27, జూన్ 2020, శనివారం
తలచు తా నొక్కటి దైవ మింకొక్కటి
తలచు తా నొక్కటి దైవ మింకొక్కటి
యిల మీద మనజీవితము లింతేను
అంతయు బాగున్నదని యానందపడు వేళ
చింతలు చుట్టుముట్టి చితుకబొడుచును
వంతులువేసుకొనుచు వచ్చిపడు కష్టముల
కంతులేకుండగనే యలరును సుఖము
శ్రీవిష్ణుపాదంబులు సేవించు వారింట
త్రోవదప్పి కొడుకొకడు తోచవచ్చును
దేవుడే లేడనుచును భావించు వాని బుధ్ధి
భావించవచ్చును రామ పాదంబులను
సర్వేశ్వరుని యిఛ్ఛ జగముల నడిపించు
గర్వించగ తన గొప్ప కాదని తెలిసి
యుర్విని వినయంబుగ నుండువాని రాముడు
సర్వవేళలను కాచు చక్కగ నిజము
23, జూన్ 2020, మంగళవారం
చెత్త ఆప్స్ గుర్తించి సహాయపడగలరా?
నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ నిండా బోలెడన్ని అప్లికేషన్లు ఉండటంతో కొంచెం చిరాకు కలుగుతోంది. నిజానికి వాటిల్లో అత్యధికం ఇంతవరకూ నేను ఎప్పుడూ వాడనివే.
చూసారు కదా, బోలెడన్ని అప్లికేషన్లు! వీటిలో కొన్ని మాత్రమే నేను డౌన్‌లోడ్ చేసినవి. మిగతావి అన్నీ ఫోన్ తీసుకున్నప్పుడే దానితో వచ్చాయి. అప్పటికీ ఒకటి రెండు నేను పీకేసినట్లు గుర్తు.
ఇప్పుడు ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే,మీకు తెలిసినంత వరకూ అనవసరమైనవి, అవసరమైనవి అన్న విభజనకు తోడ్పడవలసింది అని.
చెత్త ఎత్తివేస్తే ఫోన్ మరింత బాగా పనిచేయవచ్చును కూడా.
ఇన్నాళ్ళు బ్రతికితి నెన్నాళ్ళు బ్రతుకుదు
ఏమేమొ చదివితి నిక నేమి చదువుదు చదువు లెందుల కన్న శంక కలిగె ఏమేమొ చేసితి నిక నేమి చేయుదు చేయు టెందుల కన్న చింత కలిగె ఏమేమొ జూచితి నిక నేమి జూచెద జూచు టెందుల కన్న జూడ్కి గలిగె ఇన్నాళ్ళు బ్రతికితి నెన్నాళ్ళు బ్రతుకుదు నింక మీదట నను శంక కలిగె చదువ దగినట్టి నిను గూర్చి చదువకుండ చేయ దగినట్టి నీపూజ చేయకుండ చూడ దగినట్టి నిను నేను చూడకుండ ఎన్ని యేండ్లుండి భూమిపై నేమి ఫలము |
22, జూన్ 2020, సోమవారం
జ్యోతిష్యం గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా?
జ్యోతిష మొక శాస్త్రమా యను ప్రశ్న వేయు వారి సంఖ్య యమితముగా నున్నది. శాస్త్రము కాదను ధ్వని యాప్రశ్న యందే తోచునట్టి విధముగా నా ప్రశ్నను వేయుదురు. ఇది సర్వత్ర కనిపించుచున్న విషయము.
జ్యోతిష మొక సైన్సా లేక శాస్త్రమా యని ప్రశ్నించు వారి నింతవరకు చూడలేదు. ఎందువలన ననగ సైన్సు అను నాంగ్లపదమునకు సమానార్ధప్రతిబోధకముగా నుండు పదముగా శాస్త్రమను పదము ప్రసిధ్ధముగా నున్నది. నిజమున కీప్రశ్న "జ్యోతిష్యం సైన్సా లేక మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా?" యని వినిపించబడినది. కాబట్టి మొత్తముగ నీ ప్రశ్నను త్రోసివేయుటకు ముందుగా దీనిని కొంచెము పరిశీలనముగ జూడవలసి యున్నది. జ్యోతిష్యము మతపరంగా గ్రహఫలితాలు మార్చగలిగే శాస్త్రమా యను ప్రశ్న యిందు గమనార్హము కావున దానికి సమాధానము చెప్పుటకు యత్నించుట యుచితముగ నుండవచ్చును.
ఉచితముగ నుండవచ్చు నన్నంత మాత్రమున సమాధానము చెప్పవలయునా యనగ నది విచార్యమైన సంగతి.
ప్రశ్నించు వారి యొక్క చిత్తశుధ్ధిని నమ్మగలిగిన యెడల చెప్పవచ్చును. కేవలము కికురించుటకునై ప్రశ్నవేయువా రుందురు.
ప్రశ్నించు వారి యొక్క యర్హతను బట్టి సమాధానము చెప్పవలసి యుండును. ప్రశ్న వేసిన ప్రతి వానికికి సమాధానము దొరుకదు. అట్లేల ననగ పృఛ్ఛకునకు సమాధానమును గ్రహించు శక్తి యుండవలయును కావున. ఆధునిక భౌతికశాస్త్రము మిక్కిలి ద్రవ్యరాశికల ఖగోళవస్తువు యొక్క సామీప్యమున కాంతిస్థల కాలముల యందు మార్పు కలుగునని చెప్పుచున్నది. అట్లేల జరుగునని సామాన్యులు ప్రశ్నించవచ్చును కాని సమాధానము వారికి బోధపడునట్లు చెప్పుట దుస్సాధ్యము కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాసా యని బ్రహ్మసూత్రముల యందు మొదటి సూత్రము. ఇచ్చట అథః అనగా తగిన అధికార సిధ్ధి కలిగిన పిమ్మట నని కదా యర్ధము. అంతియే కాని వేదాంతము నేర్పుదురా, వ్యాసుని బ్రహ్మసూత్రములతో మొదలు పెట్టుదమా యన్నచో నది దుస్సధ్యమే కదా. ఇట్లు గ్రహించవలసి యున్నది.
ప్రశ్నించు వారి యొక్క ఆశయమును బట్టి సమాధాన ముండును. కొందర కుపరిస్పర్శగ సమాధానము చెప్పిన చాలును. ఏదేని విషయ మున్నదా యన్న కుతూహలమే కాని విషయమును సాకల్యముగ నేర్చుటకు నాశించని వారికి విపులముగ చెప్ప బూనినచో వారు విరక్తులు కావచ్చును లేదా భయపడి యొక నమస్కారము చేసి తప్పుకొనవచ్చును. మరియు కొందరు బుధ్ధిమంతులు సమాధానము చెప్పుచున్న వాడు తమను భ్రమింప జేయుట కేదోదో చెప్పుచున్నాడని యాక్షేపించవచ్చును.
ప్రశ్నించు వారి యందు ప్రత్యేకముగ నొక విధమైన బుధ్ధి కలవారుందురు. వారు తమకు సమాధానము చక్కగా బోధపడని పక్షమున, బోధపడినంత వరకే సత్యమనియును మిగిలిన దంతయును వ్యర్ధమైన విషయపూరణ మనియు భావింతురు. ఇది వారి చిత్తశుధ్ధికి సంబంధించిన సంగతి కాక వారి జీవలక్షణమునకు సంబంధించిన సంగతి యని గుర్తుపెట్టుకొన వలెను.
ఇట్టి వివేచన మంతయును చేయుట యెందుల కనగా జ్యోతిష్యము మతపరముగ గ్రహఫలితములు మార్చగల శాస్త్రమా యన్న ప్రశ్నకు సమాధానము చెప్పుటయా, చెప్పినచో నెట్లు చెప్పవలయును మరియు నెంతవరకు చెప్పవలయు నన్నది ముందుగా యోచించుటకు.
బుధ్దిః కర్మానుసారిణీ యని యొక నానుడి యున్నది. కావున సమాధానము చెప్పుటకు నిర్ణయించు కొంటిని. కాని బుధ్ధిమంతు లూహించుకొన గలగిన కారణముల వలన దానిని క్లుప్తముగనే చెప్పదలచితిని.
గ్రహఫలిత మనగ నిచ్చట ప్రశ్నించు వాని యుద్దేశమున గ్రహములు జ్యోతిషము ప్రాకారముగా నిచ్చునని చెప్పబడు ఫలితములు. జ్యోతిషము జాతకునకు వాని జాతకచక్రము ననుసరించి ఇష్టకాలమున జరుగుచున్న దశాంతర్దశల ప్రకారమును మరియు వర్తమానగోచారము ప్రకారమును రాగల మంచిచెడుల సూచనలను తెలుపును. ప్రశ్న యని యొక జ్యోతిషవిభాగమున్నది. దానికి కేవలము వచ్చి ప్రశ్న యడిగిన కాలము ననుసరించి ఫలములను లెక్కించు సామర్ధ్యమున్నది. ఏవిధానమున నైనను మంచిచెడుల సూచనలు సమముగనే లభించును.
జ్యోతిషము అట్టి ఫలములను సూచించుటయే కాక మార్చు విధానమును చెప్పునా యన్నది గొప్ప ప్రశ్నయే.
మనుష్యుల జీవితములు వారి వారి కర్మలను అనుసరించి జరుగుచుండును. ఒక జన్మమనగ పొందవలసిన కర్మానుభవమును పొందుటకు ఒక శరీరమును గ్రహించి ప్రవర్తించుటయే. కాని ఎవ్వడైనను దానినుండి స్వతంత్రించి మంచి దారిలోనికి మరలవచ్చును లేదా మరింత చెడు దారికి మరలవచ్చును. ఈవిషయమును కూడ జ్యోతిషము సూచించగలదు కాని సామాన్యజ్యోతిష్యులకు దురవగాహము.
కర్మమున కెదురుతిరిగి భగవద్భక్తిపరు డనుము సత్కర్మాచరణపరు డనుము మరియొకటనుము, గురూపదేశము వలన కాని మిక్కిలి తీవ్రమైన సంవేదనాకారకమైన సంఘటనము వలనకాని కొత్త దారిని పోవు వానికి సామాన్యముగా వాని జాతకము సూచించు గ్రహఫలములకు భిన్నమైన ఫలములు కనిపించును. అనగా సామాన్యజ్యోతిష్యులకు నిట్టి మార్పును గ్రహించరామి వలన గ్రహఫలములను వారి భక్తి లేదా సత్కర్మ మార్చుచున్నట్లు తోచును.
అట్లే మిక్కిలి చెడు మార్గమును కూడ నొక జీవుడు త్రొక్క వచ్చును. కాని గడుసువారు తమ అపమార్గవర్తనమును కొంత గుప్తముగ నుంచుదురు కద. అప్పుడు జాతకమున మంచి ఫలములు కనిపించినను వాస్తవమునకు చెడ్డఫలితములు అనుభవమునకు వచ్చి సామాన్యులను విస్మయపరచును.
ఇది యిట్లుండగ సామాన్యమున జ్యోతిష్యులు ప్రజలకు గ్రహగతుల వలని చెడుఫలితములు సూచితమైన సందర్భములలో శాంతిప్రక్రియాదులను గాని తత్తద్గ్రహప్రీతికరమైన కార్యములను కాని సూచించుట లోకములో కనుపించు చున్నది. ఇట్లైనను మనుష్యులు కొంతకొంతగ తమతమ మనస్సులనుండి దుర్భావనాదులను తొలగించుకొని యుదాత్తమైన కార్యముల యందు ప్రవర్తించు వారై తత్తత్పుణ్యఫలముల వలన వచ్చు నట్టి మంచి ఫలమును పొందుట జరుగునని యాశంక దీనికి కారణము. అంతకు మించి మరేదియును లేదనియే చెప్పవచ్చును.
ఇంకను మరికొంత వ్రాయదగినది కలదు కాని ఇంతవరకు చాలును.
21, జూన్ 2020, ఆదివారం
రామ నామమే నాకు రమ్యమైన మంత్రము
రామ నామమే నాకు రమ్యమైన మంత్రము
మీమీ బుధ్ధుల కది మేలగునో కాదో
కొందరకు ఋణవిముక్తి గూర్చునదే మంత్రము
కొందరకు ధనములను కురియునదే మంత్రము
కొందరకు స్వర్గము చేకూర్చునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము
కొందర కారోగ్యము కూర్చునదే మంత్రము
కొందరకు కార్యసిధ్ధి గూర్చునదే మంత్రము
కొందరకు కోరినది కొలుచునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము
కొందరకు విద్యలు చేకూర్చునదే మంత్రము
కొంరరకు పదవులు చేకూర్చునదే మంత్రము
కొందరకు స్త్రీవశ్యము కూర్చునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము
కొందరకు యశమును చేకూర్చునదే మంత్రము
కొందర కపమృత్యువును కొట్టునదే మంత్రము
కొందరకు బంధములను కోయునదే మంత్రము
అందర కన్నిటిని గూర్చు నందమైన మంత్రము
18, జూన్ 2020, గురువారం
రామ రామ దశరథరామ సుగుణధామ
రామ రామ దశరథరామ సుగుణధామ
రామ రామ పట్టాభిరామ సీతారామ
రామ రామ కోదండరామ భండనభీమ
రామ రామ పౌలస్త్యవిరామ విజయరామ
రామ రామ సాకేతరామ రాజారామ
రామ రామ భవతారకనామ సీతారామ
రామ రామ లోకాభిరామ సుందరరామ
రామ రామ వినుతసుత్రామ విజయరామ
రామ రామ సకలశుభదనామ వైకుంఠధామ
రామ రామ త్రికకుద్భామ సీతారామ
రామ రామ నీరదశ్యామ సుందరరామ
రామ రామ ఇనకులాభ్దిసోమ విజయరామ
రామ రామ భక్తలోకకామితార్ధద రామ
రామ రామ సర్వమంగళనామ సీతారామ
14, జూన్ 2020, ఆదివారం
కోరి వారే నరకమున కూలబడు వారు
కోరి వారే నరకమున కూలబడు వారు
ఘోరమైన శిక్షలకు గురియగు వారు
నేరుపు చూప హరి నింద చేయు వారు
చేరి హరిభక్తులను చెనకుచుండు వారు
నోరు లేని వారి మీద జోరు చూపు వారు
వారే చెడిపోవుచుండు వారు నిజముగ
దారుణముగ సుజనుల తప్పులెన్ను వారు
తీరి వేదశాస్త్రముల తిట్టుచుండు వారు
పారమార్ధికమును బుధ్ధి వాదమనెడు వారు
వారే చెడిపోవుచుండు వారు నిజముగ
వారిజాక్షులందు బుధ్ధి వదలలేని వారు
కోరి ధనధనేతరముల కుములుచుండు వారు
శ్రీరామ నామభజన చేయకుండు వారు
వారే చెడిపోవుచుండు వారు నిజముగ
10, జూన్ 2020, బుధవారం
గోవిందా రామ గోవిందా హరి
గోవిందా రామ గోవిందా హరి
గోవిందా కృష్ణ గోవిందా
పాకారి సన్నుత శ్రీరామ హరి భండనపండిత గోవిందా
లోకపోషక హరి గోవిందా జయ లోకైకనాయక గోవిందా
కాకుత్స్ఠవంశజ గోవిందా దశకంఠవిమర్దన గోవిందా
గోకుల నందన గోవిందా హరి గోపాలకృష్ణా గోవిందా
శ్రీరఘునందన గోవిందా హరి చింతితార్ధప్రద గోవిందా
తారకనామా గోవిందా హరి దశరథనందన గోవిందా
శ్రీరామచంద్ర గోవిందా హరి సీతామనోహర గోవిందా
నారాయణ హరి గోవిందా రామ కారుణ్యాలయ గోవిందా
శ్రీరమణీప్రియ గోవిందా హరి చిన్మయరూప గోవిందా
ఘోరదైత్యహర గోవిందా కృష్ణ కురుకులధ్వంసన గోవిందా
శ్రీరుక్మిణీశ గోవిందా హరి శ్రితపారిజాత గోవిందా
నారాయణ హరి గోవిందా కృష్ణ నారకమోచన గోవిందా
9, జూన్ 2020, మంగళవారం
బుధజనానందకర పూర్ణచంద్రానన
బుధజనానందకర పూర్ణచంద్రానన
విధిశంకరశక్రవినుత వీరరాఘవ
నిరుపమానగుణసాగర నిర్మలానందకర
నిరుపమానపరాక్రమ నిర్జితాసురలోక
నిరుపమానదయానిధి నిజభక్తమందార
నిరుపమానశుభచరిత నీలమేఘశ్యామ
సకలదివిజగణతోషణ వికటదనుజశోషణ
సకలమౌనిగణతోషణ సదాశుభదభాషణ
సకలభక్తజనతోషణ సకలదుఃఖశోషణ
సకలజగసంపోషణ సర్వమంగళేక్షణ
సురముఖ్యసంపూజిత వరవిక్రమమూర్తి
పరమయోగిసంభావితపరబ్రహ్మస్వరూప
పరమభక్తసమర్చిత పరమపావనాకృతి
ధరణిజాసంసేవిత సురుచిరపదకమల
1, జూన్ 2020, సోమవారం
తన దైవభావమును తానెఱుగు జానకి
తన దైవభావమును తానెఱుగు జానకి
తన సంగతి రాముడు తానెఱుగడు
అంత దొడ్డ శరాసన మదియును శివునిది
ఎంత వారికైన గాని యెత్తరానిది
ఎంత సులభమగుచు తన కెత్తనాయెనో
చింతింపడు శ్రీహరినో శివుడనో యనుచు
అనితరసాధ్యు డైన యసురుని రావణుని
యని నవని గూల్చ బ్రహ్మాదులు వచ్చి
మనుజమాత్రుడవు కావు మాధవుడ వనగ
విని నిజమా యని చాల విస్మయ మందెను
హేలగ నా శివచాపము నెత్తినట్టి బాలిక
మేలెంచి త్రిభువనముల కాలంక జేరి
పౌలస్త్యుని కసిమసంగి పతిని చేరినది
శ్రీలక్ష్మీ రూపిణియై చెలగు జానకి
విభుడు వీడె జగములకు విబుధులార
విభుడు వీడె జగములకు విబుధులార
సభలలో నీమాట చాటరే నేడు
వీడె లోకముల నెల్ల వెలయించు చుండును
వీడె యాడుకొను చుండు వేడుక కొలది
వీడె లోగొను చుండు వేళ యైనప్పుడు
వీడెపో విశ్వవిభుడు వివరింపగను
పోడిమిచెడి యీయాట పోటుబడిన వేళ
వీడె సరిజేయ వచ్చు వేడుక కొలది
వీడె భువిని ధర్మసంవృధ్ధి జేయుచునుండు
వీడె భక్తరక్షకుడై వెలయుచు నుండు
వీడె నరసింహుడై విరచె హేమకశిపుని
వీడె బలిని కట్టెను విరచె నృపులను
వీడె రామచంద్రుడై విరచెనా రావణుని
వీడె భూభార మణచినాడు కృష్ణుడై
అమ్మ నీ కిష్టమా అయ్య నీ కిష్టమా
అమ్మ నీ కిష్టమా అయ్య నీ కిష్టమా
అమ్మో ఒకరిష్ట మన్న నమిత కష్టము
రాము నొక్కని కోరినది రాకాసి చుప్పనాక
యేమాయ తుదకు దాని కేమి దక్కెనో
సౌమిత్రి కోసె దాని శ్రవణంబులు ముక్కును
కామాతురత ఫలము గట్టిశిక్షయే
సీతనే కోరుకొనిన చెనటి రావణాసురుడు
చేతులార బ్రతుకు బుగ్గి చేసుకొన్నాడు
కోతిమూకతో వచ్చి కోసె వాని తలలు హరి
యాతని కామాతురత కదియే శిక్ష
సీతమ్మ మనకు తల్లి శ్రీరాము డితడు తండ్రి
భూతలవాసులకు నిద్దరు పూజనీయులే
ప్రీతి నిర్వురను గాక వేరు జేసి యొకరినే
యాతురులై కోరు వార లపరాథులగుదురు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)