పాఠకభక్తమహాశయులారా,
ఈ క్రింది పద్యంతో ఒక వంద పద్యాలు సంపన్నం అవుతున్నవి.
నా యీ చిరుప్రయత్నాన్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ కందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
నేను చెప్పుకోదగ్గ తెలుగుపండితుడను కాని కవిని కానీ కాను.
మందః కవి యశః ప్రార్థీ అని యేదో భగవంతునిపై నా చేతనయిన కవిత్వం చెప్పాలని ప్రయత్నిస్తున్న వాడిని మాత్రమే!
నా అజ్ఞానం వలన పద్యాలలో రకరకాల దోషాలు దొర్లుతూ ఉంటాయి.
వాటిని గమనించిన వారు దయచేసి తమ వ్యాఖ్యల ద్వారా నాకు తప్పక తెలియజేయ ప్రార్థన.
తప్పులు దిద్దుకుందుకు నాకు యేవిధమైన బేషజమూ లేదు. తప్పక దిద్దుకుంటాను.
నిజానికి శ్రీరామనవమి వరకూ యెన్నయితే అన్ని పద్యాలు వ్రాసి ముగించాలని భావించాను.
కాని ఆపటం నాకు అశక్యం అయిన విషయంగా తోచినది.
పాఠకులలో కొందరు యీ ప్రయత్నాన్ని అబినందించి కొనసాగించ వలసినదిగా అడగటం కూడా జరిగింది.
అందుచేత యథాశక్తి యీ ప్రయత్నాన్ని కొనసాగించ దలచుకున్నాను.
ఎన్నాళ్ళు వ్రాయగలనో అన్నది అది దైవనిర్ణయం. నాచేతిలో యేమీ లేదు.
ఇలా చేయటం అందరికీ అమోద యోగ్యమే అని భావిస్తున్నాను.
ఇక 100వ పద్యాన్ని తప్పక చదవి ఆనందించండి.
ఉ. సుందరులందు సుందరుడు శుభ్రయశస్కుడు భక్తకోటికిన్
బందుగులందు బందుగుడు ప్రాణసఖుండును రామమూర్తి హృ
న్మందిరమధ్యమందు కరుణన్ వెలుగొందుచు నుండు జానకీ
సుందరిగూడి లక్ష్మణయశోధన వాయుకుమార సేవ్యుడై
(వ్రాసిన తేదీ: 2013-5-7)