4, మార్చి 2024, సోమవారం

ఎన్నెన్ని జన్మలుగ


ఎన్నెన్ని జన్మలుగ నెంత యపురూపముగ
నిన్ను నాహృదయమున నెలకొల్పుకొన్నాను

తనువు విడచి తనువు దాల్చుచు  వచ్చుచు
మునుకొని నీదివ్యమూర్తిని నానుండి
గొనిపోవ నీకుండ కుటిల  కాలమ్మును
ఘనదీక్షతో హృదయమున నిలుపుకొన్నాను

లోనున్న నీదివ్యరూపమే నడిపించ
నేను కలయదిరుగ నేర్తునీ ధరణిని
కానిమ్ము మరి యెంతకాలమ్ము నే తిరిగి
తే నీకు తృప్తియో  దేవదేవ రామ

ఎపుడు చాలందువో యీనాటకము నిక
కృపజూపి యానాడు కేరుచు నిను జేరి
నృపసత్తమా యుందు నీపదసీమను
కపటలోకము నందు కలుగక శ్రీరామ