18, డిసెంబర్ 2016, ఆదివారం

రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము


రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము
రామదేవునకు సాటిరాడు వేరుదైవము

సప్తకోటి మంత్రములకు సారమైన మంత్రము
గుప్తము కా దెల్లవారు కోరదగిన మంత్రము
లిప్తలోన జ్ఞానజ్యోతి వ్యాప్తి చేయుమంత్రము
శప్తుల ఘనపాపులను చక్కజేయు మంత్రము
రామ

మునిజనసంభావితశుభమూర్తి శ్రీరాముడు
వనజభవభవవాసవవినుతమూర్తి రాముడు
ఘనభవసాగరము మీద గట్టినౌక రాముడు
జనార్దనుడు నారాయణస్వామి శ్రీరాముడు
రామ

కోరిన లౌకికము లీయ కొల్లలా దేవతలు
వారి నుపాసించ కావలసినన్ని మంత్రములు
మీరు మోక్షార్ధులైన మీ‌కిదియే మంత్రము
మీరు మోక్షార్ధులైన మీకితడే దైవము
రామ