26, డిసెంబర్ 2023, మంగళవారం

ఓరామ రఘురామ


ఓరామ రఘురామ నారామ రామ

చేరి నిలచితి నిదే సీతారామ


వలచితి నిన్నే పట్టాభిరామ

తలచితి నిన్నే దశరథరామ

కొలిచితి నిన్నే కోదండరామ

నిలచితి నీకడ నీరజశ్యామ


హరవిరించ్యాదు లందరు రామ

తరచుగ నిన్నే తలతురు రామ

శిరసు వంచితి నీకు శ్రీకర రామ

ధరణిజారమణ నాదైవమ రామ


నిరుపమ గుణనిధి నీవాడ రామ

పొరిపొరి నిన్నే పొగడుదు రామ

తరుణ మిదే నని తలచి శ్రీరామ

కరుణను నన్నేల గలవు శ్రీరామ


ఇంతింత వరము లిచ్చె నీరాముడు


ఇంతింత వరము లిచ్చె నీరాముడు మాకు
చింత లన్ని దీర్చినాడు శ్రీరాముడు

మనసు నదుపుచేయు నట్టి మార్గమును జూపుమంటే
తన నామము రసన నుంచె దశరథసుతుడు

కలితోడను కయ్యమాడు బలము నీయమంటేను
కలికి కన్నెఱ్ఱజేసె ఘనుడు రాముడు

నిచ్చలు నీపాదసేవ నిక్కముగా నీయు మంటె
వచ్చి మనసులోన నిలిచె ముచ్చట గాను

ఎత్తిన జన్మములు చాలు నింక కటాక్షించు మంటె
చిత్తగించి సరే ననెను సీతారాముడు


24, డిసెంబర్ 2023, ఆదివారం

హరినామం మన హరినామం


హరినామం మన హరినామం నిరుపమాన మగు హరినామం

అఖిలలోకముల కాధారముగా నమరియుండునది హరినామం
అఖిలలోకముల కన్నిట రక్షగ నమరియుండునది హరినామం
అఖిలలోకముల కమృతమనగా నమరియుండునది హరినామం
అఖిలలోకముల నమితపూజ్యమై యమరియుండునది హరినామం

అందరు విబుధుల జిహ్వాగ్రంబుల నమరియుండునది హరినామం
అందరు విబుధుల హృదయంబులలో నమరియుండునది హరినామం
అందరు విబుధుల కభయము నిచ్చుచు నమరియుండునది హరినామం
అందరు విబుధుల కైశ్వర్యముగా నమరియుండునది హరినామం

సుమతుల కనిశము కర్ణపేయమై యమరియుండునది హరినామం
కుమతుల హృదయఛ్చేదము చేయుచు నమరియుండునది హరినామం
విమలబుధ్ధులకు మోక్షప్రదమై యమరియుండునది హరినామం
విమలంబగు శ్రీరామనామమై యమరియుండునది హరినామం



నరోత్తములకే మోక్షము

 
హరేరామ యని యనిశము పలికే నరోత్తములకే మోక్షము
హరేకృష్ణ యని చిందులు త్రొక్కే నరోత్తములకే మోక్షము

హరినే తల్లిగ దండ్రిన నెంచే నరోత్తములకే మోక్షము
హరియే బంధువు గురువని యెఱిగిన నరోత్తములకే మోక్షము

పరదైవతమగు హరినే కొలిచే నరోత్తములకే మోక్షము
పరాత్పరుని శుభనామము మరువని నరోత్తములకే మోక్షము

హరిసేవల కంకితమై యుండెడి నరోత్తములకే మోక్షము
హరికీర్తనమున పరవశమందెడి నరోత్తములకే మోక్షము

హరి కన్యుల తామెన్నడు తలపని నరోత్తములకే మోక్షము
హరిభక్తిని తామెన్నడు విడువని నరోత్తములకే మోక్షము

హరిని మనసులో తిరముగ నిలిపిన నరోత్తములకే మోక్షము
హరిని జగము లందన్నిట గాంచే నరోత్తములకే మోక్షము

పరమాప్తుండని రాముని తలచే నరోత్తములకే మోక్షము
పరమప్రియుడని కృష్ణుని తలచే నరోత్తములకే మోక్షము

హరినామము గల దన్యము వలదను నరోత్తములకే మోక్షము
హరిపాదంబుల నుండుట చాలను నరోత్తములకే మోక్షము


21, డిసెంబర్ 2023, గురువారం

రామచంద్రు డీత డండి

రామచంద్రు డీత డండి రండి సేవించండి

కామితార్ధప్రదు డండి కదలి రండి


సకలసుగుణధాము డండి సాకేతరాము డండి

అకళంకచరితు డండి హరియే నండి

వికచాంబుజనేత్రు డండి వీరాధివీరు డండి

సకలలోకవందితు డగు చక్రి యండి


అవనిజారమణు డండి అమిత సుందరు డండి

భువనమనోహరుడైన పురుషు డండి

సవనరక్షాదక్షు డండి భువనరక్షకు డండి

రవికులావతంసు డగు రాము డండి


పరమదయాశాలి యండి పతితపావను డండి

పరమపూరుషుం డండి నిస్తులు డండి

పరమశాంతమూర్తి యండి పట్టాభిరాము డండి

వరదాయకు డితడండి భజియించండి


భజనచేయ రేలనో పామరులారా

భజనచేయ రేలనో పామరులారా హరి
భజనచేయ రేలనో పామరులారా

భజనచేసి మోదమంద వచ్చును కాదా హరి
భజనచేసి మోక్షమంద వచ్చును కాదా
భజనచేయ చిత్తశుద్ధి వచ్చును కాదా హరి
భజనచేయ హరికి కృప వచ్చును కాదా

హరిభజనకు సమయమేమి అయ్యలారా శ్రీ
హరిభజనకు సర్వవేళ లత్యుత్తమమే
హరిభజనకు నియమమేమి అమ్మలారా శ్రీ
హరిభజనకు మనసు కలుగు టన్నది చాలు

హరేరామ యని పలుకం డయ్యలారా శ్రీ
హరేకృష్ణ యని పలుకం డమ్మలారా
నిరంతరము చేయరే మరువక భజన శ్రీ
హరేరామ హరేకృష్ణ యని హరిభజన 

మానవుడా ఓ మానవుడా


మానవుడా ఓ మానవుడా హరినామము మానకు మానవుడా
మానక శ్రీహరినామము చేసిన మానవుడే తరియించునురా

హరినామముచే అరిషడ్వర్గము నణచివేయరా మానవుడా
హరినామముచే అఖిలద్వంద్వముల నధిగమించరా మానవుడా
హరినామముచే కలిని జనియించి యానందించర మానవుడా
హరినామముచే అఖిలాత్మకుడగు హరిని చేరరా మానవుడా

హరినామముచే యాత్మశక్తి నీకతిశయమగురా మానవుడా
హరినామముచే ప్రకృతి నీయెడ నణగియుండును మానవుడా
హరినామముచే త్రిభువనపూజ్యత యబ్బును నీకు మానవుడా
హరినామముచే యమదూతలు నిన్నంటజాలరు మానవుడా

హరేరామ యని పలుకర నీవిక యన్నివేళలను మానవుడా
హరేకృష్ణ యని నిత్యము పలుకుచు నానందించర మానవుడా
హరేరామ శ్రీహరేకృష్ణ యని ఆలపించరా మానవుడా
నిరంతరాయముగా హరినామము నీవు పలుకరా మానవుడా


నామకీర్తనము చేసెదను


రామ రామ యని ప్రేమగ నిత్యము నామకీర్తనము చేసెదను


నామకీర్తనము రసనకు మప్పిన నరుడే నరుడని తలచెదను
నామకీర్తనము కలిమలహరమని నాహృదయములో తలచెదను
నామకీర్తనము నిత్యము చేయుట క్షేమకరం బని తలచెదను
నామకీర్తనము మెచ్చును హరి యది నాకు చాలు నని తలచెదను

నామకీర్తనము ప్రాణప్రదమని నమ్మి త్రిశుధ్ధిగ చేసెదను
నామకీర్తనము సర్వవేళలను నమ్మకముగ నే చేసెదను
నామకీర్తనము నేకతమున  నానందముతో నే చేసెదను
నామకీర్తనము పదుగురితో నానందముతో నే చేసెదను

నామకీర్తనము నందలి సుఖమే నాకు ముఖ్యమని తలచెదను
నామకీర్తనము చేయ పాపములు నాశన మగునని తలచెదను
నామకీర్తనము చేసిన మోక్షము నాకు కలుగు నని తలచెదను
నామకీర్తనము హరిసన్నిధిలో నన్ను నిలుపునని తలచెదను


19, డిసెంబర్ 2023, మంగళవారం

రాం రాం రాం


రాం రాం రాం హరి రాం రాం రాం
రాం రాం రాం హరి రాం రాం రాం
రాం రాం రాం హరి రాం రాం రాం
రాం రాం రాం రఘురాం రాం రాం

రాం రాం రాం రఘురాం రాం రాం
రాం రాం రాం రఘురాం రాం రాం
రాం రాం రాం రఘురాం రాం రాం
రాం రాం రాం జయ రాం రాం రాం

రాం రాం రాం జయ రాం రాం రాం
రాం రాం రాం జయ రాం రాం రాం
రాం రాం రాం జయ రాం రాం రాం
రాం రాం రాం శ్రీరాం రాం రాం

రాం రాం రాం శ్రీరాం రాం రాం
రాం రాం రాం శ్రీరాం రాం రాం
రాం రాం రాం శ్రీరాం రాం రాం
రాం రాం రాం హరి రాం రాం రాం


ఈవిధంగా సంకీర్తనం చేస్తున్న పక్షంలో మొదటనూ చివరనూ కూడా ఒకే విధంగా ఉంటుంది పాదం. అలాగే ప్రతిచరణంలోనూ తొలి మూడుపాదాలూ ఒకవిధంగానూ చివరిపాదం కొంత మార్పు తోనూ వస్తున్నది. ఆమార్పును  తరువాతి చరణం అందుకొని కొనసాగుతుంది. 

అన్నిటా రాం రాం రాం అన్నది ప్రతి పాదంలోనూ ఆరుసార్లు రావటం వలన సంకీర్తనం ఇలా ఒక ఆవృత్తి పూర్తి అయ్యేసరికి మొత్తం 96 సార్లు రామనామం నడుస్తున్నది. ఐతే హరి అని అదనంగా ఆవృత్తిలో మొత్తం మీద అదనంగా నాలుగుసార్లు రావటం వలన నామం నూరుసార్లు సంపన్నం అవుతున్నది. ఆయన్ను సకలశ్రీలకూ ఆలవాలమైన శ్రీరాముడిగా ఉటంకిస్తూ సంకీర్తనం ఒక ఆవృత్తి సంపన్నం అవుతోంది.

రఘురాం జయరాం శ్రీరాం అనటం వలన బేధం లేదు కాబట్టి నామసంఖ్య నూరు  కచ్చితంగానే ఉంటున్నది.

మరొక విశేషం . ముందుగా హరిగా సంబోధించి తరువాత రఘురాముడి గానూ పిదప జయరాముడి గానూ సంబోధించటం ద్వారా రామాయణ స్ఫురణ కలుగుతున్నది.

ఇలా ఒక్క ఆవృత్తి చేయటానికి ఇరవై లేదా ముఫ్ఫైసెకండ్లు పట్టవచ్చును.


18, డిసెంబర్ 2023, సోమవారం

రాం రాం రాం హరి రాం రాం రాం



రాం రాం  రాం హరి  రాం రాం  రాం
రాం రాం  రాం జయ రాం రాం  రాం


రాం రాం  రాం కమలేక్షణ రాం రాం
రాం రాం  రాం సీతాపతి రాం రాం

రాం రాం  రాం జగన్మోహన రాం రాం
రాం రాం  రాం జగదీశ్వర రాం రాం

రాం రాం  రాం సురనాయక రాం రాం
రాం రాం  రాం నరపాలక రాం రాం

రాం రాం  రాం సురవందిత రాం రాం
రాం రాం  రాం  మునివందిత రాం రాం


రాం రాం రాం వరదాయక రాం రాం
రాం రాం శంకరసన్నుత రాం రాం

రాం రాం  రాం పరమేశ్వర రాం రాం
రాం రాం హనుమత్సేవిత రాం రాం

రాం రాం  రాం కరుణాకర రాం రాం
రాం రాం నిర్మలవిగ్రహ రాం రాం

రాం రాం రాం భువనాశ్రయ రాం రాం
రాం రాం శ్రీకర శుభకర రాం రాం


రాం రాం దీనజనాశ్రయ రాం రాం
రాం రాం భక్తజనావన రాం రాం

రాం రాం దశరథనందన రాం రాం
రాం రాం దశముఖమర్దన రాం రాం

రాం రాం సురరిపునాశక రాం రాం
రాం రాం సుగుణవిభూషిత రాం రాం

రాం రాం మంగళదాయక రాం రాం
రాం రాం  ముక్తిప్రదాయక రాం రాం



30, నవంబర్ 2023, గురువారం

ఏమేమి నేర్చితివే రామచిలుకా


ఏమేమి నేర్చితివే రామచిలుకా శ్రీ

రామ రామ యనగలవా రామచిలుకా


ఎన్ని యూళ్ళు తిరిగితివో యిన్నినాళ్ళుగా నీ

వెన్నెన్ని నేర్చితివో ఎంతచక్కగా

తిన్నగా నీనేర్పులు తీరుతీరుగా మా

కన్నులకు పండువగా కాస్తచూపవా


భామవలె కులుకుదువా బహుపసందుగా శ్రీ

రామభజన చేయుదువా రంజురంజుగా 

ఓ ముద్దులచిలుక యేయూరి దానవే మా

రామభజనలో చే‌ర వ్రాలినావటే




28, నవంబర్ 2023, మంగళవారం

రామనామమే చాలండీ


రామనామమే చాలండీ వేరేమీ యక్కర లేదండీ 
రామనామమున కానిపని బ్రహ్మాండములోనే  లేదండీ  

కలిపురుషునితో కయ్యము లాడి ఘనముగ జయమును గాంచుటకు 
బలమగు ఖడ్గము కావలె నంటే బహుశ్రేష్ఠంబగు ఖడ్గముగా  

దారుణమగు మన పాపాటవులను తక్షణమే నిర్మూలింప 
తీరగు పరశువు కావలె నంటే దివ్యమైన యొక గొడ్డలిగా  

దాటరాని సంసా‌రసాగ‌రము దాటి యొడ్డునకు చేరుటకు 
మేటినౌకయే కావలె నంటే మిక్కిలి చక్కటి నౌక యన  

మరల మరల యీతనువుల దూరుట మనకెందుకని తలచినచో 
త్వరగా మోక్షము సంపాదించి హరిసన్నిధిలో చేరుటకు


రామరామ యని మీరు


రామరామ యని మీరు రామనామము చాల

ప్రేమతో పలకండి విభునినామము


విభుని రూపమే తలచి విభుని మనసున వలచి

విభుని నామమే పలుకు వేడుక తోడ


విభుని మహిమనే తలచి విభుని భక్తితో కొలిచి

విభుని గాథ లెన్నుచును వేడుక తోడ


విభుని వైభవము నెంచి విభుని కరుణ లోనెంచి

విభుని కన్యమెంచక వేడుక తోడ


విభుని గుణములే తలచి విభుని ధర్మమే తలచి

విభుని సత్యమే తలచి వేడుక తోడ


విభుని శౌర్యమే తలచి విభుని జయములే తలచి

విభుని కీర్తినే తలచి వేడుక తోడ


విభుని  ప్రేమనే తలచి విభుని యభయమే వలచి

విభుని మోక్షమే యడుగు వేడుక తోడ

22, నవంబర్ 2023, బుధవారం

ప్రేమమయుడగు స్వామినామము


ప్రేమమయుడగు స్వామినామము శ్రీ
రామనామము రమ్యనామము

వీనులకు విందైన నామము 
జ్ఞానులకు హితవైన నామము
దీనులను రక్షించు నామము 
తానె బ్రహ్మం బైన నామము

ఇష్టముల చేకూర్చు నామము 
కష్టముల పోకార్చు  నామము
దుష్టులను శిక్షించు నామము 
శిష్టులను రక్షించు నామము

వరము లిచ్చే దివ్యనామము
పరమసత్యంబైన నామము
పరమయోగులు పాడు నామము
హరుడు నిత్యము పలుకు నామము


కమనీయగాత్రా కరుణాసముద్రా

కమనీయగాత్రా కరుణాసముద్రా

మము బ్రోవ రారా మారామచంద్రా


ఇనవంశతిలక వనజాక్ష రామ

నిను దక్క నిత‌రులను నమ్మ కేను

మనసార నమ్మి నిను కోరి చేరి

వినుతించు చుంటినని తెలియవయ్య


కరుణించ వయ్య కమలాయతాక్ష

వరభక్తపక్ష పరమాత్మ రామ

హరి నీకుసాటి మరి యెవ్వ రయ్యా

నరనాధ దయతో నన్నేలుకోరా


సురవై‌రి నాశ హరి పాపనాశ

మరుజన్మ లేని వర మీయ వయ్య

మరి యేమి నిన్ను కరుణించ మనను

హరవినుత నామ యది చాలు నాకు

21, నవంబర్ 2023, మంగళవారం

రామనామము నీకు చేదా

 
రామనామము నీకు చేదా రాము డంటే ప్రేమలేదా
రామ రామా యంటే సర్వకామనలును తీరిపోవా


భూమి మీదను మానవుడవై పుట్టినంతనె గొప్ఫ లేదు
కాముకుడవై నాల్గునాళ్ళిట గడపిపోవుట గొప్పకాదు
స్వామినామము మరచి తిరిగి చచ్చుటేమియు గొప్ప కాదు
ప్రేమతో శ్రీరామనామము విడువకుండుటె గొప్ప కాని

ఎన్నిలక్షల జీవరాసు లున్నవయ్యా భూమి పైన మరి
యన్నిటికిని వాక్పటుత్వం బన్న దాహరి యొసగ లేదే
ఎన్ని నరునకు యిచ్చినాడది యన్న స్పృహయే లేక నీవు
తిన్నగా శ్రీరామనామము నెన్ని పలుకని దేమి బ్రతుకు

పాపములు తొలగించు నామము పతితపావన రామనామము
శాపములు కడతేర్చు నామము చల్లనైనది రామనామము
తాపముల నణగించి నీపై దయలు కురియును రామనామము
కాపుగాయుచు నన్నివేళల కరుణజూపును రామనామము



రాముడు నీవా డనుకోగానే

 
రాముడు నీవా డనుకోగానే రాముడు నీవాడే కాడా
రాముడు నీవాడే కాడా రఘురాముడు నీవాడే కాడా

రామనామమును పలికినంతనే రాముని తలపే కలుగు కదా
రాముని మనసున తలచిన క్షణమే రాముడు మనసున నిలుచు కదా
రాముని మనసున నిలుపు కొనుటకే భూమిని నీకీ జన్మ కదా
భూమిని రాముని భక్తు లందరకు రాముడు తమవాడే కాదా

కోటిజన్మముల నెత్తిన పిమ్మట సూటిగ రాముని నామమును
నాటి జిహ్వపై నిరంతరంబుగ నామస్మరణము చేయుచును
పాటింపన నాదరము నన్యముల భావించుచు రాముని లోలో
సాటిలేని హరి స్వంతమాయెనని సంతసింప తానటు కాడా



రామనామము మరువబోకండీ


రామనామము మరువబోకండీ శ్రీరామరామ యని తరించండీ

రామనామము విష్ణుదేవుని నామములలో మిన్నయైనది
రామనామము మౌనివరలు విరామెఱుగక పలుకునట్టిది
రామనామము సర్వలోకారాధితంబగు దివ్యనామము
రామనామము కన్న మిక్కిలి రమ్యమనదగు నామమేది

స్వామినామము మరువనేటికి జపములేవో చేయనేటికి
స్వామినామము మరువనేటికి సకలబాధలు పొందనేటికి
స్వామినామము మరువనేటికి జముని చేతికి చిక్కనేటికి
స్వామినామము మరువనేటికి భూమి నింకను పుట్టనేటికి

కవులకు ప్రియమైన నామము ఘనతలకొలువైన నామము
శివుడు మెచ్చిన విష్ణునామము చింతలను తొలగించునామము
భవవినాశము చేయునామము పరమపావనమైన నామము
రవికులేశుని రమ్యనామము రామనామము సుజనులారా


19, నవంబర్ 2023, ఆదివారం

శ్రీరఘురామా యని పలుకవయా

శ్రీరఘురామా యని పలుకవయా చిత్తశాంతినే పొందవయా

నారాయణు డా‌రామచంద్రుడే నరులకు దిక్కని తెలియవయా


ఘోరమైన సంసారకూపముప కూలి యుంటి నని గురుతెఱిగి

కూరిమితో వెడలించి బ్రోచుటకు గోవిందుడు కలడని యెఱిగి

నేరము లెంచక నరుల కండగా నిరతము హితుడై నిలుచు హరి

ధీరుడు దశరథసుతుడు రాముడై ధారుణి గలడని మదినెఱిగీ


మేలుగ బ్రహ్మాండములను గాచే నీలమేఘశ్యాముని నమ్మి

చాలమంది సద్భక్తుల బ్రోచిన జలజాక్షునిపై గురి నిలిపి

గాలిపట్టి సేవించు రాముడై కలడతడని మదిలో నెఱిగి

నాలుకపై హరినామము నుంచి యనారతమును సేవించుచును


రామనామము మరచి తిరిగితివి


రామనామము మరచి తిరిగితివి నీవు పామరుడవై మిగిలి పోయితివి
రామనామము కంటె ముఖ్యం బేమి కలదీ భూమి మీదను

కాసులను లెక్కించు కొనుటకు కాలమెంతయు చాలకుండిన
వాసవాదివినుతుడు శ్రీపతి భజనచేయుట కేది సమయము
వీసమంతయు భక్తిజూపక విష్ణుదేవుని భజనచేయక
కాసు లగలగలలు వినుచును కడకు ముక్తికి దూరమైతివి

కామినులపై మోహమును గొని కాలమంతయు గడపుచుండిన
స్వామి నారాయణుని భజన సలుపుటకు నీ కేది సమయము
ప్రేమమీఱగ భక్తిజూపుచు విష్ణుదేవుని భజనచేయక
కాముకుడవై సంచరించుచు కడకు ముక్తికి దూరమైతివి

నీమముగ ముక్కాలములు శ్రీరామనామము చేయువారికి
కామితంబగు మోక్షమిచ్చుచు కరుణజూపును రామచంద్రుడు
తామసత్వము పెచ్చుమీఱగ రామనామము జిహ్వనుంచక
భూమిని చరియించుచుండెడు పామరుడ విక మోక్ష మెక్కడ



16, నవంబర్ 2023, గురువారం

సెలెక్టివ్ సింపతీ!

 

చనిపోయిన మరియు చనిపోతున్న గాజానగరపు పనిపిల్లల్లారా 
ఇంకా చనిపోబోతున్న మరింతమంది గాజానగరపు పనిపిల్లల్లారా 
మీకందరికీ వీడ్కోలు ఉత్సవాలను ప్రారంభించింది ఎవరో తెలుసా?
కొందరు రాజకీయకవులు పాడుతున్నట్లు ఇజ్రాయేల్ కాదు
మీకందరకూ ఇన్నాళ్ళూ సుపరిపాలన అందించిన హమాస్ వాళ్ళు
వాళ్ళు ఇజ్రాయేల్ గర్భిణీల పొట్టలు చీల్చి ఎందరో పసికందుల్ని చంపారు.
అప్పుడీ రాజకీయకవులు ఆకళ్ళుతెరవని పిండాలమీద కవితలు పాడలేదు
ప్రతిహింస చెడ్డది అనే ఈకవులు తొలిహింసాకాండను చెడ్డది అనలేదు.
ఆ పుట్టని బిడ్డలను నాడు వాళ్ళు క్షమాపణ అడుగలేదు
బిడ్డలను కనవలసిన పిచ్చితల్లులనూ వాళ్ళు క్షమాపణ అడుగలేదు
ఇప్పుడు మిమ్మని క్షమాపణ అడుగుతున్నారు.
ఎంత సెలక్టివ్ గిల్ట్! ఎంత సెలెక్టివ్ సింపతీ. 
ఏ దిక్కుమాలిన హింసారంభకులనూ చచ్చినా క్షమించకూడదు
సెలెక్టివ్ సింపతీ డ్రామాల కవుల్ని చచ్చినా క్షమించకూడదు
గాజానగరపు పనిపిల్లల్లారా మీరు హమాస్ వాళ్ళని క్షమిస్తారా?
గాజానగరపు పనిపిల్లల్లారా మీరీ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తారా?
ఓ కాలమా నీవు ఈహమాస్ వాళ్ళని క్షమిస్తావా?
ఓ కాలమా ఈ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తావా?



నోట్:   ఇది గాజా పసిపిల్లలు అనే కవితకు ప్రతిస్పందనగా వ్రాసిన కవిత.

10, నవంబర్ 2023, శుక్రవారం

రామ నిను నమ్ముకొని


రామ నిను నమ్ముకొని మేముంటి మీభువిని
మామాట లాలించు మనుజులెవ్వరు నేడు

నీకన్న రక్షకుడు లోకాన లేడనుచు
లోకులకు బోధింప లేకుంటి మీనాడు
ఏకొద్దిమందియో గాక సర్వులు నేడు
లోకవిద్యలు నేర్చి నీకు దూరం బైరి

తనివార నీనామమును పలుక బోరాయె
నిను గూర్చి తెలిపితే మనసార వినరాయె
కనుగొనక నీసత్యకథ నించుకేనియును
మునుకొని ఆరావణుని పొగడు చుంద్రు

రానురా నిచట శ్రీరామ యన తప్పాయె
కానిపలుకులు పలుకు ఘనులదే యొప్పాయె
పూని మేమెంతగా పురుషోత్తమా భువిని
నీ నిజము తెలిపినను నేడు చెల్లకపోయె


9, నవంబర్ 2023, గురువారం

హరేరామ యనరేలా


హరేరామ యనరేలా అయ్య‌లార మీరు
హరేకృష్ణ యనరేలా అయ్యలార మీరు

పరాత్పరు డైన హరిని ప్రార్ధించక మీరు

పరమపదము నేరీతిగ బడయగలగు వారు
వరములిచ్చు సు‌రలెవ్వరు పరము నీయగలరు
హరి యొక్కడె గాక వట్టి యమాయకు లార

హరికళలే జీవు లందరని తెలియని మీరు
హరిమయ మీవిశ్వమని యరయలేని మీరు
హరిని గాక యన్యులను మరలమరల గొలిచి
పరము నెట్లు పొందగలరు వట్టి భ్రాంతి గాక

హరియే శ్రీరాము డగుచు నరుగుదెంచె కనుడు
హరియే శ్రీకృష్ణు డగుచు నరుగుదెంచె కనుడు
హరి యొక్కడు కాక దైవమనగ వేరు లేడు
హరిని గొలిచి నపుడు కాక పరము దొరుకబోదు






8, నవంబర్ 2023, బుధవారం

చక్కబడు టెట్లు

 
తప్పొప్పు లెఱుగును తన తప్పులెఱుగును
  కాని చేయుచుండు కానిపనులు

ధర్మంబు నెఱుగును తనధర్మ మెఱుగును
  కాని యధర్మముల్ మానలేడు

నీతినెఱుగు లోకరీతి నెఱుంగును
  కాని నీతికి తాను కట్టుబడడు

సత్యంబునెఱుగు నసత్యంబు నెఱుగును
  కాని యసత్యమే కడుప్రియంబు


కలిప్రభావంబుచే బుధ్ధి గాడితప్పి
మనుజు డిట్లుండ నీశ్వరా మంచిదారి
కెట్లు వచ్చును మోక్ష మదెట్లు కలుగు
నీవు దయజూపకున్నచో నిక్కముగను


రాళ్ళు విసిరి నీవు సాధించునది లేదు

 
ఎంతటి శక్తి నార్జించినా రాముని
  శక్తి యంతటి గొప్ప శక్తి కాదు

ఎంతటి జయము నార్జించినా రాముని
  జయము నంతటి గొప్ప జయము కాదు

ఎంతటి కీర్తినార్జించినా రాముని
  కీర్తియంతటి గొప్ప కీర్తి కాదు

ఎంతటి మహిమ గడించినా రాముని
  మహిమ యంతటి గొప్ప మహిమ కాదు 


రామచంద్రునిపై కొన్ని రాళ్ళు విసిరి
నీవు సాధించునది లేదు నింద తప్ప
చక్కగా రామశక్తియు జయము కీర్తి
మహిమలను పొగడుట ముక్తి మార్గమగును


రామ రామ రామ యనరాదా నీవు


రామ రామ రామ యనరాదా నీవు
రాముని సేవించుకొనరాదా నీవు

రామభక్తవరుల చేరరాదా నీవు
రామకీర్తనలను పాడరాదా నీవు
రామచరితములను చదువరాదా నీవు
రామవైరులతో తగవులాడక నీవు

రాముని వర్ణించుకొనగరాదా నీవు
రాముని సేవించుకొనగరాదా నీవు
రాముని  ధ్యానించుకొనగరాదా నీవు
రామవైరులతో తగవులాడక నీవు

రాముని పూజించుకొనగరాదా నీవు
రామకార్యములను చేయరాదా నీవు
రామభక్తి చాలనుకొనరాదా నీవు
రామవైరులతో తగవులాడక నీవు


7, నవంబర్ 2023, మంగళవారం

సృష్టికి ప్రతిసృష్టి అంతర్దాలం

సృష్టికి ప్రతిసృష్టి అంతర్దాలం. మనిషిలో ఎన్ని వికారా లున్నాయో అన్ని వికారాలు అంతర్జాలం లోనూ ఉన్నాయి

    - నిడదవోలు మాలతి గారు.

హస్బెండ్ ఆఫ్ ఎందుకనరు?

నిన్న మాతమ్ముడు సత్యప్రకాశ్ కుమార్తె శ్రీనిథి ఒక ప్రశ్న వేసింది. ఆఆమ్మాయి తొమ్మిదవ తరగతిలో ఉంది. చక్కని ప్రశ్న వేసింది.

"సన్ ఆఫ్ అంటారు.

డాటర్ ఆఫ్ అంటారు.

వైఫ్ ఆఫ్ అంటారు.

మరి ఎవర్నీ హస్బెండ్ ఆఫ్ అని ఎందుకు అనరూ?" అని.


రాముడి.మీద రాళ్ళు

ఈఉదయం మాచెల్లెలు ఒకామె నాతో మాట్లాడుతూ రాముడి మీద రాళ్ళు విసిరితే కాని వీళ్ళు రచయితలు కారా ఏమిటి అంది.

హరేరామ యనునట్టి నరుడే నరుడు


హరేరామ యనునట్టి నరుడే నరుడు
హరేకృష్ణ యనునట్టి నరుడే నరుడు

హరినామము మరువనట్టి నరుడే నరుడు
హరిపూజను విడువనట్టి నరుడే నరుడు
హరికీర్తన లాలపించు నరుడే నరుడు
హరికీర్తన లాలపించు నరుడే నరుడు

హరిసేవల నుండునట్టి నరుడే నరుడు
హరిభక్తుల కొలుచునట్టి నరుడే నరుడు
హరిబోధల ననుసరించు నరుడే నరుడు
హరిచింతన తోడ గడుపు నరుడే నరుడు

హరిగాథల తలచి మురియు నరుడే నరుడు
హరిరూపము తలచి మురియు నరుడే నరుడు
హరికరుణను తలచి మురియు నరుడే నరుడు
హరిమయ మీవిశ్వ మనెడు నరుడే నరుడు


6, నవంబర్ 2023, సోమవారం

నీవు శ్రీహరి వనుచు శ్రీరామయ్య


నీవు శ్రీహరి వనుచు శ్రీరామయ్య భావంబులో నెఱిగి నారామయ్య

నీవాడనై యుంటిరా రామయ్య నావాడవై యుండరా రామయ్య


లోకంబు లేలెడు శ్రీరామయ్య లోలాక్షి లక్ష్మితో శ్రీరామయ్య

వైకుంఠపురమందు శ్రీరామయ్య భగవంతుడగు హరివి శ్రీరామయ్య

లోకరక్షణ మెంచి శ్రీరామయ్య మాకడకు వచ్చితివి శ్రీరామయ్య 

నీకన్న మాకెవరు శ్రీరామయ్య నిజముగా ప్రియులయ్య శ్రీరామయ్య


నీనిజతత్త్వమును శ్రీరామయ్య నిటలాక్షు డెఱుగును శ్రీరామయ్య

నేనెంతవాడనో శ్రీరామయ్య నిన్నెఱిగి కొలుచుటకు శ్రీరామయ్య

నీనామకీర్తనము శ్రీరామయ్య నీగుణకీర్తనము శ్రీరామయ్య

మానకను చేయుదును శ్రీరామయ్య మన్నించి యేలుకో శ్రీరామయ్య 


రక్తిమీఱగ నిన్ను శ్రీరామయ్య భక్తులు కొలిచెదరు శ్రీరామయ్య

భక్తవరద నిన్ను శ్రీరామయ్య భావింతు నెడదలో శ్రీరామయ్య

శక్తికొలదిగ నిన్ను శ్రీరామయ్య చక్కగా గొలిచెదను శ్రీరామయ్య

ముక్తిదాయక హరి శ్రీరామయ్య ముదమార బ్రోవర శ్రీరామయ్య



కదలె కదలె శ్రీరామచంద్రుడు


కదలె కదలె శ్రీరామచంద్రుడు కారడవుల కన్నా
వదినల వెంటను లక్ష్మణస్వామియు కదలినాడు ఘనుడు

నారచీరలను చుట్టబెట్టుకొనె నారాయణమూర్తి
నారచీరలను చుట్టబెట్టె తన నాతి సీత కతడె
నారచీరలను దాల్చె సుమిత్రానందను డంతటను
చేరి రాజునకు మ్రొక్కి వారపుడు సెలవు తీసుకొనిరి

చక్కనిచుక్క సీతమ్మ తనప్రక్కన నడువగను
మిక్కిలికోపము ముక్కునగల సౌమిత్రి వెంట రాగ
చెక్కుచెదరని చిరునవ్వుగల శ్రీరాముడు కదలె
అక్కట పదునాల్గేండ్ల పాటు కారడవుల నుండగను

నిలువుము నిలువుము రామా యనుచు పిలువగ దశరథుడు
వలదువలదు పోవలదు నీవనుచు బ్రతిమలాడ ప్రజలు
నిలువలేక తమ ననుగమించిరా నిఖిలపురప్రజలు
నిలువక పురమున రామచంద్రు డిక నిముషమేని కదలె


మావలన తప్పులుండిన


కం. మావలన తప్పులుండిన
నీవే మన్నించవలయు నిర్మలచరితా
రావణసంహర త్రిజగ
త్పావన శ్రీరామచంద్ర  పాపవిదారా


ఓ శ్రీరామచంద్రప్రభూ.

మేము మానవులం. ఒప్పులూ చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఆమాటకు వస్తే మా చేతల్లో ముప్పాతికమువ్వీసం తప్పులేను.

మాలో కొందరం నీవు చూపిన బాటలో నడవటానికి ఇష్టపడని వాళ్ళమూ ఉన్నాం. 

కొందరం నిన్ను తప్పుపట్టే వాళ్ళమూ ఉన్నాం. 

ఇంకా దారుణంగా రావణుడే నీకన్నా గొప్పవాడని వాదించే మూర్ఖులమూ ఉన్నాం.

కొద్దిమందిమి నీ మాహాత్మ్యాన్ని నమ్మినా, నీవలె సత్యనిష్ఠనూ ధర్మనిరతినీ అలవరచుకోలేక ఇబ్బంది పడుతున్నాం.

కొందరం నిన్ను పూజిస్తున్నా అది అంత త్రికరణశుధ్ధిగా మాత్రం కాదు.

ఇలా మాతప్పులు ఎన్నో ఎన్నెన్నో!

మాకు తెలుసు, ఏదో ఒకరోజు వస్తుందని.
ఆరోజున యముడు మమ్మల్ని నిలదీస్తాడని.

అయన నిర్మొగమాటి. చండశాసనుడు. దయాదాక్షిణ్యాలు లేని వాడు.

అయన మమ్మల్ని మన్నించే ప్రసక్తి లేనే లేదు.

ఈ ప్రపంచంలో ఉన్న మాలాంటి వచ్చేపోయే మానవులు మమ్మల్ని మన్నించితే ఎంత మన్నించకపోతే ఎంత?

మాగతి ఏమిటి?

ఆయముడి బారినుండి మమ్మల్ని రక్షించగల మహానుభావుడవు నువ్వే,

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిన్నే వేడుకుంటున్నాం.

రావణాది ధర్మద్రోహులను శిక్షించిన ధర్మావతారుడివి నువ్వు.
నీభక్తులం.

మమ్మల్ని రక్షించటం నీధర్మం అని భావించు దయచేసి.
అఖిలపాపాలనుండీ మమ్మల్ని విముక్తులను చేసి రక్షించగలవాడవు నువ్వొకడవే.

మూడులోకాలనూ  నీకంటే పావనమూర్తి లేడు. ముమ్మాటికీ లేడు.

శ్రీరామచంద్రా, తప్పదు. 

నువ్వే మమ్మల్ని తప్పక మన్నించాలి.


4, నవంబర్ 2023, శనివారం

శ్రీరఘు రామ రాం రాం



శ్రీరఘు రామ రాం రాం సీతారామ రాం రాం
తారకనామ రాం రాం దశరథరామ రాం రాం

పతితపావన రాం రాం పట్ఠాభిరామ రాం రాం
అతిదయాపర రాం రాం దితిజమర్దన రాం రాం

పరమపావన రాం రాం భక్తవత్సల రాం రాం
దురితనాశక రాం రాం తోయజేక్షణ రాం రాం

భువనమోహన రాం రాం భువనపాలక రాం రాం
భవవిమోచన రాం రాం దివిజపూజిత రాం రాం

జగదభిరామ రాం రాం సద్గుణధామ రాం రాం
నిగమసన్నుత రాం రాం నీరదశ్యామ రాం రాం 

భయహర రామ రాం రాం జయకర రామ రాం రాం
జయజయ రామ రాం రాం జయజయ రామ రాం రాం