17, ఏప్రిల్ 2012, మంగళవారం

నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక

అనుభవంలోకి వస్తున్నట్లు భ్రమగొలిపే
అందమైన ప్రతి అబధ్ధానికి అమరించిన ముద్దుపేరు
వ్యావహారిక సత్యం

అందమైన అబధ్ధాలన్నింట్లో అతిపెద్దది ప్రపంచమే
అందుకే అది ఒక వ్యావహారిక సత్యం

అనుభవాలకు అంతుచిక్కని అసలు సిసలు తత్వం
అందీ అందని ఆనందానికి అతిసరళ స్వరూపం
పారమార్థిక సత్యం

అలా అంతు చిక్కని అతి చిన్నది నేనే కద
అందుకే నేనే ఒక పారమార్థిక సత్యాన్ని

ఈ రెండు సత్యాల మధ్య తారాడే విభజన రేఖలని
అప్పుడప్పడు నీవు గీస్తున్నావని యెప్పుడూ పొరబడుతున్నానే
ఆ గీసేది నేనేనని చెప్పవేం

అయితే ఈ గీతలు నేనే హాయిగా చెరిపేస్తాను
అప్పుడింక యేకరూప సత్యమేగా ఆపైన మిగిలేది
అదంటే నువ్వేకదా

నాకంటూ వేరే ఉనికి లేకపోవటమే నా కోరిక
నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక