రామ రామ యని ప్రేమగ నిత్యము నామకీర్తనము చేసెదను
నామకీర్తనము రసనకు మప్పిన నరుడే నరుడని తలచెదను
నామకీర్తనము కలిమలహరమని నాహృదయములో తలచెదను
నామకీర్తనము నిత్యము చేయుట క్షేమకరం బని తలచెదను
నామకీర్తనము మెచ్చును హరి యది నాకు చాలు నని తలచెదను
నామకీర్తనము ప్రాణప్రదమని నమ్మి త్రిశుధ్ధిగ చేసెదను
నామకీర్తనము సర్వవేళలను నమ్మకముగ నే చేసెదను
నామకీర్తనము నేకతమున నానందముతో నే చేసెదను
నామకీర్తనము పదుగురితో నానందముతో నే చేసెదను
నామకీర్తనము నందలి సుఖమే నాకు ముఖ్యమని తలచెదను
నామకీర్తనము చేయ పాపములు నాశన మగునని తలచెదను
నామకీర్తనము చేసిన మోక్షము నాకు కలుగు నని తలచెదను
నామకీర్తనము హరిసన్నిధిలో నన్ను నిలుపునని తలచెదను