22, జులై 2012, ఆదివారం

సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన

సుఖమయ మీ సంసారము చూపు సోకిన - నీ‌ చూపు సోకిన 
దుఃఖముల పుట్ట యదే దొరుకక కరుణ - నీ కరుణ నీ కరుణ

నేరుపు మీరగ విద్యలు నేర్వక రాణించు వారు
తీరుగ విద్యలు నేర్చి తిప్పలు పడు చుండు వారు
ఔరా ఇటువంటి వింత లుర్వి బుట్టు టెల్లను
వారి పైన నీచూపులు వాలుటలో బేధమే

నిరక్షరకుక్షు లయ్యు నీ పై గురి కల వారు
గురుబోధ బడసి కూడ గురి నిలుప లేని వారు
ధరణిని గలరెందరో దాని వెనుక కారణము
పరమాత్మ నీచూపులు వాలుటలో బేధమే

నిను లోకనాధుడవని నిరుపమకరుణాబ్ధి వని
గొని యాడును చదువు లెల్ల గనుక నాకు సుముఖుడవై
తనివారగ కృపామృతము దయచేసి కేలూని
అనవరతము బ్రోవుమని మనవి చేయుచుంటిని

4 వ్యాఖ్యలు:

 1. నిరక్షర + కుక్షు లయ్యు
  అవునా అండీ!
  అనవరతము బ్రోవుమని మనవి చేయుచుంటిని..
  నా ప్రార్ధన కూడా ఇలాగే ఉంటుంది. అండీ!
  కానీ మనసు విషయ వాంచల పై తప్ప పరమాత్మ పై నిలకడ గా ఉండదు.
  ప్రయత్నంలో పట్టు సాధించడానికి కృషి కూడా చేయాలి కదా! చేయలేను. :(

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మోక్షభూమికలలో మొట్టమొదటిది శుబేఛ్ఛ. అంటే శుభం కలగాలనే కోరిక. ఇక్కడ శుభం అంటే మోక్షమే. మిగతా మోక్షభూమికలకు అధికారం సిధ్ధించటానికోసం ముందు శుభేఛ్ఛ కలగాలి గదా. అది కలిగిన పిమ్మట తక్కిన ఒక్కొక్క భూమికకూ క్రమంగా అధికారం కలుగుతుంది కాని యీ కార్యక్రమం యెంత మెల్లగా జరుగుతుంది యెంత వేగంగా జరుగుతుంది అనేది మనం చేసే సాధన పైన ఆధారపడి ఉంటుంది. అది సాధకుల యొక్క సాధనాక్రమం పైనా సాధనాతీవ్రత పైనా ఆధారపడిన విషయాలు. ఒక్కొకసారి హఠాత్తుగా తీవ్రమైన వైరాగ్యస్థితి కలిగి అతి సద్యోముక్తికి దారి తీయవచ్చు కాని అది చాలా అరుదు. అదంతా వదలి మనం సరైన దిశలోనే ఉన్నామా చేతనైన సాధన చేస్తున్నామా అనేది ముఖ్యం అని గమనించాలి.

   తొలగించు
  2. అక్షరం ముక్క కూడా రాని యోగసిధ్ధులు కూడా ఉంటారు. విషయలోలుపులైన ఉద్దండ పండితులూ ఉంటారు. నిస్సంగత్వం సిధ్దించాలంటే వైరాగ్యం ముఖ్యం కాని, పాండిత్యం కాదు గదా,

   తొలగించు
 2. అనవరతము బ్రోవుమని మనవి చేయుచుంటిని

  ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ! అన్నాడు కదండీ రామదాసు గారు, మనకూ అదే శరణ్యం

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.