మాకు సర్వస్వమై మారాము డున్నాడు మీ కెవ్వరున్నారు మీరె చెప్పుడయ్య |
|
కర్మసముఛ్ఛయము నందు కల లబ్ధి సున్న కర్మఫలము దారితీయు కర్మములకు దుర్మానములు బాపి నిర్మలత్వము గూర్చి కర్మవిముక్తుల జేయ గలడా మీదేవుడు |
మాకు |
లేనిపోని కొంగ్రొత్త జ్ఞానమార్గములు వచ్చె దేని కెంత ఫలితమన్న దెలియరాదు మీ నిజతత్త్వమందు మిమ్ము నిలుపలేని వానిచే దెలుపబడు వాడెట్టి వాడగును |
మాకు |
ఎవడో ఒకడిని దేవు డితడని నమ్మి కొల్చితే చివరకు దక్కునదేమొ చెప్పరాదు భవరోగము మాన్పు వైద్యుడెవ్వడో వాని దవులు కొన్న మీకు ఫలము దక్కును గాని |
మాకు |
28, డిసెంబర్ 2016, బుధవారం
మాకు సర్వస్వమై మారాము డున్నాడు
27, డిసెంబర్ 2016, మంగళవారం
ఆలసించరాదు రాము నాశ్రయించరా
ఆలసించరాదు రాము నాశ్రయించరా కాలగతి యెటులుండునొ కనలేమురా |
|
కొఱగాని చదువులతో కొల్లబోయె బాల్యము నెఱజాణ యిచ్చకములు నెట్టెను యౌవనము తఱచు కాసులగోల తరిగించె నడివయసు తఱుముడువడ నాయె కాలసర్పము చేత |
ఆల.. |
కనులు హరినిజూడగ కలువరించలేదు మనసులోన నాటలేదు మాధవుని కథలు తనువుగూర్చి నేటికి తహతహలు పుట్టగ పనవుదువా హరిహరి యని పరిహసించను |
ఆల.. |
పదిజన్మల నెత్తినను బ్రతికెడు తీరిట్టిదే పదేపదే విషయంబుల భావించి చెడుటయే వదలక శ్రీరాముని పదములాశ్రయించిన వదిలిపోవు చెడుగు రామ వాల్లభ్యము చేత |
ఆల.. |
పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ పట్టుమని బ్రహ్మపదము ప్రభువొసగెను వినుమ |
|
ఒక కోతికి దక్కినదే యున్నతమగు పదము యకళంకభక్తి కది యద్భుతమగు వరము సకలజీవరాశులకు సముడు శ్రీరాముడు వికసరోరుహనేత్రుడు విభీషణవరదుడు |
పట్టె |
అతడు నవవ్యాకరణము లభ్యసించినాడు అతడు నవనిథులగుట్టు లన్ని యెఱిగినాడు అతడు శ్రీరామచంద్రు నాశ్రయించినాడు అతడు లోకారాథ్యు డగుచు వెలసినాడు |
పట్టె |
శ్రీరాముని శుభనామము చెలగు నెల్ల తావుల ఆరూఢిగ సజలనయను డగుచు వ్రాలు మారుతి ఈరేడు లోకముల లేరతనికి సాటి చేరబిలచి బ్రహ్మనుగా చేసె రాముడందుకే |
పట్టే |
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
ఏమి చేసేదయా యింత సామాన్యుడను
ఏమి చేసేదయా యింత సామాన్యుడను రాముడా దారి చూపరాదటయ్య |
|
బాగొప్ప వేదాంతపరిభాష నెఱుగనే నీ గొప్పదనమది నేర్పేనో ఆ గజిబిజి వేదాంత మబ్బకున్నను నే గొంటి నీభక్తి నిజమిది నిజము |
ఏమి |
ఏ గురువును నొకమంత్ర మీయనే లేదే సాగి యొకదీక్షగొని జపముచేయ యోగీశ్వరేశ్వర యొక్క నీ నామమే నా గతి యని నమ్మి నానిది నిజము |
ఏమి |
యేది మంచి దేది చెడుగొ యెంచగా లేనే యేది దారి యని నేను యెంచితిని శ్రీదయితుడా దీన చింతామణీ నీదు పాదములే చక్కగ పట్టితి నిజము |
ఏమి |
దేవతలున్నారు దేనికి
దేవతలున్నారు దేనికి నీకు నాకు కావలసిన విచ్చి వారు కదలిపోయేరు |
|
ఒక్కొక్క కోరిక పుట్ట నొక్కక్క దేవత నెంచి యొక్క ప్రొద్దులు పురాణోక్తస్తోత్రంబులు చక్కగా వ్రతములు సాగి మంత్రదీక్షలును నెక్కటిభక్తి ఘటించి యెచటికి చేరెదరు |
దేవత |
వారిచ్చునవి యెంత వరకు నిత్యంబులు వారిచ్చు వరముల వలచి తపించినను వారిజాక్షియొ బలమొ బంగారమో యెంచి కోరగలము గాని ముక్తి కోర వీలగునె |
దేవత |
వారికి నైన నాపదలు వచ్చుచు నుండును వారు నారాయణుని పదము లంటెదరు ధారుణి నున్న మనకు దశరథరాముడై కోరిన ముక్తి నీయ కొలువాయె శౌరి |
దేవత |
18, డిసెంబర్ 2016, ఆదివారం
రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము
రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము రామదేవునకు సాటిరాడు వేరుదైవము |
|
సప్తకోటి మంత్రములకు సారమైన మంత్రము గుప్తము కా దెల్లవారు కోరదగిన మంత్రము లిప్తలోన జ్ఞానజ్యోతి వ్యాప్తి చేయుమంత్రము శప్తుల ఘనపాపులను చక్కజేయు మంత్రము |
రామ |
మునిజనసంభావితశుభమూర్తి శ్రీరాముడు వనజభవభవవాసవవినుతమూర్తి రాముడు ఘనభవసాగరము మీద గట్టినౌక రాముడు జనార్దనుడు నారాయణస్వామి శ్రీరాముడు |
రామ |
కోరిన లౌకికము లీయ కొల్లలా దేవతలు వారి నుపాసించ కావలసినన్ని మంత్రములు మీరు మోక్షార్ధులైన మీకిదియే మంత్రము మీరు మోక్షార్ధులైన మీకితడే దైవము |
రామ |
15, డిసెంబర్ 2016, గురువారం
బడయుడు శుభములు
బడయుడు శుభములు బడయుడు సుఖములు బడయుడు శ్రీరామచంద్ర భజనంబున |
|
బడయుడు రాముడు పరమాప్తుడై యుండి పెడమోము కాక ప్రేముడితోడను నడిగిన వన్నియును నమరించు చున్నాడు కడుభక్తులరైయుండి బడయుడన్నియును |
బడయుడు |
బడయుడు రాముడు పరమగురుండై యుండి యడగించి సందియంబులనెల్ల కడుయోగ్యులను జేయు జ్ఞానమిచ్చుచున్నాడు తడయక మీరతని చేరి తత్త్వమెఱుగుడు |
బడయుడు |
అడిగడిగో రాముడు మన కందరకు మోక్షము నిడ సంసిధ్ధుడై యిదిగో పిలచె వడివడిగ పరమాత్ముని భావించి మించరే బడయ మీ కింకేమి వలయునో చెప్పరే |
బడయుడు |
14, డిసెంబర్ 2016, బుధవారం
కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది
కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది తలచి నీవిచ్చినవి తప్ప నాకడ లేవు |
|
తనువా యిది నీవు దయతో నిచ్చినది మును పిట్టి వెన్నో ముదమార గొనుమని వివిధములను నాకిచ్చి నీ పనులను నావలన బాగుగ గొంటివే |
కొలిచి |
మనసా యిది నీవు మంచివర్తనము లను దాని లోపలను పొదగి తనివార నది నిన్ను తద్దయు వేడుక గొనియాడ నిత్యము వినుచుందువే |
కొలిచి |
నను నీదు ప్రతిబింబ మనియందువు నా దని నొకడెన్న దగునా రామ నను నేను నీలోన కనుచుందు గావున కొనుమని నన్నిచ్చు కొనువాడ నంతియె |
కొలిచి |
13, డిసెంబర్ 2016, మంగళవారం
చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ
చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ మీ కున్న చింతవంత లన్నియు వీడుడీ |
|
ఇతని పేరు చెప్పినంత నెల్ల లోకనాయకులు నతిబలశాలుర నసురుల తుళువల నితడు చంపెనని యెంచి యెంచి వేడ్కతో నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి |
చిన్న |
ఇతని పేరు చెప్పినంత నింతింత యనరాక నతిశయించెడు భక్తి నందరు సజ్జనులును యితని సద్గుణముల నెంచి నెంచి వేడ్కతో నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి |
చిన్న |
ఇతని పేరు చెప్పినంత యెట్టిపాపములైన చితికి నుగ్గైచను చేరునెల్ల శుభములును యితడిచ్చు మేళుల నెంచి యెంచి వేడరే యతులితమగు మోక్షమందించు రాముని |
చిన్న |
మాయలేమి చేయలేదు
మాయలేమి చేయలేదు మహిమలేమి చూపలేదు మాయయ్య రామయ్య మరి నీతి తప్పలేదు |
|
ఒరులేల శివుని యుత్తమ ధనువును మరి యెత్తలేరైరొ మాకే మెఱుక గురువుల యనుమతి గొని రఘువరుడు కరముల గొన నదె ఖండము లాయె |
మాయ |
తానై చనలేదు దండకలో నుండ తానై దనుజుల తాకబోవడు వారె పూని పదునాల్గువేలు బొబ్బలిడుచు వచ్చి వాని నెదిరించి నంత భస్మమైరంతె |
మాయ |
పనిగొని రావణు డనువాడు సీతను గొనిపోయె మ్రుచ్చిలి కొరవితోడ తనకేల తలగోకుకొన బుద్ధి కలిగెనో కనగ భూభారమెల్ల కరిగిన దంతె |
మాయ |
నీ విచ్చే దిచ్చితివి
నీ విచ్చే దివ్చితివి నేనడుగ కుండినను నే నీయగలిగినది నీకిచ్చితినా |
|
గడచిన పలుజన్మములును కరుణ నందించితివి చెడు వేళలందు రక్షించినావు నీవు జడతతో నీప్రేమ సామ్రాజ్యసుఖము విడచి ప్రకృతి నెన్ను వెంగళిని నేనైతి |
నీ విచ్చే |
ఏనాటి కైన నేను నీవాడ నగుదునని నీ నమ్మకము కాని నేనైతే కటకటా మానక ప్రకృతికాంత మరులలో జిక్కితిని నీ నామమే మరచు నీచుడ నేనైతినే |
నీ విచ్చే |
ఇపుడు నీపైన భక్తి యినుమడించినది నాకు విపరీతమై తోచు వెనుకటిబ్రతుకంతయు యపరాథములు సైచి యాదరించవే తండ్రి తపనదీర్చి కాపాడక తప్పదయ్య రామయ్య |
నీ విచ్చే |
(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)
నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ నార్తి దీర్తువు కద నటులైన నిటులైన |
|
వేరుపడక నిన్ను వెంబడించుచు దోచు శ్రీరమణీమణి చెలగిపొగడు నట్లు నీరూపముల గూర్చి నీనామముల గూర్చి నేరిచి పలుకాడ నేనెంత వాడను |
నేర్తునో |
వీగక నీయెడద విహరించి మురిపాలు సాగించుకొను లచ్చి చక్కగా నెఱిగిన నీగుణములను గూర్చి నీదు కరుణను గూర్చి సాగి వచింపగ సరిపడు వాడనా |
నేర్తునో |
కాలమే నీవైన కడగి తానె నీవై మేలుగ చరియించు శ్రీలక్ష్మి వలెను నీలీలలను గూర్చి నీతత్త్వమును గూర్చి చాలుచాలు రామహరి చర్చించు వాడనా |
నేర్తునో |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)