3, జులై 2026, శుక్రవారం

రామభక్తశేఖరులారా యేమి కావలెను

రామభక్తశేఖరు లార యేమి కావలెను? శ్రీ
రాముల దయయే చాలును మాకింకేమి కావలెను

రామకార్యచతురు లార యేమి కావలెను? శ్రీ
   రాముల యండయె చాలును మాకింకేమి కావలెను

సిరులును సంపద లర్ధించెదరా సీతానాయకుని?
   సిరులును సంపద లిచ్చును నిత్యము శ్రీపతి నామంబె

సరగున భోగము లడిగెదరా మన సాకేతేశ్వరుని?
   నరులకు భోగము నాల్కను రామనామం బుండుటయె

పరివారంబులు దయచేయుమని ప్రభువుల నడిగెదర?
   హరిసేవకులము సేవకు లన్యులు సరిసరి మాకేల

సరసములైన సదుపాయంబులు స్వామిని యడిగెదర?
   హరినామంబును పేర్కొన సదుపాయములే యెల్లెడల

సరిసరి యేమియు వలదని పలుకుట చక్కగ నుండినను
పరమాత్ముడు వర మిచ్చెద నంటే వలదన రాదు కద?

   పరమాత్ముడు వర మిచ్చెద నంటే వలదన రాదు కద
   మరి యిక నెన్నడు ధరపై పుట్టని వరమిచ్చిన చాలు