2, మార్చి 2026, సోమవారం

మ్రొక్కుచు నుందురు

మ్రొక్కుచు నుందురు రాముని కొందరు

    చక్కగ ననిశము సంతోషముగా

మిక్కిలి భక్తిని మ్రొక్కెడు వారికె

    దక్కును మోక్షము నిక్కముగా


సీతారామా రాజారామా

    శ్రీరామా రఘురామా యనుచును

పూతచరిత్రా భువనాధిప వి

    ఖ్యాతచరిత్రా రామా యనుచును


మునివరసన్నుత సురవరసన్నుత

    పురహరసన్నుత రామా యనుచును

వనజాసననుత దనుజకులాంతక

    వనజాతేక్షణ రామా యనుచును


శాపవిమోచనచణశుభచరణా

    సంకటమోచన రామా యనుచును

పాపవిమోచన తాపవిమోచన

    భవభయమోచన రామా యనుచును