13, డిసెంబర్ 2016, మంగళవారం

నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ


నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
నార్తి దీర్తువు కద నటులైన నిటులైన

వేరుపడక నిన్ను వెంబడించుచు దోచు
శ్రీరమణీమణి చెలగిపొగడు నట్లు
నీరూపముల గూర్చి నీనామముల గూర్చి
నేరిచి పలుకాడ నేనెంత వాడను
నేర్తునో

వీగక నీయెడద విహరించి మురిపాలు
సాగించుకొను లచ్చి చక్కగా నెఱిగిన
నీగుణములను గూర్చి నీదు కరుణను గూర్చి
సాగి వచింపగ సరిపడు వాడనా
నేర్తునో

కాలమే నీవైన కడగి తానె నీవై
మేలుగ చరియించు శ్రీలక్ష్మి వలెను
నీలీలలను గూర్చి నీతత్త్వమును గూర్చి
చాలుచాలు రామహరి చర్చించు వాడనా
నేర్తునో


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.