నీనామమే జిహ్వ నుంచితిమి రామ
నీరూపమే యెదను నిల్పితిమి
నీనిత్యసేవలనే యుంటిమి రామ
నీకన్న మాకెవరు కారంటిమి
పామరత్వము వీడ లేకుంటిమి వేగ
రామయ్య విన్నాణ మిమ్మంటిమి
కామితము నీదు కృప యంటిమి వేగ
రామయ్య దయజూపరా యంటిమి
మామనసు నీకిచ్చినా మంటిమి వేగ
నీమనసులోన మము గనుమంటివి
మామొరలు వినిపించుకొ మ్మంటిమి నిజము
రామయ్య నినునమ్మి యిల నుంటిమి
సామాన్యులము మేము సర్వాత్మకా వేగ
రామయ్య రక్షించరా యంటిమి
మేమన్యులను వేడ బోమంటిమి వేగ
రామయ్య దయజూపరా యంటిమి