30, ఏప్రిల్ 2012, సోమవారం

నే పలుకాడుటకు మున్నె మరుగైతివి

కలలోన కనుపించి క్షణముంటివి నే
పలుకాడుటకు మున్నె మరుగైతివి

రోమాంచమునకేను లోనై పలుకరించ
నేమియు తోచక నిలచి చూచుచు నుండ

చిరునవ్వుతో నీవు సెలవిచ్చితివి నా
కెరుక నిలచునంటి వింకేమి వలయు కాని

అంత తొందరయేల నచ్చట్లు ముచ్చట్లు
వింతలు లేవియు కూడ విన్నవించనే లేదు

26, ఏప్రిల్ 2012, గురువారం

నా చేయందుకో మని మనవి

మాయలు చాలించమని మనవి రామ నా   
చేయందుకో మని మనవి రామ

మెలకువతో మాయను గెలువగలుగు నంత
తెలివి నాకు లేదని మనవి నీ
వలన నిలచి యుంటినని మనవి నా
బలము నీవే నని మనవి

తఱుగని చదువులలో తగులువడి నిన్ను నే
నెఱుగుటయే కుదరదని మనవి  నీ
కరుణ యొకటె చాలని మనవి నా
బరువిక నీదే నని మనవి

తడవతడవకు కొత్త తగులముల జిక్కి నే
నిడుములను పడలేనని మనవి నే
బడలితి మన్నించమని మనవి యీ
పుడమి కిక రాలే నని మనవి

ఒక నాటికి తాను నీవు నొకటే నని తెలిసేను

జననీగర్భము లోనే తనువది కలిగేను
  మనసు నింద్రియములుకూడ దానికి కలిగేను
తనకు మరల పుట్టువని  కనుగొని వగచేను
  వెనుకటి జన్మముల వెతలను తలచేను

ఎంతవగచి లాభమేమి యిలకు తరలి వచ్చేను
అంతలోనె యన్ని మరచి ఆటలాడ జొచ్చేను 


మరల ప్రకృతి మాయలు మరల పుణ్యపాపములు
మరల ప్రజారుజాదులు మరల జరామరణములు
 

తనువు తాను కానని తాను తెలియు కుండును
తనువులు దాల్చుచు వదలుచు తపన చెందు చుండును


అపుడపుడు నిన్ను దలచి యలమటించు చుండేను
ఎపుడయ్యా ముక్తి యని యేడ్చుచు నడిగేను


ఒక నాటికి తాను నీవు నొకటే నని తెలిసేను
అకళంకస్వస్వరూప మందు నిలచి వెలిగేను

25, ఏప్రిల్ 2012, బుధవారం

నాకు నీవు కలుగు దారి నాకు తెలియ వచ్చు టెట్లు

ఏవేవో ధర్మములు యేవేవో శాస్త్రములు
ఏవేవో విద్యలు నే నేవి నేర్వవలయు
ఏవేవో తెలుపు గాని యెరుక పరచ లేవు
నిన్నెరుక పరచ లేనివి నేనేల నేర్వవలయు

నేను నేను నే ననుకొను నేనెటుల కలిగినాను
నేను నీవు నొకటైతే నేను దేని కున్నాను
నేను మాయవల లోపల నేల చిక్కుకున్నాను
నేను నిన్ను జేరి దీని నెల్ల తెలియ దలచినాను

ఎచటి నుండి వచ్చితిని యెచటి కేగ నుంటిని
నడుమ నిచట నీ మజిలీ యేల చేయుచుంటిని
అటునిటు నే తిరుగనేల నటమటపడ నేల
ఇటువంటివి నిన్ను జేరి యెరుగ దలతు నేను

నీకన్నా తెలియ జెప్ప నేరుపు గల వారెవ్వరు
నీ కొరకెంతో వెదకితి నెందు గాన బడయనైతి
నీకు కరుణ కలుగు విధము నాకు తెలియ వచ్చు టెట్లు

నాకు నీవు కలుగు దారి నాకు తెలియ వచ్చు టెట్లు

24, ఏప్రిల్ 2012, మంగళవారం

అరెరే ఇటు వచ్చానే అనుకోకుండా

అరెరే ఇటు వచ్చానే 
  అనుకోకుండా
తిరిగి పోయే దారేదో 

  తెలుసుకోకుండా

వింతలు చాలా చూడాలని 

  పిచ్చి ఊహతో వచ్చాను
వింతగ నేనీ లోకమనే 

  పెద్ద ఉచ్చులో పడ్డాను

అందాలన్నీ బందాలేగద 

  అని నువ్వు ఊర కున్నావు
తొందరపడినే చిక్కుపడితె  కని 

  తుళ్ళుతు నవ్వుతున్నావు

నీవాడ నేనని నేనే నీవని 

  యేవోవో చెబుతుంటావు
నావాడ వైతే నన్ను చప్పున 

  కావగ  రాకుండపోవు

22, ఏప్రిల్ 2012, ఆదివారం

నేనెరిగిన దెల్ల నీ కొఱకై మానక ధ్యానము చేయుట

నేనెరిగిన దెల్ల నీకొఱకై
  మానక మరిమరి ధ్యానము చేయుట
నేనడిగిన దెల్ల నా కొఱకై
  నీ నిజరూపము మరి మరి చూపుట

భ్రమలను విడచిన దేహిని గాను
  శమదమంబుల విధులే నెరుగను
అమలిన సహజోదారప్రేమమున
  నిముసము విడువక నిను భావింతును

లోకక్రియోపరి నిష్టుత దేనికి
  నీకు మెప్పుగా నిలువగ లేనిది
నీకై మనసే ముడుపు గట్టితిని
  నా కెరుకగు నటుగా కొలుతును

నను చేసినదీ నీవని  యెరుగుదు
  నను నడుపునదీ నీవని యెరుగుదు
ననునిను నొకటిగ నాత్మ నెరుగుదు
  కనుకనె  నిను చూడక నెటులుండుదు

21, ఏప్రిల్ 2012, శనివారం

నిజమే నేమో లే నేమో యే ఋజువులు సాక్ష్యము లేలా

నిజమే నేమో లే నేమో యే
  ఋజువులు సాక్ష్యము లేలా నా
నిజరూపము నీ దివ్యవిభూతీ
  విజయవిలాసవిశేషమేమో

నానారూపము లందున నీవు
  నానాలోకము లందున నుందువు
మానవరూపము మరియటులే గద
  పూని ధరించితివో యీ దేహము

లేని నాకు యిటు లేల నుంటినని
  లేని పోని తలపేలా గలిగెను
కాని తలపుల కాలము చనగా
  కానగ నైతినిగా నిజతత్వము

పోనీలే యిపుడైనా విషయము
  జ్ఞానదృష్టికి సంధించితివి
మానక నీ యందే నిలచెద
  నేనని వేరుగ లేనే లేనుగ

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

వేగ కనరావయ్య వేదాంత వేద్య


వేగ కనరావయ్య వేదాంత వేద్య
వేగ కనరావయ్య జాగేల రామ

కొఱగాని కలలతో కలత నిద్దురె గాని   
పరమైన ఇహమైన నరయరా దయ్యయ్యొ
అరుదు చేసితి వేమి యగుపడుటయే నీవు
మరలమరల రాక మంచిదే యగు కాద

ఘనమైన రూపమ్ము గొనినీవు కనరాగ
కనులార వీక్షించి కలుషమ్ము లారగా
మనసార కీర్తించి మరి నేను పొంగితిని
తనివి తీరగ మరల దరిశనం బీవయ్య

ఒకసారి జూచి నే నొడలు మరచితి నాయె
యికమీద నినుజూచి యిల నుండ గోరనని
యొక వేళ శంకింతువో నీవు నను జూచి
యిక నిన్నే నెడబాసి యేరీతి నుందురా

మాయల మారి యెవరో మాయనె మాయం చేసిన దెవరో

మాటలు నేర్చిన దెవరో
  మాయలు పన్నిన దెవరో 
మనసున జొరబారి ప్రపంచం
  మాయం చేసిన దెవరో 
మటు మాయం చేసిన దెవరో

పగలంతా నా కనుల ముందర
  వగలను కురిపించీ నటించీ
ఒడలు మరువగా చేసిన దెవరో
  పగలు రేయిగా చేసిన దెవరో

రేయంతా తన స్మరణము లోని
  హాయిని మరగించీ రెప్పలు
మూయగ నీయని దెవరో యెవరో
  రేయి పవలుగా చేసిన దెవరో

అలజడి రేపి రేబవళ్ళను
  తలక్రిందులుగా చేసిన దెవరో
బలె బలె మాయల మారి యెవ్వరో
  మాయనె మాయం చేసిన దెవరో

19, ఏప్రిల్ 2012, గురువారం

కొత్త కొత్తలు యెక్కడి నుండి యెత్తుకు వచ్చేదయ్యా

కొత్త కొత్తలు నీవు కోరేవు యెక్కడి నుండి
    యెత్తుకు వచ్చేదయ్యా యెరిగించ వయ్యా
అలిగి కూర్చుండేవు అది మరియాద కాదు
    అడిగిన వన్నీ నీకు నమరించ లేదా

వలపులు కొత్తవి గావు వగపులు కొత్తవి గావు
    కొలుపులు కొత్తవి గావు ముడుపులు కొత్తవి గావు

తలపులు కొత్తవి గావు తమకము కొత్తది గాదు
    నగవులు కొత్తవి గావు తగవులు కొత్తవి గావు

ఇచ్చకాలు కొత్తవి గావు ముచ్చటలు కొత్తవి గావు
    మచ్చరాలు పగలున్నాయవి మన కెందుకు లేవయ్యా

18, ఏప్రిల్ 2012, బుధవారం

ఇది నా అద్దమేనా ఇందులో నీ రూపమే కనబడుతోంది

ఇది నా అద్దమేనా
    ఇందులో నీ రూపమే కనబడుతోంది
ఇది నా ప్రపంచమేనా
    అన్నిటా నువ్వే నిండి కూర్చున్నావు
ఇది నా మనస్సేనా
    ఇప్పుడు నీ మాటే వింటున్నట్లున్నది
ఇది నా జీవితమేనా
    మరి నీ యిష్టప్రకారమే నడుస్తున్నట్లుంది
ఇంకా నేనెందుకయ్యా
    ఇప్పుడు అది కూడా నువ్వేనంటే పోలా

17, ఏప్రిల్ 2012, మంగళవారం

నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక

అనుభవంలోకి వస్తున్నట్లు భ్రమగొలిపే
అందమైన ప్రతి అబధ్ధానికి అమరించిన ముద్దుపేరు
వ్యావహారిక సత్యం

అందమైన అబధ్ధాలన్నింట్లో అతిపెద్దది ప్రపంచమే
అందుకే అది ఒక వ్యావహారిక సత్యం

అనుభవాలకు అంతుచిక్కని అసలు సిసలు తత్వం
అందీ అందని ఆనందానికి అతిసరళ స్వరూపం
పారమార్థిక సత్యం

అలా అంతు చిక్కని అతి చిన్నది నేనే కద
అందుకే నేనే ఒక పారమార్థిక సత్యాన్ని

ఈ రెండు సత్యాల మధ్య తారాడే విభజన రేఖలని
అప్పుడప్పడు నీవు గీస్తున్నావని యెప్పుడూ పొరబడుతున్నానే
ఆ గీసేది నేనేనని చెప్పవేం

అయితే ఈ గీతలు నేనే హాయిగా చెరిపేస్తాను
అప్పుడింక యేకరూప సత్యమేగా ఆపైన మిగిలేది
అదంటే నువ్వేకదా

నాకంటూ వేరే ఉనికి లేకపోవటమే నా కోరిక
నీకోసం యీ పిచ్చి గీతల్ని చెరిపేయాలిక