4, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఎందున్నాడు నీరాముడని


ఎందున్నాడు నీరాముడని ఎవ్వరైన నిన్నడిగినచో
ఇందున్నాడు నారాముడని హృదయమునే చూపించవయా

ఎట్టిది రాముని శీలమని ఎవ్వరైన నిన్నడిగినచో
అట్టి సుశీలుడు లోకములో నతడొకడే నని చెప్పవయా

ఏమిచ్చును నీరాముడని ఎవ్వరైన నిన్నడిగినచో
ఏమడిగిన నా కది యిచ్చునని ధీమాగా బదులీయవయా

ఎంత సమర్ధుడు రాముడని ఎవ్వరైన నిన్నడిగినచో
అంత సమర్ధుడు లోకములో నతడొకడే నని చెప్పవయా

ఏమి చేసెను నీరాముడని ఎవ్వరైన నిన్నడిగినచో
భూమిని ధర్మము నిలిపెనని పొలుపుగ బదులు చెప్పవయా

ఎంతటి వీరుడు రాముడని ఎవ్వరైన నిన్నడిగినచో
అంతటి వీరుడు లోకములో నతడొకడే నని చెప్పవయా

ఏటికి రాముని కొలుతువని ఎవ్వరైన నిన్నడిగినచో
సూటిగ వాడే దేవుడనే మాటను దీటుగ చెప్పవయా

ఏడీ రాముడు చూపుమని ఎవ్వరైన నిన్నడిగినచో
చూడదలచితే వేడుమని సూటిగ నీవు చెప్పవయా