సుఖమయ మీ సంసారము నీ చూపు సోకిన
దుఃఖముల పుట్ట యిదే దొరుకక నీ కరుణ
నేరుపు మీరగ విద్యలను నేర్వక రాణించే వారు
తీరుగ విద్యలు నేరిచియు తిప్పలు పడు వారు
ధారుణిపై గలరెందరో దానికి కారణ మేమనగ
వారిపైన నీ చల్లని చూపులు వాలుటలో గల బేధమే
నిరక్షరకుక్షు లైన మరి నీపైనే గురి కలవారు
గురుబోధను బడసియు కూడ గురి నిలువని వారు
ధరణిమీద గలరెందరో దానికి కారణ మేమనగ
వారిపైన నీ చల్లని చూపులు వాలుటలో గల బేధమే
అనుపమాన లోకనాథ జనార్దన పామరుడను నేను
నిను సూటిగ లోనమ్మితిని నేనే మెఱుగుదును
మనసున నీ నామంబునే మానక స్మరించువాడనయ
కనుక నింక నీ చల్లని చూపులు కరుణించుము రామ