నీవెరిగినదేగా రామా
ఆదయ వానగ కురిపించగ నీ
కడ్డేమున్పది ఓరామా
ఆకరిరాజును కాపాడిన నీ
యద్భుతమగు దయనే కాదా
నేకోరుచు యుగయుగములుగా నిల
నిలబడి యుంటిని రఘునాథా
ఆకోమలి శాపము తొలగించిన
ఆదయనే కోరుదు గాదా
నీకెవ్వరు వలదని చెప్పేరని
నాకా కరుణామృత మీవు
ఏకార్యమునకు నేదిగివచ్చితి
నాకార్యము నెరవేరెనుగా
నీకార్యము నెరవేర్చిన నన్నిక
నిలుపగ తొల్లిటి పదమునను
నీకిపు డడ్డేమున్నదయా
శ్రీకర దయచూపించవయా
శోకమోహముల కాకరమగు ధర
నేకారణమున నుంచేవో
గురుదేవుడు హరదేవుడు నీతో
కరుణించుమని చెప్పడుగా
మరి తానిచ్చిన భవతారక మెద
మరువని చేసిన ఫలమేమి
నరసింహా నరనాయక సీతా
నాయక శ్రీరఘునాయక నీ
కరుణను వానగ కురిపించవయా
తిరముగ స్వస్థితి నుంచవయా