6, డిసెంబర్ 2011, మంగళవారం

భాషావికాసము

భాషావికాసము రెండు పక్షములుగా జరుగుచుండును.  పూర్వ పక్షము ప్రయోగము కాగా  నుత్తర మారక్షణము.  ప్రయోగము  లేక భాషయే లేకపోవును గనుక ప్రయోగమే పూర్వపక్షమని చెప్పవలయును.    ప్రయోగిత పూర్వారక్షిత పదసంపదనుండి సుష్టువులగు వానిని కవులు ప్రయోగించుచుందురు.  అట్లేర్పడిన సాహిత్యమునుండి జనామోదము బొందిన కావ్యాదులు కాలమునకెదురొడ్డి నిలుచుచు నారక్షితమగు భాషావికాసము నేర్పరచుచున్నవి.  ఆరక్షితభాషను జను లధ్యయనము చేయుట వలన రక్షిత ప్రయోగములకు వ్యాప్తియును జీవనమును ప్రాప్తించుచున్నవి.  ఈ విధానముగా భాషయేది కొనసాగుచున్నదో నది జీవభాష యనిపించుకొనును.   ముఖ్యమేమనగా ప్రయోగారక్షణములను పక్షములుభయమును పరస్పరాశ్రయములుగా నుండి కొనసాగుచు భాషను రక్షించుచున్నవనుట.

అట్టి భాషయందు కవులు మిక్కిలి జాగరూకులై యుండవలెను. కారణమేమనగా వారి వలన  భాషయొక్క పోషణమును జీవనమును సిధ్దించుచున్నవి.  కవులనియే కాదు. కవులుగాని యితరసామాజికులుగాని భాష విషయములో ప్రమాదమునకు తావిచ్చుట మంచిది కాదు.   సామాజిక కారణానేత్వము మిషగా ప్రజలు భాషను నిర్లక్ష్యము చేసినచో తొలుత ప్రయోగపక్షమునకు ముప్పువచ్చును.  ప్రయోగము బలహీనమైన భాషలొ ప్రజలకు సాహిత్యముతో సాన్నిహిత్యము చెడుట సంభవించును.  కవిలోకముగూడ చెదరుటయు సంభవించును.

అదియునుగాక కవియగువాడు నూతన నిర్మాణము చేయుచున్నప్పుడు ప్రయోగమును పరిహరించి కేవలము నారక్షిత పదకోశమునకే పరిమితముగా కావ్వమును దిద్దుచో నొక గొప్ప యవ్యవస్థ యేర్పడుచున్నది.  సాహిత్యమనగా కేవలము పూర్వకవిప్రయోగపదజుష్ట గ్రంధబాహుళ్యముగా కవులును ప్రజలును భావించుట జరిగి యట్టి సాహిత్యమునకు ప్రజలలో తిరస్కృతి యేర్పడును.  కవులు ప్రయోగభాషావిముఖులగుట  యొక్క పరిణామముగా సాహిత్యమునకు ప్రజలు విముఖులగుట సిధ్దించుచున్నది. ఇది పరిహార్యము.

ఈ రెండు కారణములుగా భాషయొక్క యుభయపక్షములును చెడుట జరుగుచున్నది.  నివారణ మేమనగా భాషను జాగరూకులై ప్రజలును కవులును సంరక్షించుటయే. జీవభాషను ప్రజలనుండి గ్రహించి కవులు ప్రయోగించక తీరదు. లేకున్న నేటిభాష రేపటికందుట యెట్లు? వందలసంవత్సరములక్రిందటి భాషకే లక్షణములు బిగించి దానినే మడిగట్టుకొని కవులు వాడుచున్నచో ప్రజలేల యట్టి  కృతకసాహిత్యవ్యవసాయమును హర్షించవలెను?  జీవభాషను ప్రయోగించుటకు పాతబడిన లక్షణసూత్రములు చాలకపోవచ్చు నట్టి యెడ కొత్త లక్షణములను ప్రజాప్రయోగమునుండి కవులు తప్పక గ్రహించి ప్రయోగించి వాటికి స్థిరత్వమును కలుగ జేయవలెను.  అట్లని ప్రాతది యనివంక పెట్టి  సాంప్రదాయికమైనది సర్వమును విడువ నవుసరము లేదు.  సమన్వయమును చక్కగా నేర్పరచుట కవులకు  తెలియని విద్య గాదు.  కాని, నిత్యము పరిణాముము చెందుచుండు భాసను మార్పులేని లాక్షణిక చట్రములో బిగించివేయవలెనని చూచుట వట్టి యమాయకత్వము.  యెట్టి భాషయైనను నట్టి పధ్ధతిని నిరసించును.

సంస్కృత నాటక వ్యవహారములో నొక చోద్యమున్నది. అరి యేమనగా రాముడు, ధర్మరాజు మున్నగు నుత్తములగు వారి పాత్రలు సంస్కృతములో భాషించగా, సీతాద్రౌపద్యాదులు మాత్రము, వారుత్తమ పాత్రలే యగుదురుగాక ప్రాకృతముననే మాట్లాడుదురు.  ఇందు పైచిత్రి విషయమటులుండగా, నాటకకర్తలు ప్రాకృతమును రచనావ్యవహారములో గ్రహించుటనే నేను ప్రస్తావించునది. ప్రాకృతమనగా సంస్కృతమునకు వాడుకభాష.  అట్టి వాడుకభాష నేమిషపై నేమి సంస్కృతకవులు ప్రయోగించిరి. మన తెలుగు కవులకు మాత్రము వాడుకభాష సర్వదా పరిహార్యము. ఇది చాల విచారించవలసిన విషయము.

వాడుక భాషనేల తగుమాత్రముగానైనను స్వీకరించరాదు? నన్నయగారి కాలములో సంస్కృతముయొక్క విస్తారమైన పలుకుబడి కారణాముగా గ్రంధభాషలో నదియే ముఖ్యమైనది కావచ్చును. వేయేండ్ల పిమ్మట గూడ కమ్మని తెలుగులో పూర్తిగా గ్రంధములు చేయలేని దురవస్థకు కారణమేమి? తమకర్ధము కాని భాషలో కవులమనుకొనువారు విన్యాసములు చేయుచున్నప్పుడు  ప్రజలు నిరాసక్తతో నుండక యేమిచేయుదురు?   కవులును తాము సమాజములోని వారమని యెఱిగి సామాజికుల జిహ్వమీది భాషను సాధువులైన ప్రయోగములో గ్రంధస్తము చేయగలిగినచో చాల మంచిది.

సినిమాలలోని పాటలు పరమ యసాధుపదప్రయోగములతో నున్నను విపుల ప్రచారములో నుండుటకు కారణము వాటలోని భాష  ప్రజలనాలుకలకు సులభముగానుండుటయే. సమస్త సాహిత్యములోను చెత్త యొక్క శాతమే యధికముగా నుండును. సినిమా పాటలలో గూడ నట్లే. నూటికొకటి రెండు సాహిత్యసిధ్ధి కలిగినవి గూడ కనిపించును. ఆక్షేపించవలసినది లేదు.

సాహిత్య ప్రక్రియలు గూడ కాలముతో మారుట సహజము. నేడు గూడ ప్రబంధములే వ్రాయవలెననుకొనుట మంచిది కాదు.  కవులు పాతను కొత్తతరములకందించుచు కొత్తను తాము స్వికరించుచు సమాజమును దిద్దవలెను.  సమకాలీన  ప్రక్రియల నాదరించకుండ సమాజమును తమను నిరాదరించుచున్నందుకు తప్పుబట్టుట నిష్ప్రయోజనము.

కవులు సమాజము నుపేక్ష చేయుటచేత వచ్చిన గొప్ప ప్రమాదములలో నొకడేమనగా, ప్రజలకు భాషను నేర్చుకొనుట కష్టమగుట. దీనికి విరుగుడుగా వాడుకభాష వచ్చి విద్యాభ్యాసము చేయించుచున్నది.  దీని వలన భాష మఱింత పలుచనై పోవుచున్నది. భాషా విద్వాంసులని బిరుదు పట్టములు సంపాదించిన వారికే భాషలో పట్టులేని సంగతి యైనది. చివరి కక్షరములు గూడ సరిగా వచ్చుటలేదు.  'నీరు', 'నీఱు' అను పదములు వేఱను విషయము కొందరు నేటి పండితులే యెఱుగరు.

సలక్షణమైన భాషలో రచించినవి బహుకాలము జీవించు నను మాట సత్యమే కావచ్చును. ప్రజలభాషను అసంస్కతముగా గ్రహించుట వలన త్వరగా చెడుట గూడ సత్యము గావచ్చును. కాని నేర్పరితనముతో కవులు ప్రజాభాషను జాగ్రతగా నుపయోగించి ప్రజామోదమును  సాదించుట మంచిది.  సాహిత్యకృషి ప్రజలకు యెంత దగ్గరాగా నిలచిన నంత లాభము భాషకు.  ప్రజల నుపేక్షసేసి విరచించిన సర్వము వృధయగును.  దాని వలన భాషావికాసము శూన్యము.

భాషావికాసమునకు  కవులకు గల సూటి యైన మార్గమేమనగా కవులు ప్రజలలో మమేక మగుట.  ప్రజలు భాషయందనురక్తులై యుండుట నిట్లుగాక సాదించరాదు.

4 కామెంట్‌లు:

  1. ప్రాకృతము కూడ ఒక నియమావళి ననుసరించి గ్రాంథికము కాబడింది. తెలుగులో, వాడుక భాషను అట్లే వ్యాకరణ బద్ధము చేస్తే గ్రాంథికము అవుతుంది. ప్రాకృతము అన్ని మాండలీకాలలో ఒకే లాగున వాడబడింది. 'వచ్చిండు' అని కోస్తావాళ్లు అనరు. అది తెలంగాణా మాండలీకం. ఈ మాండలీకాలకు వ్యాకరణ బద్ధము ఎలాగో ఆలోచించాలి.
    భాషను మీ ఇష్టం వచ్చినట్లు విరిచేయండి, క్రొత్త అనే పేరుతో! గ్రంథస్థం చేసేయండి. క్రొత్త, ప్రాతల లో రేఫకారాలు ఎప్పుడో పీకేసాముగా! కాని, ఒక విన్నపము. వ్యాకరణం లేకుండ ఛందస్సు జోలికి రాకండి. మీకు కావలిసిన బోల్డు మాత్రా ఛందస్సులు ఉన్నాయి. సినిమా గీతాల్లా వ్రాసుకోండి. పూర్వ ఛాందసుల మైన మా ఛందస్సును మా ఖర్మకు వదిలేసి, భాషను ఛిన్నా భిన్నం చేస్తూ పుటలు పుటలు వ్రాసుకోండి. వాక్ స్వాతంత్ర్యము ఎవరు అడ్డుకో గలరు?
    వేదాలు ఈ రోజు మనకు అర్థం అవుతున్నాయి అంటే, మాండలీకాలు లేక, వ్యాకరణ బద్ధము గా ఉండటం వల్ల నని అనుమానం! అవి ఆనాటి వాడుక భాషలో ఉండి ఉంటే, ఈ రోజు మనకు అర్థం కష్టం అయ్యేది.
    కొన్నాళ్ళకు వాడుక భాషలో మార్పులు వస్తాయి. గ్రాంథికం నియమావళి మారదు. కావున చిరస్థాయిని సంతరించుకుంటాయి అని పూర్వుల భావన. వాళ్లు మూర్ఖు లని భావించి, వాడుక భాషకు కూడ చిరస్థాయిని కల్పించ గలిగితే, మేలే! కాని దానికి మా ఛాందసుల వృత్త, గీతాల ఛందస్సునే వాడాలా? వాడితే కాని మీకు గ్రాంథిక భాషను సర్వనాశనం చేసిన తృప్తి లేదా?
    పైన చెప్పినట్లు, ఇది విన్నపము మాత్రమే! అటు పైన మీ దయ!
    ఇ ట్లు ,
    aprvprasad@yahoo.com

    రిప్లయితొలగించండి
  2. ముందుగా ఈ కామెంటు ను రాస్తున్నందుకు క్షమించండి.
    సరికొత్త అగ్గ్రిగేటర్ " బ్లాగర్స్ వరల్డ్ " చుసారా ?
    www.bloggersworld.in

    రిప్లయితొలగించండి
  3. నమస్తే "శ్యామలీయం" గారు.
    నాకేమాత్రము ఇలాంటి సాహిత్యం లో అస్సలు ప్రవేశం లేదు కాని, బాగా అభిరుచి ఉన్నది. మీలాంటి వారు ఉండటం వలన మన సాహిత్యానికి విఘాతములు కలగవని నమ్ముతున్నాను.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా! చాలా చక్కగా వివరించి భాషా పరిరక్షణ బాధ్యత స్వీకరించి అప్రమత్తంగా చేస్తున్న మీకు నా అభినందనలు.
    ముఖంగా మీ యొక్క సెల్ నెంబరు, మీ పూర్తి పేరు, చిరునామా మీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను.
    ౧౨ వ తేదీన ఆదివారం నాడు మనం జరుపబోవుతున్న అష్టావధానం, ప్రణాళికా బద్ధంగా మనం నిర్వహించు నిమిత్తము పరస్పరము అవగాహన కలిగియుండుట కొఱకు,నిర్వహణ విషయము చర్చించుకొనుట కొఱకు ఒక గంట ముందుగానైనా మనం కలుసుకోవడం ముఖ్యమని భావిస్తున్నాను.
    మీకు అభ్యంతరం లేకపోతే రెండు గంటలకల్లా మీరు రాగలిగితే బాగుంటుందని భావిస్తున్నాను.
    మీ మెయిల్ ఎడ్రస్ నాకు లభించ లేదు. తప్పక మీ మెయిల్ ఏడ్రస్ తెలుప గలరు.
    నా సెల్ నెంబర్.9247238537.
    నమస్తే.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.