ఏనాడు నీనామ మీజహ్వపై కెక్కె
నానాడె నీవాడ నైనానయా
ఏమేమొ పలుకుచు నెగిరి పడెడు జహ్వ
కేమాయె విడువక నీనామమే పలుకు
నీనామమే పలుకు నానామమున కులుకు
తానెంతగా మారె దశరథరామ
నీనామమే శివుడు నిత్యంబు ప్రేమతో
ధ్యానించు ననుచు పెద్దలు చెప్పగా వింటి
ఆనామమే జగదాధార మందు రది
యీనాడు నాజిహ్వ పైనుండె రామ
చేరి నాజిహ్వపై చిందులాడుచును సం
సారవిముఖుని జేసె చక్కగాను నన్ను
కూరిమి నిటు లేలుకొనుచు నిదియే భవ
తారకమై యొప్పె తండ్రి శ్రీరామ