29, జూన్ 2024, శనివారం

శ్రీరామభజ నానందమే


శ్రీరామభజ నానందమే
ఔరౌర బ్రహ్మానందము

ధారుణి సరిసాటిలేని తీరైన సుఖమిచ్చు
ధీరు లందరును మెచ్చు దివ్యానందము
కోరెద రిది సురవరులును గొప్పగ నిత్యంబును
ఆరూఢిగ మోక్షమిచ్చు అమితానందము

హనుమంతుడు పొందునట్టి యానంద మిదియేను
జనని జానకి పొందెడు సంతోష మిదేను
వనజాసనుడును హరుడును బడసిన యానందము
మనకన శ్రీరామ భజన మహదానందము


శ్రీరామనామ మిది

శ్రీరామనామ మిది చింతలన్ని తీర్చునది
ఆరాటము లణచునది ఆనందము నిచ్చునది

సత్యమగుచు నుండునది సర్వజనులు నెఱిగినది
నిత్యమగుచు నుండునది నిగమవినుత మంత్ర మిది
భృత్యుల పోషించు శ్రీవిష్ణుదేవుని నామ మిది
అత్యంతము మధురమై అమరు దివ్యనామ మిది

హరునినోట నుండునది అందమైన నామమిది
సురలు చాల పొగడునది పరమమంత్రరాజమిది
నరుల కెల్ల మోక్షమిచ్చు నాణ్యమైన మంత్రమిది
పరమదివ్యమంత్ర మిది నిరుపమాన మంత్రమిది

భోగపరాయణుల స్వల్పబుధ్ధి కెపుడు తోచనిది
రాగద్వేషముల నణచి రామభక్తి నిచ్చునది
యోగివరుల జిహ్వలపై నొప్పారుచు నుండునది
వేగముగా ఫలించునది విమలసులభ మంత్ర మిది


26, జూన్ 2024, బుధవారం

అసమాన మీనామము

అసమాన మీనామము బహు
పసందైన రామనామము

విశదముగా నిది మన విష్ణుదేవుని నామము
దిశలను వెలిగించే దివ్యనామము 
నిశాచరులకంటికి నిదురమాన్పు నామము
కుశలముమనకిచ్చే గొప్ప నామము

రామదాసుల కెల్ల ప్రాణమైన నామము
కామదాసుల కనువుగాని నామము
కామితార్ధము లిచ్చు ఘనమైన నామము
క్షేమదాయకు డైన స్వామినామము

వివరింప పురారికి ప్రీతిగొలుపు నామము
పవమానసుతు డెపుడు పలుకునామము
భవరోగమును బాపు పరమదివ్యనామము
అవనిజార్చితమంత్ర మైన నామము

24, జూన్ 2024, సోమవారం

నందబాల


నందబాల ప్రజ్ఞానఘనా
నందరూప మునిజనా
నందకారక కోటిమన్మథ
సుందరాకా‌ర

చేత మురళిని బట్టి నీవు
చిద్విలొసముగను రార
పూతనాసంహారక కృష్ణ
పురుషసింహమ మా
చేతులార నీకు పూజలు
చేయవలచి వేచినాము
నీతి కాదుర దాగియుండుట
నిన్ను వేడెదము

బేలలము మేము గోప
బాలికలమురా యశోదా
బాలక నిన్నిపుడు వెదుకగ
జాలకున్నాముర కరు
ణాలవాల జాలమేల
నీలగగనశ్యామ రార
కాలిగజ్జెలందెలు మ్రోయ
బాలగోపాల


23, జూన్ 2024, ఆదివారం

నరులారా


నరులారా శ్రీరాముని నామమున్నది
పరమమధురమైనది పరమిచ్చునది

మక్కువగల వారలకే చిక్కుచున్నది
చిక్కెనా నోటిగూటిచిలుక యగునది
మిక్కిలి సుఖదాయకమై మెలగు నపుడది
అక్కజముగ వరదాయక మగునురా యది

చతుర్విధభక్తులకును సరసమైనది
పతితపావనమని పేరుబడసి యున్నది
అతిసులభమని భక్తు లాదరింపగ
ప్రతియోగ్యునకు మోక్షము పంచుచున్నది

22, జూన్ 2024, శనివారం

ఏమర మేమరము


ఏమర మేమరము మేము రామనామము
ప్రేమతోడ పలికెదమా రామనామము

శాపములను వదలించెడు స్వామినామము
పాపాటవుల దహించు స్వామినామము
తాపములను తొలగించెడు తండ్రినామము
మాపెదవులపై రహించు మంచినామము

సుమధురమై వెలుగొందెడు శుభదనామము
ఉమాపతికి హృదయమున నుండునామము
అమరవిరోధులను తరుము నట్టినామము
ముముక్షువుల నోటనుండు ముఖ్యనామము

వివరింపగ సాటిలేని నిష్ణునామము
పవమానసుతు డెప్పుడు పలుకునామము
శివుడిచ్చిన యందమైన చిన్నినామము
భవరోగము నణగించెడు భవ్యనామము

పరమసులభము


పరమసులభము రామభద్రుని నామము
పరమసుఖదము లోకవంద్యుని నామము

ధరణిజాప్రాణ మగు హరినామము
సురవైరిభయద మగు హరినామము
పరమర్షివినుత మగు హరినామము
పరమమనోహరమగు హరినామము

సురలకు ప్రియమైన హరినామము
హరునకు ప్రియమైన హరినామము
కరుణను జగమేలే హరినామము
సిరులను కు‌రిపించే హరినామము

వరములు కురిపించే హరినామము
పరమును కలిగించే హరినామము
కరుణను మమ్మేలే హరినామము
నిరుపమాన మైన హరినామము


20, జూన్ 2024, గురువారం

హరి నీ కంకితం


హరే రామ యందమైన వన్నీ నీకంకితం

హరి నీకంకితమై యవి మిక్కిలి ధన్యం


అందమైన పూవులన్నీ హరి నీ కంకితం

అందమైన పూజలన్నీ హరి నీ కంకితం

అందమైన తలపులన్నీ హరి నీ కంకితం

అందమైన క్రతువులన్నీ హరి నీ కంకితం


అందమైన స్వరాలన్నీ హరి నీకంకితం

అందమైన అక్షరాలు హరి నీకంకితం

అందమైన మాటలన్నీ హరి నీకంకితం

అందమైన పాటలన్నీ హరి నీకంకితం


అందమైన క్షణాలన్నీ హరి నీకంకితం

అందమైన దినాలన్నీ హరి నీకంకితం

అందమైన ఋతువులన్నీ హరి నీకంకితం

అందమైన జీవితాలు హరి నీకంకితం


నీనామ మున్నది

నీనామ మున్నది నాజిహ్వ యున్నది

    దానికి దీనికి జతకుదిరె

దాని మధురిమకు దీనికి తహతహ

    దీనిపై నాడ దానికి తొందర


పవలని లేదే రేయని లేదే

     భళిభళి రెండిటి ముచ్చటలు

అవిరళముగనన అతిశయముగనన

     ఆరెండింటికి గల చెలిమి

అవినాభావముగా కొనసాగుచు

      నతిముచ్చట గొలుపును చూడ

అవురా యిది బహుజన్మల బంధమె

      యనిపించుగా రఘురామ


స్థిరసుఖవాసము గొని నీనామము

      చిందులు త్రొక్కగ నాలుకపై

సురుచిరమగునీ నామపు కలిమికి

      మురియుచు పాడును నాలుకయు

పరులముందు బాగుండదు పొమ్మను

     భావన రెండింటికి లేదు

అరయగ నిదియే పరమానందం

      బనిపించునుగా రఘురామ


రామనామ మండి


రామనామ మండి శ్రీరామనామము

కామితముల నిచ్చు మాస్వామినామము


తామసులను దూర ముంచు రామనామము

పామరులకునైన దొరకు రామనామము

ధీమంతుల కందరకును రామనామము

ప్రేమపాత్రమై యుండును రామనామము


ఆమారుతి జపముచేయు రామనామము

భూమిసుతకు ప్రాణమైన రామనామము

మీమీ జిహ్వలను చేరి రామనామము

క్షేమము కలిగించు నండి రామనామము


స్వామికి వాగ్రూపమైన రామనామము

సామాన్యము కాదండీ రామనామము

ఏమడిగిన నది యిచ్చును రామనామము

ఆమోక్షము నైన నిచ్చు రామనామము



19, జూన్ 2024, బుధవారం

వర్షించుము రామచంద్ర


వర్షించుము రామచంద్ర వర్షించుము
వర్షించుము నీకరుణను వర్షించుము

ప్రతిదినమును నీకరుణను వర్షించుము
ప్రతిరాత్రియు నీకరుణను వర్షించుము
ప్రతిస్థలమున నీకరుణను వర్షించుము
శతకోటి దండములో సర్వేశ్వరా

పరమమధురమైన కరుణ వర్షించుము
పరమశుభదమైన కరుణ వర్షించుము
పరమపదము నిచ్చు కరుణ వర్షించుము
పరమపురుష శతకోటి వందనంబులు

వరదాయక మగు కరుణను వర్షించుము
త్వరపడుము నీకరుణను వర్షించుము
పరమాత్మా నీకరుణను వర్షించుము
పరదైవమ శతకోటి వందనంబులు


రామనామ మనే


రామనామ మనే దివ్యరత్నము దొరకె
శ్రీమంతుడ నైతి నండి చిత్రము గాను

చిత్తుజేయు నది లోకపు సిరులన్నిటిని
హత్తుకొని నానాలుక నదియుండగ
నెత్తుకపోలేరు దొంగ లెవ్వరు దాని
నెత్తుకపోలేరు రాజు లెవ్వరు గాని

దిశలను వెలిగించు దాని దివ్యతేజము
కుశలము కలిగించు దాని దివ్యవిభూతి
యశమును కలిగించు దాని యద్భుతశక్తి
వశముచేయు మోక్షరాజప్రాసాదమును

ఆరత్నము కలిమిచేత నందరి కంటె
భూరిభాగ్యశాలి నైతి భూజనులార
కోరదగిన దేది నాకు కువలయ మందు
శ్రీరాముని పాదములను చేరుకొందును


18, జూన్ 2024, మంగళవారం

రారేల జనులార


రారేల జనులార శ్రీరామ భజనకు
శ్రీరామ భజనచే చిత్తశాంతి కలుగు

శ్రీరామ భజనచే సిరిలన్నియును గలుగు
శ్రీరామ భజనచే చింతలన్నియు తొలగు
శ్రీరామ భజనచే చెప్పరాని సుఖము
మీరు పొందెదరయ్య మిక్కిలి గాను

శ్రీరామ భజనచే చేకూరు నభయము
శ్రీరామ భజనచే చేకూరును శుభము
శ్రీరామ భజనచే చేకూరనది లేదు
చేరి రాముని భజన చేయండి మీరు

శ్రీరామ భజనచే క్షీణించునఘములు
శ్రీరామ భజనచే మీఱు సద్భక్తియును
శ్రీరామ భజనచే సిధ్ధించును ముక్తి
చేర వచ్చును మీరు శ్రీరామపదము

 

గట్టిగా నమ్మేరు కాని


గట్టిగా నమ్మేరు కాని మీరాముడు తెలియ
నెట్టివాడొ చెప్పండి మీరాముడు

సాకేతపురేశు డండి మారాముడు వినుడు
రాకాచంద్రవదను డండి మారాముడు

సకలలోకపోషకు డండి మారాముడు వినుడు
సకలలోకవంద్యు డండి మారాముడు

నిరుపమాన చరితుం డండి మారాముడు వినుడు
హరవిరించివినుతు డండి మారాముడు

దశరథనృపతనయు డండి మారాముడు వినుడు
దశముఖమథను డిత డండి మారాముడు

వారిరుహనేత్రు డండి మారాముడు వినుడు
నారాయణస్వామి యండి మారాముడు

భక్తలోకసులభు డండి మారాముడు వినుడు
ముక్తినిచ్చు దేవు డండి మారాముడు


పళనిస్వామి


పళనిస్వామి గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఆయన రకరకాల వంటల గురించి వీడియోలు పెడుతూ ఉంటారు.


పేరు పళనిస్వామి అనగానే ఆయన తమిళుడు అని సూచనగా తెలుస్తోంది కదా. అవును తమిళుడే.


ఐతే ఆయన పెట్టే వీడియోలు అన్నీ తెలుగులో ఉంటాయి.


తెలుగంటే అలాంటిలాంటి తెలుగు కాదు. ఆయన వీడియోల్లో ఇంగ్లీషు మాటలు మచ్చుకైనా కనిపించవు.


పూర్తిగా తెలుగే మాట్లాడుతూ చేస్తారాయన వీడియోలని.


ఆయన రాజమహేంద్రవరం నుండి చేస్తున్నారు వీడియోలను. వారి కుటుంబం చాలా కాలం క్రిందటనే తెలుగు నేల మీద స్థిరపడినట్లు తోస్తుంది.


ఈ వంటల వీడియోలతో నాకేం పనీ అనవచ్చును మీరు.


పని ఉంది కదండీ.


ఇప్పుడు నేను మాశ్రీమతికి పూర్తిసమయం సహాయకుడిని కదా. ఇంగ్లీషులో చేప్పాలంటే full-time maid అన్నమాట. డయాలసిస్ సెంటర్ వాళ్ళైతే నన్ను అటెండర్ అంటారు.


ఈకొత్త ఉద్యోగబాధ్యతలో భాగంగా ఆవిడ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా ఓటీటీల్లో టీవీసీరియళ్ళు చూస్తున్నా నోరుమూసుకొని (pun intended) అవన్నీ చూస్తూ కూర్చుని ఉండాలి.


అలా పళనిస్వామి గారి వంటల ఛానెల్ కూడా చూస్తున్నా నన్నమాట.


పళనిస్వామి గారి ఛానెల్ నాకు నచ్చింది.


అంటే ఆమాట ఆయన వంటల గురించి చెప్పటానికి అనటం లేదు. ప్రస్తుతానికి వంటింట్లో సహాయకుడినే కాని వంటవాడిని కాను కాబట్టి ఆవంటల బాగోగుల గురించి ఏమీ సాధికారిక వ్యాఖ్యలు చేయలేను.


కాని ఆయన తెలుగు గురించి మాత్రం తప్పకుండా చెప్పగలను.


మిక్కిలి కర్ణపేయమైన స్వఛ్ఛమైన తెలుగుభాషలో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు పళనిస్వామి గారు. 


చక్కని మాటతీరు, వినసొంపైన భాష అనే రెండింటికి తోడు మంచి కంఠస్వరం. ఇంకేం కావాలి మనకు ఎంతైనా వినబుధ్ధి కావటానికి?


నిజం చెప్పాలంటే కొందరు ప్రవచనకర్తలకూ అంత చక్కగా ఆకట్టుకొనేలా మాటలాడటం రాదు. ఆకట్టకొనేలా మాటలాడటం కూడా ఒక మంచి కళయే.


ఒకప్పుడు ఒక హోమియోపతి వైద్యం గురించిన గ్రంథం leaders in homeopathic therapists అని Dr E.B.Nash గారిది మానాన్నగారి  దగ్గర ఉండేది. నాకు హోమియోపతి గురించి ఆట్టే తెలియకపోయినా అంతగా ఆసక్తి కూడా లేకపోయినా డాక్టరు గారి అందమైన ఇంగ్లీషు కారణంగా ఆపుస్తకాన్ని తరచూ చదివేవాడిని.


అలాగే వంటల గురించి కాకపోయినా పళనిస్వామి గారి హాయిగొలిపే తెలుగును వినటానికైనా ఆయన ఛానెల్ లోని వీడియోలు వినవచ్చు.


అనేకమంది వంటల వీడియోలను గమనిస్తున్నాను. పేరుకు తెలుగు లోనే ఐనా వాటి నిండా రాళ్ళవాన లాగా ఇంగ్లీషు మాటలే. నాకు తిక్కపుట్టే విషయం ఏమిటంటే ఆ ఇంగ్లీషు కూడా తప్పులతడకలే.


ఆసక్తి కలవారు ఆయన ఛానెల్ చూడండి.



జయజయ జయజయ శ్రీరామ

జయజయ జయజయ శ్రీరామ దేవ 
    జయజయ భవహర శ్రీరామ

మానవనాయక శ్రీరామ జయ 
    మహనీయగుణరూప శ్రీరామ
జానకీనాయక శ్రీరామ జయ 
    శరనిధిబంధన శ్రీరామ

సకలసంపత్ప్రద శ్రీరామ జయ 
    సకలార్తిప్రశమన శ్రీరామ
సకలలోకాధార శ్రీరామ జయ 
    సకలజీవాధార శ్రీరామ

భండనపండిత శ్రీరామ జయ 
    బ్రహ్మాండనాయక శ్రీరామ
ఖండితదశముఖ శ్రీరామ జయ 
    గరుడగమన హరి శ్రీరామ

వినుతకృపాశీల శ్రీరామ జయ 
    వేదాంతసంవేద్య శ్రీరామ
వనరుహలోచన శ్రీరామ జయ 
    వనజసంభవనుత శ్రీరామ

నారదసన్నుత శ్రీరామ జయ 
    నారాయణాచ్యుత శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ జయ 
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ


శ్రీరాము డెవ్వరో చెప్పండి


శ్రీరాము డెవ్వరో చెప్పండి మాకు 
    శ్రీరాముని మహిమ తెలుపండి
ఆరాముని గొలిచి ఫలమేమి భక్తు 
    లందుకొనవచ్చునో తెలుపండి

సాకేతపురమేలు వాడండి వాడు
    సర్వలోకములేలు వాడండి
లోకాధిపులు పొగడు వాడండి సకల
     లోకసన్నుతుడగు వాడండి
లోకపావనుడైన వాడండి సకల
    శోకనాశనుడైన వాడండి
ఆకాశవర్ణంబు వాడండి వాడు
    లోకపోషకుడైన హరి యండి

శ్రీహరియె రాముడని తెలియండి తెలిసి 
    శ్రీరాముని మీరు కొలవండి
ఊహింహ శ్రీరామమాహాత్మ్య మజుని 
    యూహకైనను తెలియ రాదండి
దేహధారులకెల్ల శ్రీరామనామ 
    దివ్యమంత్రమె చాలు తెలియండి
మోహాదులను గోసి రామయ్య మనకు
    మోక్షఫల మిచ్చునని తెలియండి


17, జూన్ 2024, సోమవారం

రావయ్య రక్షింప


రావయ్య రక్షింప రామయ్య మ్రొక్కెదను
నావాడవని నమ్మినాను హరి

మానవేశ్వర రామ మహితసద్గుణధామ
నేను నీవాడనే నిక్కంబుగ
రానిమ్ము నీకరుణ రాజీవలోచన
జానకీనాయక సర్వేశ్వర

దేవదేవ రామ దివిజవైరివిరామ
దేవేంద్రసంపూజ్య దీనావన
భావింప నావశమె పరమాత్మ నీమహిమ
కావవయ్యా నన్ను కమలేక్షణ

వలచి నీనామమునె పలుకాడు నాజిహ్వ
అలసట లేకుండ జలజేక్షణ
తలచి నీరూపంబె ధ్యానించు నామనసు
కలనైన మరువక కరుణాలయ


కృపజూడ కున్నావురా


కృపజూడ కున్నావురా
నృపతిసత్తమ రామ

కపటవర్తనుడను గాను నేనన్నను
నపమార్గముల ద్రొక్క నయ్య నేనన్నను
అపరాధముల గాచు మయ్య నీవన్నను
కుపితుడవుగ దోచి కోదండరామయ్య

నీనామమును మరచి నేనున్న దెపు డయ్య
నేనున్న దెపుడయ్య నీకన్యులను గొలిచి
మాన కుండగ నిన్ను మది నెన్ను చున్నను
జానకీపతి రామచంద్ర పెడమొగ మగుచు

కారణకారణ కమనీయ గుణధామ
శ్రీరఘునందన చింతితార్ధప్రద
నారాయణాచ్యుత నరసింహ గోవింద
స్మేరానన ప్రేమమీఱ పలుకాడర


15, జూన్ 2024, శనివారం

శ్రీహరివాడై పోవు కదా

శ్రీహరివాడై పోవు కదా యిక 
    శ్రీహరిచెంతకు చేరుకదా

శ్రీహరి గుణగానము చేయుటలో 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి చరితామృతపానంబున 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి నెప్పుడు సేవించుటలో 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి భక్తుల సేవించుటలో 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి కోవెల కేగగ మిక్కిలి 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి క్షేత్రంబుల దర్శించగ 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి కీర్తనమాలకించగా 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరి పాదాంబుజముల చేరగ 
    ప్రీతికలిగితే చాలు కదా
శ్రీహరిరూపము చిత్తమునందున 
    స్థిరముగ నుండిన చాలు కదా
శ్రీహరినామము జిహ్వాగ్రంబున 
    స్థిరముగ నుండిన చాలు కదా
హరేరామ యని హరేకృష్ణ యని 
    పరవశించితే చాలు కదా
హరే మురారే నను కావుమని 
    యర్ధించినదే చాలు కదా

14, జూన్ 2024, శుక్రవారం

మమ్మేలు శ్రీరాముడా

మమ్మేలు శ్రీరాముడా నీదయ 
    మాకున్నచో చాలుర
కమ్మని వరములతో శ్రీరామ 
    ఘనముగ మమ్మేలర

నీకథలనే చదువుచు శ్రీరామ 
    నీఘనతనే తలచుచు
నీకరుణనే తలచుచు శ్రీరామ 
    నీపాటలే పాడుచు
నీకార్యముల నెన్నుచు శ్రీరామ 
    నీకై నిరీక్షించుచు
నీకీర్తనము చేయుచు శ్రీరామ 
    నీవార మున్నాముర

నిగమంబులే పొగడెడు శ్రీరామ 
    నిన్నెవరు కీర్తించరు
జగమేలు వెన్నుండవో శ్రీరామ 
    సాకేతనాథుండవు
పగలనగ రాత్రనకను శ్రీరామ 
    భజయింతు మయ్యా నిను
జగదీశ నీవిప్పుడు శ్రీరామ 
    చక్కగ మమ్మేలర

నిరుపమగుణవార్నిధి శ్రీరామ
     నీవారమని మరువకు
పరమాత్మ మాతప్పులు శ్రీరామ
     మరి నీవు మదినెన్నకు
కరుణాలవాలుండవు శ్రీరామ
     నరనాథుడవు నీవుర
వరమిచ్చు దేవుండవు శ్రీరామ
    దరిజేర్చుకొను మింకను
 

8, జూన్ 2024, శనివారం

రామ రామ రామ యని

రామ రామ రామ యని రామనామము పా
డేము మేము నిత్యమా రామనామము

సకలలోకపాలకుడగు స్వామినామము మా

కొకఘడియ యైన మరువ రాకుండు నామము


సకలసుగుణనిధియైన స్వామినామము ధర

మకరాంకుని తండ్రి దివ్యమైన నామము


సకలభూతనాథుడైన స్వామినామము సుర

లకును ప్రీతిగొలుపు చుండు రామనామము

6, జూన్ 2024, గురువారం

నారాయణ హరి శ్రీరామా


నారాయణ హరి శ్రీరామా సం
సారనివర్తక శ్రీరామా

శ్రీరామ శ్రీరామ శ్రీరామా దు
ర్వారపరాక్రమ శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా కరు
ణారసవార్నిధి శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా భయ
వారణశీలా శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా జయ
కారణశీలా శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా సుర
వైరివిదారణ శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా పుర
వైరిప్రశంసిత శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా సీ
తారమణీప్రియ శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా లో
కారాధితపద శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా సుకు
మార మనోహార శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా రఘు
వీర మహాత్మా  శ్రీరామా - జయ 

శ్రీరామ శ్రీరామ శ్రీరామా నిగ
మారణ్యహరీ శ్రీరామా - జయ

శ్రీరామ శ్రీరామ శ్రీరామా శృం
గారగుణాకర శ్రీరామా - జయ

4, జూన్ 2024, మంగళవారం

హరిని పొగడరే

హరిని పొగడరే శ్రీహరిని పొగడరే
హరిని పొగడి భవమును తరియించరే

నిరుపమసుగుణాకరు డగు హరిని పొగడరే

పరమదయాపూర్ణుండగు హరిని పొగడరే

సురవిరోధికులదహనుని హరిని పొగడరే

సురుచిరసుందరవదనుని హరిని పొగడరే


పరమభక్తవరులు కొలుచు హరిని పొగడరే

హరవిరించిసన్నుతు డగు హరిని పొగడరే

వరవితరణశీలుం డగు హరిని పొగడరే

సరసీరుహనయనుం డగు హరిని పొగడరే


స్మరగురు డని సురగురు డని హరిని పొగడరే

నరనాథుడు రాము డనుచు హరిని పొగడరే

దరిజేర్చెడు దైవమనుచు హరిని పొగడరే

మరి యొకరిని పొగడ మనుచు హరిని పొగడరే


3, జూన్ 2024, సోమవారం

అఘనాశక భవనాశక

అఘనాశక భవనాశక ఆలసించకు

రఘునాయక రామా పరాకు కూడదు


చిల్లర జన్మము లెత్తుచు నే చెడుచు నున్నచో

కొల్లలుకొల్లలు పాపము లవి కొండలు కాగ

చెల్లేదెప్పు డివి యని నిను చేరి వేడితే

బెల్లముకొట్టిన రాయివలే పలుకకుందువా


ఇమ్మహి మునుపెందరొ పెద్దలె యెంతోభక్తితో

నెమ్మనమ్ముల నిన్నేచక్కగ నమ్మితరించిన

కమ్మనికథలను విని నినునమ్మి గట్టిగ వేడిన

నిమ్మకు నీరెత్తిన రీతిని గమ్ము నుందువా