3, నవంబర్ 2026, మంగళవారం

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 బ్రహ్మాండంబులు నడిచేను

రాముని యిఛ్ఛ ప్రకారము గానే

 భూమిని సర్వము జరిగేను


రాముని ఆటకు తగిన విధముగా

 భూమియె వేదిక గానగును

భూమిని వేదికగా నొనరించుచు

 రాముడు కథ నడిపించేను

రాముడు కథ నడిపించుట కొరకై

 భూమికి హంగులు కూర్చేను

భూమిని నానాజీవుల చెట్టూ

 చేమల జాతుల నింపేను


రాముని యిఛ్ఛ ప్రకారము జీవుడు

 భూమిని వేషము క ట్టేను

భూమిని వేషము కట్టేను ఆ

 స్వామి కోసమే ఆడేను

స్వామి కోసమే ఆడుట లోనే

 స్వామికి వేడుక గొలిపేను

స్వామి చాలుచా లన్నపుడే తన

 స్వస్వరూపమును పొందేను


రాముని యాటను రాణించే యీ

 బ్రహ్మాండము లివి యెక్కడవి

రాముని యాటల రంగస్థలములు

 రాముని యిఛ్ఛాకల్పనలు

రాముని యాటల నాడే జీవులు 

 యేమయ్యా వీరెవరయ్యా

రాముని యిఛ్ఛారూపములే యీ

 భూమిని జీవులు పోవయ్యా

 

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.