18, జనవరి 2024, గురువారం

వరములిచ్చు దేవుడవని


వరములిచ్చు దేవుడవని వచ్చినాను రామచంద్ర
పరమపురుష వరములిచ్చి పంపుము నన్ను


నీవు దేవదేవుడవును నేను భక్తవరుడ గాన
నీవు వరములిచ్చెద వని నిశ్చయించితి
నీవు కూడ నారీతిని నిశ్చయించకుందు వేని
భావించగ నీకీర్తికి వచ్చును మచ్చ

సిరుల నిమ్ము నాకు చీకుచింతలేని బ్రతుకు నిమ్ము
పరులు వలన మాటపడనివాని జేయుమా
పరాత్పర నిన్ను నేను మరువకుండు వరము నిమ్ము
వరము నిమ్ము నిత్యము నా పక్షముండగ

ఇన్నివరము లిచ్చుటెట్టు లన్నది నీశంక యేని
చిన్నియుపాయమును నేను చెప్పవచ్చునా
తిన్నగాను ముక్తినిచ్చి దేవదేవ నన్ను నీదు
సన్నిథిలో నిలుపుకొనిన చాలును కాదా