామచంద్ర వరఋక్షగణసేవితా

పరిశీలితమేదినీ శ్రీరామచంద్ర హరిదర్శిత మైధిలీ
అరిరావణదూషితా శ్రీరామచంద్ర హరిరాట్సమాశ్వాసితా

కారుణ్యవారాన్నిధీ శ్రీరామచంద్ర ఘనపాపసంశోషణా
వారాన్నిధిబంధనా శ్రీరామచంద్ర భండనహతరావణా

పాకశాశనసన్నుతా శ్రీరామచంద్ర బ్రహ్మాద్యభినందితా
సాకేతపీఠస్థితా శ్రీరామచంద్ర సర్వజగద్వందితా



రాముని తలచవే మనసా ....


రాముని తలచవె మనసా శ్రీ
రాముని తలచిన సేమము కలుగును
రాముని తలచవె మనసా


ఎవరే బంధుగణంబులు నీకు
ఎవరే మిత్రగణంబులు నీకు
అవలి యొడ్డునకు చేరే వేళ
ఎవరే నీతో నడచే వారు

రాముని

నిందలు వేసే వారిని చూసి
ఎందుకు నీవు చింతించెదవే
అందుకు వారే ఆ సమవర్తి
ముందర నిలచి వాపోయేరే

రాముని

తెగడే వారిని తెగడ నీయవే
పొగడే వారిని పొగడ నీయవే
జగమును విడచే టప్పుడు నీతో
వగపులు మురిపెము లేవీ రావే

రాముని

వచ్చిన కార్యము రాముడు మెచ్చగ
ముచ్చటగా నెఱవేర్చుకు పోవే
ఇచ్చట మొఱిగే కుక్కలు నీతో
మచ్చరించు టవమానము కాదే

రాముని


16, ఆగస్టు 2016, మంగళవారం

అందరికీ వందేసి నమస్కారాలు



సకలజనులకు నా నమస్కారశతము
మీకు హితుడనా నా నమస్కారశతము
మీ కహితుడనా నమస్కారశతము
మీరు ప్రేమింతురా నమస్కారశతము
మీరు ద్వేషింతురా నమస్కారశతము
మీ రుపేక్షింతురా నమస్కారశతము
మీరు నా వారలా నమస్కారశతము
మీరు పెఱవారలా నమస్కారశతము
చేరి పొగడెదరా నమస్కారశతము
కోరి తెగడెదరా నమస్కారశతము
మీరు నమ్మెదరా నమస్కారశతము
మీరు నమ్మనిచో నమస్కారశతము
మీరు మెచ్చెదరా నమస్కారశతము
మీరు మెచ్చనిచో నమస్కారశతము
మీర లనుకూలురా నమస్కారశతము
మీరు ప్రతికూలురా నమస్కారశతము
మీరు మన్నింతురా నమస్కారశతము
మీరు వేధింతురా నమస్కారశతము
మీరు భావింతురా నమస్కారశతము
మీరు బాధింతురా నమస్కారశతము
మీరు సాధింతురా నమస్కారశతము
మీరు మేలెంతురా నమస్కారశతము
మీరు కీడెంతురా నమస్కారశతము
మీరు సజ్జనులా నమస్కారశతము
మీరు దుర్జనులా నమస్కారశతము
మీర లెట్లున్న నా నమస్కారశతము
సర్వవేళల నా నమస్కారశతము
సర్వవిధముల నా నమస్కారశతము
మీర లెవరైన నా నమస్కారశతము
చాల మారులు నా నమస్కారశతము
చాల వినయంబుతో నమస్కారశతము
సాగి నే చేయు నీ నమస్కారశతము
సత్య మెఱిగి చేసెడు నమస్కారశతము
సకల హృత్పద్మములయందు సంచరించు
జానకీరాములకు నమస్కారశతము


గరిమన్ స్వర్ణ మనేక భూషణములన్
      కన్పట్టు చందంబునన్
పరమాత్ముం డఖిలప్రపంచమయుడై
      భాసిల్లు నట్లౌటచే
సురసిధ్ధోరగయక్షకిన్నరనర
      స్తోమాది శశ్వత్ చరా
చరరూపోజ్వల సర్వభూతములకున్
      సద్భక్తితో మ్రొక్కెదన్




రాజారావు గారి పద్యాలను నేను తస్కరించానా?



పాఠకమహాశయులారా,

వరూధిని బ్లాగులో వచ్చిన ఈ క్రింది వ్యాఖ్యను పరిశీలించండి.

వెంకట రాజారావు . లక్కాకుల Aug 15, 2016, 7:27:00 PM
ఖ్యాతి వహించి నట్టి ఘను లక్కట నా పలు పద్య మాలికల్
వ్రాతలు తస్కరించి తమ బ్లాగున వేసిరి , ముందనుఙ్ఞ లే
దే! తమ చేతలేమొ ఘనతే , పెర వారివి తప్పిదా లగున్ ,
నీతులు జెప్పు కోవిదుల నీమము లిట్టివి , చూడ ముచ్చటౌ .


రాజారావు గారు ఘనుడు అంటే అనునిత్యం ఎత్తిపొడిచేది నన్నే కాబట్టి వారు తస్కరుడంటున్నది నన్నే అనుకొన వలసి వస్తోంది.

ఎంతో నొవ్వు కలిగింది ఈ నిరాధారమైన నిందాలాపానికి. వారి పద్యాల మాలలను దొంగిలించి నా బ్లాగులో ప్రచురించ వలసిన అగత్యం నాకేమి ఉంది?

నిజానికి, గత రాత్రి విపులమైన సమధానం వ్రాసాను. కాని ప్రచురించే ముందు సమయం తీసుకోవటం‌ మంచిదని ఆగాను.

నా సంగతి ఈ తెలుగుబ్లాగు లోకానికి చక్కగా తెలిసినదే. అటువంటప్పుడు ఇది నీలాపనింద అన్నది వారికి సులభగ్రాహ్యమే.  అందుచేత నేను విపులమైన అభ్యంతరాన్నీ వివరణనూ వ్రాయవలసిన అగత్యం ఏమీ లేదు కదా. కాబట్టి అలా విపులంగా వ్రాసినది మొత్తం తొలగించి కేవలం క్లుప్తంగా (నా రికార్డు కోసమే అనుకోండి) నా బ్లాగులో ఈ సంగతిని ప్రస్తావిస్తున్నానంతే.

వెత గలిగినన తాళుకొమ్మననే అని భగవద్వచనం అన్నట్లుగా సద్గురు త్యాగరాజస్వాముల వారు

   సద్భక్తులనడత లిట్లనెనే
   యమరికగా నాపూజఁ గొనెనే
   యలుగ వద్దనెనే
   విముఖులతోఁ జేరఁ బోకు మనెనే
   వెత గలిగిన తాళు కొమ్మనెనే


అని ఆరభిరాగం లో సాధించెనే అన్న పల్లవితో మొదలయ్యే తమ పంచరత్న కీర్తనలో ఉపదేశించారు కదా. అదే శిరోధార్యం.


12, ఆగస్టు 2016, శుక్రవారం

కష్టేఫలీ శర్మ గారిని వేధించే ప్రయత్నం తప్పు.

          ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !
అంటూ.

ఈ ప్రయత్నం  పొరపాటు.

అందుకే, దానిపై నావ్యాఖ్యను ఈ ఉదయమే ఇలా వ్రాసాను. (వ్యాఖ్య time stamp Fri, 12 Aug 2016 04:24:19 GMT. అంటే మనసమయంలో ఉ. గం9:59ని)


ఈ ప్రయత్నం సరికాదు.
కష్టేఫలీశర్మగారు కావాలనుకుంటే తమటపాలను బ్లాగులో ఉంచలేరా? వారు ఇకచాలు వద్దు అనుకున్నారు. మధ్యలో జిలేబీగారు దూరి వారి బ్లాగుటపాలను నేను ప్రకటిస్తాను అనటం అక్రమం, అనైతికం. ఇది ఆయన్ను క్షోభపెట్టాలన్న దురుద్దేశం తప్ప మరేమీ కాదు. చాలించండి దుండగాలు.

ఇది ఇంకా మాలికలో దర్శనం ఇస్తోంది. 

 వరూధిని బ్లాగువారు నా వ్యాఖ్యను ఎందుకు తొలగించారో మరి.

ఈ విధంగా బ్లాగర్లను వేధించే ప్రయత్నాలను అందరూ త్రిప్పికొట్టాలి.

ఇలాంటి చేష్టలకు తెగబడేవాళ్ళదే పైచేయి అయ్యేపక్షంలో బ్లాగర్లు తమ బ్లాగుల్ని తొలగించటమే ఉత్తమం అనుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.